దేవతలా నిను చూస్తున్నా & ఎందుకు ఎందుకు ఎందుకు

“నేను” అనే ఒక సినిమా కథ విభిన్నమైనది. బాల్యం లోని దుర్భర సంఘటనలకి చితికిపోయిన ఒక బాలుడు, పెరిగి యువకుడైనా గతస్మృతులనే నిత్యం తలచుకుంటూ సంఘంలో ఇమడలేకపోతాడు. ఒంటరిగా, మౌనంగా, తనదైన లోకంలోనే జీవిస్తూ ఉంటాడు.

ఇటువంటి అబ్బాయికి పరిచయం అయ్యింది college లో ఒక అమ్మాయి. మరిచిపోయిన మమకారాలనీ, చిన్ననాటి అనుబంధాలనీ ఆమెలో చూసుకుంటాడు ఇతను. తనని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి మాత్రం స్నేహభావం తోనే ఉంటుంది. తను వేరే అబ్బాయి ప్రేమలో పడుతుంది కూడా. ఇవన్నీ మౌనంగా చూస్తూ, తనలో చెలరేగే భావాలని ఆ అమ్మాయికి చెప్పలేక తనలోనే దాచుకుని నలిగిపోతూ ఆ అబ్బాయి పడే సంఘర్షణకి అక్షర రూపం ఇవ్వాలి.

సినిమాలో అతను తనలోని ఈ సంఘర్షణనని రెండు పాటల ద్వారా చెప్పుకుంటాడు –
1. దేవతలా నిను చూస్తున్నా – ఇది అతనిలోని సంఘర్షణ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటి పాట. ఈ స్థితిలో అతనిలో బాధ ఉన్నా, ఆలోచన, ఆశ ఇంకా చచ్చిపోలేదు.
2. ఎందుకు ఎందుకు ఎందుకు – ఇది సినిమా చివర్లో వచ్చే పాట. అతనిలో తారాస్థాయి సంగర్షణకి అక్షర రూపం. ఇక్కడ బాధ కాదు, పూర్తి శోకం కనిపిస్తుంది. ఆశా, ఆలోచన పూర్తిగా చచ్చిపోయి అనుభూతుల సంద్రంలో కొట్టుకుపోతున్నప్పటి పాట.

పై వాటిలో మొదటి పాట వేటూరి రాశారు, రెండోది సిరివెన్నెల. ఇద్దరూ రాసిన పాటల్ని గమనిస్తే సందర్భానికి తగినట్టుగా ఎంత గొప్పగా రాశారో తెలుస్తుంది. వాళ్ళ శైలి కూడా కొంచెం గమనించొచ్చు. వేటూరి పాట “ఆలోచనామృతం” అయితే, సిరివెన్నెల పాట ఆలోచన అవసరం లేని ఇట్టే అర్థమయ్యే అమృతం!

ఈ వ్యాసంలో వేటూరి పాట గురించి నా అభిప్రాయం రాస్తాను. వచ్చే వ్యాసంలో సిరివెన్నెల పాట గురించి.

వేటూరి రాసిన గుండెల్ని పిండేసే పాట ఇది:

దేవతలా నిను చూస్తున్నా
దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువు తీస్తున్నా
నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా?
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా?
ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

1. సుడిగాలికి చిరిగినా ఆకు అణగదు
చెలిచూపుకు నలిగినా మనసు మరవదు
నీ ఒడిలో చేరలేని నా ఆశలూ
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలూ
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు
అందీ అందనిదానా, అందమైనా దానా
అంకితం నీకే అన్నా, నను కాదన్నా

2. నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు
నీ వెన్నెల నీడలైన నా ఊహలూ
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులూ
ఈ సమాధిపై పూసే సన్నజాజులు
నిదర రాని నిట్టూర్పుల జోలపాటలు
చక్కనైన చినదానా దక్కనిదానా
రెక్కలు కట్టుకు రానా, తెగిపోతున్నా

మామూలుగా చదివితే ఈ పాటలో గుండెలని పిండేసే తత్త్వం అంత కనబడదు. ఇందాక చెప్పుకున్నట్టు ఇది “ఆలోచనామృతం” కాబట్టి కొంచెం ఆలోచించి అర్థం చేసుకుంటేనే పాట భావాన్ని “అనుభూతి” చెందగలం. నాకు తోచిన భాష్యం కొంత చెబుతాను –

దేవతలా నిను చూస్తున్నా
దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువు తీస్తున్నా
నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా?
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా?

ఆ అమ్మాయి దేవత. ఆ అబ్బాయి దృష్టిలో ఎడారిలో స్నేహపు పన్నీటి జల్లులు కురిపించిన దేవత ఆమె. ఈ అబ్బాయి దీపం. దీపం లాగే ధ్యానిస్తూ, అదే సమయంలో మరిగిపోతూ, కరిగిపోతూ ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి తనకి ఎవరు? నిన్నటి దాకా ఎవరో తెలియని, పరిచయమే లేని అమ్మాయే ఇప్పుడు జీవితం అయిపోయిందా?

ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

అయినా ఆ అమ్మాయి తనది కాదు. ఇంకెవరినో ప్రేమిస్తోంది. తను అందక ఎగిరిపోయినా తన జ్ఞాపకాలు మాత్రం ఇంకా ఉన్నాయి. ఈ రెండు లైన్లూ అద్భుతం! ఎంత గొప్ప ఉపమానం ఎంచుకున్నాడు వేటూరి! “పల్లవికి వేటూరి” అని ఊరికే అన్నారా?

సుడిగాలికి చిరిగినా ఆకు అణగదు
చెలిచూపుకు నలిగినా మనసు మరవదు

అతని మనసు ఆ అమ్మాయిని ఇంకా మరవలేదు. ఎంత పిచ్చిదీ మనసు? దక్కదని తెలిసీ చందమామ కోసం చేయి చాచుతుంది. “సుడిగాలికి చిరిగిన ఆకు” అన్న చక్కటి ఉపమానం ద్వారా వేటూరి అతని చితికిన మనసుని మనకి చూపిస్తాడు.

నీ ఒడిలో చేరలేని నా ఆశలు
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు

తను కోరుకున్నది దక్కనప్పుడు మనసులో ఒక నిరాశ, ఒక నిట్టూర్పు. “ఎండమావిలో పూల పడవలు” అనడం ఎంత గొప్ప ఉపమానం! అతను గుండెల్లోని అగ్ని గుండాలని చల్లార్చుకోడానికి, మనసు విప్పి మాట్లాడుకోడానికి ఆ అమ్మాయిని కోర్కున్నాడు. ఇప్పుడు తను దక్కట్లేదు. ఇంక ఎవరికి చెప్పుకోవాలి?

అందీ అందనిదానా, అందమైనా దానా
అంకితం నీకే అన్నా, నను కాదన్నా

తను అందదు. అయినా మనసూ, జీవితం అంతా తన చుట్టూనే తిరుగుతాయ్! తను కాదన్నా మనసు వద్దనుకోదు.

నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు

ఆ అమ్మాయిని పువ్వు అనుకుని ఇష్టపడితే ఇప్పుడు నిప్పై దహిస్తోంది ఏమిటి? తప్పు తనదేనా? “నెమలి కన్ను” అందంగా కనిపిస్తుంది, కానీ చూడలేదు. మనసుకి నెమలి కళ్ళు! అందుకే అది నిజాలని చూడలేదు. ప్రేమలోనో, వ్యామోహంలోనో గుడ్డిగా పడిపోతుంది. అయినా ఇప్పుడు ఇదంతా అనుకుని ఏం లాభం? బుద్ధిని మనసు ఎప్పుడో ఆక్రమించేసుకుంది.

నీ వెన్నెల నీడలైన నా ఊహలు
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు
ఈ సమాధిపై పూసే సన్నజాజులు
నిదర రాని నిట్టూర్పుల జోలపాటలు

ఆ అమ్మాయి ఊహలే అతనికి వెన్నెల. ఆ అమ్మాయి కనులు తనతో మూగ సంభాషణ చేస్తున్నాయ్ అనుకోవడమే అతనికి ఆనందం. ఇవే సమాధి లాంటి అతని జీవితంపై పూసే సన్నజాజులు, నిదురపోని నిట్టుర్పుల మనసుకి జోలపాటలు. అతని దయనీయమైన మానసిక స్థితిని ఆవిష్కరించే ఈ వాక్యాలు మన గుండెల్ని బరువెక్కిస్తాయ్.

చక్కనైన చినదానా దక్కనిదానా
రెక్కలు కట్టుకు రానా, తెగిపోతున్నా

ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మరవలేడు. తన ప్రాణమే ఆ అమ్మాయి. అలిసిపోతున్నా, ప్రాణమే పోతున్నా పరుగు తప్పదు! అవును రెక్కలు తెగిపోతున్నా ఎగరక తప్పదు.

మొత్తం పాటలో వేటూరి వాడిన ఉపమానాలు గమనించండి. ఎంత గొప్పగా ఉన్నాయో. చదివిన ప్రతి సారీ కొత్త అర్థాలు స్ఫురిస్తూనే ఉంటాయి. “సాహో వేటూరి” అనుకోకుండా ఉండలేం. ఈ పాటలో ప్రతీ పదాన్ని గమనిస్తూ, భావాన్ని అనుభూతి చెందుతూ ఒక సారి చదవండి. మనసు చెమర్చకపోతే చూడండి.

ఇప్పుడు సిరివెన్నెల రాసిన పాట చూద్దాం:

ఎందుకు ఎందుకు ఎందుకు
నను పరిగెత్తిస్తావెందుకు?
ఆకలి తీర్చని విందుకు
నన్నాకర్షిస్తావెందుకు?
దరికి రానీక నింగి శశిరేఖా
పొదువుకోనీక ఒదులుకోనీక
ఇంతగా చితిమంటగా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా, సౌందర్య జ్వాలా!

1. పాల నవ్వుల రూపమా
తను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా
జత చేరనీయని శాపమా
తళ తళ తళ తళ కత్తుల మెరుపై కళ్ళని పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంట కాని జంటగా నా వెంట నడవాలా?

2. నీవు నింపిన ఊపిరే
నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే
నరనరాన్ని కోస్తుంటే ఇలా
సల సల మరిగే నిప్పుల మడుగై నెత్తురి ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కదే వరమాలా
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా?

ఇందాకటి పాటతో పోలిస్తే ఈ పాటలో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారింది. శోకం అతనిని కమ్మిన ఆక్రోశంలో పుట్టిన పాట ఇది. సిరివెన్నెల తనదైన శైలిలో రాశారు – చక్కటి తేలిక పదాలూ, ఇట్టే అర్థమయ్యే గుణం, లోతైన భావం అన్నీ ఈ పాటలో చూడొచ్చు. “సౌందర్య జ్వాల”, “జంట కాని జంటగా నడవడం”, “ఒక్క పుట్టుకలో ఎన్నో మరణాలు”, “ఉరితాడుతో ఉయ్యాలలూపడం” కొన్ని గమనించదగిన ప్రయోగాలు. వాక్యాలు చదివితే అర్థమైపోతాయ్ కాబట్టి ఈ పాటకి పెద్ద వ్యాఖ్యానం కూడా అక్కర లేదు వేటూరి పాటలా.

ఈ పాటనీ, వేటూరి రాసిన “దేవతలా” పాటని పక్క పక్కన పెట్టుకుని వినడం ఒక చక్కని అనుభూతి. ఒకేలాటి సందర్భానికి ఇద్దరు కవులు, భిన్నమైన శైలిలో, భిన్నమైన ఉపమానాలతో రాయడం మనం చూడొచ్చు. “బాగా” ఎలా రాయలో కొంత నేర్చుకోవచ్చు కూడా.

ఈ రెండు పాటలకీ తగిన tune ఇచ్చిన సంగీత దర్శకుడు “విద్యాసాగర్” కూడా అభినందనీయుడే!

దేవతలా నిను చూస్తున్నా & ఎందుకు ఎందుకు ఎందుకు