రామ నవమి – సిరివెన్నెల

ఈ రోజు శ్రీ రామ నవమి. నాకు రాముణ్ణి తలచుకుంటే చప్పున సిరివెన్నెల రామ తత్త్వం గురించి, రాముని విశిష్టత గురించి రాసిన పాటలు గుర్తొస్తాయ్. “మా” TV లో ఆయన ఈ రోజు కనిపించి ఈ విషయాలు విశదీకరించారుట కూడాను!

రామాయణం గురించి గొప్ప తాత్త్విక విశ్లేషణ సిరివెన్నెల రాసిన “తికమక మకతిక” పాట (శ్రీ ఆంజనేయం సినిమాలోది). ఆ పాట గురించి నేను ఇది వరకే ఒక వ్యాసం రాసి ఉన్నాను- http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=40166&page=1

శాస్త్రి గారు కొన్ని పాటలకి చాలా versions రాస్తారన్నది తెలిసిన విషయమే. కొన్ని సార్లు ఇలా 50 versions దాకా రాసిన సందర్భాలు ఉన్నాయిట! ఇలా రాసిన వాటిల్లో దర్శక నిర్మాతలు తమకు నచ్చినది తీసుకుంటారు. అలాగే ఈ “తికమక మకతిక” పాటకి కూడ ఇంకో version ఉంది. దీని గురించి మిత్రుడు నచకి Orkut sirivennela comm లో చాలా కాలం క్రితం ఇచ్చిన వివరాలు, అతని మాటల్లోనే:

At first, guruji was in USA when Krishna Vamsi told the situation for the song. He gave one version based on the track provided by Mani Sarma. And, then, KV changed the situation again twice! appuDu inka ikkaDa unDi vraayaTam kudaradu ani India ki veLLipOyi vraasina version “tikamaka makatika…” ani (movie lO unna version).

The previous version, sung by Anjaneya addressing the God (instead of the man, as in the movie finally) is given here, thanks to my friend Vamsee:
కపికులం కపికులం మనుషుల రూపంలో
కలకలం కలకలం మనసుల మౌనంలో
కపికులం కపికులం నరుల సమూహంలో
కలకలం కలకలం భక్తి ప్రవాహంలో

సుడిగాలిలాగ రెచ్చి, గుడిలోకి తరలివచ్చి
మదిలోని బురద తెచ్చి ముదిరేటి భక్తి పిచ్చి
అది నీ పాదాలపై వదిలిందిరా దేవా…

మనిషిలో మనిషిని చూసావా దేవా?
మనసులో మురికిని భక్తని అనుకోవా?
భేరీలు పగలగొట్టి, బూరాలు ఎక్కుపెట్టి
పిలిచింది శక్తి కొద్దీ, బీభత్సమైన భక్తి
ఈ కేకల ధాటికి వైకుంఠమే దిగవా!

భజనలే చేయరా చిడతలు చేపట్టి
పూజలే జరపరా పూనకమే పుట్టి!
గుడిలోన అడుగుపెట్టి, కోరికల కూతపెట్టి
వెను తరుముంటె భక్తి గుండెల్లొ గుబులు పుట్టి
భగవంతుడే గడగడా వణకాలిరా నరుడా!

ఈ సాహిత్యం చదివితే భక్తి పేరుతో జరిగే నానా సంగతుల్ని ఒక పక్క వ్యంగ్యంగా విమర్శిస్తూనే, ఇంకో పక్క నిజమైన భక్తి గురించి చెప్పకనే చెప్పారు. మన మనసుల్లో నిండిన కపిత్వాన్నీ, మురికినీ చూపెడుతూ, అసలు మనుషుల్లో నిజమైన మనిషిని చూశావా అని దేవుణ్ణి ప్రశ్నించడం చతురంగానూ ఉంది, ఆలోచింపజేసేది గానూ ఉంది.
“రాయినై ఉన్నాను ఈనాటికి, రామ పాదము రాక ఏనాటికి?” (వేటూరి) అనడంలో రాముడు వచ్చి కాపాడాలి అనే భావం కన్నా, “నాలో మార్పు ఎప్పుడు వచ్చి రాయి రాగాలు పలుకుతుంది?” అని తనకు తాను ప్రశ్నించుకోవడమే ఎక్కువ కనిపిస్తుంది. శ్రీ రామ నవమి పర్వ దినాన ఈ ప్రశ్న మన అందరమూ వేసుకుని, కొన్ని క్షణాలైనా మనని మనం ఆలోచనల అద్దంలో చూసుకుంటే రాముడు తప్పక ఆనందపడతాడు!

రామ నవమి – సిరివెన్నెల

దేవతలా నిను చూస్తున్నా & ఎందుకు ఎందుకు ఎందుకు

“నేను” అనే ఒక సినిమా కథ విభిన్నమైనది. బాల్యం లోని దుర్భర సంఘటనలకి చితికిపోయిన ఒక బాలుడు, పెరిగి యువకుడైనా గతస్మృతులనే నిత్యం తలచుకుంటూ సంఘంలో ఇమడలేకపోతాడు. ఒంటరిగా, మౌనంగా, తనదైన లోకంలోనే జీవిస్తూ ఉంటాడు.

ఇటువంటి అబ్బాయికి పరిచయం అయ్యింది college లో ఒక అమ్మాయి. మరిచిపోయిన మమకారాలనీ, చిన్ననాటి అనుబంధాలనీ ఆమెలో చూసుకుంటాడు ఇతను. తనని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి మాత్రం స్నేహభావం తోనే ఉంటుంది. తను వేరే అబ్బాయి ప్రేమలో పడుతుంది కూడా. ఇవన్నీ మౌనంగా చూస్తూ, తనలో చెలరేగే భావాలని ఆ అమ్మాయికి చెప్పలేక తనలోనే దాచుకుని నలిగిపోతూ ఆ అబ్బాయి పడే సంఘర్షణకి అక్షర రూపం ఇవ్వాలి.

సినిమాలో అతను తనలోని ఈ సంఘర్షణనని రెండు పాటల ద్వారా చెప్పుకుంటాడు –
1. దేవతలా నిను చూస్తున్నా – ఇది అతనిలోని సంఘర్షణ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటి పాట. ఈ స్థితిలో అతనిలో బాధ ఉన్నా, ఆలోచన, ఆశ ఇంకా చచ్చిపోలేదు.
2. ఎందుకు ఎందుకు ఎందుకు – ఇది సినిమా చివర్లో వచ్చే పాట. అతనిలో తారాస్థాయి సంగర్షణకి అక్షర రూపం. ఇక్కడ బాధ కాదు, పూర్తి శోకం కనిపిస్తుంది. ఆశా, ఆలోచన పూర్తిగా చచ్చిపోయి అనుభూతుల సంద్రంలో కొట్టుకుపోతున్నప్పటి పాట.

పై వాటిలో మొదటి పాట వేటూరి రాశారు, రెండోది సిరివెన్నెల. ఇద్దరూ రాసిన పాటల్ని గమనిస్తే సందర్భానికి తగినట్టుగా ఎంత గొప్పగా రాశారో తెలుస్తుంది. వాళ్ళ శైలి కూడా కొంచెం గమనించొచ్చు. వేటూరి పాట “ఆలోచనామృతం” అయితే, సిరివెన్నెల పాట ఆలోచన అవసరం లేని ఇట్టే అర్థమయ్యే అమృతం!

ఈ వ్యాసంలో వేటూరి పాట గురించి నా అభిప్రాయం రాస్తాను. వచ్చే వ్యాసంలో సిరివెన్నెల పాట గురించి.

వేటూరి రాసిన గుండెల్ని పిండేసే పాట ఇది:

దేవతలా నిను చూస్తున్నా
దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువు తీస్తున్నా
నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా?
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా?
ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

1. సుడిగాలికి చిరిగినా ఆకు అణగదు
చెలిచూపుకు నలిగినా మనసు మరవదు
నీ ఒడిలో చేరలేని నా ఆశలూ
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలూ
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు
అందీ అందనిదానా, అందమైనా దానా
అంకితం నీకే అన్నా, నను కాదన్నా

2. నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు
నీ వెన్నెల నీడలైన నా ఊహలూ
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులూ
ఈ సమాధిపై పూసే సన్నజాజులు
నిదర రాని నిట్టూర్పుల జోలపాటలు
చక్కనైన చినదానా దక్కనిదానా
రెక్కలు కట్టుకు రానా, తెగిపోతున్నా

మామూలుగా చదివితే ఈ పాటలో గుండెలని పిండేసే తత్త్వం అంత కనబడదు. ఇందాక చెప్పుకున్నట్టు ఇది “ఆలోచనామృతం” కాబట్టి కొంచెం ఆలోచించి అర్థం చేసుకుంటేనే పాట భావాన్ని “అనుభూతి” చెందగలం. నాకు తోచిన భాష్యం కొంత చెబుతాను –

దేవతలా నిను చూస్తున్నా
దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువు తీస్తున్నా
నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా?
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా?

ఆ అమ్మాయి దేవత. ఆ అబ్బాయి దృష్టిలో ఎడారిలో స్నేహపు పన్నీటి జల్లులు కురిపించిన దేవత ఆమె. ఈ అబ్బాయి దీపం. దీపం లాగే ధ్యానిస్తూ, అదే సమయంలో మరిగిపోతూ, కరిగిపోతూ ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి తనకి ఎవరు? నిన్నటి దాకా ఎవరో తెలియని, పరిచయమే లేని అమ్మాయే ఇప్పుడు జీవితం అయిపోయిందా?

ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

అయినా ఆ అమ్మాయి తనది కాదు. ఇంకెవరినో ప్రేమిస్తోంది. తను అందక ఎగిరిపోయినా తన జ్ఞాపకాలు మాత్రం ఇంకా ఉన్నాయి. ఈ రెండు లైన్లూ అద్భుతం! ఎంత గొప్ప ఉపమానం ఎంచుకున్నాడు వేటూరి! “పల్లవికి వేటూరి” అని ఊరికే అన్నారా?

సుడిగాలికి చిరిగినా ఆకు అణగదు
చెలిచూపుకు నలిగినా మనసు మరవదు

అతని మనసు ఆ అమ్మాయిని ఇంకా మరవలేదు. ఎంత పిచ్చిదీ మనసు? దక్కదని తెలిసీ చందమామ కోసం చేయి చాచుతుంది. “సుడిగాలికి చిరిగిన ఆకు” అన్న చక్కటి ఉపమానం ద్వారా వేటూరి అతని చితికిన మనసుని మనకి చూపిస్తాడు.

నీ ఒడిలో చేరలేని నా ఆశలు
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు

తను కోరుకున్నది దక్కనప్పుడు మనసులో ఒక నిరాశ, ఒక నిట్టూర్పు. “ఎండమావిలో పూల పడవలు” అనడం ఎంత గొప్ప ఉపమానం! అతను గుండెల్లోని అగ్ని గుండాలని చల్లార్చుకోడానికి, మనసు విప్పి మాట్లాడుకోడానికి ఆ అమ్మాయిని కోర్కున్నాడు. ఇప్పుడు తను దక్కట్లేదు. ఇంక ఎవరికి చెప్పుకోవాలి?

అందీ అందనిదానా, అందమైనా దానా
అంకితం నీకే అన్నా, నను కాదన్నా

తను అందదు. అయినా మనసూ, జీవితం అంతా తన చుట్టూనే తిరుగుతాయ్! తను కాదన్నా మనసు వద్దనుకోదు.

నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు

ఆ అమ్మాయిని పువ్వు అనుకుని ఇష్టపడితే ఇప్పుడు నిప్పై దహిస్తోంది ఏమిటి? తప్పు తనదేనా? “నెమలి కన్ను” అందంగా కనిపిస్తుంది, కానీ చూడలేదు. మనసుకి నెమలి కళ్ళు! అందుకే అది నిజాలని చూడలేదు. ప్రేమలోనో, వ్యామోహంలోనో గుడ్డిగా పడిపోతుంది. అయినా ఇప్పుడు ఇదంతా అనుకుని ఏం లాభం? బుద్ధిని మనసు ఎప్పుడో ఆక్రమించేసుకుంది.

నీ వెన్నెల నీడలైన నా ఊహలు
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు
ఈ సమాధిపై పూసే సన్నజాజులు
నిదర రాని నిట్టూర్పుల జోలపాటలు

ఆ అమ్మాయి ఊహలే అతనికి వెన్నెల. ఆ అమ్మాయి కనులు తనతో మూగ సంభాషణ చేస్తున్నాయ్ అనుకోవడమే అతనికి ఆనందం. ఇవే సమాధి లాంటి అతని జీవితంపై పూసే సన్నజాజులు, నిదురపోని నిట్టుర్పుల మనసుకి జోలపాటలు. అతని దయనీయమైన మానసిక స్థితిని ఆవిష్కరించే ఈ వాక్యాలు మన గుండెల్ని బరువెక్కిస్తాయ్.

చక్కనైన చినదానా దక్కనిదానా
రెక్కలు కట్టుకు రానా, తెగిపోతున్నా

ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మరవలేడు. తన ప్రాణమే ఆ అమ్మాయి. అలిసిపోతున్నా, ప్రాణమే పోతున్నా పరుగు తప్పదు! అవును రెక్కలు తెగిపోతున్నా ఎగరక తప్పదు.

మొత్తం పాటలో వేటూరి వాడిన ఉపమానాలు గమనించండి. ఎంత గొప్పగా ఉన్నాయో. చదివిన ప్రతి సారీ కొత్త అర్థాలు స్ఫురిస్తూనే ఉంటాయి. “సాహో వేటూరి” అనుకోకుండా ఉండలేం. ఈ పాటలో ప్రతీ పదాన్ని గమనిస్తూ, భావాన్ని అనుభూతి చెందుతూ ఒక సారి చదవండి. మనసు చెమర్చకపోతే చూడండి.

ఇప్పుడు సిరివెన్నెల రాసిన పాట చూద్దాం:

ఎందుకు ఎందుకు ఎందుకు
నను పరిగెత్తిస్తావెందుకు?
ఆకలి తీర్చని విందుకు
నన్నాకర్షిస్తావెందుకు?
దరికి రానీక నింగి శశిరేఖా
పొదువుకోనీక ఒదులుకోనీక
ఇంతగా చితిమంటగా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా, సౌందర్య జ్వాలా!

1. పాల నవ్వుల రూపమా
తను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా
జత చేరనీయని శాపమా
తళ తళ తళ తళ కత్తుల మెరుపై కళ్ళని పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంట కాని జంటగా నా వెంట నడవాలా?

2. నీవు నింపిన ఊపిరే
నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే
నరనరాన్ని కోస్తుంటే ఇలా
సల సల మరిగే నిప్పుల మడుగై నెత్తురి ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కదే వరమాలా
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా?

ఇందాకటి పాటతో పోలిస్తే ఈ పాటలో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారింది. శోకం అతనిని కమ్మిన ఆక్రోశంలో పుట్టిన పాట ఇది. సిరివెన్నెల తనదైన శైలిలో రాశారు – చక్కటి తేలిక పదాలూ, ఇట్టే అర్థమయ్యే గుణం, లోతైన భావం అన్నీ ఈ పాటలో చూడొచ్చు. “సౌందర్య జ్వాల”, “జంట కాని జంటగా నడవడం”, “ఒక్క పుట్టుకలో ఎన్నో మరణాలు”, “ఉరితాడుతో ఉయ్యాలలూపడం” కొన్ని గమనించదగిన ప్రయోగాలు. వాక్యాలు చదివితే అర్థమైపోతాయ్ కాబట్టి ఈ పాటకి పెద్ద వ్యాఖ్యానం కూడా అక్కర లేదు వేటూరి పాటలా.

ఈ పాటనీ, వేటూరి రాసిన “దేవతలా” పాటని పక్క పక్కన పెట్టుకుని వినడం ఒక చక్కని అనుభూతి. ఒకేలాటి సందర్భానికి ఇద్దరు కవులు, భిన్నమైన శైలిలో, భిన్నమైన ఉపమానాలతో రాయడం మనం చూడొచ్చు. “బాగా” ఎలా రాయలో కొంత నేర్చుకోవచ్చు కూడా.

ఈ రెండు పాటలకీ తగిన tune ఇచ్చిన సంగీత దర్శకుడు “విద్యాసాగర్” కూడా అభినందనీయుడే!

దేవతలా నిను చూస్తున్నా & ఎందుకు ఎందుకు ఎందుకు

మనిషితనం ఒకటే – సిరివెన్నెల ఒకరే!

“చక్రం” చిత్రంలో పాటలకి సిరివెన్నెల వారికి మరొక నంది వచ్చింది. ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే పాట “జగమంత కుటుంబం నాది”. కవి యొక్క అంతరంగ ఆవిష్కరణ కవి తనకి తానే చేసుకోవడం ఈ పాటలో విషయం. ఈ పాట విని, స్పందించి, ఆ స్పందనకి సమాధానంగా దర్శకుడు కృష్ణవంశీ “చక్రం” సినిమా తీశారని కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ పాటే ముందు గుర్తు రావడంలో ఆశ్చర్యం లేదు.

ఇక తర్వాత గుర్తొచ్చే పాటలు “ఒకే ఒక మాట”, “కొంచెం కారంగా” మొదలగు ప్రేమ గీతాలు. చంద్రబోస్ రాసిన “నా పేరు చక్రం” పాట కూడా బానే వినపడింది. అయితే అంతగా వినబడని పాట – “రంగేళీ హోలీ” అన్నది. tune అంత బాగుండకపోవడం, routine beat ఉండడం ఈ పాట అంతగా వినబడకపోవడానికి కారణం కావొచ్చు. సినిమా flop అవ్వడం కూడా కొంత కీడు చేసిందీ పాటకి.

నా దృష్టిలో ఈ పాట వినబడాల్సిన పాట, అందరూ వినాల్సిన పాట. ఎందుకంటే మన పండగలకి సిరివెన్నెల అందించే తాత్త్విక భాష్యం ఈ పాటలో కనిపిస్తుంది. “పండంటే ఇదీ, ఆ పండగ నుంచి మనం నేర్చుకోవలసినది ఇదీ” అంటూ సిరివెన్నెల వారు అందరికీ అర్థం అయ్యేటట్టు పాఠం చెబుతారు. మన పండుగలు అన్నీ ఆరోగ్యకరమైన సామాజిక జీవనానికి సూత్రాలు లాంటివి. మనలోని “నేను” ని కాస్త పక్కన పెట్టి “మేము” కి చోటిచ్చి, తనలో అందరినీ, అందరిలో తననీ చూసుకోవడం మన పండగల ఉద్దేశ్యం. పండగంటే సంవత్సరంలో మరొక సెలవు దినం, మొక్కుబడిగా చేయాల్సిన పూజలూ గట్రా చేసేసి, ఓపికుంటే పిండివంటలు చేసుకుని (లేకుంటే సాయంత్రం hotel ఉండనే ఉంది!), TV లో ప్రత్యేక “సినిమా కార్యక్రమాలు” చూస్తూ గడిపెయ్యడమే అన్నట్టు మారిపోయిన ప్రస్తుత పరిస్థితులలో ఈ పాట చాలా అవసరమైనది –

కోరస్:
చిన్నా పెద్దా అంతా పండుగ చెయ్యాలంట
తీపీ చేదూ అంతా పంచిపెట్టాలంట

పల్లవి:
రంగేళీ హోలీ
హంగామా కేళీ
ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి!
రవ్వల రించోలి
సిరిదివ్వెల దీవాలీ
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి!
పంచాంగం చెబితేగానీ పండుగ రానందా
సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా?

పండగ ఎప్పుడు రమ్మంటే అప్పుడూ రావాలి అని చెప్పడం ద్వారా, మనకోసం పండగ ఉంది గానీ, పండగ కోసం మనం కాదని గుర్తుచెయ్యడం.

చరణం 1:
తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి
ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది
గడపలు అన్నీ జరిపి, ఆ గణపతి పండుగ జరిపి
నిమజ్జనం కాని జనం జరిపే పయనం నిత్య భద్రపదమౌతుంది
లోకుల చీకటి తొలిగించే శుభసమయం కోసం వెతికే
చూపులు దీపాలుగ జేసే జాగరణే శివరాత్రి

ప్రత్యేకంగా బంధువులొచ్చే రోజొకటుండాలా
చుట్టు ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా!

చరణం 2:
తల్లుల జోలపదాలై, గొల్లల జానపదాలై
నరుడికి గీతాపదమై నడవడమంటే అర్థం కృష్ణ జయంతి
అందరి ఎండకి మనమే పందిరయే లక్షణమే
మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామనవమయింది
మనలో మనమే కలహించి మనలో మహిషిని తలద్రుంచి
విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది

పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగిమంటయింది
మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి

కొన్ని పండగలకి సిరివెన్నెల భాష్యం ఇక్కడ చూస్తాం. గొప్ప భావాలతో పాటూ చక్కని పద సౌందర్యం కూడా కనిపిస్తుంది. శబ్దాన్ని-అర్థాన్ని సమతూకంలో వెయ్యడంలో సిరివెన్నెల అందెవేసిన చేయి అని మరో సారి రుజువు చెయ్యడానికి!

ఈ పండగల సారాంశం ఏకత్వం. పైపై భేదాలు కనిపిస్తున్నా, మనలోని అంతర్లీనమైన మనిషితనం ఒకటే అని చెప్పడం. దానినే సిరివెన్నెల అంకెలని తీసుకుని ఎంత గొప్పగా చెప్తారో చూడండి:

ఒకటీ రెండంటూ విడిగా లెక్కడితే
తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే
పక్కన నిలబెడుతూ కలుపుకు పోతుంటే
లెక్కల కైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే!
నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే
కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే
నిన్నూ నన్ను కలిపి మనమని అనుకున్నామంటే
ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒకటే!!

ఈ వాక్యాలు స్కూలు పిల్లలు అందరి చేతా వల్లెవేయించాలి. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళం అనుకుంటున్న మన లాంటి వాళ్ళని కూడా దగ్గర కూర్చోబెట్టుకుని కొత్త అంకెలు నేర్పించే మాస్టారులా సిరివెన్నెల కనిపిస్తారు. అంకెలని కేవలం పెద్ద పెద్ద జీతాలతోనో, ఆస్తుల వివరాలతోనో పోల్చుకుంటున్న ఈనాటి జనతకి అంకెల్లో మానవత్వాన్ని ఆవిష్కరించిన గొప్ప దార్శనికుడిగా సిరివెన్నెల ఎదురౌతారు.

మరి ఈ గురువుకి మీరు గురుదక్షిణ ఏమిస్తున్నారు?

మనిషితనం ఒకటే – సిరివెన్నెల ఒకరే!

వైష్ణవి భార్గవి వాగ్దేవి

“స్వాతి కిరణం” సినిమాలోని కొన్ని పాటలని సిరివెన్నెల వారు రాశారు. వాటిలో “వైష్ణవి భార్గవి” అన్న పాట ఒకటి. పూర్తిగా సంస్కృతంలో ఉందీ పాట. ఈ పాట గొప్పతనాన్ని గురించి Orkut Sirivennela community లో మిత్రులు నచకి, PRK, ఇచ్చిన వివరణల సారాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

పాట:

పల్లవి: వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే

1.ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
శ్రీభారతీ క్షీరసంప్రాప్తము అమృతసంపాతము సుకృతసంపాకము
సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని
సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకినీ! మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ!

2.ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము
సారస్వతాక్షర-సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సరస వచోబ్ధిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ!
వర్ణాలంకృత-వైభవశాలిని వరకవితాచింతామణీ
మాంపాహి సాలోక్యసంధాయినీ! మాంపాహి శ్రీచక్ర సిమ్హాసినీ!

ఈ పాట గురించి సిరివెన్నెల:

ఈ పాట నేపథ్యం గురించి సిరివెన్నెల అమెరికాలో విద్యార్థులతో జరిపిన ముఖాముఖిలో (మిత్రుడు నచకి ముఖాముఖి సభ్యుల్లో ఒకరు) చెప్పిన విషయాలు:

“కథాపరంగా 500 సంవత్సరాల నుంచి ఒక ఆచార్యపీఠంలో దాచిన సాహిత్యమది. “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” లాంటి లొల్లాయి పదాలు వాడే అవకాశం లేదు. ఆనాటి భాష వినపడాలి, అంతగా దాచుకోదగ్గ భావం కనపడాలి!

…నేను పల్లవిలో ప్రస్తావించిన వైష్ణవి, భార్గవి, వాగ్దేవి ముగ్గ్రమ్మల పేర్లు – అవి శక్తికి ఉన్న మూడు గుణాలకు సూచనలు, మహోపాసకుల నుంచి క్షుద్రోపాసకుల దాకా అందరూ స్మరించే దేవతల పేర్లు. వారాహి, మాతంగి వంటివి క్షుద్రరూపాలు. ఈ మూడు గుణాలు గల దేవతలు అర్థము (ధనం), సత్యార్థము (విద్య/జ్ఞానం), మంత్రము (శక్తి/క్షుద్రశక్తి) ఇచ్చే దేవతారూపాలు. 
 
మొదటి చరణం సంగీతం గురించి, రెండో చరణం సాహిత్యం గురించి ఉంటాయి. సంగీతసాహిత్యాలు రెండూ సరస్వతీ స్తనద్వయంగా అభివర్ణించబడ్డాయి పూర్వకవుల చేత. ఆ వర్ణన ఇక్కడా తీసుకోబడింది. కాకపోతే, ఒక్కో చరణంలో ఒక్కోలాగా – “శ్రీభారతీక్షీర సంప్రాప్తము” అని సంగీతం గురించి, “శారదా-స్తన్యము” అని సాహిత్యం గురించి – చెప్పబడింది”
pallavi word to word meaning:

vaishnavi = paarvati
bhargavi =  lakshmi
vagdevi = saraswati
Trigunatmike = sattvarajasstamO guNaalu mooDU kaliginadi (sattva guNamunaku mahaasaraswati, rajOguNaaniki mahaalakshmi, tamOguNaaniki mahaaSakti prateekalu.); Can also imply arthaamu (dhanam), satyaarthamu (vidya/j~naanam), mantramu (Sakti/kshudraSakti)
Vindhya = knowledge
Vilasini = playful
vaaraahi = literally inextinguishable fire (baDabaagni); oka kshudra devataa ruupam.
tripuraambike = Who is the Mother-Goddess Tripurambika
bhavati = tamaru
vidyaam = knowledge
dehi = give
bhagavati = Goddess
sarva+artha = all activities/duties (not exact words)
sadhike = one who fulfills
satyartha = correct (truth)
chandrike = light of (actually moon light)
pahi = save
maam = me
mahaneeya+mantra+atmike = the one who has the power of great mantras
matangi = the Goddess Matangi
maaya+atmike = the one who has mysterious powers

Pallavi Meaning:

Oh, one who has three facets: powers of Vaishnavi (Sakti), opulences of Bhargavi (Lakshmi), wisdom of Vagdevi(Goddess Saraswati); one who plays/enjoys skillfully with knowledge, ocean of knowledge, one who represents the stresses in the creative process known Nada, Bindu, and Kala; Supreme Goddess; one who blesses with success in all activities; one who is the source of great light of truth; one who is hailed as Matangi ; one who has mysterious powers ; one who is has the powerful mantras as soul ;
– please give me knowledge/education
– please save me

charaNam 1 Word to word meaning:

ancita = worshipped
sangaatamu = companion
sancita = earned, gathered
sanketamu = appointment
sampaakamu = tree
Sri Bhaarati = Sri Saraswati
ksheera = milk
sampraaptamu = possession
amruta = most delicious, immortal
sampaatamu = a fall of
sukruta = past good
sampakam = huge tree
sarigama = sarigamalu
swara dhuni = A river/stream of music
saara = essence
varudhini = who gives blessings
saama = saama veda (pacification, gentle method)
sunaadha = good sound
vinOdini = one who enjoys
sakala = all
kala = arts
kalyani = one who causes good to
subhashini = one who speaks good words
Sri ragaalaya = the Temple of raagas
vaasini = one who stays in
charaNam 1 meaning:

Music is: descending honey; a worshipped companion; gathered (by past activities) appointment.

Obtaining Sri Saraswati’s milk is like enjoying the fall of amrutam; (it is a proof/result of)tree of past good activities done by us.

Oh, one who gives as blessings the stream of swaras called “sarigama” ; one who enjoys pacifying sweet music; one who does good (saviour) to all arts; one who speaks good words; one who lives in the temple of raagas; the ganges of honey; one who develops good wisgom (for her children)
— please save me
సరస్వతీదేవి స్తనక్షీరంగా లభించి అమృతధారలై చక్కగా కూర్చబడిన పాకము సంగీతం. (సామ, సునాదవినోదిని, కళ్యాణి, శ్రీ అన్నవి రాగాల పేర్లు కూడా అని గ్రహించాలి.) “మకరంద మందాకిని” అన్న ప్రయోగం నా దృష్టిలో అద్భుతం! మందాకిని అన్నది గంగానదికి ఉన్న పేర్లలో ఒకటి – మెల్లగా పారుతున్న చోట మందాకిని… గంగ దివ్యనది (దివిలో పుట్టి”నది”), అటువంటిదే సంగీతమూ (సామవేదంలో ఉన్నదియై సునాదము కలిగి వినోదమును అందించునది) అది మెల్లగా ఎందుకు పారుతోందయ్యా అంటే అది మకరందం (తేనె) అంతటి తీయనిది కనుక! “శ్రీరాగాలయవాసిని”, “శ్రీచక్రసిమ్హాసిని” అన్న పదాలు కూడా గమనించాలి.
charaNam 2 word to word meaning:

alochanamrutamu = honey extracted by thinking

sahita = included
hita = good (anukulamaina, priyamaina, subhamaina)
satyam = truth
Sarada = Goddess Saraswati’s
stanyamu = milk from the breast (which feeds Her children)
saaraswata = sarasvata-sambandhamaina
akshra = text (that is undefeatable/immortal)
saaradhyamu = lead (That which is lead by the invincible)
gnyana = of wisdom
saamrajyamu = kingdom
janma = birth
saaphalyam = fruitfulness
sarasa+vacha+ubdhini = one who is the source of charming and sweet words
saarasa = A lotus or water lily
lochani = one who has eyes
vaani = Goddess Saraswati
pustaka = book
dharini = one who holds
varnaa+alankruta = decorated with a letter of the alphabet (aksharamu)
vaibhavaSaalini = one who possesses the glory
vara = desired
kavita = poem
chinta-mani = a precious stone (gem) of thought ; the wishing stone, a fabulous gem or magic ruby, imagined to yield its possessor all that he wishes.
salokyam = dwelling in heaven with God
sandhayini = one who unites (who is the way to)
Sri Chakra = the yantram of Goddess
simhasini = one who has throne as

charaNam 2 meaning:

Poetry is: honey that can be extracted on thinking; which also contains good-resulting truth; the (other) breast of Goddess Saraswati;

the kingdom of wisdom which is led by Goddess’ letters gives the fruitfulness to life.

Oh, one who is the source of sweet words, one who has eyes like lotus flowers, Goddess of voice; one who holds books in hands; one who has the glory of being decorated with letters of language; one who gives the desired poetry (to her children); one who takes us to the world of God; one who has Sri Chakram as her throne.
— please save me
పూర్తిగా మధురమైనది సంగీతమైతే సాహిత్యము ఆలోచన-అమృతము, హితమైన సత్యముతో కూడి ఉన్నది! “అక్షర” అన్నది “నాశము లేనిది” అన్న అర్థంలో కూడా వాడబడింది.  అలాగే “వర్ణ” అన్నది “రంగు/వర్ణనీయము” అన్న అర్థంలోనే కాక “syllable” అన్న అర్థంలోనూ వాడబడింది.

Other related Trivia:

1. ‘Vaishnavi’ means the one who is related to lord “Vishnu”. Goddess Vaishnavi is the manifestation of the collective spiritual strengths of Mata Maha Kali, Mata Maha Lakshmi and Mata Maha Saraswati. It is described in Durga Sapatshati that the goddess was born as a young girl of extraordinary beauty and strength, out of the collectively pooled ‘Tejas’ of various ‘Devtas’ and three lords Brahma, Vishnu and Shankar.

2. In ancient India, Sage Bhrigu was Vishnu’s devotee. He had married kardama’s daughter Khyati. In answer to the prayer of that couple, Goddess Lakshmi was born as their daughter. Because she was the daughter of Bhrigu, she got the name ‘Bhargavi’.

3. Matangi is the Dark One, a form of Saraswati, incarnated as the daughter of Matang Rishi. He was from the lowest caste known as Chandal, but did not believe in the orthodox caste system and wanted to achieve brahminhood through his karma. Through worship of first Indra and then Saraswati, she became his daughter and was unequaled in her intellect (mati). Thus Matang Rishi gained a reputation to which only brahmins were entitled.

4. Tripurambika: Who is the Mother-Goddess Tripurambika (who represents the stresses in the creative process known Nada, Bindu, and Kala).
 
5. An ancient Sanskrit SlOka:

సంగీతమపి సాహిత్యం సరస్వత్యాహ్ స్తన-ద్వయం
ఏకం-ఆపాత-మధురం అన్యద్-ఆలోచనామృతం
 
Meaning: Music and Literature are the two breasts of Saraswati, the Mother of Learning. One [like honey] is sweet as we drink it; the other yields more and more nectar as we reflect on it [like an ikShu khaNDa i.e., sugarcane piece]

ApAta = descending, rushing upon, at that instant, current moment.
sangItam is descending honey, or honey pouring down. i.e., it can be
enjoyed directly, as is – no need for pre-processing or Alochana
(reflection, thinking, analysis etc.) to enjoy music.

AlochanAt amR^itaM AlochanAmR^itam = upon/due to reflection, amR^itam
Literature is nectar upon reflection. i.e., it is nectar that oozes out only when we reflect on it i.e., ponder over it.
 

వైష్ణవి భార్గవి వాగ్దేవి

కాటుక పిట్టలు

“ఉగాది” చిత్రానికి సిరివెన్నెల రాసిన ఒక పాట:

కాటుక పిట్టల మాదిరి ఎగిరే కన్నులు రెండు
అవి నీ పైనే వాలేనేమో కొంచెం గమనించు

ఇప్పటి దాకా పరిచయమైనా లేకపోవచ్చు
అవి ఎప్పటినుంచో నీకోసమనీ చూస్తూ ఉండొచ్చు
నువు రాగానే రెప్పల రెక్కలు చాచి ఎగరవచ్చు!!

అమ్మాయి కనులని “కాటుక పిట్టలుగా” వర్ణించడంలో ఎంత సౌందర్యం, ఎంత భావుకత! “రెప్పల రెక్కలు” చాచి ఆ పిట్ట ప్రియుడిపై వాలిందని అనడం లో ఎంత thought continuity. ఆహా అనిపించే భావం! సాహో అనరా విన్న జనం!!

కాటుక పిట్టలు

జ్ఞాపకాలు

“రాజా” సినిమాలో “ఏదో ఒక రాగం” అనే పాట రెండు versions లో వస్తుంది. పాట పల్లవిలో వినబడే

జ్ఞాపకాలే మైమరపు
జ్ఞాపకాలే నిట్టూర్పు
జ్ఞాపకాలే ఓదార్పు
జ్ఞాపకాలే మేల్కొలుపు

అన్న వాక్యాలు ఈ రెండు పాటలకీ ఆయువు పట్టులాంటివి. జీవితాన్ని కాచి వడ బోసిన వాళ్ళు తప్ప అన్యులు ఇలాటి వాక్యాలు రాయలేరు. తలచి చూసిన కొద్దీ కొత్త కొత్త అర్థాలు స్ఫురించే ఈ వాక్యాలు విన్నప్పుడల్లా “సిరివెన్నెల” గారి ప్రతిభకి నేను స్తంభీభూతుణ్ణి అవుతూ ఉంటాను.

జ్ఞాపకాలు

ఎవ్వరినెప్పుడు తన వలలో (full version)

చిత్రం: మనసంతా నువ్వే
రచన: సిరివెన్నెల
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
గానం: కె.కె

“మనసంతా నువ్వే” సినిమాలోని ఈ సుప్రసిద్ధ రచన ఎన్ని యువ-హృదయాలని కదిపిందో లెక్కలేదు. ప్రేమ గురించి చాలా గొప్ప భాష్యం చెబుతూనే అది అందరికీ ఇట్టే అర్థమయ్యేటట్టు చెప్పడం సిరివెన్నెల మహత్యం.

సిరివెన్నెల సుదీర్ఘ రచనని, సినిమాలో కొంత వరకే వాడుకున్నారు.

సినిమాలో వినిపించే పాట ఇది:

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే అయినా గానీ ఈ ప్రేమ
జీవిత పరమార్ధం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ

కోరస్:ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

1. ఇంతక ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనిపిస్తుంది ఈ ప్రేమ
కలసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ

సిరివెన్నెల రాసిన మొత్తం పాట ఇది: (courtesy:manasirivennela.com)
ఎవ్వరినెప్పుడు తనవలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే ఐనా గానీ ఈ ప్రేమ,
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ

ఎన్నెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ఈ ప్రేమ
రంగుల కలలే కాంతి అని నమ్మిస్తుంది ఈ ప్రేమ
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణం కాదీ ప్రేమ
తెల్లని సత్యం కల్ల అని ప్రకటిస్తుంది ఈ ప్రేమ

లైలా మజ్నూ గాధలనే చదివిస్తుంది ఈ ప్రేమ
తాజ్ మహల్ తన కోట అని అనిపిస్తుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనిపిస్తుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ

అమృత కలశం తానంటూ ఊరిస్తుంది ఈ ప్రేమ
జరిగే మథనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమ
ఔనంటూ కాదంటూనే మదిని మథించే ఈ ప్రేమ
హాలాహలమే గెలవండి చూద్దామంటుందీ ప్రేమ

ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఒక జంటతొ మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
సీతారాములనేమార్చే మాయలేడి కథ ఈ ప్రేమ
ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమ

ఈ full version చూస్తే ప్రేమ గురించి హెచ్చరికగా రాసిన వాక్యాలని సినిమాలో తీసుకోలేదని తెలుస్తుంది. అయినా మన దర్శకనిర్మాతలకి ప్రేమా, ప్రేమా అంటూ యువతని మత్తులోకి దించే వాక్యాలు కావాలి గానీ, జాగ్రత్తలూ అవీ చెప్పి మేల్కొల్పే పాటలు కావు కదా!

సీతారాములనేమార్చే మాయలేడి కథ ఈ ప్రేమ
ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమ

అంటూ రామాయణం, భారతాలని స్పర్శిస్తూ ప్రేమకి నవీన భాష్యం చెప్పడంలోనే సిరివెన్నెల ప్రతిభ తెలుస్తోంది.

ఈ పాటలో ప్రేమకి సంబంధించిన pit-falls గురించి శాస్త్రి గారు చేసిన హెచ్చరికలు ప్రేమలో పడుతున్నాం, పడ్డాం, పడదాం అనుకుంటున్న కుర్రకారు జాగ్రత్తగా గమనించి పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడు ప్రేమ కథా, ముగింపూ కూడా సినిమాల్లో చూపించినంత అందంగా ఉంటుంది!!
 

ఎవ్వరినెప్పుడు తన వలలో (full version)

ఎన్నో త్యాగాల దాస్యమా

చిత్రం: శివ 2006
రచన: సిరివెన్నెల
సంగీతం: ఇళయరాజా
గానం: ఇళయరాజా, బృందం

ఇటీవల వచ్చిన “శివ 2006” (Hindi) సినిమాలో పోలిసు శిక్షణ తర్వాత చేసే శపథం నేపథ్యంగా, వాళ్ళ వృత్తి లోని సవాళ్ళనూ, పరిస్థితులనూ ప్రస్తావిస్తూ ఒక పాట వినిపిస్తుంది. ఈ పాటకి సిరివెన్నెల తెలుగు వెర్షన్ రాశారు.

చాల మంది గీతరచయితల్లాగ, సిరివెన్నెల పాటలని తెలుగులోకి అనువదించరు. lip-sync మొదలైన విషయాలు పట్టించుకోకుండా తనదైన స్వతంత్ర భావాన్ని పలికిస్తారు. ఈ పాటలో కూడా అది కనిపిస్తుంది. అసలు పోలిసుల సమస్యల గురించి కాకుండా, పోలిసులంటే దేశ శాంతిభద్రతల పరిరక్షకులు కాబట్టి, వాళ్ళు దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నట్టుగా సిరివెన్నెల పాటని రాశారు. కాబట్టి ఈ పాటలో వినిపించేది ఆయన సొంత గొంతు.

గాయం సినిమాలో రాసిన “సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని” లాంటి పాటే ఇది కూడా. ఆ పాట లాగే ఈ పాటకీ వివరణలూ ఏమీ అక్కరలేదు. పాట తనకు తానే అర్థాన్ని పలికించుకుని, స్పందనని కలిగించడం సిరివెన్నెల పాటల లక్షణం!

ఎన్నో త్యాగాల దాస్యమా
ఏం సాధించింది నీ శ్రమ?
ఈ నిజం కోసమా, కలగన్నావు నా దేశమా?
రాలిన పూవుల సాక్షిగా, పాపమే పాలించె స్వేచ్చగా

1. ఎన్నాళ్ళైనా చలనం లేని రాతి రథం పై ప్రయాణమా?
కావాలన్నా కాంతే రాని కారడవే నీకు గమ్యమా?
అర్థరాత్రి వేళలో అలికిడే స్వతంత్రమా?
నిద్రచెడిన కళ్ళలో ఎర్రదనమే ఉదయమా?

2. కాసే కంచే మేస్తూ ఉంటే చేనుకు ఏదింక రక్షణ?
వేకువతోనే చీకటి పడితే పయనం అడుగైన సాగునా?
బానిసత్వ భావన మనసులోనె మిగిలిన
శాంతి జాడ దొరుకునా ఎంత సేపు వెతికినా

మొదటి చరణంలో మన దేశ ప్రగతి ఇంకా జరగాల్సినంతగా, జరగాల్సిన విషయాల్లో, జరగలేదని కవి సూచన. ముఖ్యంగా 3,4 lines అద్భుతం అని నా భావన.

రెండో చరణంలో ప్రగతికి అవరోధాలు కొన్ని ప్రస్తావించడం జరిగింది.

పాట ఆసాంతం పరికిస్తే మన దేశం కనిపిస్తుంది. దానితో పాటూ సిరివెన్నెలా కనిపిస్తారు! అప్రయత్నంగా నా మనసు ఈ మహాకవికీ, దార్శనికుడికీ, తాత్త్వికుడికీ  సాష్టాంగ ప్రణామం చేస్తుంది.

ఎన్నో త్యాగాల దాస్యమా

తికమక మకతిక పరుగులు ఎటుకేసి?

చిత్రం: శ్రీ ఆంజనేయం
రచన: సిరివెన్నెల
సంగీతం: మణి శర్మ
గానం: బాలు
అసలు మతం అంటే ఏమిటి? దేవుడంటే ఎవరు? మనం చేసే పూజల వెనుక పరమార్థమేమిటి? ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి – దేవుడూ, మతం పేరుతో మారణ హోమాలు జరుగుతున్న ఈ రోజుల్లో. జనాలకి మంచీ చెడూ తెలిపి, సరి అయిన దారిలో నడిపే సామాజిక కర్తవ్యం ప్రతి మతానికీ ఉంటుంది. ఈ విషయం కాస్త  dry subject కావడం వల్ల, చిన్న చిన్న కథల ద్వారా, దైవాంశ సంభూతులైన వ్యక్తుల జీవితాల ద్వారా జనరంజకంగా చెప్పే ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే ప్రజలు కథలో నీతినీ, తమ కర్తవ్యాన్నీ మరిచి, దేవుడనే వాడు ఒకడు స్వర్గంలోఉంటాడు, గుడికి వెళ్ళి వాడికి మనం దండం పెడితే చాలు అనుకుంటారో, అదే భక్తి అనుకుంటారో, అప్పుడు వాళ్ళని –

రాముణ్ణైనా కృష్ణుణ్ణైనా కీర్తిస్తూ కూర్చుంటామా?
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా!

అని నిదుర లేపే ఒక “సిరివెన్నెల” లాంటి కవి కావాలి.

“ఒక్కడు” సినిమా పాటలో ఈ అంశాన్ని రేఖా మాత్రంగా స్పర్శించిన సిరివెన్నెలకి, “శ్రీ ఆంజనేయం ” సినిమాలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం దక్కింది – “తికమక మకతిక” అనే పాటలో. రామాయణం ఇచ్చే సందేశాన్ని ఈ పాటలో సిరివెన్నెల అద్భుతంగా ఆవిష్కరించారు.

పాట మొక్కుబడిగా గుడికి వెళ్ళి, మన కోరికలన్నీ మొరపెట్టుకుని, కానుకలూ అవీ ఇచ్చి దేవుడిని కరుణింప చేసుకుంటున్నాం అనుకునే వాళ్ళ భక్తిని ప్రశ్నిస్తూ మొదలు అవుతుంది:

తికమక మకతిక పరుగులు ఎటు కేసి?
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీ రామచంద్రుడిని కోవెల్లో ఖైదు చేసి
రాకాసి రావణుడిని గుండెల్లో కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కలా మనిషీ?

“తికమక పరుగులు” అని చెప్పడం ద్వారా ప్రస్తుతం మనం ఉన్న  “confused fast life”  ని కవి ప్రస్తావిస్తున్నాడు. అయితే ఈ పరుగులు “ఎటు కేసి”? ఏమో, ఎవరికీ (చాలా మందికి) తెలియదు! ఈ ప్రశ్న ద్వారా కవి మనని ఆలోచింపజేస్తాడు – “అవును. ఎటు కేసి? ” అని మనలో మనం అనుకునేటట్టు. రాముడు మన మనసులో ఉంటాను అంటే, ఆయన్ని మనం గుడిలో బంధించేశాం ! పాపం ఆయన ఇంకా మన మనసులోకి వచ్చి కొలువుండాలనే అనుకుంటున్నాడు; కాని మనమే ఆయనతో – “వద్దులే! నీకు ఎందుకు అంత శ్రమ! గుడిలో ఉండు. అప్పుడప్పుడు వచ్చి చూసి పోతాం లే” అన్నాం !!  మనసులోనే రాముడుంటే, ఇంక గుడికి వెళ్ళి ఆయన్ని వెతకాల్సిన పని ఏమిటి? అయితే మన మనసులో రాముడు లేడు, రావణుడు ఉన్నాడు. మనలో ఉన్న క్రోధాలూ, ద్వేషాలూ, చెడు గుణాలూ….కలిపితే ఈ రావణుడు. కవి ఈ దారి వదిలి కొత్త దారిలో మనని నడవమంటున్నాడు. నలుగురినీ కలుపుకుని మరీ నడవమంటున్నాడు – అంటే మంచి పదుగురికీ చెప్పడం ద్వారా సమాజానికి శ్రేయస్సు కలిగించండి అని చెప్పడం. అయితే ఏ దారిలో నడవాలి? ….. రాముడి దారిలో. ఏమిటి ఆ దారి అంటే –

వెదికే మజిలీ దొరికే దాకా, కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా
క్షణమైనా నిన్ను ఆపునా?
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన!
బెదురంటూ లేని మది ఎదురు తిరిగి అడిగేనా
బదులంటూ లేని ప్రశ్న లేదు లోకాన !
నీ శోకమే శ్లోకమై పలికించరా మనిషీ….

సీతని వెదకాలి. చుట్టూ అరణ్యం , దారీ తెన్నూ తెలియదు. ప్రాణ సమానమైన భార్యకి దూరం కావడం ఎంతో పెద్ద శోకం. కన్నీళ్ళు ధారాపాతంగా వస్తున్నాయి రాముడికి. అయితే బాధలోనే ఉండిపోయాడా రాముడు? ఇక బ్రతుకంతా చీకటే అని ఆగిపోయాడా? వెదికే మజిలీ (సీత) దొరికే వరకూ, కష్టాలూ నష్టాలూ ఓర్చి, చివరకి జాడ కనుక్కుని, సముద్రాన్ని దాటి లంకని చేరడానికి వారధి సైతం సాధించి, సీతని తిరిగి గెలుపొందాడు. ఈ విషయాన్ని – “కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెన” అని కవి చాలా అద్భుతంగా చెబుతాడు. అయితే ఈ సాధనకి కేవలం పట్టుదల ఉంటే సరిపోదు “ధైర్యం ” కూడా కావాలి. ధైర్యం అంటే “భయం లేక పోవడం “. ఏమవుతుందో ఏమో, సాధిస్తానో లేదో, ఇన్ని కష్టాలు నాకే ఎందుకు రావాలి, ఏమిటి నా పరిస్థితి…. ఇలా ఆలోచించే మనసు ఎప్పుడూ సమస్యలకి పరిష్కారం కనుక్కోలేదు. ఈ భయం చెదని ఆదిలోనే తుంచకపోతే అది మనసుని పూర్తిగా తొలిచేస్తుంది. ఎప్పుడైతే మనసులో భయం ఉండదో, అప్పుడే మనసు సరిగ్గా ఆలోచించగలుగుతుంది, ప్రశ్నలకి బదులు పొందగలుగుతుంది. ఇది నిజానికి గొప్ప  “spiritual truth”  “బెదురంటూ లేని మది ఎదురు తిరిగి అడిగేనా, బదులంటూ లేని ప్రశ్న లేదు లోకాన” అని ఈ విషయన్ని శాస్త్రి గారు చాలా  powerful  గా గొప్ప ఆత్మ విశ్వాసంతో చెబుతారు. ఈ పైన చెప్పిన లక్షణాలు ఎవరి సొంతమో అతడు శోకాన్ని కూడా శ్లోకంలా మార్చుకుంటాడు. (శోకంలో శ్లోకం అనడం కూడా రామాయణాన్ని గుర్తుతెచ్చేదే. వాల్మీకి ఒక పక్షి జంట ఆవేదన చూసి పొందిన శోకంలో రామాయణం మొదటి శ్లోకం ఆశువుగా వెలువడింది అంటారు)

రాముడి కథ కష్టాలనీ, నష్టాలనీ ఎదురుకుని లక్ష్యాన్ని సాధించే స్థైర్యాన్ని గురించి కాక మరి ఇంకేమి చెబుతుంది? మనిషిని ధర్మపథంలో నడవమని చెబుతుంది. ధర్మం అంటే  simple  గా చెప్పాలంటే – “ప్రపంచానికి హితం చేసేది” అని అర్థం. ధర్మపథంలో నడిచే వాడు సామాజిక శ్రేయస్సు కోసం అవసరమైతే తన సుఖాలనీ, తను పొందిన వాటినీ వదులుకోడానికి అయినా సిద్ధపడతాడు. “రామో విగ్రహవాన్ ధర్మః” అన్నారు. అంటే రాముడు ధర్మస్వరూపం. ఈ సంగతి సీతారామ శాస్త్రి గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి –

అడివే అయినా, కడలే అయినా, ధర్మాన్ని నడిపించు పాదాలకి
శిరసొంచి దారీయదా?
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమే కదా!
ఈ రామగాథ నువ్వు రాసుకున్నదే కాదా?
అది నేడు నీకు తగు దారి చూపను అందా?
ఈ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ….

సముద్రం మహోగ్రంగా ఉంది. వంతెన వేసి లంకను చేరాలి. అయితే సముద్రం శాంతిస్తెనే అది సాధ్యం. ఎలా మరి? రాముడికి “ధర్మ ఆగ్రహం ” కలిగింది. సముద్రంపై విల్లు ఎక్కు పెట్టాడు. అంటే! అంతటి కడలీ రాముడి ముందు దాసోహమని మోకరిల్లింది. వంతెన కట్టడానికి దారి ఇచ్చింది. అవును మరి! ధర్మాన్ని నడిపించే రాముడి పాదాలకి అడివైనా సముద్రమైనా శిరసొంచి నమస్కరించాలి కదా! రాముడు మాములుగా రాజు అయిపోతే పెద్ద విశేషం లేదు. అయితే ధర్మం కోసం నిలబడి, అరణ్యవాసం చేసి, రాక్షస సమ్హారం గావించి తర్వాత రాజు అయితే, ప్రజలు కూడ అతని ధర్మ మార్గాన్ని పాటిస్తారు. రామ పట్టాభిషేకం , ధర్మ పట్టాభిషేకం అవుతుంది, లోకహితం చేస్తుంది. అటువంటి రాముడి పాదుకలకి అయినా పట్టాభిషేకం చెయ్యొచ్చు (భరతుడి ఉదంత ప్రస్తావన). రామ కథని చెప్పుకుంటూ ప్రజలు మంచి దారిలో నడవొచ్చు.

ఈ రాముడి కథ వాల్మీకి లోకక్షేమం కోసం రాశాడు. ఇది మనుషుల సౌభాగ్యం కోసం మనుషులే రాసుకున్న దేవుని కథ. మానవ సంబంధాలని గొప్పగా నిర్వచించి, ధర్మాన్ని తెలిపిన కథ. ఇప్పటికీ, ఎప్పటికీ ఈ కథ మనకి కర్తవ్యాన్ని తెలిపే దారి చూపెడుతుంది. మనమే ఈ విషయం మర్చిపోయాం. రాముడి అడుగుజాడలని విస్మరిస్తున్నాం. సముద్రకెరటం వస్తే చెరిగిపోయే ఇసుక జాడలు కావవి. కాలాలు మారినా, చీకట్లు కమ్మినా చుక్కలై మెరిసే వెలుగురేఖలు ఆ జాడలు. నిదురమాని తిలకిస్తే కనబడతాయ్.  మనసు గెలిచి అడుగేస్తే వశమవుతాయ్ !

ఈ పాట గురించి ఆలోచిస్తున్న కొద్దీ మరింతగా అర్థం అయ్యి మనసు అనుభూతితో తడిసి పోతుంది. ఆ నీటితో సిరివెన్నెల కాళ్ళు కడగాలనిపిస్తుంది. అయితే అనుభూతి చెందడమే ఈ పాట లక్ష్యం కాదు. పాట సారాన్ని గుర్తుంచి, కాస్తైనా మనం మారి, సమాజ శ్రేయస్సు కోసం మన వంతు సాయం చేసి, ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే కవిగా సిరివెన్నెల తన లక్ష్యం నెరవేరినట్టు భావిస్తారు.
 
 

తికమక మకతిక పరుగులు ఎటుకేసి?