సిరివెన్నెల పాటతో మనందరం!

సిరివెన్నెల అంతగా జనంలోకి చొచ్చుకుపోయిన సినిమా కవి మరొకరు కనిపించరు! పండిత పామరులని ఒకేలా అలరించడం సిరివెన్నెలకే సాధ్యపడింది. సాహిత్యం ఛాయలకే వెళ్ళని వాళ్ళనీ, సిరివెన్నెల పేరు తెలియని వాళ్ళనీ కూడా ఆయన పాట ఆకట్టుకుంది. ఆయన పాట ఎందరికో జీవితాన్ని నేర్పింది, కొందరికి జీవితమే అయ్యింది. సిరివెన్నెల పాటతో ప్రేమలో పడి, ఆయన పాటతో నవ్వుకుని, ఆయన పాట ద్వారా బాధపడి, ఆయన పాటతో బాధ దించుకుని, ఆయన పాటతో ప్రేరణ పొంది, జీవితాన్ని దిద్దుకుని, ఆయననే నమ్ముకుని బ్రతుకులోని నవరసాలనీ తెలుసుకున్నవారు ఎందరో! సిరివెన్నెల పాటల ప్రభావానికి నేను అబ్బురపడ్డ సందర్భాలు కొల్లలు ఉన్నాయి నా జీవితంలో. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వాటిల్లో కొన్ని పంచుకుంటున్నాను!

బోటనీ పాఠముంది!

ఊహ తెలిసినప్పటి నుంచీ నాకు సినిమా పాటలంటే చాలా ఇష్టం. సాహిత్యం అర్థం కాకపోయినా నచ్చిన పాటలని నోటికొచ్చినట్టు పాడుకునేవాడిని. అలాంటి నేను సాహిత్యం పూర్తిగా అర్థం కాకపోయినా సాహిత్యంలోని గమ్మత్తుని ఎంజాయ్ చేసిన మొదటి పాట “బోటనీ పాఠముంది” (అప్పటికి నా వయసు పన్నెండేళ్ళు ఉంటుందేమో). శివ సినిమా వచ్చిన కొన్నేళ్ళ వరకూ ఈ పాట మా ఫ్యామిలీ గేదరింగ్స్ లో తరచూ వినబడేది. మా తమ్ముడొకడు (బాబయ్య గారి అబ్బాయి) ఈ పాటని భలే ఎక్స్ప్రెషన్స్ తో పాడే వాడు. మామూలు మాటల్లానే ఉండే ఈ పాట మమ్మల్ని బాగా ఆకట్టుకునేది. అందరు పిల్లలం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంత చిన్న వయసు పిల్లలు కూడా ఆస్వాదించేలా పాట రాయడం సిరివెన్నెల గొప్పతనం!

ఆదిభిక్షువు వాడినేది కోరేది?

మా అమ్మమ్మ గారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మా ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మరీ పాటలు పాడించుకునేది, ముఖ్యంగా భక్తి పాటలు. సిరివెన్నెల చిత్రంలో ఆది భిక్షువు” పాటని నా చేత చాలా సార్లు పాడించుకుని ఆ సాహిత్యానికి తెగ మురిసిపోయేది. నాకు మటుకు ఆ పాట పెద్ద అర్థమయ్యేది కాదు (అప్పటికి నేను ఇంటర్మీడియట్ కి వచ్చాను). మాటలు, భావం అర్థమవుతున్నా ఆ పాటలో అంత గొప్ప విషయం ఏముందో నాకు తెలిసేది కాదు. మా అమ్మమ్మ నాకు కొంత వివరించి – “నీకు అర్థమవుతుందిలే ఏదో రోజు” అనేది. తరువాత రెండేళ్ళకి అనుకుంటా నాకు ఆ సాహిత్యంలో గొప్పతనం అర్థమయ్యింది. సిరివెన్నెలకీ, మా అమ్మమ్మకీ ఓ దణ్ణం పెట్టుకున్నాను.

నిగ్గదీసి అడుగు!

ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఓ రోజు టీవీలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే ఆయనతో ఇంటర్యూ చూశాను. అదే ఆయన్ని మొదటి సారి చూడడం, పేరు వినడం. అప్పుడే నాకు “బోటనీ పాఠముంది” రాసింది ఆయననీ, సిరివెన్నెల పాటలన్నీ ఆయనే రాశారని తెలిసింది. దాంతో నేను ఆయనకి తక్షణం అభిమానిగా మారాను! తరువాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మొదటిసారి సిరివెన్నెలని చూడడం జరిగింది. ఓ బాలూ పాటల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించారు. సిరివెన్నెలని చూడడం మహగొప్పగా అనిపించింది. ఆయన మాటల్లోని ఫోర్స్ ని అప్పుడే తెలుసుకున్నాను. “నిగ్గదీసి అడుగు” పాట పాడుతూ “ఇది సమాజం నుంచి వేరుపడి, సమాజం కంటే ఉన్నతుణ్ణి అనుకున్న మనిషి సమాజానికి చేసే నీతిబోధ కాదు, సమాజంలోని భాగమైన మనిషి తనలోకి, తనలోని సమాజంలోకి తొంగి చూసుకోవడం” అని చెప్పడం నాకు బాగా గుర్తుంది. అలాంటి విప్లవ ప్రబోధాత్మక గీతాల్లో సమాజం, ఉద్ధరణ వంటి బాహ్య వస్తువులపై దృష్టి పెట్టక మనిషి, మనసు అంటూ అంతర్ముఖ విచారణ చెయ్యడం నన్ను అబ్బురపరిచింది!

నేను BTech ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా కాలేజీలోని కులవివక్షపై గొంతెత్తి యాజమాన్యంపై తిరుగుబాటు చేశారు. చాలా మంది విద్యార్థులు క్లాసులను బహిష్కరించి గేటు దగ్గర బైఠాయించారు. అక్కడున్న వారిని ఉత్తేజపరచడానికి ఎవరో పాట అందుకున్నారు – “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని” అంటూ! అందరూ గొంతు కలిపారు. మా కాలేజీలో యూనియన్లు లేవు, కమ్యూనిస్టులు లేరు. అప్పటికప్పుడు విద్యార్థులు మూకుమ్మడిగా స్పందించిన సందర్భంలో ఒకరి గుండెల్లోంచి పుట్టి అందరి గుండెలని తాకిన పాట అది! అందుకే సిరివెన్నెల “ప్రజాకవి”!

నీ నవ్వు చెప్పింది నాతో!

నేను విజయవాడ సిద్ధార్థ కాలేజీలో B.Tech చదువుతున్నప్పుడు కాలేజీ హాస్టల్ లో ఉండేవాణ్ణి. మా ECE బిల్డింగుకీ, హాస్టల్ కీ ఐదు నిమిషాలు నడక, అంతే. ఒక పాట పాడడం మొదలెడితే పూర్తయ్యేటప్పటికి హాస్టల్ లో ఉండేవాణ్ణి. ఓ రోజూ నేనూ ఓ మిత్రుడూ కలిసి నడుస్తున్నాం. నేను సాధారణంగా పక్కన ఎవరైనా ఉంటే పాడేవాడిని కాను, వాళ్ళని నా గానంతో కష్టపెట్టడం ఎందుకని! కానీ ఈ మిత్రుడు పాటలు ఇష్టపడతాడు, నా పాటలూ భరించాడు గతంలో. కనుక నేను అతనితో మాటలు పెట్టకుండా, నీ నవ్వు చెప్పింది నాతో” పాట పాడుకుంటూ పోయాను. హాస్టల్ కి చేరాక అతను నాతో – “చాలా బావుంది ఈ లిరిక్! కానీ మరీ అంత ఫీలై పాడాలా?” అని అడిగాడు! “ఈ పాట పాడుతుంటే ఆ సాహిత్యానికి ఫీల్ అవ్వకుండా ఉండడం కష్టం!” అన్నాను! అతను “అవును కదా!” అన్నట్టు తలూపాడు. మనిషిలోని మనసుని తట్టిలేపే పాట మరి! సిరివెన్నెల పాటలన్నీ అంతే!

నేలనడిగా పువ్వులనడిగా!

B.Tech చదివే రోజుల్లో మా క్లాసులో అమ్మాయిలందరూ ఓ వైపూ, అబ్బాయిలు మరో వైపు కూర్చునేవారు. ఓ రోజెందుకో నాకు అమ్మాయిలు కూర్చునే బెంచీపై ఓ రాత కనపడింది. చూస్తే – “ఇపుడే ఇటు వెళ్ళిందంటూ చిరుగాలి చెప్పింది, నిజమే ఇంకా గాలుల్లో చెలి పరిమళం ఉంది” అన్న వాక్యాలు ఎవరో రాశారు, క్లాసులో బోర్ కొట్టినప్పుడు అనుకుంటా. రాసిన వాళ్ళకి ఆ పాట రాసింది సిరివెన్నెల అని తెలిసుండకపోవచ్చు. తమకి నచ్చిన వాక్యాలు రాసుండొచ్చు. సిరివెన్నెల పాటలు అందరినీ ప్రేమలో పడేస్తాయనడానికి ఇదో ఉదాహరణ!

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా!

మా బాబయ్య కూతురు ఒకమ్మాయి, అప్పుడు దానికి పదేళ్ళు ఉంటాయనుకుంటా. “వర్షం” సినిమా ట్రైలర్ వస్తోంది టీవీలో. “ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా…..అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా” అన్న సాహిత్యం. ఆ పాట అదే మొదటిసారి వినడం నేను. “ఎంత క్యూట్ గా రాశారో సిరివెన్నెల!” అని నేను మనసులో అనుకుంటూ ఉంటే, నాతో పాటూ ట్రైలర్ చూస్తున్న మా చెల్లెలు పైకి అన్న మాటలు – “అబ్బా! ఆశ దోశ అప్పడం. వాన నీతో ఉండిపోవాలనే!” దానికి సిరివెన్నెల చెప్పిన భావం అర్థమవుతుందని నేను అస్సలు ఊహించలేదు. దటీజ్ సిరివెన్నెల!

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని!

విజయవాడ సిద్ధార్థాలో ఒక స్నేహితుడు ఉండేవాడు. పల్లెటూరి నుండి వచ్చినవాడు. సినిమాలు బాగా చూసేవాడు. చూసి అందరికీ భలే వివరించేవాడు. ఈ కాలం భాషలో చెప్పాలంటే “mass audience”కి మంచి ప్రతినిధి. అప్పుడే “నువ్వు నాకు నచ్చావ్” సినిమా వచ్చింది. అందులో “ఒక్కసారి చెప్పలేవా” పాట గొప్పతనం గురించి “హాసం” పత్రికలో వ్యాసం చదివి “ఆహా అద్భుతం” అనుకున్నాను. కొన్ని రోజులు పోయాక అతనూ, నేను కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ సినిమా గురించి చర్చ వచ్చింది. అతను తన శైలిలో కథ చెప్తున్నాడు – “… ఇలా ఇద్దరూ ఇష్టపడినా పైకి చెప్పరు. వెంకటేష్ తొక్కలో లాజిక్కులతో మనని చావగొడుతూ ఉంటాడు. అప్పుడే ఒక పాట కూడా వస్తుంది. అందులోనూ మనవాడు తగ్గడు. నువ్వు చందమామ అనీ, పైన ఎక్కడో కూర్చున్నావు కాబట్టి నాకు అందవనీ, అయినా ఏదో చిన్నపిల్లలు చందమామని చూసి ముచ్చటపడినట్టు నీతో సరదాగా గడిపాననీ మహా లాజిక్ ఒకటి తీస్తాడు!….” అతను చెప్పుకుపోతున్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఒక పాటలో విషయాన్ని సినిమా కథలో భాగంగా సాహిత్యంపై ఏ మాత్రం ఆసక్తి లేని నా మిత్రుడు చెప్పడం సిరివెన్నెల సినిమాలో ఎంత లీనమై పాటలు రాస్తారో, అవి ప్రేక్షకులని సినిమాతో ఎంతలా కనెక్ట్ చేస్తాయో చెప్పడానికి ఓ ఉదాహరణ.

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే!

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొక్క అనుభవం గురించి చెప్పి ముగిస్తాను. నేను విజయవాడలో B.Tech చదువుకునే రోజుల్లోనే ఆకాశవాణి వారు దీపావళి పండుగ సందర్భంగా, “వెండి వెలుగుల కవితావళి” అని ఒక కవితాగోష్టి పెట్టి ఎనిమిది మంది సినీ కవులను ఆహ్వానించారు. సిరివెన్నెల, జాలాది, భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, జొన్నవిత్తుల, సుద్దాల మొదలైన వారు ఉన్నారు. సిరివెన్నెల “ఏటికొక అమవాస దీపావళి, ఓటమెరుగని ఆశ దీపావళి” అంటూ దీపావళిపై రాసిన పాట పాడారు. కవిత గొప్పగా ఉన్నా, కొంచెం “ఆలోచనామృతం” కావడం వల్ల, జనాలు “సామాన్యులు” కావడం వల్ల తప్పదన్నట్ట్లు చప్పట్లు తప్ప అంత స్పందన లేదు. సిరివెన్నెల తరువాత మళ్ళీ వచ్చి ఒక పాట వినిపించారు. “అటు అమెరికా – ఇటు ఇండియా” అనే సినిమాకి ఈ పాట రాశానని చెప్తూ ఆయన ఆ పాట వినిపించారు – “నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే! ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే!!”. తేలికగా అందరికీ అర్థమయ్యి, గుండెల్ని సూటిగా తాకేలా ఉన్న ఆ పాట ఆయన పాడడం పూర్తవ్వగానే సభంతా కరతాళధ్వనులు. వేదికపై ఆసీనులైన మిగతా కవులు కూడా ఎంత కదిలిపోయారో!

సిరివెన్నెలని గొప్ప కవి అనో, మేధావి అనో, ఫిలాసఫర్ అనో, ఉత్తేజపరిచే ప్రసంగకుడనో మనం భావించొచ్చు. ఆయన ఇవన్నీ, ఇంకా ఎన్నో! కానీ వీటన్నిటికీ మించి ఆయన గొప్ప మనిషనీ, మనిషితనానికి ప్రతినిధనీ మనం గుర్తించాలి. నేను ఆయన పుట్టినరోజుకి మిత్రులతో కలిసినప్పుడు ఆయన మాతో అన్న ఓ మాట నా మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది – “నాలోని కవిని ఫిలాసఫర్, ఫిలాసఫర్ ని మనిషి డామినేట్ చేస్తారు!”. ఇదో గొప్ప మాట. కవి, ఫిలాసఫర్, మనిషి – ఈ ముగ్గురిలో అతి ముఖ్యమైన వాడు మనిషి. కవిని ఫిలాసఫర్, ఫిలాసఫర్ ని కవి డామినేట్ చెయ్యొచ్చు, కానీ లోపలి మనిషిని వీళ్ళు డామినేట్ చెయ్యకూడదు! కవిత్వం రాసేవాడు ఫిలాసఫీలను ఐడియాలజీలను చుట్టుకోవచ్చు, తప్పు లేదు. అయితే మనిషిని మరిచిపోతే, తానూ అందరిలా మనిషినన్న స్ప్రహ కోల్పోతే అది చాలా చేటు చేస్తుంది. దీనికి చరిత్ర లోని హింసా విధ్వంసాలే సాక్ష్యం. “చలించడం, కనులు చెమరించేటట్లు గుండె ద్రవించడం నిజమైన కవికి జీవలక్షణం!” అని వేటూరి ఆత్రేయ గురించి రాసిన మాటలు కవులనుకునే వాళ్ళు సర్వకాల సర్వావస్థల్లోనూ గుర్తుపెట్టుకోవాలి. సిరివెన్నెల పాటలన్నిటిలోనూ పరుచుకున్నది మనిషి గుండె సడులే. ఆ మనిషితనమే నన్ను సిరివెన్నెల వైపు ఆకర్షించింది, ఆ మనిషితనమే సిరివెన్నెలని అందరికీ దగ్గర చేసింది!

ఇంకా ఎన్నో గొప్ప పాటలు రాసి జనులను జాగృతి పరచాలని కోరుకుంటూ, గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు!

సిరివెన్నెల పాటతో మనందరం!

సిరివెన్నెల “కబుర్లు” ఇంటర్వ్యూ

సిరివెన్నెల “కబుర్లు” వెబ్ పత్రికకి ఇచ్చిన ఈ పాత ఇంటర్వ్యూ చాలా చక్కని విషయాలని చర్చించింది. సినిమా పాటలు రాయడంలో ఉండే ఇష్టమైన కష్టాల గురించీ, కవిత్వం గురించీ, కవికి సామాజిక బాధ్యత ఉండాలా వంటి అంశాల గురించీ సిరివెన్నెల లోతైన సమాధానాలు ఇచ్చారు.

ఈ అరుదైన ఇంటర్వ్యూ వెబ్ లో ఇక్కడ దొరుకుతోంది (ఈ లంకెను పట్టుకున్న సిరివెన్నెల అభిమాని చంద్రకళకి ధన్యవాదాలు!). అయితే అది IE browser లో మాత్రమే సరిగ్గా కనిపిస్తోంది. కాబట్టి PDF గా మార్చి అందరికీ అందజేస్తున్నా! PDF ఇక్కడ.

 

 

సిరివెన్నెల “కబుర్లు” ఇంటర్వ్యూ

మేలుకొలుపు!

(సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఉగాది కవిత ఇది. పాత manasirivennela.com వెబ్సైట్ నుంచి)

పెద్ద పనేం పెట్టుకోవద్దు
పెద్ద పెద్ద కబుర్లూ వద్దు
నిద్దర్లేద్దాం చాలు!

కాలానికీ, భూగోళానికీ ఉగాదులూ కొత్త కాదు, ఉషస్సులూ కొత్త కాదు
గతం అంటే కేవలం జ్ఞాపకం అనీ
ఆగామి అంటే ఊసుపోని ఊహల వ్యాపకమనీ
చైత్రశుద్ధ పాడ్యమి వచ్చి ట్యూషన్ చెప్పేదాకా మనకి తెలియదా?
మాఘమాసపు మంచుగాలికి పట్టిన పడిశం వదిలించుకుని
మావి కొమ్మల్లో కచేరీ పెట్టిన కోకిలయ్య
పంచమంలో ప్రకటించేదాకా
అది అనాది ప్రకృతి గానమనీ
షడ్రుతువుల రాగమాలికలో సాగే ఆ గీతానికి
నిత్యం ఆదితాళమని ఎరుగమా మనం?

కొత్త పంచాంగం కట్టుకొచ్చినంత మాత్రాన
దినపత్రిక కళ్యాణ సుముహూర్తాల పట్టికై పోతుందా?
ఆకలి, అవసరం, అసహాయతా, అత్యాచారం, అరాచకత్వం, ఆక్రోశం…
వీటి అడ్రస్సులు పబ్లిషవడం ఆగిపోతుందా?
మరీపాటి భాగ్యానికి పనులన్నిటికీ శెలవుపెట్టి
మన మూడొందల అరవై ఐదు రోజుల్లోంచి
ఈ ఒక్కరోజునీ పైకి తీసి, దులిపి, పండుగ పేరుపెట్టి
ప్రత్యేక అతిథిగా పెద్ద పీట వేసి,
కోలాహలంగా సాగించే ఈ పాత సరికొత్త వేడుక ఎందుకూ?

అవనిమీదకి ఇదే మొట్టమొదటి అడుగన్నట్టు
కుడికాలు పెట్టి రమ్మని అలవాటైపోయిన ఆమనికి ఆహ్వానం అందిస్తాం
ఆచారంగా బ్రతుకుపుస్తకానికి శ్రీకారం చుట్టాలి రమ్మని
బహుపరాకుల కుహూరతాల పరభృతబృందాన్నీ
ప్రసవ పరాగ పవనాంకురాల్నీ పిలిపిస్తాం ప్రత్యేకంగా!
మనం మరిచిపోయిన అరవైఏళ్ళనాటి పాతపేరుతో
కొత్త కులుకు నటిస్తూ వచ్చిన వసంతుడికి
రంగవల్లుల ఆహార్యాన్నీ, ఆకాంక్షల అర్ఘ్యపాద్యాల్నీ
ఆటపాటల హారతుల్నీ, షడ్రుచుల నైవేద్యాన్నీ అర్పిస్తాం!
అట్టహాసంగా నిద్దరోయేవేళ దాకా అతిధి మర్యాదల్ని చేసి
సాగనంపేసి, తలుపులు వేసుకుని, అలిసిపోయి
మన మిగతా మూడువందల అరవైనాలుగు రోజుల
పాతదనపు పరిష్వంగంలో పవళిస్తాం!
పండగ ఐపోయినట్టేనా?

మాసిన తలల్ని కుంకుళ్ళతో అంటుకునేముందు
మూసుకున్న తలపులకీ వాటివెనుకనున్న అభ్యంతరాలకీ అభ్యంగనం చేయించామా?
అప్పో సొప్పో చేసి కొత్త బట్టలు కుట్టించుకునే ముందు
చిరుగులుపడ్డ జీవన వాస్తవాలకి కుట్టు వేసుకోగలిగామా?
మన కళ్ళెదుట కదుల్తున్న పగటి వాస్తవాలని
మనవికావులే అని కళ్ళుమూసుకున్నా
అవే వాస్తవాలు రాత్రి పూట పీడకలల్లో
మనముఖాలే తగిలించుకుని ఎదురౌతూ ఉంటే
ఆ కలవరింతల్నుంచి మేలుకోగలుగుతున్నామా?
ఆశయాల్నీ, ఆదర్శాల్నీ ఆశల అంబరం నుంచీ
ఆచరణల ధరాతలం మీదకి దింపలేక
మనమే స్వప్న పక్షాల్ని కట్టుకుని
నీరవ నిశీధంలో విహాయస విహారం చేస్తున్నాం కానీ
నేలమీదా కాలూనే ప్రయత్నమేదైనా చేస్తున్నామా?

పండగంటే మూడువందల అరవైనాలుగు రోజుల
కలల కల్లోలాల కలవరింతల పతాకస్థాయి కాదు
నిదరని నిధనందాకా సాగదియ్యకుండా
నిజంలోకి మేల్కోవడానికి పెద్ద పనేం పెట్టుకోవద్దు
పెద్దపెద్ద కబుర్లూ వద్దు
నిద్దర్లేదాం చాలు!

siriugadi

మేలుకొలుపు!

సిరివెన్నెల రాసిన అఘమర్షణమైన శివదర్పణ గీతం!

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్ప గీతరచయితలే కాక గొప్ప శివభక్తులు కూడా. తమ గురువు గారైన సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో శివునిపై వేయి గీతాలు రాయాలని సంకల్పించారు. ఈ గీతాలలో కొన్ని “శివదర్పణం” అనే పుస్తకంగా వచ్చాయి. ఈ పుస్తకంలోని పాటలు కొన్ని  రెండు ఆడియో క్యాసెట్లుగానూ వచ్చాయి. ఈ గీతరచనా సంకల్పం గురించి “శివదర్పణం”లో సిరివెన్నెల ఇలా చెప్పారు –

“అడగకుండానే, శ్రమించి సాధించకుండానే, మాటల్ని పాటల పేటలుగా కూర్చే చిన్ని విద్దెను పుట్టుకతోనే ఇచ్చిన పరాత్పరుడి కరుణాకటాక్ష వరానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బతుకుని అర్థవంతం చేసుకుని తరించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అనిపించడమే శ్రీకారంగా, ఈ గీతాయజ్ఞం 1990లో ప్రారంభించాను. వెయ్యి పాటల్నీ వెయ్యి యజ్ఞాలుగా చేసి, సహస్రమఖ పూర్తి సిద్ధి పొంది, తద్వారా లభించే దేవేంద్రత్వాన్ని, దేవదేవుని సేవేంద్రత్వంగా మలచుకోవచ్చని అత్యాశ కలిగింది!”

ఆయన అత్యాశ మన పాలిటి వరమై, అద్భుత సాహితీ యజ్ఞమై నిలిచింది! ఈ పుస్తకంలో ఉన్న ప్రతిపాటా ఆణిముత్యం. భక్తిగా సిరివెన్నెల తనని తాను శివునికి అర్పించుకున్న విధానం మనసుని స్పందింపజేస్తుంది. ఈ పాటల్లో ఆయన వాడిన భాషని చూస్తే సిరివెన్నెల ఎంత పదసంపద కలవారో తెలుస్తుంది. సినిమా పాటల కోసం తనని తాను భోళాశంకరునిగా మలచుకున్నారే తప్ప ఆయనో మహోన్నత కైలాస శిఖరమని అర్థమవుతుంది!

“శివదర్పణం” అంటే శివుణ్ణి చూపించే అద్దం. అయితే సిరివెన్నెలకి శివుడంటే క్యాలెండర్ లో కనిపించే దేవుడు కాదు. శివుడంటే మనం, శివుడంటే సమస్తం! ఆయన మాటల్లోనే చెప్పాలంటే –

“జగత్తు మొత్తాన్నీ త్రికాలసమేతంగా సాకల్యంగా సజీవంగా సంక్షిప్తంగా ప్రతిబింబించే అద్దం మనం! అలాగే మనకీ ప్రపంచం అద్దమవుతుంది. అయితే మనలా సూక్షంగా లేదే? మన భౌతిక తత్త్వాన్ని సరిగ్గా మన పరిమాణంలోనే ప్రతిబింబించేలా ప్రపంచాన్ని కుదించగలమా? అలా కుదిస్తే ఆ అద్దం శివుడు అవుతుంది. శివుడంటే ప్రపంచమే! శివుడంటే మనమే! శివుణ్ణి సరిగ్గా చూడగలిగితే మనని మనం సరిగ్గా, సజీవంగా, సంపూర్ణంగా, చూడగలం. అలాంటి శివదర్పణాన్ని చూపించడమే నా ఉద్దేశ్యం!”

ఆయనిలా చక్కగా చూపించినా, అర్థమయ్యేలా వివరించినా, శివతత్త్వాన్ని గ్రహించడానికి చాలా సంస్కారం, జ్ఞానం ఉండాలి అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సిరివెన్నెల గీతధారలో తడిసే ఆనందం దక్కాలంటే మాత్రం హృదయం ఉంటే చాలు. అందుకే ఈ పుస్తకంలోని ఒక పాటని పరికించి పులకిద్దాం!

“తొలిజోత” అనే పేరుతో రాసిన ఈ గీతం పుస్తకంలో మొదటిది. శివదర్పణ యజ్ఞాన్ని మొదలుపెడుతూ వినాయకునికి ప్రార్థనగా రాసిన గీతం.

పల్లవి:

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత
ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత
నా తలపోత! కైతల సేత!

చరణం 1:

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత
ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!
అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత
అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట
ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

చరణం 2:

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత
స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత
అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత
శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా
తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

చరణం 3:

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత
కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత
శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత
సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత
అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత
ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత
నా తలపోత! కైతల సేత!

విఘ్నేశ్వర స్తుతిలోనూ తెలివిగా శివుణ్ణి ప్రస్తుతించారిక్కడ సిరివెన్నెల! “అగజాసూనుడు” అంటే పార్వతీ (అగజా) తనయుడైన (సూనుడు) వినాయకుడు! అఖిల జగాలూ ఏ పని చేసినా ముందుగా దణ్ణం పెట్టుకునేది వినాయకునికి! మరి ఆ వినాయకుడు భక్తిగా తొలిపూజ చేసేది ఎవరికి అంటే శివుడికి! ఆ శివుడికి సిరివెన్నెల తన గీతాలను అంకితం ఇస్తున్నారు. ఈ శివదర్పణ కృతి సిరివెన్నెల మేధలోంచి జాలువారిన  కవితామృతధార! ఆ తలపోత, కైతలసేత పొందే ధన్యత మనది!

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత
ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!
అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత
అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట
ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

వినాయకుడికి (హేరంబుడు) తొలి వందనాలు చేసి మొదలుపెట్టిన ఏ పనైనా ఆయన ప్రాపు (ఆలంబన) వల్ల విఘ్నాలు లేకుండా వేగంగా (అవిలంబితము) సాగుతుంది. ఇక్కడ సిరివెన్నెలకి అవ్వాల్సిన పని వేయి గీతాలు పూర్తిచెయ్యడం కాదు. ఆ గీతాల ద్వారా తాను చేసిన శత వందనాల చేష్టని (శత వందనముల చేత) ఆ శివుని చెంతన చేర్చడం!  ఇది తన వల్ల అయ్యేది కాదు కనుక చంద్రజేత అయిన వినాయకుని శరణుకోరుతున్నాను అంటున్నారు! ఆ వినాయకుడు శివుడికి రోజూ అర్పించే వందనాల (అంజలి) వెంట సిరివెన్నెల యొక్క  హృదయభారాన్నీ తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుని పాదాల చెంత అర్పించాలట! ఎంత చక్కని భావం!  చేత/జేత వంటి పదాలతో శబ్దాలంకారాలు చేస్తూనే గొప్ప అర్థాన్నీ సాధించారిక్కడ సిరివెన్నెల!

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత
స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత
అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత
శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా
తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

అల్పత్వ భావన లేనిదే భక్తి లేదు. ఆ భగవంతుని ముందు నేనెంత, ఆయన్ని స్తుతించడానికి నా అర్హతెంత అనుకున్నప్పుడే  ఆయన కటాక్షం వలన గొప్ప కృతులు పుడతాయి! ఇదే ఇక్కడ సిరివెన్నెలలో కనిపిస్తోంది.  “నా అర్హత ఏమిటో కొంచెం కూడా తెలుసుకోకుండానే (గణుతించక) ఆ శివుణ్ణి స్తుతించాలనుకున్నాను! అందుకే స్కందపూర్వజుడైన ఆ వినాయకుడిని శరణు వేడుకుంటున్నాను! ఆయనే దయతో నాకు చేయూత నివ్వాలి! పుట్టుకలేనివాడూ (అజాతుడు), ఆలోచనకి అందనివాడూ (అచింత్యుడు), అంతము లేనివాడూ (అనంతుడు), పరిమితులు లేనివాడూ (అమేయుడు) అయిన ఆ పరమేశ్వరుడి గొప్పతనాన్ని ఈ శివకీర్తనల ద్వారా ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది నా అల్పత్వం. ఈ అల్పత్వం శర్వుడైన ఆ శివుణ్ణి సర్వమంగళంగా ప్రస్తుతించే అర్హతగా మారాలి అన్నది నా ఆశ.  ఈ నా ఆశని ఆ వినాయకుడే తన అపారమైన దయతో  తీర్చాలి!” అని వేడుకుంటున్నారు సిరివెన్నెల! ఇంత భక్తితో వేడుకుంటే వినాయకుడు తీర్చకుండా ఉంటాడా?

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత
కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత
శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత
సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత
అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

శివకవిత రాయాలంటే భక్తీ ప్రతిభతో పాటూ సుకృతమూ ఉండాలి! పరమాత్ముని కీర్తనం పుణ్యులకే సాధ్యపడుతుంది. అందుకే సిరివెన్నెల – “మంచి సంకల్పాలతో కూర్చబడిన (సంకలిత) ఈ శివకవిత, కూడబెట్టబడిన (సంచిత) నా సుకృతాల వలనే పుట్టింది (సంభూతము)” అంటున్నారు. పుణ్యాత్ములకే గొప్ప సంకల్పాలు కలుగుతాయి మరి!

ఈ సంకలనం “కవులలో కవి” అని ప్రస్తుతించబడిన సిద్ధివినాయకుని స్తోత్రం (గణన) వలన పవిత్రతను పొందింది (పరిపూత). అంటే తన గీతాలలో గొప్పతనమేదైనా ఉంటే అది కేవలం తన సుకృతం వల్ల, వినాయకుని దయ వల్ల, శివుని విభూతి వల్ల సాధ్యపడిందే తప్ప నాదంటూ ఘనత ఏమీ లేదని వినమ్రంగా సిరివెన్నెల చెప్పుకుంటున్నారు! “కవిం కవీనాం” అన్న వినాయక స్తుతిలో కవి అంటే కవిత్వం రాసేవాడు అని కాక జ్ఞాని, మేధావి అన్న అర్థం చెప్తారు. గొప్ప కవిత్వాన్ని కలిగిన ఈ శివదర్పణ సంకలనపు తొలిగీతంలో  “కవులలో కవి” అంటూ వినాయకుణ్ణి స్తుతించడం ఎంతైనా సముచితం!

ఆ శివుని ఆజ్ఞని ఎరుగని తన తిరస్కార (అవజ్ఞ) ధోరణిని ఆ విద్యాదినాధుడైన వినాయకుడే వంచుతాడు అంటున్నారు!  అంత భక్తితో, వినమ్రతతో ఉన్న సిరివెన్నెలకి తిరస్కారం ఎక్కడ నుంచి వచ్చింది? శివుని గురించి ఏమీ తెలియని అజ్ఞానం నాదని ముందు చరణంలో చెప్పుకున్నారు కదా, అలాంటి అల్పత్వం ఉన్నా లెక్కపెట్టక శివుణ్ణి స్తుతించే సాహసం చెయ్యడమే ఈ తిరస్కార ధోరణి! ఇలాంటి తిరస్కారం చూస్తే శివుడు కోప్పడడు సరికదా, కరిగిపోతాడు!

ఇలా ఆ వినాయకుని అండ వలన సింధురాస్యుడైన ఆ శివునికి అర్పితమైన ఈ శివకీర్తనలు పావనమై సిద్ధిని సాధిస్తాయి! “సర్వపాపాలూ నశింపజేసే మంత్ర” (అఘమర్షణము) సంహితలై అలరారుతాయి!

భక్తితో సిరివెన్నెల అర్పించిన పుష్పాలీ గీతాలు. పూజ ఆయనది, పుణ్యం మనందరిదీ! భక్తి ఆయనది, ఆ భక్తికి పులకించే హృదయం మనది. ఇన్ని గొప్ప గీతాలు రాసిన సిరివెన్నెలా ధన్యులే, ఈ గీతాలను విని ఆనందించే భాగ్యం కలిగినందుకు మనమూ ధన్యులమే! సిరివెన్నెల గారికి సహస్ర వందనాలు.

శశిప్రీతం సంగీతంలో బాలు ఆర్తిగా ఆలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినొచ్చు! 

 

సిరివెన్నెల రాసిన అఘమర్షణమైన శివదర్పణ గీతం!

వేటూరికి సిరివెన్నెల అక్షరాభిషేకం!

సిరివెన్నెల రాసిన వ్యాసాలు చదివినవారికి ఆయన ఎంత బాగా విశ్లేషించి రాస్తారో తెలిసిన విషయమే. 2002 లో వేటూరి పుట్టినరోజు సందర్భంగా “హాసం” పత్రికలో ఆయన రాసిన వ్యాసం బహుశా వేటూరిపై వచ్చిన వ్యాసాల్లోకెల్లా గొప్పది. సిరివెన్నెలకి వేటూరిపై ఉన్న ఆదరాభిమానాలకి దర్పణం ఈ వ్యాసం. వేటూరికీ సిరివెన్నెల అంటే ఎంతో ఆప్యాయత ఉండేది. “సీతారామశాస్త్రి నా సోదరుడు, నాకు పెద్దబ్బాయిలాంటివాడు – చాలా గొప్ప జీనియస్ అతను, అతను వ్రాస్తున్న సాహిత్యం నాకు ఇష్టం” అని వేటూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఈ వ్యాసం చదవడం ఆ మహారచయితలిద్దరికీ వందనాలు అర్పించడమే. పీడీఫ్‌గా ఉన్న వ్యాసాన్ని (ఒరిజినల్ వ్యాసం ఇక్కడ), తెలుగులో టైపు చేసి అందించిన సూర్యప్రభ, చంద్రలేఖ గార్లకు కృతజ్ఞతలు!

వెండితెరని నల్లబల్లగా మార్చి తిరిగి తెలుగు ఓనమాలు దిద్దించిన వేటూరి

శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు గత మూడు దశాబ్దాలుగా తెలుగు చలన చిత్ర సీమలో గీత రచయితగా ఏం సాధించారు అన్న సమాచారాన్ని ఈ రోజు నేను పనిగట్టుకుని మళ్ళీ వివరించనక్కర్లేదు – జగమెరిగిన సత్యం గనుక.

veturi_sirivennela

ఆయన ‘చలన చిత్ర పద చరిత్ర’ గురించి ఇప్పటికే కొందరు ప్రామాణిక పరిశోధనా గ్రంధాలు రాసి పి.హెచ్.డి.లు పొందారు అని విన్నాను. వారిలో డా. జయంతి చక్రవర్తి గారు నాకు తెలుసు. ఇంకా ఎందరైనా, ఎన్నిసారులైనా, పునరుక్తిదోషం పట్టని పుస్తకాలెన్నయినా వేటూరి గారి గురించి రాయవచ్చు, రాయాలి కూడా. ఆయన గీతరచనా వ్యాసంగం గురించి సమగ్రంగా తెలుసుకోవటం, సినిమా పాట గురించి మాత్రమే గాక, తెలుగుభాష, వాజ్ఞ్మయం, సంస్కృతి, ఇత్యాది అత్యావశ్యక అంశాల గురించి అధ్యయనం చేసినట్టవుతుంది.

వేటూరి గారి బహుముఖ ప్రతిభను సాకల్యంగా సమీక్షించిన వారి హృదయం – నవరసాల్లోనూ మునిగి తేలి, ఎంత తుడుచుకుందామనుకున్నా ఆరని ‘అద్భుత రస’ స్పర్శతో చిరకాలం ‘స్నేహం’ చేస్తుంది.

ఈటీవిలో గత కొన్నాళ్ళుగా, ‘ఝుమ్మందినాదం’ అన్నపేరుతో ఆదివారాల్లో ప్రసారమౌతున్న కార్యక్రమాన్ని చూసేవారు వేటూరి గారి గురించి ఎంతో వింటున్నారు, చూస్తున్నారు, సంతోషిస్తున్నారు. అయితే, ఇంకా కొన్ని సూక్ష్మమైన ‘సంగతులు’ సశేషమై పోతున్నాయేమో అన్న ఆరాటంతో, నాకు అనిపించిన కొన్ని విశేషాల్ని మీతో పంచుకోవడానికి, వారి జన్మదిన శుభ సందర్భంగా దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ, వారికి నా శుభాకాంక్షలను, వినమ్ర ప్రణామాలను అర్పించుకుంటున్నాను.

తెలుగు సినిమా పాటని, ఆదినుంచీ ఇప్పటిదాకా ఒక్కసారి ‘విహంగ వీక్షణ’ చేస్తే, నేను దిగువ ప్రస్తావించనున్న మూడు ముఖ్యాంశాల ప్రత్యేకత ఏవిటో, ఎందుకో, సహృదయులు అర్థం చేసుకోగలరు.

వేటూరిగారిలోని భావ సంపద

మొదటిది-వేటూరిగారిలోని భావ సంపద గురించి. సినిమా పాటకి ఉన్న ఉండవలసిన పరిమితుల్ని దృష్టిలో పెట్టుకుంటే,దానికి సెలయేటి గలగలల ‘లలిత పద లాస్యం’ తప్ప, సాగర గీతానికి ఉండే లక్షణాలు ఉండవని, అలా ఉండక పోవడం సహజమేనని తెలుస్తుంది. జలధి పేరు చెవిని పడితే అనంతనీలిమ సౌందర్యం, చిందులాడే అలల ఆట, ముప్పుగా ముంచెత్తే ఉప్పెనల తాండవం, అంతుబట్టని లోతు, నీరు కూడా ఆర్పలేని నిప్పుని ఒడిలో దాచుకోగలగడం, పుడమిపైనున్న ప్రపంచానికి మూడింతల ప్రపంచాన్ని తనలో కలిగి ఉండడం, ఇలా ఎన్నో స్ఫురిస్తాయి.

తెలుగు సినిమా పాట-తనకి అంతవరకూ లేని ‘సముద్ర స్వభావాన్ని’ చూపడం మొదలు పెట్టింది వేటూరి గారి సిరా నింపుకున్నతర్వాతనే! స్వరాల సిరిమువ్వలతో గలగల పా(డే)రే లేత చరణాల గీతబాల, ‘గిరిబాల’ (పార్వతి)గా మారి, అర్థనారీశ్వర విలాసంగా, అటు ‘అరభటీ’ తాండవోద్ధతిని, ఇటు ‘కైశికీ’ ఖేలననీ ప్రదర్శించే స్థాయికి ఎదిగింది.

వేటూరి గారికి ముందున్న పెద్దలందరూ – ఎన్నోసార్లు, ఎన్నో సినిమా పాటల్లో భావగరిమనీ, కావ్య లక్షణాన్ని పొదిగి, సర్వాలంకార శోభితంగా, సలక్షణంగా, తీర్చిదిద్దిన సందర్భాలు లేక పోలేదు. నిజానికి ఈ వ్యాసంలో నేను వివరించ దలుచుకున్న వేటూరి వారి గీతాల సులక్షణాలన్నిటికీ స్ఫూర్తిదాయకమైన గీతాలు వారి ముందు తరం వారు ఎన్నో రచించారు. వారిని తన గురువులుగా, మార్గదర్శకులుగా వేటూరిగారే సంభావించారు.

కాకపోతే-‘సగటు సినిమా పాట’ తో పోలిస్తే, కావ్య స్థాయిలో మన్నించదగ్గ పాటల సంఖ్య స్వల్పమే గాక, అవి, అలా ఆ ప్రత్యేకతను సంతరించుకోవడానికి-ఆయా చిత్రాల్లోని కథ, సన్నివేశాలు, పాత్రల ఔచితి, వగైరా సహకరించడం కూడా కారణమని అర్థమవుతుంది.

ఇక్కడే వేటూరి గారి ‘ఉనికి’ తన విశిష్టతను వ్యక్తీకరిస్తుంది. తన పాటల ప్రయాణంలో మొదటి పదేళ్ళపాటూ ఆయన చేసిన ప్రయత్నాన్ని పనిగట్టుకుని పరిశీలించండి. యుగళగీతమైనా, భక్తిగీతమైనా, రక్తిగీతమైనా, విరక్తిగీతమైనా, ‘ఉత్తి’ గీతమైనా – పాట…అదే సినిమా పాట ఆయన కొనవేలు పట్టుకుని కొత్త మలుపుల్లోకి నడవడం మొదలెట్టింది. మొట్టమొదటసారిగా బాణీ కట్లుబాట్లని, ‘చిత్ర’ పరిధుల్ని దాటి, తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో ఒక ‘కావ్యఖండిక’ గా మనగలిగేలా పాటని నిలబెట్టి, ఎప్పటికీ వసివాడని దేవపారిజాతాల్లా, గీతాలు గుబాళించేటట్టు తన ‘భావ గంధాన్ని’ అద్ది, ఒక్కోపాట ఒక్కో ‘సంపూర్ణ కావ్యం’ లా తీర్చిదిద్దడానికి ఆయన చేసిన తపస్సు, నన్ను స్తంభీభూతుణ్ని చేసిన సందర్భాలెన్నో వివరించడానికి చోటు చాలదు. అది ఏ సినిమా, దాని ‘నిలకడ’ ఎంత క్షణికం, ఆ సినిమాకి గాని, ఆ సందర్భానికి గాని అంత అర్హత ఉందా అని కూడా పట్టించుకోకుండా, ఆయన చెక్కిన కావ్యశిల్పాలు ఎన్నో!! పేరుకూడా గుర్తులేనంతగా ఇట్టే వచ్చి అట్టే కొట్టుకుపోయిన ఎన్నో చిత్రాల్లో ఆయన చేసిన అద్భుతాల్ని ఆనవాలు పట్టాలంటే ఎంతో త్రవ్వకపు పని చేపట్టాల్సిందే. అలా ‘తెరమరుగున’ పడిన అనేక గీతాలను ‘కనిపెట్ట’ గలిగితే, తన పద పారిజాతాల సుమమాలతో వాగ్దేవి నలంకరించిన సుందర రామ్మూర్తి గారిలోని కవితా మూర్తిని దర్శించగలిగితే, సినిమాకి సంబంధించని మహాకవులు కూడా సినిమా పాట రాయడం తమ ప్రతిభకి గర్హించదగ్గ ‘స్వోన్మీలనం’ (Self expression) గా భావించి కుతూహలపడతారే గాని, గర్హించవలసిన, లొల్లాయి పదాల కాలక్షేపంగా భావించి వెనకడుగు వేయరని అనిపించక తప్పదు. జనాదరణ పొందిన చిత్రాల పుణ్యమా అని పదిమందికి తెలిసిన ఒకటి రెండు ఉదాహరణలు గమనించండి. ‘ఈ దుర్యోధన దుశ్సాసన దుర్వినీతలోకంలో’ (ప్రతిఘటన) అని ఉదధి కడుపులో రగిలే బాడబానలాన్ని సహస్రకీలలతో బహిర్గతం చేసినా, ‘భక్తకన్నప్ప’ లో ‘కిరాతార్జునీయం’ లోని ‘తలపైని గంగమ్మ తలపులోనికి ఒదిగె’ అని సార్ర్దమైన సదాశివుని తలపుని సూచించినా, ‘చినుకులన్నీ కలసి చిత్రకావేరి, చివరికా కావేరి కడలి దేవేరి’ (శుభసంకల్పం) అని కనురెప్పల చెలియల కట్టని దాటని కన్నీటి పొర వెనుకనున్న గుండెకడలి కల్లోలాన్ని చూపించినా, ‘ కైలాసాన కార్తీకాన హిమదీపం…’(సాగరసంగమం) అని ‘ప్రమిదే లేని ప్రమధాలోకమణి దీపాల’ కాంతిలో మనల్ని నడిపించినా… ఆయన అనేక గీతాల్లోని ఈ స్తవనీయమైన కావ్య ‘ధ్వని’, తెలుగు సినిమా పాట ఇట్టే తేలిపోయే ‘తేటగీతి’ మాత్రమే కాదు, ఇట్టే ఆడిపోయే ‘ఆటవెలది’ మాత్రమే కాదూ, ఆత్మని తట్టి లేపగల ‘గీతాచార్య పాంచజన్య శంఖారావం’ కూడా కాగలదని నిరూపించి ‘So Called’ కవుల చెవుల్లోని సీసాన్ని కరిగించిన సత్యాన్ని చాటి చెపుతుంది.

వేలకు వేలుగా ఉన్న ఆయన పాటల్లోని పొల్లుని మాత్రమే పోగు చేసుకునే ఓటి చేతుల పండితమ్మన్యులకీ, రత్నాకరుని (సముద్రుని) ఇంటి ముందున్న చెత్తకుండీలోని నత్తగుల్లల్ని లెక్కపెట్టి ఆయన సంపదని గణించ చూసుకునే ‘విమర్శక శిఖామణు’లకీ, నా మాటలు మరీ అతిశయోక్తులు అనిపించవచ్చు. ఆయన కాలకృత్యాల వేళ దంతధావనానంతరపు పుక్కిలింతలే గమనించి పక్కకి పారిపోయే వారు ఆ తర్వాత ఆయన తన మనోమందిరంలో ధ్యానముద్రలో జపించిన నమక చమకాల నాదం నుంచి ఆవాహన చేసి మనకందించిన రుద్రాభిషేక సంజనిత గీతామృత శీకరాలలో స్నానించలేరు. ‘పోయింది పొల్లు, ఉన్నది గట్టి’ అన్న మన కృషీవలుల (రైతుల) ఋషి వాక్తుల్యమైన సామెతను స్మరించుకునే ధీమంతులు వేటూరి గారి పాటల పూదోటలోని ప్రవేశార్హులు.

వేటూరి గారి భాషా పాటవం

రెండవది వేటూరి సుందరరామ్మూర్తి గారి భాషా పాటవం గురించి… ఆబాల గోపాలాన్ని అలరించే చిత్రకళాకేళిలో భాగమైన సినిమా పాటలో భాష అతి సరళంగా, జనబాహుళ్యం నిత్యం వినియోగించే వ్యావహారికంలా సులువుగా, తేలిగ్గా ఉండాలి అనే నిబంధన తప్పు అనలేం, అనకూడదు కూడా. కాని, వేటూరిగారు తెలిసి తెలిసి సినిమా నియమావళిని అతిక్రమించి, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సాగర సంగమం’, ‘పార్వతీ పరమేశ్వరులు’ ఇంకా ఇలా ఎన్నో చిత్రాల్లో, అతి ప్రౌఢమైన భాషని వినియోగించడం ద్వారా తెలుగుభాషకి,సంస్కృతికి,ఎలాంటి మేలు జరిగిందో ఒకసారి ఆగి ఆలోచించాలి.

పాల పళ్ళు కూడా ఊడని పసిప్రాయంలోనే భారత భాగవతాలూ, భగవద్గీత, ప్రాచీన పద్యవాజ్ఞ్మయం, దాశరధీ శతకాది శతకాలూ, భర్తృహరి సుభాషితాలు, అమరకోశం, పెద్దబాలశిక్ష…. ఇంకా ఇలాంటి వన్నీ కంఠతా పట్టించిన మన తెలుగింటి విద్యాబోధన-తరాలు మారుతున్న కొద్దీ ఏ విధంగా ‘చిన్నబో’ తోందో గమనిస్తే, ఇంట్లో, వీధుల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇలా అన్ని చోట్లా మన పిల్లలకి ఎలాంటి మాటతీరు అలవడుతుందో అర్థం చేసుకో గలిగితే క్రమక్రమంగా ‘గ్రంధ పఠనం’, ‘అధ్యయనం’ , ‘వినడం’ లాంటి ‘కసరత్తు’ కరువై, దంతాలూ, జిహ్వా, సర్వతంత్రులూ, అన్నీ సత్తువుడిగి, దివ్యభాషాపీయూషాస్వాదనకి అనర్హమై, పలుకులు నత్తినత్తిగా, నంగినంగిగా తయారై, ఆంధ్రభాష ఎలాంటి దుర్దశకి లోనైందో గుర్తిస్తే, ఈనాటి అవకతవక శిక్షణ మనకి ఎంత ‘పెద్ద’ బాల ‘శిక్ష’ గా పరిణమించిందో అని బాధపడగలిగితే మనం ఏ సంపదని కోల్పోతున్నామో తెలుస్తుంది. పండితులు, పెద్దలు , భాషావేత్తలు, విజ్ఞులు, కవులూ ఈ పరిస్థితిని ఉపేక్షిస్తున్నారు.

మంచి ‘పలుకుబడిని’ కొందరికే పరిమితం చేయకుండా సమాజంలో అందరికీ పంచిపెట్ట గలిగిన, పంచి పెట్టవలసిన ‘వేదిక’ ఏదీ ఎక్కడా ‘మాటవరసకి’ కూడా లేక, తెలుగుభాష నిరుపేదగా మారి, నడి వీధుల్లో పడుతున్న సమయంలో, వేటూరి గారిలోని ‘వాచస్పతి’ మనకి సంస్కృతసత్సంగంతో పరిపుష్ఠమై, గాంభీర్యంలోనూ గహనత్వంలోనూ విస్తృతిలోనూ సౌందర్యంలోనూ మరే ఇతర భాషకి అందనంత ఎత్తులో ఊన్న ఆంధ్రభాషతో పునః పరిచయం కలిగించే ప్రయత్నం చేసారు. అది కూడా ప్రజాబాహుళ్యానికి చేరువగా ఉన్న వెండితెర వేదిక ద్వారా.

కావ్యభాష – సినిమాని చిన్నచూపు చూస్తూ తనని తనే ‘వెలి’ వేసుకున్న తరుణంలో వేటూరి గారి పుణ్యమా అని తెలుగుపాట ఉన్నత స్థాయిలో పలకడం నేర్చుకుంది. అంతకుమునుపు పౌరాణికాల్లోనూ, ఏవో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప తెలుగు సినిమా కవులు అందరికీ అందుబాటులో లేనంత జటిలమైన, సంస్కృత సమాస భరితమైన భాష జోలికి పోలేదు. ఆ కవులకి శక్తి, అర్హత, సామర్థ్యం లేక పోవడం వల్ల కాదు – సినిమా తెరని కృష్ణదేవరాయుల భువన విజయ మండపంగా మార్చే స్వేచ్ఛా, చొరవా తీసుకోక పోవడం వల్ల. అలాని అంతకుమునుపెప్పుడూ ఘనమైన భాషా పాటవాన్ని ప్రదర్శించిన పాటలు అస్సలు లేవని కాదు. కాని, వేటూరిగారు ఈ విషయంలో చాలా ముందుకి దూసుకువెళ్ళారు. అవకాశాన్ని అంది పుచ్చుకుని మరీ భాషని వినియోగించుకున్నారు.

‘గొప్ప భావాలను కూడా చిన్న మాటల్లో చెప్పగలగడం చాలా గొప్ప విషయం’ అన్న అభిప్రాయం తప్పని ఎవరూ అనరు. అది నిజంగా గొప్పే. కాని, ఆ అభిప్రాయం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఒక నిజాన్ని విస్మరిస్తోంది.

కేవలం నాదం ద్వారానే ప్రాణనాడుల్ని మీటగలిగే సత్తా ఉన్న ఆంధ్రవాణిలోని వేదతుల్యమైన నాదమహిమని అలక్ష్యం చేయడం ద్వారా మనం, ‘భాషకి అందని భావం లేదు’ అనే ఐశ్వర్యాన్ని వదులుకుని, ‘ఏ భాషకీ అందనిదే భావం’ అని అనుకోవలసిన దారిద్ర్యాన్ని వరిస్తున్నాం. ‘అందరికీ అర్థం కావడం’ అనే లక్ష్యం కోసం, సినిమా పాట రాన్రానూ ఓ అరవై డెబ్భె మాటలకి పరిమితమై పోతోంది.

‘అర్థం కావడం వేరు, అనుభూతికి అందడం వేరు’ అని తెలుసుకుంటే – ‘ఏవో కొన్ని మాటలతోనే నిత్యనైమిత్తిక వ్యవహారాలు నడిచి పోతున్నాయి కదా, ఇంకా అంత విశాలమైన భాషార్ణవం దేనికి? రండి, భాషా సాగరాన్ని ఎండగట్టి ఎడారి చేసేద్దాం’ అనుకునే విపరీత ధోరణి మానుకుంటే – మనకి అర్థం అయేలా మనకి అందుబాటులోకి వచ్చేలా విలువల శిఖరాల్ని తలవంచమనడం కన్నా – గొప్ప విషయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకి వశమయ్యేలా అభ్యాసం చేద్దాం. ఉన్నత విలువల శిఖరాలను అధిరోహించే బలాన్ని మన ‘చరణాల’ కు కలిగిద్దాం అనే దృక్పథాన్ని అలవాటు చేసుకుంటే ఒక్క సంస్కృతంలోనూ, సంస్కృత భరితమైన ఆంధ్రంలోనూ తప్ప ‘శివతాండవాన్ని’ ఇంకే భాషైనా మన ‘అనుభూతి’ కి అంది వచ్చేలా ఆవిష్కరించగలరా అని గర్వంగా ఆశ్చర్యపడగలిగితే వేటూరి సుందరరామ్మూర్తి గారు సినిమా పాటల్లో భాషా పాటవాన్ని చూపడం ద్వారా ఆంధ్రభాషకి చేసిన చిరస్మ్రణీయమైన సేవని మెచ్చగలుగుతాం. శంకరాభరణం, సప్తపది, సీతారామయ్య గారి మనవరాలు, భక్త కన్నప్ప, రాజేశ్వరీ కల్యాణం, సరిగమలు… ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన “పరిపూర్ణమైన తెలుగు”ను వినియోగిస్తూ, తెలుగు నుడికారాన్ని, ఆంధ్ర భాషా ప్రాశస్త్యాన్ని, తెలుగుజాతి వారసత్వాన్ని ప్రపంచంలో తెలెత్తుకు తిరగ్గల తెలుగు మాటలలోని ఠీవిని, రూపు కట్టిన సంక్లిష్ట భావాల్ని ఎన్నోసార్లు ఆవిష్కరించారు.

ఇది వివాదాస్పద అంశం. నాకు తెలుసు ఎందరితోనో విభేదించవలసి వస్తుందని! అయినా ఈ అంశాన్ని ఇంత విస్తృతంగా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అంటే – గ్రంధాలయాలకి, పండితులకి, ప్రత్యేకమైన ఆసక్తి గల వారికి, “మేం గొప్ప కవులం. సామాన్య ప్రజానీకం కన్నా ఉన్నతులం” అనుకుంటున్న కొందరికి మాత్రమే పరిమితమైపోతున్న భాషా వైభవాన్ని ప్రజలందరికీ సన్నిహితం చేసేందుకు వెండి తెరని నల్లబల్లగా మార్చి ఆరేళ్ళ ప్రాయం వారి నుంచి అరవై ఏళ్ళ పైబడిన వారి దాకా అందరికీ తిరిగి తెలుగు ఓనమాలు దిద్దించేందుకు కృషి చేసిన వేటూరి గారి ప్రయత్నానికి సహకరించకపోగా ఆ “గురువు”కే పాఠాలు నేర్పుతూ తపనిసరితనంలోకి నెట్టి ఆయన చేత గత్యంతరం లేని సాము గరిడీలు చేయించి శభాషంటూ చప్పట్లు కొడుతున్నాం.

మన ఈ ‘సరదా’ కేరింతల్ని కాసేపు కట్టిపెట్టి ఆయన ఏటికెదురీది, కావ్యభాషా ప్రయోగం చేసే సాహసాన్ని ప్రదర్శించి, తన పాటల ద్వారా అందించిన చక్కని చిక్కని మాటల మాధుర్యాన్ని అందుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం భాషా రసాస్వాదనలోని మాధుర్యాన్ని చవి చూడడంతో బాటు నన్నయ్య, తిక్కన, శ్రీనాధుడు, పెద్దన, పోతన, రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య వంటి ఎందరో శారదాంశా సంభూతులకు వారసులమని సగర్వంగా మనని మనం పరిచయం చేసుకోగలుగుతాం. శ్రీ వేటూరి గారు ముందు తరాలకి దారి చూపించేలా అందించిన ఈ కరదీపిక ఆరిపోక ముందే వర్తమాన చలనచిత్రసీమ లోని కవులు, ఆంధ్ర ప్రేక్షకులూ, ఈ “ముద్దుమాటల” మరుగున పడి నిద్దరోతున్న తమ “పెద్దరికాన్ని” మేలుకొలిపేందుకు వీలుగా “రుద్రవీణ నిర్ణిద్రగానమిది అవధరించరా! విని తరించరా!” అని ‘శంకరాభరణం’లో ఆలపించిన ఆయన శ్వాసకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.

వేటూరి గారి తుంటరితనం!

మూడవ అంశం… భావ ప్రకటన దృష్ట్యా, భాషా ప్రయోగం దృష్ట్యా ఆయన ఘనతకి గీటురాళ్ళుగా “నిలిచిన” పాటలు గాక, ఇంకా మిగిలిపోయిన “కీచురాళ్ళు”గా ఆయన విదిలించిన “చప్పుళ్ళ” గురించి- నాటుతనం, మోటుతనం, ఆకతాయితనం, తుంటరితనం మేళవించి, గులకరాళ్ళుగా ఆయన మన మీదకి విసిరిన పాటల్ని విమర్శిద్దాం. తప్పులేదు. కాని, అక్కడకూడా ఆయన చూపించిన అనన్య సామాన్యమైన చమత్కారాన్ని, చాతుర్యాన్ని చూసి, “ఔరా!” అనలేకపోతే మనకి “సరసం” తెలియనట్టే. ఆయనలోని ఈ విశిష్ట శైలి నభూతో నభవిష్యతి.

మామూలుగా, ఉత్తుత్తినే, సినిమా పాటల్ని “ఆరేసుకోబోయి పారేసుకోవచ్చు” అని భ్రమపడి, ఆయన్ని అనుకరించడానికి, అనుసరించడానికి ప్రయత్నిస్తున్న పిల్లకాకులకి, ఆయన “పదబంధవైచిత్రి” ఉండేలు దెబ్బలాంటిది. పైకి కొంటెతనంగా, కోణంగితనంగా కనిపించినా, ఆయన అలవోకగా వాడే మాటల అల్లికలోని లాఘవం పోల్చుకుంటే ఆ ఆంజనేయుడిముందు కుప్పిగెంతులు వేసే ప్రయత్నానికి పాల్పడరెవరూ.

చెప్పవలసినదంతా చెప్పేసాక, చెయ్యవలసినదంతా చేసేసాక, exaust అయిపోయిన తరుణంలో కూడా, ఇంకా ఆయన చెణుకులు, “జగడజగడజగడాలు” , “నాటుకొట్టుళ్ళు” “కాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో” (రెండు రెళ్ళు ఆరు) “హంస లేఖ పంపా నీకంది వుంటది, పూల బాణమేసా ఎద కంది వుంటది” (ముత్యమంత ముద్దు) ఇలా లెక్కకు మించి పలుకుబళ్ళు వింటుంటే, ఆఖరికి బూతులు కూడా “మాటకారితనం సుమా!” అని అనిపిస్తూ ఉంటే, చిరాకు పక్కనే చిరునవ్వు, కోపం పక్కనే “ఓరి వీడి అసాధ్యం గూలా” అనే అబ్బురబాటు కలుగుతుంటే….

“కాదనడానికి, కసురుకోవడానికి, తిట్టడానికి మనం ఏపాటివాళ్ళంలే! ఆయనగారిగ్గానీ కోపం వస్తే, ఓ గొ..ప్ప పాటని, రెక్కలున్న మేరుపర్వతంలా మన నెత్తిన పడేస్తాడు, అణిగి చావాలి. ఆయన మనని వెక్కిరించాడని, మనం కూడా ఆయన్ని వెక్కిరించాలంటే తాహతు ఉండద్దూ!” అని బెరుకు పుడుతుంది.

ఇది వేటూరి గారిలోని భీమబలం! ధీమా! పొగరు!

“మహానుభావా! మీతో మేం చాల్లేం గానీ, బళ్ళో మంచి పాఠాలు నేర్పి, వీధిలో ఇలా కబ్బాడీ ఆడించి పిడిగుద్దులు గుద్దుతుంటే, మీరు మమ్మల్ని రాముడు మంచిబాలుడిగా తీర్చి దిద్దుతున్నారో, మాకు రాలుగాయి రౌడీల్లా తయారయే తర్ఫీదిస్తున్నారో మీకే తెలియాలి” అంటూ-

ఆకాశాన్ని ఆక్రమించిన ఆయన భావనా పదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషా పదానికి భక్తితో అంజలి ఘటిస్తూ, ‘నా మూడో పదాన్ని నీ నెత్తిన పెడతా’ అంటున్న ఆయన తాండవ పదానికి భయంతో నమస్కరిస్తూ,

ముమ్మారు మొక్కుతూ…

– సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(వేటూరి పోయినప్పుడు కన్నీళ్ళతో సిరివెన్నెల)

వేటూరికి సిరివెన్నెల అక్షరాభిషేకం!

నేను రాసిన అతి క్లిష్టమైన పాట! (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

(“శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా” పాట రాయడంలో తాను పడ్డ కష్టం గురించి సిరివెన్నెల స్వయంగా రాసిన ఈ వ్యాసం ఆయన స్వదస్తూరిలో పాత manasirivennela.com వెబ్సైటులో ఉండేది. ఒక కళాకారుడికి కళపట్ల ఎంత నిబద్ధత ఉండాలి, గొప్ప కళాసృష్టికి ఎంత తాపత్రయ పడాలి అన్నది తెలియాలంటే ఈ వ్యాసం తప్పక చదవాలి. వ్యాసం చదివాక సిరివెన్నెలకి మనసులో ఓ నమస్కారం పెట్టకుండా ఉండలేం. ఈ అపురూపమైన వ్యాసాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో ఉడతాభక్తిగా టైపు చేసి అందిస్తున్నాను.)

కష్టమైన పాట – క్లిష్టమైన పాట

 

“మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది?” అని అడుగుతుంటారు చాలామంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేను నేను. రాసిన ప్రతి పాటా పదిమంది మెప్పు పొందాలని ఆశించడం తప్పుకాదు కానీ అలా జరగడం సాధ్యం కాదు. రాసేటప్పుడు, ఈ పాట తప్పకుండా హిట్ అవుతుంది కాబట్టి గొప్పగా రాయాలి, ఈ పాట పురిట్లోనే సంధికొట్టి చస్తుంది కనుక దీనికి పెద్దగా శ్రమపడక్కర లేకుండా ఏదో గీకి పారెయ్యాలి అని ఎవరూ అనుకోరు. ఆ  పాట వీధినపడ్డ తర్వాత తెలుస్తుంది దాని బతుకేవిటో! కవి రాతతో పాటూ పాటకి దాని సొంత తలరాత కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళింతర్వాత పాట “హిట్”, “ఫట్” అవడాన్ని బట్టి దాని మీద ఇష్టం ఏర్పరుచుకోవడం జరగదు. ఇష్టపడకుండా ఎలా రాయడం?

కానీ ఇప్పటికీ ఎక్కువమంది నన్ను “సిరివెన్నెల” పాటల్లోనే గుర్తించడానికి ఇష్టపడతారు. “అంత గొప్ప పాటలు మళ్ళీ మీరు రాయలేరు!” అని అన్నవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మాత్రం నేను “హర్ట్” అవుతాను. ఎందుకంటే సిరివెన్నెల పాటలంత ప్రజాదరణ మిగతా పాటలకి రాలేదేమో గానీ సిట్యుయేషన్ దృష్ట్యా, అంతకన్నా గొప్పపాటలు చాలానే రాశాను.

“మీరు రాసిన పాటల్లో మీకు ఎదురైన అత్యంత క్లిష్టమైన పాట ఒకటి చెప్పండి!” అని అడిగితే, అది కూడా నా పాలిటి చిక్కుప్రశ్న. ఎందుకంటే క్లిష్టమైన పాట వేరు, కష్టమైన పాట వేరు. తగినంత సమయం దొరక్క, అక్కడ ఆ పాట ఎందుకుండాలో, దాంట్లో చెప్పాల్సినంత గొప్ప సంగతేవిటో తెలీక, తేలక చాలా పాటలు చాలా కష్టపడి రాయాల్సి వచ్చింది. సాధారణంగా ఈ “డ్యూయెట్లు” అనబడే “గాలిపాటలు” రాసేటప్పుడు ఈ కష్టం వస్తుంది. నా దృష్టిలో ఈ పాటలు క్లిష్టమైనవి కావు. చెప్పాల్సిన విషయం చాలా గొప్పదీ, విస్తృతమైనదీ, లోతైనదీ అయినప్పుడు, దాన్ని ఒక పల్లవీ, రెండు చరణాల్లో ఇమిడ్చి, వీలయినంత సరళంగా చెప్పవలసి వచ్చినపుడు అదే నిజమైన క్లిష్టత. అయితే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురయితే ఏ కవీ కష్టంగా భావించడు, ఇష్టపడతాడు.

ఈ దృష్టితో చూస్తే మాత్రం, నాకు సంబంధించి నేను “స్వర్ణకమలం” సినిమాలో రాసిన పాటలు చాల క్లిష్టమైనవి. కనుక చాలా ఇష్టమైనవి. అందులో “శివపూజకు చివురించిన” పాట గురించి చెబుతాను. కవిగా తన సత్తా చూపించాలి అని అనుకునే ఎవరికైనా, సరైన ఛాలెంజ్ ఎదురైతే ఎంతో ఆనందం కలుగుతుంది. తన సర్వశక్తుల్నీ ధారపోసే అవకాశం దొరికిన సంతోషం అది. అసలు “స్వర్ణకమలం” సినిమా కథలోనే గొప్పతనం ఉంది. ఆ సినిమా కథకి పాటలు రాయడం అనేక విధాల కత్తిమీద సాములాంటిది.

మూడు ఛాలెంజ్‌లు!

 

మొట్టమొదటి ఛాలెంజ్ ఏవిటంటే

సినిమాపాట అనేది సినిమా చూసే ప్రేక్షకులకోసం అన్నది సినిమా కవి సర్వవేళ సర్వావస్థల్లోనూ గుర్తుపెట్టుకునే ఉండాలి. తన వ్యక్తిగతమైన ప్రతిభని చాటించుకోడానికీ, మహామహా విద్వాంసుల బుర్రలకు పనిపెట్టేందుకూ సినిమా పాట వాడరాదు. ఒక ఉదాహరణ చెబుతాను.

సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ పొందిన టి.ఎస్.ఇలియట్ రాసిన “వేస్ట్‌లాండ్” అన్న సుధీర్ఘమైన కవిత ఉంది. అది ఎంతటి పాషాణపాకంలో ఉంటుందంటే కొమ్ములు తిరిగిన ఉద్దండపిండాల్లాంటి పాండితీప్రకాండులెందరికో ఇప్పటికీ పూర్తిగా కొరుకుడుపడలేదు. ఇప్పుడు, ఎవరైనా టి.ఎస్.ఇలియట్ జీవిత కథని కమర్షియల్‌గా తీస్తున్నారనుకోండి! “వేస్ట్‌లాండ్” కావ్యం అంతా కూడా ఒక పాటలో చెప్పాలనుకోండి. చెప్పగలిగి తీరాలి చచ్చినట్టు. ఎందరెందరికో పూర్తిగా అర్థంకాని దాన్ని ముందు తను సంపూర్ణంగా అర్థం చేసుకోవలసి రావడం ఒక ఎత్తు. దాన్ని సినిమా పాటగా రాయవలసి రావడం ఒక ఎత్తు. ఎందుకంటే “వేస్ట్‌లాండ్” లో తన సొంత తెలివి చొప్పించకూడదు. అందులో ఉన్న ఏ అంశాన్ని తప్పించకూడదు. ప్లస్ అదంతా కూడా సినిమా ప్రేక్షకులకి అందుబాటులో ఉండేలా చెప్పాలి.

ఉదాహరణ కోసం పైసంగతి చెప్పాను కానీ, ఎక్కడో నూటికీ కోటికీ ఒక అరుదైన సందర్భంలో తప్ప, సినిమాకవికి అలాంటి, అంతటి ఘోరపరీక్ష ఎదురవదు. సాధారణంగా మనం నిత్యం తీసే సినిమాల్లోనూ చూసే సినిమాల్లోనూ ఉండే పాటలు, సంగీతబద్ధంగా ఉండే మామూలు మాటలే తప్ప, గొప్ప కవిత్వాలు కాదు. కానక్కర్లేదు కూడా. కాకూడదు కూడా. పార్కులో గెంతులేస్తూ, డ్యూయట్ పాడుకునే హీరో హీరోయిన్లు కవులు కాదు. కనుక వాళ్ళ నోటంట కవిత్వం రాకూడదు.

అయితే ఎప్పుడో అరుదుగా ఎదురయ్యే అసాధారణ స్థితి లాంటిది “స్వర్ణకమలం” కథ. అలాంటి అసాధారణమైన అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. విశ్వనాథ్‌గారికి నాపట్ల ఉన్న ఆదరణ.

జనబాహుళ్యానికి అందుబాటులో ఉండాలి అన్న మొట్టమొదటి నియమానికి “స్వర్ణకమలం” కథలోనే ఇబ్బంది ఉంది. ఆ కథే అసాధారణం. మామూలుగా సినిమా స్టొరీలు, మన జీవితంలోని మెటీరియస్టిక్ అంశాలకి సంబంధించినవే అయి ఉంటాయి తప్ప, తీవ్రమైన భావనా ప్రపంచానికి సంబంధించినవి అయి ఉండవు. కానీ “స్వర్ణకమలం” కథలో కేంద్రబిందువు ఏవిటి?

ప్రతి ఒక్కరూ ఏదో ఒక “పని” చేస్తుంటారు. ఏదో ఒక “పని” చెయ్యకుండా బ్రతుకు గడవదు గనక. అయితే, తాము చేసే పనిని మనసా వాచా కర్మణా ప్రేమించే వాళ్ళు ఎంతమంది? “బ్రతుకు గడవదు గనుక” అనే తప్పనిసరితనంతో కొందరు, ఆ పనివల్ల తన ఆదర్శం కోసం కొందరు, ఆ పనివల్ల తాను నలుగుర్లో చాలా గొప్పవాడనిపించుకోవాలనే పట్టుదలతో కొందరు. ఇలా అనేక రకాలుగా చేస్తారు. రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. కాకపోతే ఆ పని, దాని ఫలితమూ ఇతరులతో సంబంధించిందే తప్ప, తనకీ ఆ పనికీ ఉన్న ప్రత్యేక అనుబంధం కాదు.

ఇలాటి ఒక సూక్ష్మాతిసూక్ష్మమైన భావనా ప్రపంచానికి సంబంధించిన కథ అది. ఒక యోగసాధన, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం లాటి అంశాలు మన నిత్యజీవితంలో రొటీన్‌గా ఎదురయ్యే అంశాలు కాదు కదా? ప్రేమ, ఆకలి, ఆదర్శం, కులం, మతం, సెంటిమెంట్సు ఇత్యాది జనులందరికీ కామన్‌గా ఉండే విషయాలకన్నా వేరుగా ఉంటుంది. మరి అటువంటి కథకి పాటలు రాసేటప్పుడు మొదటి కండిషన్‌ని పూర్తిగా ఫాలో అవడం సాధ్యమా?

అయితే ఉపనిషత్తుల్లాగా, శాస్త్రచర్చలాగా చెప్పడం కుదరదు కదా? ఎంచుకునే భాషలో గానీ, భావంలో గానీ, మరీ నేలవిడిచి చుక్కల్లో తిరిగితే, ఆ పాట వినడానికి, చూడ్డానికి భూలోకవాసులు పరలోకాలకి పోలేరు కదా!

రెండో క్లిష్టత ఉంది.

స్వర్ణకమలంలో మూడు పాటలు ఒకే విషయం చెప్పాలి. “ఆకాశంలో ఆశల హరివిల్లు” అనే పాట, మీనాక్షి (భానుప్రియ) కారెక్టర్‌ని చెబుతోంది. జీవితం పట్ల తనకి ఉన్న ఆశలేవిటి, అవగాహనలేవిటి అన్నది. ఏదో పుట్టుకతో తనకి డాన్స్ చెయ్యడం అబ్బింది. కానీ డాన్స్ చెయ్యడం పట్ల ఆసక్తి గానీ, అభిమానం గానీ లేదు. ఓ పక్కనుంచి తండ్రి (పోరు). మరో పక్కనుంచి చంద్రం (వెంకటేష్) వేధించుకు తినేస్తుంటాడు. “నువ్వు మహా డాన్సర్‌వి సుమా! దీన్ని ప్రాణంగా భావించాలి” అంటూ. తనకు ఒద్దు మొర్రో అన్నా వినడు.

రెండో పాట “ఘల్లు ఘల్లు..”. ఈ పాటలో కూడా మళ్ళీ మీనాక్షి పాత్ర లక్షణం చెప్పాలి. మొదటి పాటకి, రెండో పాటకి ఆమె పాత్ర స్వభావం మారిపోదు కదా? అంటే, మొదటి పాటలో చెప్పిందే మళ్ళీ చెప్పాలి.

తర్వాత “శివపూజకి…”. ఇది మళ్ళీ చంద్రానికీ, మీనాక్షికీ మధ్య వాళ్ళవాళ్ళ జీవన దృక్పథాల్ని చెప్పుకుంటూ సంఘర్షించే పాట. రెండో డ్యూయెట్‌కీ దీనికీ మధ్య వీసవెత్తుకూడా భేదం లేదు. అంటే “ఘల్లు ఘల్లు..” లో వాళ్ళిద్దరి మధ్యా ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందో మళ్ళీ దానినే మూడో పాటగా చెప్పాలి.

మూడో క్లిష్టత…

నేను సినిమా కవిని. ఏ పాత్ర పాట పాడాలో ఆ పాత్ర సంస్కారాన్ని, భాషని పలికించాలి గాని నా వ్యక్తిగత భావనల్ని కాదు. అంటే మీనాక్షి పాత్రకి రాసేటప్పుడు నేను మీనాక్షినే అయిపోవాలి.

సీతారామశాస్త్రిగా, నాకు చంద్రం ఆలోచనే రైటు, మీనాక్షి ఒట్టి మూర్ఖురాలు అనిపించవచ్చు, అనిపించాలి! అదే కథ ఉద్దేశం. కనకే మీనాక్షి మారుతుంది. సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడూ చంద్రం పక్షం వహిస్తాడు.

కానీ మీనాక్షి తనలో మార్పు వచ్చేవరకూ తనూ తన పక్షమే వహిస్తుంది గాని చంద్రం పక్షం వహించదు కదా. “అమ్మాయ్, నీ ఆలోచన తప్పు సుమా” అని చంద్రం అంటే, “అవునండీ రైటే!” అని ఒప్పుకోదు గదా! అతను ఒకటంటే, తను పది అంటూ, తనే రైటని వాదిస్తుంది. ఆ వాదనలో లొసుగు ఉంటే తనకే తెలుస్తుంది కదా! అంటే ఆ అమ్మాయి తను తప్పుచేస్తున్నానని అనుకోవడం లేదు గనక, తనే ఒప్పు అనుకుంటుంది గనుక, చంద్రం ఏ “లా” పాయిట్ తీసినా, వాటికి ధీటుగా తనూ అంతకన్నా బలంగా సమాధానం చెపుతుంది. ఇదీ నిజమైన క్లిష్టత అంటే!

చంద్రం పల్లవి

 

శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా?
నటనాంజలితో బ్రతుకును తరించనీవా?

అని చంద్రం పాడాల్సిన పల్లవి రాసాను. రాయగానే నాకు అనిపించింది చాలా అద్భుతంగా వచ్చిందని, డైరెక్టరు గారు (శ్రీ కె.విశ్వనాథ్ గారు) మెచ్చుకుంటారని. అనుకున్నట్టే ఆయన చాలా సంతోషించారు. అసలు చిక్కు అంతా అప్పుడు ప్రారంభం అయింది. చంద్రం పల్లవికి దీటైన పల్లవి మీనాక్షి అనాలి. సహజంగానే నాకు (వ్యక్తిగతంగా) చంద్రం పాత్రపట్ల మొగ్గు ఉంటుంది కనక అతని ఆరోపణ చాలా పవర్ఫుల్‌గా చెప్పాను. పైగా ఒక కవితాపరమైన శిల్పవైచిత్రి చూపించాను.

“చివురించిన మువ్వ” అన్నాను. మువ్వ అంటే పువ్వు కాదు కదా! మరి మువ్వని పువ్వు అని సమర్థించడం ఎలా అంటే అడుగడుగునా మువ్వకి సర్వలక్షణాల్లోనూ పువ్వుతో సారూప్యం కనిపిస్తుంది. పువ్వు చిగురిస్తుంది – ఒక లతకి, ఒక కొమ్మకి. మరి మువ్వ మృదువైన, అందమైన (మంజుల) పాదాలు అనే లతకి (మంజరి) చిగురించిన పువ్వు. పువ్వుకి పరిమళం ఉంటుంది. మరి మువ్వకి జతిస్వరములు. అయితే ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని రెండు వస్తువుల్ని అంత బలవంతంగా, విచిత్రంగా ఎందుకు పోల్చాలి? ఎందుకూ అంటే నాదమూర్తి, నటరాజు అయిన పరమేశ్వరుడి పాదపూజకి మామూలు పూలు కాకుండా, నాట్యానికి సంబంధించిన పూలు అయితే ధర్మంగా ఉంటుంది. కనుక “శివపూజకి చివురించిన సిరిసిరి మువ్వా”. అదే విధంగా వాసన, జతిస్వరాలు ఒకటి కాదు. కనుకనే యతిరాజు అని వాడడం జరిగింది. యతిరాజు అంటే సన్యాసులకి రాజు అని. సర్వసంగ పరిత్యాగి అయిన యోగి, సుగంధ ద్రవ్యాల్ని, సువాసనల్ని స్వీకరిస్తాడా? కానీ శివుడే ఒక విచిత్రమైన యోగి. ఇద్దరు భార్యలున్న సన్యాసి. అర్ధనారీశ్వరుడైన విరాగి. అతడు సంసారి కనుక పరిమళాలు కావాలి. సన్యాసి కనుక పరిమళాలు కూడదు. ఈ రెండూ కలిసొచ్చి “యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా”!

మీనాక్షి పల్లవి

 

ఇక ఆ క్షణం నుంచీ పదిహేను రోజులపాటు నేను పొందిన అలజడీ, అశాంతీ అంతా ఇంతా కాదు. అయితే ఆ ఛాలెంజ్‌ని ఎదుర్కోవడంలో ఇష్టం ఉంది. ఒక పాట రాయడానికి పదిహేను రోజులు టైమిచ్చే విశ్వనాథ్‌గారి వంటి దర్శకులుండటం, అటువంటి వారి వద్ద పనిచేసే అదృష్టం పట్టడం ఎంత గొప్ప!

ఈ పదిహేను రోజులూ నేను మీనాక్షిని అయిపోయాను. చంద్రం ఆరోపణకి దీటైన సమాధానం ఇవ్వడం ఒక సమస్య. కానీ ఆ పల్లవిలో ఉన్న కవిత్వపు లోతుముందు ఈమె పల్లవి వెలవెలపోకూడదు. కానీ మీనాక్షి పాత్ర కవిత్వం పలకదు కదా. ఎలా? చంద్రం భావుకుడు, కళాకారుడు. కనుక అతడు శివుడు, మువ్వ, పువ్వు లాంటి కావ్య వస్తువుల్ని, అలంకారాల్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. నేను కవిని గనక సులువుగా రాసేసాను.

కళలూ, ఆత్మానందం, పరమార్థం లాంటి విచిత్రపదాలతో భావనాలోకంలో పరిగెత్తడం కన్నా, ఓ హోటల్లో వెయిట్రెస్‌గా నౌఖరీ చెయ్యడం చాలా ఘనమైన సంగతి అని భావించే మీనాక్షి కవిత్వం చెప్పొచ్చా? చెప్పకుండా పేలవంగా పొడిపొడి మాటలు చెబితే రెండు పల్లవులకీ “బ్యాలెన్స్” ఉంటుందా? అంటే నేను మీనాక్షి పల్లవి రాస్తూ నాతో నేనే యుద్ధం చేయాలి. నా సర్వశక్తుల్నీ, ఆలోచనా తీవ్రతని వినియోగించి తిరుగులేని విధంగా ఆరోపణ చేసి, దాంట్లో లోతైన కవిత్వాన్ని పొదిగిన నన్నే నేనోడించాలి. ప్రత్యారోపణని కూడా మళ్ళీ చంద్రం నోరెత్తకుండా చేసేలా చెయ్యాలి. పొరబాటున కూడా కవిత్వపరిభాషని వాడకూడదు!

రాత్రీ లేదు, పగలూ లేదు. తిండీ లేదు, నిద్రా లేదు. మొదటి పల్లవి రాయడం ఒక తప్పు, దాన్ని అత్యుత్సాహంగా డైరెక్టరుగారికి చూపించేసి “సెభాష్” అనిపించేసుకోవడం రెండో తప్పు. నా మెడకి నేనే ఉరి తగిలించుకున్నానే అని చింత మొదలైంది.

మొత్తానికి, సరస్వతీదేవి కరుణ, శివుడి చల్లని దీవెన, నేను నిత్యం ఆరాధించే శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహం వల్ల, దాదాపు పదిహేను రోజుల తర్వాత ఒక రాత్రి పన్నెండూ ఒంటిగంట మధ్య పిచ్చిపట్టినట్టు వడపళని రోడ్లంట తిరుగుతూ జుట్టు పీక్కుంటూంటే, నాకు కావాల్సిన అన్ని లక్షణాలూ ఉన్న పల్లవి దొరికింది –

పరుగాపక పయనించవె తలపుల నావా!
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
నడిసంద్రపు తాళానికి నర్తిస్తావా?
మదికోరిన మధుసీమలు జయించుకోవా?

ఈ పల్లవిలో మూడో లైను కవిత్వపు ఘాటు వేస్తోందని, ఫైనల్ వెర్షన్‌లో మార్చాను. చంద్రం మాటకి సరైన జవాబు ఎలా చెప్పిందో నేను వివరించక్కర్లేదు. మంజుల, మంజరి లాంటి కావ్యభాష లేదు గనక. అది మీనాక్షి మాటల్లోనే ఉంది గనుక.

అయితే, చంద్రం పల్లవిలో ఉన్న కవితాలక్షణాన్ని కూడా ఎదుర్కోడానికి ఇక్కడ చిన్న మేజిక్ చేసాను. అతనిలా, శివుడూ, పదమంజరి, జతిస్వరాల పరిమళాలు లాంటి అభౌతికమైన విషయాలు కాకుండా, సముద్రం మీద నడుస్తున్న ఒక నావలాంటి భౌతికమైన అంశాన్ని ఆమె వాదానికి ఆలంబనగా తీసుకున్నాను. నట్టనడి సముద్రం మధ్య, కెరటాలు తాళం కొడుతున్నాయి కదా అని, ఒయ్యారంగా ఊగుతూ అక్కడే నిలబడదు ఓడ. తెడ్లో, ఇంజనో ప్రయోగించి, ఆ అలల ఊపుకి ఎదురీదుతుంది.

చరణాల్లో కూడా ఇదే బ్యాలెన్స్ చూపించాను. అతను మొత్తం అంతా కావ్య పరిభాష వాడుతూ, ఆమెను ఉదయంలా ప్రకాశించమంటాడు. ఆమె తన నిత్యజీవితంలో చూసే ఒక భౌతికమైన విషయాన్ని ఆలంబనగా తీసుకుని అతని వాదాన్ని తిప్పికొట్టడమే గాక, ఉదయప్రకాశంలో మేలుకోవడం కన్నా, నడిరాత్రి వెన్నెల్లో సోలిపోవడం మేలని చెబుతుంది.

నేను కత్తిమీద సాముగా భావించింది ఎక్కడంటే ఆమె ఆర్గ్యుమెంట్ విన్నవాళ్ళెవ్వరైనా అందులో లొసుగుందని అనుకోకూడదు. ఆమె ఆర్గ్యుమెంట్‌కి వెంటనే కన్విన్స్ అయిపోవాలి. ఆమె దృష్టితో చూస్తూ అంగీకరించడం కాదు. మన దృష్టిలోంచి చూసినా కూడా “అవును కదా!” అనిపించాలి.

“ఘల్లు ఘల్లు” పాటలో కూడా ఇదే సర్కస్ ఫీట్ చేసాను, గమనించండి –

నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకు పడు సురగంగకు విలువేముంది?

అని అతను అన్నప్పుడు, “అవును కదా” అనుకుంటాం.

“అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది?”

అని ఆమె అంటే, “అవును కదా!” అనుకోమా?

– సిరివెన్నెల సీతారామశాస్త్రి

ఈ పాటను యూట్యూబులో ఇక్కడ వినొచ్చు –

 

నేను రాసిన అతి క్లిష్టమైన పాట! (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

కంచెలు తుంచే మనిషితనం!

సిరివెన్నెల “కంచె” చిత్రానికి రాసిన రెండు అద్భుతమైన పాటలు పైకి యుద్ధోన్మాదాన్ని ప్రశ్నిస్తున్నట్టు కనిపించినా నిజానికవి నానాటికీ మనందరిలో కనుమరుగౌతున్న మనిషితనాన్ని తట్టిలేపడానికి పూరించిన చైతన్యశంఖాలు. ఇక్కడ “మనిషితనం” అంటే ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఓషో చెప్పిన ఓ కథ మనిషితనాన్ని చక్కగా విశదీకరిస్తుంది. ఓ ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున ఉన్నారు. ఇంతలో ఎవరో నదిలో మునిగిపోతూ – “రక్షించండి, రక్షించండి” అని అరిచారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి తలెత్తి చూశాడు. అతని విశ్వాసం ప్రకారం ప్రతి మనిషీ తన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. పక్కవాడి కర్మలో మనం తలదూర్చడం కన్నా అవివేకం మరోటి లేదు. అంతా భగవదేచ్చ!  కాబట్టి ఇక్కడో మనిషి మునిగిపోతున్నాడంటే అదతని కర్మఫలమే! ఇందులో చెయ్యగలిగినది ఏమీ లేదు. ఇలా ఆలోచించి అతను ఏమీ పట్టనట్టు ఉండిపోతాడు. రెండో మనిషీ ఈ అరుపులు వింటాడు. ఇతని నమ్మకం ప్రకారం మనిషి పోయాక స్వర్గ-నరకాలు అంటూ ఉంటాయి. పుణ్యకర్మలు చెయ్యడం వలన దేవుని కృపకి పాత్రులమవుతాం, స్వర్గం సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడీ మునిగిపోతున్న మనిషిని రక్షించడమంటే స్వర్గప్రవేశాన్ని ఖాయం చేసుకోవడమే! ఇలా ఆలోచించి అతను వెంటనే నదిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. కథలో నీతి ఏమిటంటే, మనం మనుషుల్లా స్పందించడం మరిచిపోయాం. ఏవో ఆలోచనలూ, సిద్ధాంతాలు, భావజాలాలూ తలలో నింపుకుని వాటి వలన మనుషులను రక్షించగలం, చంపగలం కూడా! ఇలా కాక మనిషిలా కరిగి, గుండెతో స్పందించే గుణం మనిషితనం అవుతుంది.

ఒక ఊరిలో రెండు వర్గాలు కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేక ఇంకేదో కారణం చేతనో విద్వేషంతో రగిలి తలలు తెగనరుక్కునే దాకా వస్తే, అది చూసిన మన స్పందన ఏమిటి?  ఇద్దరిలో ఎవరిది ఎక్కువ తప్పుందీ, గతంలో ఎవరు ఎక్కువ దారుణాలు చేశారు, ఏ శక్తులు ఎవరికి సహాయపడుతున్నాయి, అవి మంచివా చెడ్డవా – ఇవన్నీ బేరీజు వేసుకుని అప్పుడు గానీ స్పందించలేకపోతే మనలో మనిషితనం చచ్చిపోయినట్టే లెక్క! ఒక మనిషిలా కనుక స్పందిస్తే, మన గుండె ద్రవించాలి, మనసు తల్లడిల్లిపోవాలి.యుద్ధం పేరుతో ఓ మనిషి ఇంకో మనిషిని ఎందుకు చంపుకుంటున్నాడు? ఏమి సాధించడానికి? మృదువైన కోరికలూ, తీయని కలలలో తేలే మన హృదయ పావురాన్ని ఏ చీకటి బోయవాడు పాపపు బాణం వేసి నేలకూల్చాడు? హృదయాన్ని మరిచి, తెలివి మీరి, పగలతో సెగలతో రాక్షసులుగా మారిన మన మానవజాతిని చూసి పుడమి తల్లి గుండె తీవ్రమైన వేదనతో తల్లడిల్లిందే! ఆ తల్లి చేష్టలుడిగి నిస్సహయురాలై నిట్టూర్చిందే! ఆ తల్లి గుండెఘోషని చూస్తున్నామా, చూస్తే ఏమైనా చేస్తున్నామా? ఇంతటి మహా విషాద వృక్షాన్ని పెంచిన విషబీజాలేమిటి? పూలతోటల బదులు ముళ్ళచెట్లని పూయిస్తున్న ఆ ఆలోచనలేమిటి –

నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం

మృదు లాలస స్వప్నాలస హృత్ కపోత పాతం

పృథు వ్యథార్త పృథ్విమాత నిర్ఘోషిత చేతం

నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం

ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం?

ఈ మనసూ, హృదయస్పందనా, మనిషితనం లాంటివి వినడానికి బానే ఉంటాయి కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఒక మంచిని సాధించడానికి కొన్నిసార్లు దారుణాలు జరగక తప్పవని కొందరి భావన. ఉదాత్తమైన గమ్యం కోసం వక్రమార్గం పట్టినా ఫర్వాలేదు (The end justifies the means) అనే ఈ ఆలోచన చేసిన వినాశనానికి చరిత్రే సాక్ష్యం. తాను దుర్మార్గుణ్ణని విర్రవీగి విధ్వంసం సృష్టించిన వాడి కంటే, తానెంతో మంచివాణ్ణనీ, మహోన్నత ఆశయసాధనకే ప్రయత్నిస్తున్నాననీ నమ్మినవాడి వలన జరిగిన మారణహోమాలే ఎక్కువ! మనని మనం తగలబెట్టుకుంటే ఏ వెలుగూ రాదనీ, కత్తుల రెక్కలతో శాంతికపోతం ఎగరదనీ, నెత్తుటిజల్లులు ఏ పచ్చని బ్రతుకులూ పెంచవనీ ఇప్పటికైనా మనం నేర్వకపోతే మన భవిత అంధకారమే –

భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో?

ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో?

ఏ పంటల రక్షణకీ కంచెల ముళ్ళు?

ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు?

ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు

ఏ దాహం తీర్చవు ఈ కార్చిచ్చులు

ప్రాణమే పణమై ఆడుతున్న జూదం

ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు

చావులో విజయం వెతుకు ఈ వినోదం

పొందదే ఎపుడూ మేలుకొలుపు మేలుకొలుపు!

ఒకప్పుడు ఎంత స్నేహం, సౌభ్రాతృత్వం వర్ధిల్లినా మనసులో మొలకెత్తే ఒక విషబీజం చాలు ఆ చెలిమిని అంతా మరిచిపోవడానికి. ప్రచండ సూర్యుణ్ణి సైతం మబ్బు కప్పేసినట్టు, ద్వేషం, పగా దట్టంగా అలముకున్నప్పుడు ఏ వెలుగురేఖలూ పొడచూపవు. అపార్థాల వలన చెదిరిన అనుబంధాలకీ, స్వార్థం వలన సమసిన స్నేహాలకీ, ద్వేషం వలన దగ్ధమైన పూదోటలకీ లెక్క లేదు. ఈ పగలసెగల వలన ఏర్పడిన ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలాల్సిందేనా –

అంతరాలు అంతమై అంతా ఆనందమై

కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా

చెలిమి చినుకు కరువై, పగల సెగలు నెలవై

ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా!

ఇలా గుండె రగిలిన వేదనలోంచి ఓ వెలుగురేఖ ఉద్భవించి మనలోకి మనం తరచి చూడగలిగితే ఓ సత్యం బోధపడుతుంది. నేనూ, నా వాళ్ళు అని స్వార్థంతో గిరిగీసుకుని, నా వాళ్ళు కానివాళ్ళందరూ పరాయివాళ్ళనే అహంకారపు భావనే అన్ని సమస్యలకీ మూలకారణం అని. పక్కవాడు కూడా నాలాగే మనిషే, వాడికీ నాలాగే కన్నీళ్ళూ, కోపాలూ, ద్వేషాలూ, ప్రేమలూ ఉంటాయని గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఈ స్వీయవినాశనానికి దారితీసే వైపరీత్యం నుంచి మనం బైటపడే వెసలుబాటు ఉంటుంది –

నీకు తెలియనిదా నేస్తమా?

చెంత చేరననే పంతమా?

నువ్వు నేననీ విడిగా లేమనీ

ఈ నా శ్వాసని నిన్ను నమ్మించనీ

మన హృదయస్పందనని పట్టుకుని, మనలోని మనిషితనాన్ని మేల్కొలిపి, నేనొక్కణ్ణీ వేరుకాదు మనమంతా ఒకటే అనే భావనని మొలకెత్తించగలిగినప్పుడు మనం యుద్ధం అనే సమస్యకి సామరస్యమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని దర్శించగలుగుతాం. మనమంతా మనుషులం, ఈ భూగోళం మనది! విద్వేషంతో పాలించే దేశాలూ, విధ్వంసంతో నిర్మించే స్వర్గాలు ఉండవు, ఉంటే అవి మనుషులవి కాబోవు అని నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. యుద్ధం అంటే శత్రువుని సంహరించడం కాదు, మనలోని కర్కశత్వాన్ని అంతమొందించడం అని అర్థమైనప్పుడు మన ప్రతి అడుగూ ఒక మేలుకొలుపు అవుతుంది. సరిహద్దుల్ని చెరిపే సంకల్పం సిద్ధిస్తుంది –

విద్వేషం పాలించే దేశం ఉంటుందా?

విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?

ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా?

అడిగావా భూగోళమా! నువ్వు చూశావా ఓ కాలమా?

రా ముందడుగేద్దాం.. యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ

సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం!

ప్రేమ గురించి గొప్పగొప్ప కల్పనలు చెయ్యొచ్చు, ప్రేమే జీవితమనీ, ప్రేమే సమస్తమనీ ఆకాశానికెత్తెయ్యొచ్చు. ఇలా ఆలోచనల్లో భూమండలం మొత్తాన్ని ప్రేమించడం చాలా ఈజీ, కానీ మనకి నచ్చని మనిషి ఎదురుగా ఉంటే ప్రేమించడం చాలా కష్టం. యుద్ధంలో ఉండీ, చేతిలో ఆయుధం ఉండీ, ఎదురుగా ఉన్న శత్రువుని సంహరించగలిగే సామర్థ్యం ఉండీ, ఆ శత్రువూ సాటి మనిషే అని జాలి కలిగితే అప్పుడు మనం నిలువెత్తు ప్రేమకి నిదర్శనం అవుతాం. అలాంటి ప్రేమ బ్రహ్మాస్త్రం సైతం తాకలేని మనలోని అరిషడ్వర్గాలను నాశనం చెయ్యగలుగుతుంది. రాబందలు రెక్కల సడుల మధ్య సాగే మరుభూముల సేద్యం నుంచి మనని మరల్చి జీవనవేదాన్ని అందిస్తుంది.”రేపు” అనే పసిబిడ్డని గుండెకి పొదువుకుని తీపి కలలను పాలుగా పట్టే అమ్మతనానికి మనమంతా ప్రతినిధులమనీ, మనని మనమే నాశనం చేసుకునే ఈ ఉన్మాదం వలన భవితంతా ఆ పాలుదొరకని పసిబిడ్డడి ఏడ్పుల పాలౌతుందనీ గుర్తుచేస్తుంది –
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?

ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?

రాకాసుల మూకల్లే మార్చదా పిడివాదం!

రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?

సాధించేదేముంది ఈ వ్యర్థ వినోదం?

ఏ సస్యం పండించదు మరుభూముల సేద్యం!

రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం

ఈ పూటే ఇంకదు అందాం, నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం!
ఇదంతా పాసిఫిజమనీ, ఐడియలిజమనీ, దుర్మార్గం ఎప్పుడూ ఉంటుందనీ, యుద్ధం తప్పదనీ కొందరు వాదించొచ్చు. కావొచ్చు. అయితే ఈ అందమైన భూలోకం మనదనీ, మనందరం దానికి వారసులమనీ, ఒకరు ఎక్కువనే ఆధిపత్యం చెల్లదనీ మనమంతా నమ్మినప్పుడు, అరిష్టాలపై అంతా కలిసికట్టుగా చేసే యుద్దం యొక్క లక్షణం వేరేగా ఉంటుంది. అప్పుడది పంటకి పట్టిన చీడని నిర్మూలించే ఔషదం అవుతుంది, పచ్చదనాన్ని పెకిలించే ఉన్మాదం అవ్వదు. అప్పుడు లోకకళ్యాణాల పేరుతో కల్లోలాలు జరగవు, మానవ సంక్షేమం కోసం మారణహోమాలు జరగవు. అప్పుడు మనం భౌగోళికంగా ఖండాలుగా, దేశదేశాలుగా విడిపోయినా మానసికంగా అఖండమైన మానవత్వానికి ప్రతినిధులమవుతాం. మన చొక్కాపై ఏ జెండాని తగిలించుకున్నా మన గుండెల్లో ప్రేమజెండానే ఎగరేస్తూ ఉంటాం. ఈ సదాశయమే నిజమైన గెలుపు, లోకానికి అసలైన వెలుగు –

అందరికీ సొంతం అందాల లోకం

కొందరికే ఉందా పొందే అధికారం?

మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం

గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం!

ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం

ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం

ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం

ఆ తలపే మన గెలుపని అందాం

“సిరివెన్నెల ఎంత అద్భుతంగా చెప్పారండీ! ఏం కవిత్వమండీ! నిజమే సుమండీ, లోకంలో హింసా ద్వేషం పెరిగిపోతున్నాయి! దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు!” అంటూ మనని మనమే మంచివాళ్ళ జాబితాలో వేసేసుకోకుండా, ఈ పాటని అద్దంగా వాడుకుని మనలోని లోపాలను మనం చూసుకోగలగాలి. ఎందుకంటే యుద్ధమంటే ఇరు దేశాల మధ్యో, ఇరు వర్గాల మధ్యో జరిగే మహాసంగ్రామమే కానక్కరలేదు. మన దైనందిన జీవితంలో, మన సంబంధ బాంధవ్యాలలో జరిగే సంఘర్షణలనీ యుద్ధాలే. అరిషడ్వర్గాల సైన్యంతో చీకటి మనపై దాడి చేసే యుద్ధంలో, మన తెలివితో మనిషితనాన్ని వెలిగించుకోవాలి, ప్రేమని గెలిపించుకోవాలి. ఆ యుద్ధంలో ఈ పాటని రథంగా, సిరివెన్నెలని రథసారధిగా వినియోగిస్తే జయం మనదే!
అనుబంధం:

  1. కంచె చిత్రంలోని ఈ రెండు పాటలనీ యూట్యూబ్‌లో ఇక్కడ వినొచ్చు – భగభగమని & నీకు తెలియనిదా
  2. ఈ పాటల గురించి సిరివెన్నెలే స్వయంగా వివరించిన వీడియో – సిరివెన్నెల వివరణ

(తొలి ప్రచురణ సారంగ పత్రికలో)

కంచెలు తుంచే మనిషితనం!