సిరివెన్నెల సన్నిధిలో…!

నాకు సిరివెన్నెలని ఒక సెలబ్రిటీని కలిసినట్టు కలవాలనీ, ఫొటోలు దిగాలని ఉండదు. ఒక గురువుగా ఆయన జ్ఞానబోధ చేస్తూ ఉంటే ఆయన సన్నిధిలో గడపాలనీ, ఆయన చెప్పే విషయాలు వింటూ స్ఫూర్తి పొందాలనీ ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న రోజుల్లో మా కిరణ్ అన్న (కిరణ్ చక్రవర్తుల) పుణ్యమా అని దాదాపు ఆయన ప్రతి పుట్టినరోజుకీ కొందరు మిత్రులం అందరం ఆయన్ని కలవడం, ఆయన కబుర్లు వినడం చేసేవాళ్ళం. మేము “ఆర్కుట్ సిరివెన్నెల కమ్యూనిటీ” సభ్యులం అని కిరణ్ అన్న మమ్మల్ని సిరివెన్నెలకి పరిచయం చేశాడు. అది ఆయనకి గుర్తుండిపోయింది. మాతో మాట్లాడడం ఆయనకి చాలా ఇష్టంగా ఉండేది. చాలా మంది సెలబ్రిటీలు (హీరో రవితేజ వంటి వారు) ఆయన్ని కలిసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఓ ఐదు నిమిషాలు ఉండి వెళ్ళిపోయేవారు. మేము మాత్రం ఆయన రూమ్ లోనే ఉండేవాళ్ళం, వచ్చీపోయేవాళ్ళని చూస్తూ. ఒకసారి నాగబాబు గారు అనుకుంటా, మేమందరం ఉండడం చూసి సిరివెన్నెలతో ఫ్రీగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. సిరివెన్నెల అసిస్టెంట్ శ్రీను, “లేవండింక!” అన్నట్టు మమ్మల్ని చూశాడు. మాకూ విషయం అర్థమయ్యి లేవబోయాము. కానీ సిరివెన్నెల మమ్మల్ని ఆపి – “వీళ్లందరూ మనవాళ్ళే, బయటవాళ్ళు కాదు! మీరేమీ మొహమాటపడకండి” అని నాగబాబు గారిని సమాధానపరిచారు! అదీ ఆయన మాతో మాట్లాడడానికి ఇచ్చే ప్రాముఖ్యత! అటువంటి సిరివెన్నెలగారితో సత్సంగం మా బోటి వారికి దక్కిన మహాదృష్టం!

2012 లో అమెరికా వచ్చాక సిరివెన్నెలతో ఈ సత్సంగానికి నేను దూరమయ్యాను. అందుకే ఈసారి ఆయన కేలిఫోర్నియా బే ఏరియాకి వస్తున్నారని తెలియగానే తప్పక కలవాలని అనుకున్నాను. ఆయన గతంలో లాస్ ఏంజిల్స్, బే ఏరియాలకి వచ్చినప్పుడు నాకు కలవడం కుదరలేదు. ఈసారి ఎలాగైనా కుదుర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. “అన్నయ్య మా అమ్మాయి వేద్యస్ఫూర్తి కూచిపూడి రంగప్రవేశం చూడడానికి ప్రత్యేకంగా బే ఏరియా వస్తున్నారు. మా ఇంట్లోనే ఉంటున్నారు. మీరందరూ తప్పకుండా ఆయన్ని కలవొచ్చు” అని మాటిచ్చారు వెంకట్ కొండ గారు. ఆయన సిరివెన్నెల జగమంత కుటుంబ సభ్యులలో తమ్ముడిగా పిలుపుని పొందినవారు. సిరివెన్నెల భావలహరి వెబ్సైట్ రూపొందించినవారు. ఆ వెబ్సైట్ కి సిరివెన్నెల పాటలు టైప్ చేసి పెట్టిన వారందరికీ (నాతో సహా) వెంకట్ గారు మంచి మిత్రులైపోయారు. ఆయన సౌమ్యతా, మంచితనం చూస్తే ఎవరైనా మిత్రులు కాక తప్పదు మరి! అలా వెంకట్ కొండ గారి మాట అండతో నేను కుటుంబసమేతంగా బే ఏరియాకి శాండియాగో నుంచి డ్రైవ్ చేసుకుని బయలుదేరాను.

సిలికానాంధ్ర “మీట్ & గ్రీట్ విత్ సిరివెన్నెల” (జూన్ 23, శుక్రవారం)

సిలికానాంధ్ర సంస్థ వారు సిరివెన్నెలతో “మీట్ & గ్రీట్” కార్యక్రమం ఒకటి పెట్టే ఆలోచనలో ఉన్నారని నాకు ముందే వెంకట్ గారు చెప్పి ఉన్నారు. “మీట్ & గ్రీట్” అంటే కేవలం ఫోటోలు తీసుకునే కార్యక్రమమని నేను అనుకుని పెద్ద ఆసక్తి చూపలేదు. నా ట్రిప్ కూడా ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చెయ్యలేదు. అయితే ముందు అనుకున్నట్టు కాక ఆ కార్యక్రమం శుక్రవారం (జూన్ 23) కి మారడం, నేను ఆ రోజు బే ఏరియాలోనే ఉండడంతో మిత్రుడు శ్రీనివాస మౌళి (మౌళి, కిరణ్, నేనూ మంచి స్నేహితులం. ముగ్గురం కలిసి పాటలు రాసేవాళ్ళం అప్పట్లో!) తో కలిసి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను.  వెళ్ళడం చాలా మంచిదయ్యింది, లేకపోతే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మిస్ అయ్యేవాడిని.

393541_787767680588_1314363795_n.jpg
నేనూ, మౌళీ, కిరణ్! (2008 లో సిరివెన్నెల గారింట్లో)

కార్యక్రమం సిలికానాంధ్ర యూనివర్సిటీ భవనంలో జరిగింది. నేను సిలికానాంధ్ర వారి తెలుగు బడి అయిన మనబడిలో ఉపాధ్యాయునిగా శాండియాగోలో సహకారం అందిస్తున్నా, నాకు సిలికానాంధ్ర సంస్థతో పెద్ద అనుబంధం లేదనే చెప్పాలి. అనుకోని విధంగా ఈ “మీట్ & గ్రీట్” కార్యక్రమం నాకు సిలికానాంధ్ర తో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడింది. మేము చేరేటప్పటికి ఇంకా జనం రాలేదు. నేను ఈ కార్యక్రమం గురించి చెప్పగా విని నా మిత్రుడు వేణు కూడా వచ్చాడు కొద్దిసేపటికి. వేణు తన “సృష్టి గురుకుల్” ద్వారా శిల్ప చిత్ర కళని అందరికీ నేర్పిస్తూ ఉంటాడు. నేనూ, మౌళీ, వేణూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే విజయసారథి గారు వచ్చారు. విజయ్ గారితో నా పరిచయం కూడా పాతదే. 2010 లో నేను సిరివెన్నెలపై రాసిన పాటని ఆయనకి చేరవేసినది విజయ్ గారే. సిరివెన్నెలనీ, సిరివెన్నెల పాటలనీ ప్రాణంగా ఆరాధించే విజయ్ గారు సిరివెన్నెల పాటలపై వ్యాసాలు రాయడమే కాక ఈ మధ్య సిరివెన్నెల పాటలను విశ్లేషిస్తూ అద్భుతమైన వీడియోలూ పెడుతున్నారు. మా మధ్య సాహితీ చర్చలు జరుగుతూనే ఉన్నా, నేనెప్పుడూ ఆయన్ని కలవలేదు. కాబట్టి ఆయన కూడా రంగప్రవేశం చూడడానికీ, సిరివెన్నెలని కలవడానికీ బే ఏరియా వస్తున్నట్టు చెప్పగానే ఆయన్ని ఎప్పుడు కలుద్దామా అని నేను ఎదురు చూస్తున్నాను. ఆయన్ని కలవగానే ఒక ఆత్మీయుడిని కలిసినట్టే అనిపించింది. మా పెద్ద మావయ్య గుర్తొచ్చారు. ఆయన హాస్యచతురత వలన మా సంభాషణలు ఆహ్లాదంగా సాగాయి. వేణు కి విజయ్ గారిని – “ఈయన హీరో వరుణ్ సందేశ్ నాన్నగారు!” అని పరిచయం చేస్తే, “కాదు! వరుణ్ సందేశే మా అబ్బాయి! నేనే వాడికంటే ముందు!” అన్నారు నవ్వుతూ! సిరివెన్నెలకి దగ్గరగా మేము వెళ్ళడానికి విజయ్ గారు చాలా సహకరించారు, వారి వెంటే ఉండడం మాకు చాలా ఉపకరించింది.

మేము మాటల్లో ఉండగానే కిరణ్ ప్రభ గారు వచ్చారు. ఆయన నడుపుతున్న కౌముది వెబ్ పత్రిక నాకు చాలా నచ్చుతుంది, ఈ మధ్య కౌముదికి కొన్ని కథలు కూడా రాశాను. అలాగే ఆయన టాక్ షో, గతంలో ఆయన నిర్వహించిన మనసిరివెన్నెల.కామ్ వెబ్సైట్ గొప్పగా ఉంటాయి. ఇదే విషయం ఆయనతో చెప్పాను. ఆయన మితభాషి, అవసరమైనంతే మాట్లాడతారు. మనం చెప్పేది చక్కగా వింటారు. మాటల్లో నాతో – “ఫణీంద్ర అంటే ఇంత చిన్నవారనుకోలేదు. మీ కథలు చదివి నలభై పైబడినవారనుకున్నాను” అన్నారు. అది కాంప్లిమెంటుగానే నేను భావించాను!

హాల్ దాదాపు నిండింది, కానీ సిరివెన్నెలే ఇంకా రాలేదు. ఏడింటికి కార్యక్రమం మొదలవ్వాలి, అప్పటికే ఏడు దాటి ఇరవై నిమిషాలు కావొస్తోంది. సిరివెన్నెల వచ్చారా లేరా అని మేము అనుకుంటూ ఉండగానే చంద్ర గారు వచ్చి పలకరించారు. ఆయనతో ఈ మధ్య ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. ఆయనా నాలాగ మనబడిలో టీచర్. చాలా చక్కని కంద పద్యాలు రాస్తారు, ఈ మధ్యే క్షీరసాగరమథనాన్ని వర్ణిస్తూ దాదాపు వంద పద్యాలు రాశారు. ఆయన ప్రేరణతో నేనూ కొన్ని కందాలు రాసే ప్రయత్నం చేశాను. ఆయన సిరివెన్నెలకి పరమభక్తుడు. సిరివెన్నెలని కలవాలని ఎంతగానో ఎదురు చూసిన వ్యక్తి. మమ్మల్ని కలిసినప్పుడు ఆనందంతో ఆయన మొహం వెలిగిపోతోంది. “ఇప్పుడే సిరివెన్నెలని కలిశాను! పైనున్నారు. మీరు వెళ్ళండి” అన్నారు. అదన్నమాట ఆయన మొహంలో వెలుగుకి కారణం! మేము మొహమాటంగా వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉండగా విజయ్ గారు పక్కనే ఉన్నారని గుర్తొచ్చింది. మాకు ఇంకేం భయం!

పైన వెంకట్ గారు కనిపిస్తే పలకరించాం. ఆయన “రండి! అన్నయ్యని కలుద్దురు గానీ!” అని తీసుకెళ్ళారు. సిరివెన్నెల గారిని సిలికానాంధ్ర ఛైర్మన్ ఆనంద్ కూచిభొట్ల గారు తన రూమ్ లో, తన సీట్లో కూర్చోబెట్టి, “బావా” అని సిరివెన్నెల గారిని సంబోధిస్తూ, చాలా ఆనందంగా సిలికానాంధ్ర గురించి ఏదో వివరిస్తున్నారు. సిరివెన్నెల రాకతో ఆ భవనం ధన్యమైందన్న భావన ఆయనలో కనిపించింది. వారిని కూడా అదే మొదటిసారి చూడడం. ఆ రూమ్ లోనే సిరివెన్నెల గారి శ్రీమతి పద్మావతి గారు, వారి పెద్దబ్బాయి యోగి ఉన్నారు. సిరివెన్నెలని కలవడానికి ముందు మమ్మల్ని ఆనంద్ గారికి విజయ్ గారు పరిచయం చేశారు. “నేను మీ మనబడి టీచర్ని!” అని ఒకింత గర్వంగానే చెప్పాను. తరువాత వీలు కుదరగానే విజయ్ గారి వెంట కదిలి సిరివెన్నెల గారికి నమస్కరించి, వారి పాదాలు తాకి ఆశీస్సులు తీసుకున్నాం. నన్నూ, మౌళీని ఆయన గుర్తుపట్టినట్టు లేదు కానీ, మేము “ఆర్కుట్ సిరివెన్నెల కమ్యూనిటీ” అని చెప్పగానే ఆయనలో ఆనందం కనిపించింది. “కిరణ్ అన్నతో కలిసి మేము మిమ్మల్ని హైద్రాబాద్ లో కలుస్తూ ఉండే వాళ్ళం” అన్నాను. “నచకి !” అన్నారు, అది కిరణ్ కలం పేరు. “అవును! మీరు కిచకిచ అని కూడా పిలిచేవారు” అని గుర్తుచేశాను, ఆయన చిరునవ్వు నవ్వారు.

సిరివెన్నెల గారు ఆనంద్ గారి రూం నుంచి ప్రోగ్రాం కి వెళ్ళడానికి కదిలారు. ఆయన వెంట మందీ మార్బలం లా నేనూ, మౌళీ, వేణూ కూడా కదిలాం! దారిపొడుగునా చాలా మంది ఫొటోలు తీసుకుంటున్నారు సిరివెన్నెలతో. పనిలో పని మేమూ కొన్ని గ్రూప్ ఫొటోలు తీసుకున్నాం, తరువాత కుదురుతుందో లేదోనని!

IMG_2834
సిరివెన్నెల గారితో నేనూ మౌళీ!

సభావేదిక వద్ద సిరివెన్నెలకి ముందు ఆనంద్ గారు మాట్లాడారు. ఆయనంత మంచి వక్తని నాకు తెలీదు. ఎక్కడా తడబడకుండా చాలా చక్కగా సిలికానాంధ్ర గురించి చెప్పి సిరివెన్నెలని ఆహ్వానించారు. సభావేదికపై సిరివెన్నెలని ఉన్నతాసనంలో కూర్చోబెట్టినప్పుడు ఆయన – “మా బావ (ఆనంద్ గారు) నాకు కొన్ని ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాడు, కాదనలేని విధంగా. నేను మీ అందరితో సరదాగా మాట్లాడాలని వస్తే ఇలా ప్రవచనకారుడిలా విడిగా కూర్చోబెట్టాడు!” అన్నారు, అందరి నవ్వుల మధ్య! తరువాత అచ్చం ఆయన హైద్రాబాద్ రూమ్ లో మాతో కబుర్లు చెప్పినట్టే మాట్లాడారు. తరువాత కొన్ని ప్రశ్నలకు సమాధనం చెప్పి చివర్లో – “నా పాటంటే, నేను మీకు ఉత్తరం రాసుకోవడమే, అంతకన్నా ఏమీ లేదు. నాకివాళ ఇలా అనిపించింది..ఆ దృశ్యాన్ని ఇలా చూశాను…ఇలా ఉత్తరాల్ని మీకు రాస్తున్నాను! ఈ ఉత్తరాలన్నీ మీకు చేర్చడానికి సినిమాతెర అనే పోస్టుబాక్సులో పడేస్తున్నాను. కాబట్టి మీరు సినిమాలని చూసి ఆనందించి వచ్చేటప్పుడు నా ఉత్తరాన్ని మీతో పాటూ తెచ్చుకోండి. ఇంట్లో ఉత్తరాన్ని విప్పి చదువుకోండి! అందులో మీవైన అనుభవాలు, అనుభూతులూ దొరుకుతాయి!” అన్నారు అందరి కరతాళధ్వనుల మధ్య. అందుకే సిరివెన్నెల పాటని “ఆప్తుని వాక్యం” అన్నాను నేను నా పాటలో! ఈ ప్రసంగం, తరువాత ప్రశ్నలకు సమాధానాలు విని తీరాల్సిందే! సిలికానాంధ్ర వారు ఫేస్బుక్ లో ఈ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేశారు, తప్పక చూడండి – భాగం 1 (ప్రసంగం), భాగం 2 (సన్మానం, ప్రశ్నలు), భాగం 3 (ప్రశ్నలు)

తరువాత అందరం కలిసి కొన్ని ఫోటోలు దిగాము. నా బీటెక్ మిత్రుడు సుధీర్ కూడా ఈ కార్యక్రమానికి నేను చెప్పగా వచ్చాడు. చివర్లో మనబడి పాఠ్యప్రణాళిక రూపొందించిన కూచిభొట్ల శాంతి గారిని (ఆనంద్ గారి శ్రీమతి) కూడా పలకరించాను. ఆవిడని నేను చాలా సీరియస్ గా ఊహించుకున్నాను కానీ చాలా సరదా మనిషి. చక్కగా మాట్లాడారు. ఇలా సిరివెన్నెల కబుర్లతో, ఎందరో వ్యక్తుల పరిచయంతో నిండుగా గడిచింది మొదటి రోజు.

IMG_2837
కిరణ్ ప్రభ గారు, సుధీర్, మౌళీ, నేనూ, విజయ సారథి గారు, చంద్ర గారు!

కుమారి వేద్యస్ఫూర్తి కూచిపూడి రంగప్రవేశం (జూన్ 24, శనివారం)

పక్కరోజు వెంకట్ కొండ గారి రెండవ అమ్మాయి వేద్యస్ఫూర్తి కూచిపూడి రంగప్రవేశం. నేనూ, మౌళీ కుటుంబసమేతంగా హాజరయ్యాం. నేను కొన్ని నాట్యప్రదర్శనలు చూసినా రంగప్రవేశం ఎప్పుడూ చూడలేదు. అదంత పెద్ద కార్యక్రమమనీ, దాదాపు పెళ్ళిలాంటిదేననీ తెలీదు! దాదాపు 900 మంది వచ్చారు. ఆడిటోరియం క్రిక్కిరిసి పోయింది. కార్యక్రమం మొదలవ్వడానికి ముందు వెంకట్ కొండ గారు మాట్లాడుతూ సిరివెన్నెలని సభకు ఇంగ్లీషులో పరిచయం చేశారు. “సచిన్ టెండూల్కర్ క్రికెట్ పరుగుల కన్నా ఎక్కువ పాటల రాసిన రచయిత మా అన్నయ్య సిరివెన్నెల!” అని సగర్వంగా చెప్పారు! ఇది ఆయనకి ఇష్టమైన పోలిక, గతంలోనూ మాతో చెప్పారు. రంగప్రవేశంలో మొదటి పాట కూడా సిరివెన్నెలదే – శృతిలయలు సినిమాలోని “శ్రీ శారదాంబా నమోస్తుతే” పాటని అద్భుతంగా వేద్యస్ఫుర్తి అభినయించింది. సిరివెన్నెలా ఉప్పొంగి – “శాస్త్రీయ గీతాలు సినిమా తెరపై రావడం తెలుసు కానీ సినిమా పాట ఇలా శాస్త్రీయ నృత్యంలో రావడం ఇదే మొదలు!” అన్నారని విజయ్ గారు తరువాత చెప్పారు (ఆయన ముందు వరుసలో సిరివెన్నెల పక్కనే కూర్చున్నారు). వేద్యస్ఫూర్తి అద్భుతంగా అభినయించిన నృత్యగీతాలకు ఆమె అక్క నవ్యమైత్రి తెర వెనుక నుంచి చాలా చక్కని వ్యాఖ్యానం అందించింది. తనే పరిశ్రమ చేసి పాటల వివరాలు తెలుపుతూ రాసుకున్న స్క్రిప్ట్ ని, సుస్పష్టమైన ఇంగ్లీషులో, పొంకంగా, శాస్త్రీయ ప్రదర్శనకు తగినట్టుగా చదివి వినిపించడం అందరికీ వచ్చేది కాదు. ఇక వేద్యస్ఫూర్తి నాట్యం గురించి చెప్పడానికి మాటలు లేవు. ముఖ్యంగా సత్యభామగా అభినయం అమోఘం! నాట్యం గురించి ఏమీ తెలియని నాబోటి వాడినే ఆమె నటనం, హావభావాలు, రసపోషణ ఆకట్టుకున్నాయంటేనే ఆమె ప్రతిభ తెలుస్తోంది. ప్రేక్షకులూ, కార్యక్రమం తరువాత మాట్లాడిన వక్తలూ ఏకగ్రీవంగా ఆమె ప్రదర్శన అద్భుతమని తీర్మానించారు సిరివెన్నెలా ఇదే మాట చెప్పి, “ఇద్దరు ఆణిముత్యాలు లాంటి కూతుర్లు తయ్యారయ్యారంటే దాని వెనుక నా తమ్ముడు వెంకట్, శాంతిల పెంపకం, సంస్కారం కూడా ఉందని మర్చిపోకూడదు” అన్నారు. అందరి కరతాళధ్వనులూ, ఆ తల్లిదండ్రుల కళ్ళలో పొంగిన ఆనందభాష్పాలూ చూస్తే అదో మనసుని స్పందింపజేసే అపూర్వ దృశ్యం! నేను వెంకట్ గారితో తరువాత అన్నాను – “పిల్లలని ఎలా పెంచాలో తెలియజెప్పే గొప్ప స్ఫూర్తిని మీ కార్యక్రమం ఇచ్చింది.” అని!

కార్యక్రమం మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు విజయ్ గారి వెంట సాగాము నేనూ మౌళీ. కిరణ్ ప్రభ గారితో మనసిరివెన్నెల.కామ్ వెబ్ సైట్ ప్రస్తావన వచ్చింది. ఏదో పాస్ వర్డ్ ప్రాబ్లం వల్ల సైట్ రెన్యూ అవ్వలేదనీ, కంటెంట్ మొత్తం ఉందనీ, తిరిగి నెట్ లో ఉంచే ఆలోచన ఉందనీ చెప్పారు. సిరివెన్నెల రాసిన కథలను (ఎన్నో రంగుల తెల్లకిరణం పుస్తకం) నెలనెలా ఇకపై కౌముదిలో ప్రచురించనున్నట్టూ చెప్పారు. ఎంతో ప్రాచుర్యం పొందిన “సిరివెన్నెల తరంగాలు” మళ్ళీ పుస్తకంగా తెచ్చే ఆలోచన ఉందనీ (ఇదే మాట సిరివెన్నెలా చెప్పారు తరువాత) అందుకే కౌముది గ్రంథాలయంలో “సిరివెన్నెల తరంగాలు” పుస్తకం వ్యాసాలు ఉన్నా, ఒక పుస్తకంగా లేదని చెప్పారు. ఈ విషయాలు విని ఆనందించాం.

కార్యక్రమం పూర్తయిన తరువాత మేము సిరివెన్నెల కుటుంబంతో ఫొటోలు దిగినప్పుడు నేను సిరివెన్నెల గారితో – “గురువుగారూ, మీకు కుదిరితే మేము రేపూ మిమ్మల్ని కలుస్తాం. మీ నాన్నగారి పుస్తకం “సమ్మాన్యుడు” ని మీ చేతుల మీదగా అందుకోవాలని నా కోరిక అన్నాను!”. సమ్మాన్యుడు, సిరివెన్నెల నాన్నగారిపై సిరివెన్నెల గారి తమ్ముడు ప్రచురించిన పుస్తకం. దాని గురించి నేను ఇండియాలో ఉన్న రోజుల్లోనే విన్నాను, ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్నాను. సిరివెన్నెల గతంలో అమెరికా వచ్చినప్పుడు సంతకం చేసి చాలా మందికి ఆ పుస్తకం ఇచ్చారు. అందుకే నేను అడగడం! ఆయన – “తప్పకుండా రండి! నేనూ వెంకట్ కి అదే చెబుదాం అనుకుంటున్నా!” అన్నారు! ఇంకేం దేవుడు వరమిచ్చాడు!

IMG_2865
సిరివెన్నెల దంపతులతో మేము!

భోజనం వేళ విజయ్ గారు నన్నూ, మౌళీని పిలిచి మరీ సిరివెన్నెల ఉన్న రౌండ్ టేబుల్ లో కూర్చోబెట్టారు. ఆనంద్ గారు, శాంతి గారు, కిరణ్ ప్రభ మొదలైన సిరివెన్నెల సన్నిహితులు ఉన్నారక్కడ. వారి మధ్య మేము కొంత మొహమాటంగానే కూర్చున్నాం. మాటల్లో సిరివెన్నెల నన్నూ మౌళీని చూపించి – “వీళ్ళు నా సైన్యం!” అన్నారు. నా పక్కన కూర్చున్నావిడ – “సైన్యం అంటున్నారాయన! మీరేం చేశారు? ఏమవుతారు ఆయనకి?” అని అడిగారు కూడా! నేను చిరునవ్వుతో ఏదో సమాధానం చెప్పాను కానీ, నిజానికి “సైన్యం” అన్నది సిరివెన్నెల మాకిచ్చిన బాధ్యత. ఆయన ఫిలాసఫీ అనే ఆయుధాన్ని వాడి బ్రతుకు యుద్ధంలో గెలుపొందే సైనికులం మేమందరం! అది ఆయన ఆకాంక్ష!

వెంకట్ గారింట్లో సిరివెన్నెలతో ఆత్మీయ సంభాషణ (జూన్ 25, ఆదివారం)

పక్కరోజు ఆదివారం, సిరివెన్నెల పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. సిరివెన్నెలే స్వయంగా రండని చెప్పినా, వెంకట్ గారు కలుద్దామని హామీ ఇచ్చినా నాకు ఈ మీట్ జరుగుతుందో లేదోనన్న చిన్న అనుమానం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత రోజు ఉదయమే సిరివెన్నెల ఇండియా ప్రయాణం. ఆ హడావిడి ఒకటీ, నిన్నా మొన్నా కార్యక్రమాల్లో అలిసిపోవడం ఒకటీ, వీటివల్ల సిరివెన్నెల నిజానికి ఎవరినీ కలవకుండా రెస్ట్ తీసుకుంటేనే మంచిది! కాబట్టి మీట్ కేన్సిల్ అవ్వొచ్చు, అయినా ఫర్వాలేదు అనుకుంటూ ఉన్నాను. ఇంతలోనే పదకొండు గంటల ప్రాంతంలో వెంకట్ గారు కాల్ చేశారు – “అన్నయ్య! ఇప్పుడే లేచారు. లేవగానే మీ గురించే అడిగారు. మీరో గంటలో వచ్చెయ్యండి!” అన్నారు. నేను ధన్యోస్మి అనుకుని, వేణూ, మౌళీలతో కలిసి హుటాహుటిన బయలుదేరాను. వెంకట్ కొండ గారి ఇంటి బ్యాక్ యార్డ్ లో చెట్టు కింద నీడలో సిరివెన్నెల గారు ఎవరితోనో మాటల్లో ఉన్నారు. పక్కన విజయ్ గారు అప్పటికే ఉన్నారు, చంద్ర గారు కొద్ది సేపట్లో వచ్చారు. సిరివెన్నెల గారిని రంగు చొక్కాలో చూడడం అరుదే! (ఆయనెప్పుడూ తెల్లటి బట్టలే వేసుకుంటారు). ఇంటిలో చుట్టాలందరూ కలిసి మాట్లాడుకున్నట్టే ఉంది వాతావరణం. దానికి తగినట్టే సిరివెన్నెల గారు మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా “టిఫిన్ తింటారా?” అని ఆప్యాయంగా పదే పదే అడిగారు.

చెట్టు కింద బుద్ధుడిలా ఆయన మాకు బోధ చేస్తూ ఉంటే మేము వింటూ ఉన్నాం. అది “బోధ” అని అనడాన్ని ఆయన ఒప్పుకోరు! “గొప్పవాళ్ళ ఆలోచనల్లో మన అంతరంగాన్ని కనుగొంటాం” అని ఒక కోట్ విన్నాను ఈ మధ్య. సిరివెన్నెల చెప్పేది అదే! మాతోనూ అన్నారు – “I am the echo of your silence” అని. ఆయన “శైశవేభ్యస్త విద్యానాం” అన్న రఘువంశంలోని కాళిదాసు శ్లోకం గురించి చాలా సేపు మాట్లాడారు. మనిషి ఎలా జీవించాలి అన్న విషయాన్ని భారత దేశం ఎంత గొప్పగా నేర్పించిందో వివరించారు. నిజానికి ఆ శ్లోకం మామూలుగా చూస్తే సాధారణమైనదే, కానీ దానికి సిరివెన్నెల చేసిన వ్యాఖ్యానం అత్యద్భుతం. “ప్రతీ దానికీ కూడా మనకి తెలిసేసిన జవాబులకి ప్రశ్నలు వేసుకుని అసలు ప్రశ్నలు వదిలేస్తున్నాం!” “మనకి భారతీయత మాటల నుంచి మౌనాన్ని నేర్పింది, అన్నీ పొందాక త్యజించడం నేర్పింది”, “ముని అంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవాడు కాదు, తన గుండె చప్పుళ్ళను మౌనంగా వినేవాడు” వంటి వాక్యాలు నాకు గుర్తున్న కొన్ని జ్ఞానగుళికలు!

మాటల మధ్యలో నేను చేతిలో పట్టుకుని ఉన్న కాయితాలు చూసి – “ఏవిటివి? నాకేమైనా చూపించాలా?” అని అడిగారు. నేను ఈ మధ్య ఒక సరదా కథ రాసి కౌముదిలో ప్రచురించాను. ఒక సిరివెన్నెల అభిమాని అయిన అమ్మాయికీ, వేటూరి అభిమాని అయిన అబ్బాయికీ మధ్య జరిగే ప్రేమకథ, పేరు – “సుందరీ సీతారామ్”. ఆ కథ సిరివెన్నెల చూపించాలని ఉబలాటపడి ప్రింట్ తీసుకుని వెళ్ళాను. ఆయనకీ విషయం చెప్పి చూపిస్తే ఆయన తీసుకుని తరువాత చదువుతాను అన్నారు! ఈ “తర్వాత చదవడం” ఎప్పటికీ జరగదని నా భయం! సరే, అంతే ప్రాప్తం అనుకున్నాను. అయితే నేను తనని కథలో వేటూరితో పోల్చానని అనుకున్నారో ఏమో, “నాకూ వేటూరి గారికీ పోలిక లేదు. ఆ మాటకొస్తే నేను పాటల రాసే విధానం అందరి కన్నా భిన్నం. శ్రీశ్రీ గారు “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిదురపోకుమా” అని ప్రబోధించారు. నేను అలా చెప్పను – “ఎవరో ఒకరు, ఎపుడో అపుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు! మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది.” అన్నప్పుడు మీకు “అవును కదా!” అని ఒక ఆలోచన కలుగుతుంది. మీకు తెలిసినవే అయినా మీరు గ్రహించనవి మీలో ఆలోచన రేకెత్తించేలా చెప్పడం నా పద్ధతి” అన్నారు. ఈ మాటల గురించి తరువాత ఆలోచిస్తే సిరివెన్నెల పాటల పద్ధతి నాకు ఇంకొంచెం బాగా అర్థమైంది. పాటల్లో ఆయన వాడే భాషా, భావాలు సరళమే కానీ వాటి వెనుక సాలెగూడులా అల్లుకున్న అలోచనల లోతు అనంతం! అదే సిరివెన్నెల గొప్పతనం!

“అన్నయ్యా! ఎండలో కూర్చోకండి! లోపలికి రండి! ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు!” అని వెంకట్ గారి శ్రీమతి శాంతి గారు పదే పదే సిరివెన్నెలని పిలవడంతో మా మకాం బ్యాక్ యార్డ్ లోని చెట్టు నీడ నుంచి ఇంటి లోపలి హాలులోకి మారింది. వెళ్తున్నప్పుడు సిరివెన్నెల నాపైన చేయి వేసి – “నాన్నా ఫణీ! నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు. శాండియాగో నుంచి అన్ని గంటలు నా గురించే డ్రైవ్ చేసుకుని వచ్చావు కదా!” అన్నారు. ఆ ఆప్యాయతకి ఏమనాలో తెలియలేదు. అప్పుడే మౌళీతో మాట్లాడుతూ మమ్మల్నందరినీ ఆయన్ని “గురువు గారూ” అని పిలవొద్దని ఆజ్ఞాపించారు! “నన్ను మావయ్య అని గానీ బాబయ్య అని గానీ పిలవండి, అవి రెండూ నాకు చాలా ఇష్టమైన పిలుపులు! “గురువు గారూ” అని పిలిచి నన్ను దూరం పెట్టకండి!” అన్నారు! కానీ గుండెల్లో ఎంతో గౌరవం పొందిన వ్యక్తిని ఒక్కసారిగా “మావయ్య” అని ఎలా పిలవడం? అప్పటికీ మొహమాటంగా ఒకసారెప్పుడో “మావయ్య” అని పిలిచాను కానీ “గురువు గారూ” అనడమే నాకు బావుంది నిజానికి!

ఇంట్లోకి వచ్చాక మౌళీ – “మీరు జరుతున్నది జనన్నాటకం పాటలో రాసిన ఒక లైన్ సరిగ్గా వినిపించట్లేదు. “నీ అడుగుల ఆకాశాన్నడుగు!” అన్నారా లేక “నీ అణువుల ఆకాశాన్నడుగు” అన్నారా?” అని అడిగాడు. “నీ అణువుల ఆకాశం, నీలోని అణువణువుల మధ్య ఉన్న శూన్యం. అక్కడ పంచభూతాలు అన్నిటినీ చెబుతూ ఆకాశం గురించి చెప్పాను. అణువులలోని శూన్యం ఉన్న పదార్థం (matter) కన్నా చాలా ఎక్కువని సైన్స్ కూడా చెబుతోందిగా! ” అన్నారు. మేమందరం ఏకగ్రీవంగా “అద్భుతం” అన్నాం.  అప్పుడు సిరివెన్నెల ఆ పాట గురించి అణువిస్ఫోటనం అంతటి శక్తివంతమైన ప్రసంగం చేశారు. పాటలోని లైన్లు మేము గుర్తుచేస్తూ ఉంటే దాదాపు మొత్తం పాటంతటినీ వివరించారు. దశావతారాలని మనిషికి ఎలా అన్వయించారో వివరించారు. ఈ పాటలో “కూర్మావతారం” వంటి అవతారాలలో కూర్మం ద్వారా ఓర్పునీ, విషం వచ్చినా కోరింది సాధించే నేర్పునీ తెలియజెప్పడం అందరికీ అర్థమవుతుంది. అయితే మత్స్యావతారంలో సత్యవ్రతుడి కథని మటుకు ఊరికే చెప్పినట్టు ఉంటుంది పాటలో. కానీ అక్కడా చాలా విషయం ఉందని నాకు తెలిసి అబ్బురమనిపించింది – “సత్యవ్రతుడు అంటే సత్యాన్ని శోధించే వాడు, అంటే మనిషి! నిరంతరం ప్రశ్నించే వాడు. ఈ అవతారంలో మనిషికి భగవంతుడు చెబుతున్నాడు. నీ జీవన వ్యవహారాన్ని అతలాకుతలం చేసుకుంటే, పర్పస్ పూర్తయ్యేలోపులోనే నీ ప్రయాణం ఆగిపోతుంది అని!” “శివమానస పూజ” వంటి రకరకాల అంశాలు స్పృశిస్తూ అద్భుతంగా సాగిన ఈ ప్రసంగాన్ని సిరివెన్నెల మాటల్లోనే వినాలి, చెప్పడానికి నా బోటి వాడికి మాటలు లేవు. ఆ వాగ్ధార ఎలాంటిదంటే మేమందరం మంత్రముగ్ధులై వింటూ ఉన్నాం, ఏ మాటా లేక. మధ్యలో అక్కడున్న ఒకాయన  – “ఇప్పుడు మీరు చెబుతున్న ఈ భగవద్గీతా అవీ విని ఎవరైనా పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయి రమణ మహర్షిలా అయిపోయారనుకోండి! అప్పుడు వాళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిడండ్రుల పరిస్థితి ఏమిటి?” అని అడిగారు. అప్పుడు సిరివెన్నెల ఏ మాత్రం తడుముకోకుండా – “ రమణ మహర్షి లాగ మనం అవ్వాలంటే కొన్ని వందల జన్మలు పడుతుంది! అయినా రమణ మహర్షి లాంటి వాడు మా వంశంలో పుట్టాడని ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు గొప్పగా చెప్పుకోవాలి కానీ, “అయ్యో! రమణ మహర్షి పుట్టాడేంటండీ మా ఇంట్లో!” అనీ వాపోతారేంటండీ మీరు?” అన్నారు మా నవ్వుల మధ్య. సిరివెన్నెల హాస్యచతురతా, సమయస్ఫూర్తీ కూడా గొప్పగా ఉంటాయి.

సిరివెన్నెల మాటలు వినాలనిపిస్తూనే ఉంటాయి కానీ వెళ్ళాలి, ఆయనకీ తెరిపి ఇవ్వాలి కదా! ఈలోపు వెంకట్ గారు కొన్ని “సమ్మాన్యుడు” పుస్తకాలు తీసిపెట్టారు మా కోసం. “సమ్మాన్యుడు” కాపీలు ఎక్కువ లేవు. 2014 లో సిరివెన్నెల సంతకం పెట్టిన పుస్తకాలు కొన్ని వెంకట్ గారి వద్ద ఉండడంతో అవి వెతికి మాకోసం బయటకు తీశారు. సిరివెన్నెల మాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా మా పేర్లను పుస్తకంపై రాసి పుస్తకాలను మాకిచ్చారు. ఆయన చేతులమీదగా ఈ పుస్తకం అందుకోవడం మహదానందం!

IMG_3072

చివర్లో వీడ్కోలు తీసుకునేటప్పుడు నేను వెంకట్ గారితో – “సిరివెన్నెల సచిన్ పరుగుల కన్నా ఎక్కువ పాటలు రాశారన్నారు కదా, అది సాధ్యమేనా?” అన్నాను. నా మాటలు విన్న సిరివెన్నెల – “అవును! అప్పట్లో నేను రోజుకి చాలా పాటలు రాసేవాడిని. ఇది కేవలం నేను చెప్పడం కాదు, ఆ ముప్ఫై వేల పాటలూ నా దగ్గర కాయితాలు ఉన్నాయి!” అన్నారు. “అద్భుతం! మరి వెలికితీసి అందరికీ అందిద్దాం అయితే” అని నేనంటే, “అవును! అదే ఆలోచన. సాయీ (సిరివెన్నెల గారి పెద్దబ్బాయి యోగి), వీళ్ళ డీటైల్స్ తీసుకో!” అని మరీ మరీ చెప్పారు. తరువాత మౌళీ తను పాటలు రాస్తానని చెబుతున్నప్పుడు, “నేనూ పాటలు రాస్తానండీ! మీ మీద ఒక పాట రాశాను అప్పట్లో, విజయ్ గారు మీకు చూపించారు, మీరు మెచ్చుకున్నారు!” అన్నాను. “ఆ, బాగా గుర్తుంది! అదే! ఫణీంద్ర పేరు ఎక్కడో విన్నాను అనుకుంటున్నాను, ఇప్పుడు గుర్తొచ్చావు!” అన్నారు. ఆయన గుర్తులో మన పేరు ఉండడం కన్నా ఆనందం ఏముంది?

00CE4F05-7345-4039-B3B0-24B96C022065
వెంకట్ కొండ గారింట్లో! (కుడి నుంచి – యోగి (సిరివెన్నెల గారబ్బాయి), వేణు, నేను, సిరివెన్నెల గారు, విజయ సారథి గారు, మౌళీ)

దేవుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినట్టు, సిరివెన్నెల చుట్టూ మూడు రోజులు తిరిగి ఆయనతో ముచ్చటించగలగడం నా దృష్టిలో మహాపుణ్యమే! ఆయన పంచిన జ్ఞానమే ప్రసాదం. ఆయన పాటలూ, మాటలూ మనకి తరగని వరాలు!

సిరివెన్నెల సన్నిధిలో…!

One thought on “సిరివెన్నెల సన్నిధిలో…!

  1. Phani,
    I am always a big fan of your simple, lucid, concise & consummate writing! We are very fortunate that you, along with your family and friends, could visit all of us to meet Annayya those three days. Now you took time to put it together so that those unfortunate who missed it could share the same experiences! AWESOME!!!

    Like

Leave a comment