సిరివెన్నెల సన్నిధిలో…!

నాకు సిరివెన్నెలని ఒక సెలబ్రిటీని కలిసినట్టు కలవాలనీ, ఫొటోలు దిగాలని ఉండదు. ఒక గురువుగా ఆయన జ్ఞానబోధ చేస్తూ ఉంటే ఆయన సన్నిధిలో గడపాలనీ, ఆయన చెప్పే విషయాలు వింటూ స్ఫూర్తి పొందాలనీ ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న రోజుల్లో మా కిరణ్ అన్న (కిరణ్ చక్రవర్తుల) పుణ్యమా అని దాదాపు ఆయన ప్రతి పుట్టినరోజుకీ కొందరు మిత్రులం అందరం ఆయన్ని కలవడం, ఆయన కబుర్లు వినడం చేసేవాళ్ళం. మేము “ఆర్కుట్ సిరివెన్నెల కమ్యూనిటీ” సభ్యులం అని కిరణ్ అన్న మమ్మల్ని సిరివెన్నెలకి పరిచయం చేశాడు. అది ఆయనకి గుర్తుండిపోయింది. మాతో మాట్లాడడం ఆయనకి చాలా ఇష్టంగా ఉండేది. చాలా మంది సెలబ్రిటీలు (హీరో రవితేజ వంటి వారు) ఆయన్ని కలిసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఓ ఐదు నిమిషాలు ఉండి వెళ్ళిపోయేవారు. మేము మాత్రం ఆయన రూమ్ లోనే ఉండేవాళ్ళం, వచ్చీపోయేవాళ్ళని చూస్తూ. ఒకసారి నాగబాబు గారు అనుకుంటా, మేమందరం ఉండడం చూసి సిరివెన్నెలతో ఫ్రీగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. సిరివెన్నెల అసిస్టెంట్ శ్రీను, “లేవండింక!” అన్నట్టు మమ్మల్ని చూశాడు. మాకూ విషయం అర్థమయ్యి లేవబోయాము. కానీ సిరివెన్నెల మమ్మల్ని ఆపి – “వీళ్లందరూ మనవాళ్ళే, బయటవాళ్ళు కాదు! మీరేమీ మొహమాటపడకండి” అని నాగబాబు గారిని సమాధానపరిచారు! అదీ ఆయన మాతో మాట్లాడడానికి ఇచ్చే ప్రాముఖ్యత! అటువంటి సిరివెన్నెలగారితో సత్సంగం మా బోటి వారికి దక్కిన మహాదృష్టం!

2012 లో అమెరికా వచ్చాక సిరివెన్నెలతో ఈ సత్సంగానికి నేను దూరమయ్యాను. అందుకే ఈసారి ఆయన కేలిఫోర్నియా బే ఏరియాకి వస్తున్నారని తెలియగానే తప్పక కలవాలని అనుకున్నాను. ఆయన గతంలో లాస్ ఏంజిల్స్, బే ఏరియాలకి వచ్చినప్పుడు నాకు కలవడం కుదరలేదు. ఈసారి ఎలాగైనా కుదుర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. “అన్నయ్య మా అమ్మాయి వేద్యస్ఫూర్తి కూచిపూడి రంగప్రవేశం చూడడానికి ప్రత్యేకంగా బే ఏరియా వస్తున్నారు. మా ఇంట్లోనే ఉంటున్నారు. మీరందరూ తప్పకుండా ఆయన్ని కలవొచ్చు” అని మాటిచ్చారు వెంకట్ కొండ గారు. ఆయన సిరివెన్నెల జగమంత కుటుంబ సభ్యులలో తమ్ముడిగా పిలుపుని పొందినవారు. సిరివెన్నెల భావలహరి వెబ్సైట్ రూపొందించినవారు. ఆ వెబ్సైట్ కి సిరివెన్నెల పాటలు టైప్ చేసి పెట్టిన వారందరికీ (నాతో సహా) వెంకట్ గారు మంచి మిత్రులైపోయారు. ఆయన సౌమ్యతా, మంచితనం చూస్తే ఎవరైనా మిత్రులు కాక తప్పదు మరి! అలా వెంకట్ కొండ గారి మాట అండతో నేను కుటుంబసమేతంగా బే ఏరియాకి శాండియాగో నుంచి డ్రైవ్ చేసుకుని బయలుదేరాను.

సిలికానాంధ్ర “మీట్ & గ్రీట్ విత్ సిరివెన్నెల” (జూన్ 23, శుక్రవారం)

సిలికానాంధ్ర సంస్థ వారు సిరివెన్నెలతో “మీట్ & గ్రీట్” కార్యక్రమం ఒకటి పెట్టే ఆలోచనలో ఉన్నారని నాకు ముందే వెంకట్ గారు చెప్పి ఉన్నారు. “మీట్ & గ్రీట్” అంటే కేవలం ఫోటోలు తీసుకునే కార్యక్రమమని నేను అనుకుని పెద్ద ఆసక్తి చూపలేదు. నా ట్రిప్ కూడా ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చెయ్యలేదు. అయితే ముందు అనుకున్నట్టు కాక ఆ కార్యక్రమం శుక్రవారం (జూన్ 23) కి మారడం, నేను ఆ రోజు బే ఏరియాలోనే ఉండడంతో మిత్రుడు శ్రీనివాస మౌళి (మౌళి, కిరణ్, నేనూ మంచి స్నేహితులం. ముగ్గురం కలిసి పాటలు రాసేవాళ్ళం అప్పట్లో!) తో కలిసి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను.  వెళ్ళడం చాలా మంచిదయ్యింది, లేకపోతే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మిస్ అయ్యేవాడిని.

393541_787767680588_1314363795_n.jpg
నేనూ, మౌళీ, కిరణ్! (2008 లో సిరివెన్నెల గారింట్లో)

కార్యక్రమం సిలికానాంధ్ర యూనివర్సిటీ భవనంలో జరిగింది. నేను సిలికానాంధ్ర వారి తెలుగు బడి అయిన మనబడిలో ఉపాధ్యాయునిగా శాండియాగోలో సహకారం అందిస్తున్నా, నాకు సిలికానాంధ్ర సంస్థతో పెద్ద అనుబంధం లేదనే చెప్పాలి. అనుకోని విధంగా ఈ “మీట్ & గ్రీట్” కార్యక్రమం నాకు సిలికానాంధ్ర తో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడింది. మేము చేరేటప్పటికి ఇంకా జనం రాలేదు. నేను ఈ కార్యక్రమం గురించి చెప్పగా విని నా మిత్రుడు వేణు కూడా వచ్చాడు కొద్దిసేపటికి. వేణు తన “సృష్టి గురుకుల్” ద్వారా శిల్ప చిత్ర కళని అందరికీ నేర్పిస్తూ ఉంటాడు. నేనూ, మౌళీ, వేణూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే విజయసారథి గారు వచ్చారు. విజయ్ గారితో నా పరిచయం కూడా పాతదే. 2010 లో నేను సిరివెన్నెలపై రాసిన పాటని ఆయనకి చేరవేసినది విజయ్ గారే. సిరివెన్నెలనీ, సిరివెన్నెల పాటలనీ ప్రాణంగా ఆరాధించే విజయ్ గారు సిరివెన్నెల పాటలపై వ్యాసాలు రాయడమే కాక ఈ మధ్య సిరివెన్నెల పాటలను విశ్లేషిస్తూ అద్భుతమైన వీడియోలూ పెడుతున్నారు. మా మధ్య సాహితీ చర్చలు జరుగుతూనే ఉన్నా, నేనెప్పుడూ ఆయన్ని కలవలేదు. కాబట్టి ఆయన కూడా రంగప్రవేశం చూడడానికీ, సిరివెన్నెలని కలవడానికీ బే ఏరియా వస్తున్నట్టు చెప్పగానే ఆయన్ని ఎప్పుడు కలుద్దామా అని నేను ఎదురు చూస్తున్నాను. ఆయన్ని కలవగానే ఒక ఆత్మీయుడిని కలిసినట్టే అనిపించింది. మా పెద్ద మావయ్య గుర్తొచ్చారు. ఆయన హాస్యచతురత వలన మా సంభాషణలు ఆహ్లాదంగా సాగాయి. వేణు కి విజయ్ గారిని – “ఈయన హీరో వరుణ్ సందేశ్ నాన్నగారు!” అని పరిచయం చేస్తే, “కాదు! వరుణ్ సందేశే మా అబ్బాయి! నేనే వాడికంటే ముందు!” అన్నారు నవ్వుతూ! సిరివెన్నెలకి దగ్గరగా మేము వెళ్ళడానికి విజయ్ గారు చాలా సహకరించారు, వారి వెంటే ఉండడం మాకు చాలా ఉపకరించింది.

మేము మాటల్లో ఉండగానే కిరణ్ ప్రభ గారు వచ్చారు. ఆయన నడుపుతున్న కౌముది వెబ్ పత్రిక నాకు చాలా నచ్చుతుంది, ఈ మధ్య కౌముదికి కొన్ని కథలు కూడా రాశాను. అలాగే ఆయన టాక్ షో, గతంలో ఆయన నిర్వహించిన మనసిరివెన్నెల.కామ్ వెబ్సైట్ గొప్పగా ఉంటాయి. ఇదే విషయం ఆయనతో చెప్పాను. ఆయన మితభాషి, అవసరమైనంతే మాట్లాడతారు. మనం చెప్పేది చక్కగా వింటారు. మాటల్లో నాతో – “ఫణీంద్ర అంటే ఇంత చిన్నవారనుకోలేదు. మీ కథలు చదివి నలభై పైబడినవారనుకున్నాను” అన్నారు. అది కాంప్లిమెంటుగానే నేను భావించాను!

హాల్ దాదాపు నిండింది, కానీ సిరివెన్నెలే ఇంకా రాలేదు. ఏడింటికి కార్యక్రమం మొదలవ్వాలి, అప్పటికే ఏడు దాటి ఇరవై నిమిషాలు కావొస్తోంది. సిరివెన్నెల వచ్చారా లేరా అని మేము అనుకుంటూ ఉండగానే చంద్ర గారు వచ్చి పలకరించారు. ఆయనతో ఈ మధ్య ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. ఆయనా నాలాగ మనబడిలో టీచర్. చాలా చక్కని కంద పద్యాలు రాస్తారు, ఈ మధ్యే క్షీరసాగరమథనాన్ని వర్ణిస్తూ దాదాపు వంద పద్యాలు రాశారు. ఆయన ప్రేరణతో నేనూ కొన్ని కందాలు రాసే ప్రయత్నం చేశాను. ఆయన సిరివెన్నెలకి పరమభక్తుడు. సిరివెన్నెలని కలవాలని ఎంతగానో ఎదురు చూసిన వ్యక్తి. మమ్మల్ని కలిసినప్పుడు ఆనందంతో ఆయన మొహం వెలిగిపోతోంది. “ఇప్పుడే సిరివెన్నెలని కలిశాను! పైనున్నారు. మీరు వెళ్ళండి” అన్నారు. అదన్నమాట ఆయన మొహంలో వెలుగుకి కారణం! మేము మొహమాటంగా వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉండగా విజయ్ గారు పక్కనే ఉన్నారని గుర్తొచ్చింది. మాకు ఇంకేం భయం!

పైన వెంకట్ గారు కనిపిస్తే పలకరించాం. ఆయన “రండి! అన్నయ్యని కలుద్దురు గానీ!” అని తీసుకెళ్ళారు. సిరివెన్నెల గారిని సిలికానాంధ్ర ఛైర్మన్ ఆనంద్ కూచిభొట్ల గారు తన రూమ్ లో, తన సీట్లో కూర్చోబెట్టి, “బావా” అని సిరివెన్నెల గారిని సంబోధిస్తూ, చాలా ఆనందంగా సిలికానాంధ్ర గురించి ఏదో వివరిస్తున్నారు. సిరివెన్నెల రాకతో ఆ భవనం ధన్యమైందన్న భావన ఆయనలో కనిపించింది. వారిని కూడా అదే మొదటిసారి చూడడం. ఆ రూమ్ లోనే సిరివెన్నెల గారి శ్రీమతి పద్మావతి గారు, వారి పెద్దబ్బాయి యోగి ఉన్నారు. సిరివెన్నెలని కలవడానికి ముందు మమ్మల్ని ఆనంద్ గారికి విజయ్ గారు పరిచయం చేశారు. “నేను మీ మనబడి టీచర్ని!” అని ఒకింత గర్వంగానే చెప్పాను. తరువాత వీలు కుదరగానే విజయ్ గారి వెంట కదిలి సిరివెన్నెల గారికి నమస్కరించి, వారి పాదాలు తాకి ఆశీస్సులు తీసుకున్నాం. నన్నూ, మౌళీని ఆయన గుర్తుపట్టినట్టు లేదు కానీ, మేము “ఆర్కుట్ సిరివెన్నెల కమ్యూనిటీ” అని చెప్పగానే ఆయనలో ఆనందం కనిపించింది. “కిరణ్ అన్నతో కలిసి మేము మిమ్మల్ని హైద్రాబాద్ లో కలుస్తూ ఉండే వాళ్ళం” అన్నాను. “నచకి !” అన్నారు, అది కిరణ్ కలం పేరు. “అవును! మీరు కిచకిచ అని కూడా పిలిచేవారు” అని గుర్తుచేశాను, ఆయన చిరునవ్వు నవ్వారు.

సిరివెన్నెల గారు ఆనంద్ గారి రూం నుంచి ప్రోగ్రాం కి వెళ్ళడానికి కదిలారు. ఆయన వెంట మందీ మార్బలం లా నేనూ, మౌళీ, వేణూ కూడా కదిలాం! దారిపొడుగునా చాలా మంది ఫొటోలు తీసుకుంటున్నారు సిరివెన్నెలతో. పనిలో పని మేమూ కొన్ని గ్రూప్ ఫొటోలు తీసుకున్నాం, తరువాత కుదురుతుందో లేదోనని!

IMG_2834
సిరివెన్నెల గారితో నేనూ మౌళీ!

సభావేదిక వద్ద సిరివెన్నెలకి ముందు ఆనంద్ గారు మాట్లాడారు. ఆయనంత మంచి వక్తని నాకు తెలీదు. ఎక్కడా తడబడకుండా చాలా చక్కగా సిలికానాంధ్ర గురించి చెప్పి సిరివెన్నెలని ఆహ్వానించారు. సభావేదికపై సిరివెన్నెలని ఉన్నతాసనంలో కూర్చోబెట్టినప్పుడు ఆయన – “మా బావ (ఆనంద్ గారు) నాకు కొన్ని ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాడు, కాదనలేని విధంగా. నేను మీ అందరితో సరదాగా మాట్లాడాలని వస్తే ఇలా ప్రవచనకారుడిలా విడిగా కూర్చోబెట్టాడు!” అన్నారు, అందరి నవ్వుల మధ్య! తరువాత అచ్చం ఆయన హైద్రాబాద్ రూమ్ లో మాతో కబుర్లు చెప్పినట్టే మాట్లాడారు. తరువాత కొన్ని ప్రశ్నలకు సమాధనం చెప్పి చివర్లో – “నా పాటంటే, నేను మీకు ఉత్తరం రాసుకోవడమే, అంతకన్నా ఏమీ లేదు. నాకివాళ ఇలా అనిపించింది..ఆ దృశ్యాన్ని ఇలా చూశాను…ఇలా ఉత్తరాల్ని మీకు రాస్తున్నాను! ఈ ఉత్తరాలన్నీ మీకు చేర్చడానికి సినిమాతెర అనే పోస్టుబాక్సులో పడేస్తున్నాను. కాబట్టి మీరు సినిమాలని చూసి ఆనందించి వచ్చేటప్పుడు నా ఉత్తరాన్ని మీతో పాటూ తెచ్చుకోండి. ఇంట్లో ఉత్తరాన్ని విప్పి చదువుకోండి! అందులో మీవైన అనుభవాలు, అనుభూతులూ దొరుకుతాయి!” అన్నారు అందరి కరతాళధ్వనుల మధ్య. అందుకే సిరివెన్నెల పాటని “ఆప్తుని వాక్యం” అన్నాను నేను నా పాటలో! ఈ ప్రసంగం, తరువాత ప్రశ్నలకు సమాధానాలు విని తీరాల్సిందే! సిలికానాంధ్ర వారు ఫేస్బుక్ లో ఈ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేశారు, తప్పక చూడండి – భాగం 1 (ప్రసంగం), భాగం 2 (సన్మానం, ప్రశ్నలు), భాగం 3 (ప్రశ్నలు)

తరువాత అందరం కలిసి కొన్ని ఫోటోలు దిగాము. నా బీటెక్ మిత్రుడు సుధీర్ కూడా ఈ కార్యక్రమానికి నేను చెప్పగా వచ్చాడు. చివర్లో మనబడి పాఠ్యప్రణాళిక రూపొందించిన కూచిభొట్ల శాంతి గారిని (ఆనంద్ గారి శ్రీమతి) కూడా పలకరించాను. ఆవిడని నేను చాలా సీరియస్ గా ఊహించుకున్నాను కానీ చాలా సరదా మనిషి. చక్కగా మాట్లాడారు. ఇలా సిరివెన్నెల కబుర్లతో, ఎందరో వ్యక్తుల పరిచయంతో నిండుగా గడిచింది మొదటి రోజు.

IMG_2837
కిరణ్ ప్రభ గారు, సుధీర్, మౌళీ, నేనూ, విజయ సారథి గారు, చంద్ర గారు!

కుమారి వేద్యస్ఫూర్తి కూచిపూడి రంగప్రవేశం (జూన్ 24, శనివారం)

పక్కరోజు వెంకట్ కొండ గారి రెండవ అమ్మాయి వేద్యస్ఫూర్తి కూచిపూడి రంగప్రవేశం. నేనూ, మౌళీ కుటుంబసమేతంగా హాజరయ్యాం. నేను కొన్ని నాట్యప్రదర్శనలు చూసినా రంగప్రవేశం ఎప్పుడూ చూడలేదు. అదంత పెద్ద కార్యక్రమమనీ, దాదాపు పెళ్ళిలాంటిదేననీ తెలీదు! దాదాపు 900 మంది వచ్చారు. ఆడిటోరియం క్రిక్కిరిసి పోయింది. కార్యక్రమం మొదలవ్వడానికి ముందు వెంకట్ కొండ గారు మాట్లాడుతూ సిరివెన్నెలని సభకు ఇంగ్లీషులో పరిచయం చేశారు. “సచిన్ టెండూల్కర్ క్రికెట్ పరుగుల కన్నా ఎక్కువ పాటల రాసిన రచయిత మా అన్నయ్య సిరివెన్నెల!” అని సగర్వంగా చెప్పారు! ఇది ఆయనకి ఇష్టమైన పోలిక, గతంలోనూ మాతో చెప్పారు. రంగప్రవేశంలో మొదటి పాట కూడా సిరివెన్నెలదే – శృతిలయలు సినిమాలోని “శ్రీ శారదాంబా నమోస్తుతే” పాటని అద్భుతంగా వేద్యస్ఫుర్తి అభినయించింది. సిరివెన్నెలా ఉప్పొంగి – “శాస్త్రీయ గీతాలు సినిమా తెరపై రావడం తెలుసు కానీ సినిమా పాట ఇలా శాస్త్రీయ నృత్యంలో రావడం ఇదే మొదలు!” అన్నారని విజయ్ గారు తరువాత చెప్పారు (ఆయన ముందు వరుసలో సిరివెన్నెల పక్కనే కూర్చున్నారు). వేద్యస్ఫూర్తి అద్భుతంగా అభినయించిన నృత్యగీతాలకు ఆమె అక్క నవ్యమైత్రి తెర వెనుక నుంచి చాలా చక్కని వ్యాఖ్యానం అందించింది. తనే పరిశ్రమ చేసి పాటల వివరాలు తెలుపుతూ రాసుకున్న స్క్రిప్ట్ ని, సుస్పష్టమైన ఇంగ్లీషులో, పొంకంగా, శాస్త్రీయ ప్రదర్శనకు తగినట్టుగా చదివి వినిపించడం అందరికీ వచ్చేది కాదు. ఇక వేద్యస్ఫూర్తి నాట్యం గురించి చెప్పడానికి మాటలు లేవు. ముఖ్యంగా సత్యభామగా అభినయం అమోఘం! నాట్యం గురించి ఏమీ తెలియని నాబోటి వాడినే ఆమె నటనం, హావభావాలు, రసపోషణ ఆకట్టుకున్నాయంటేనే ఆమె ప్రతిభ తెలుస్తోంది. ప్రేక్షకులూ, కార్యక్రమం తరువాత మాట్లాడిన వక్తలూ ఏకగ్రీవంగా ఆమె ప్రదర్శన అద్భుతమని తీర్మానించారు సిరివెన్నెలా ఇదే మాట చెప్పి, “ఇద్దరు ఆణిముత్యాలు లాంటి కూతుర్లు తయ్యారయ్యారంటే దాని వెనుక నా తమ్ముడు వెంకట్, శాంతిల పెంపకం, సంస్కారం కూడా ఉందని మర్చిపోకూడదు” అన్నారు. అందరి కరతాళధ్వనులూ, ఆ తల్లిదండ్రుల కళ్ళలో పొంగిన ఆనందభాష్పాలూ చూస్తే అదో మనసుని స్పందింపజేసే అపూర్వ దృశ్యం! నేను వెంకట్ గారితో తరువాత అన్నాను – “పిల్లలని ఎలా పెంచాలో తెలియజెప్పే గొప్ప స్ఫూర్తిని మీ కార్యక్రమం ఇచ్చింది.” అని!

కార్యక్రమం మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు విజయ్ గారి వెంట సాగాము నేనూ మౌళీ. కిరణ్ ప్రభ గారితో మనసిరివెన్నెల.కామ్ వెబ్ సైట్ ప్రస్తావన వచ్చింది. ఏదో పాస్ వర్డ్ ప్రాబ్లం వల్ల సైట్ రెన్యూ అవ్వలేదనీ, కంటెంట్ మొత్తం ఉందనీ, తిరిగి నెట్ లో ఉంచే ఆలోచన ఉందనీ చెప్పారు. సిరివెన్నెల రాసిన కథలను (ఎన్నో రంగుల తెల్లకిరణం పుస్తకం) నెలనెలా ఇకపై కౌముదిలో ప్రచురించనున్నట్టూ చెప్పారు. ఎంతో ప్రాచుర్యం పొందిన “సిరివెన్నెల తరంగాలు” మళ్ళీ పుస్తకంగా తెచ్చే ఆలోచన ఉందనీ (ఇదే మాట సిరివెన్నెలా చెప్పారు తరువాత) అందుకే కౌముది గ్రంథాలయంలో “సిరివెన్నెల తరంగాలు” పుస్తకం వ్యాసాలు ఉన్నా, ఒక పుస్తకంగా లేదని చెప్పారు. ఈ విషయాలు విని ఆనందించాం.

కార్యక్రమం పూర్తయిన తరువాత మేము సిరివెన్నెల కుటుంబంతో ఫొటోలు దిగినప్పుడు నేను సిరివెన్నెల గారితో – “గురువుగారూ, మీకు కుదిరితే మేము రేపూ మిమ్మల్ని కలుస్తాం. మీ నాన్నగారి పుస్తకం “సమ్మాన్యుడు” ని మీ చేతుల మీదగా అందుకోవాలని నా కోరిక అన్నాను!”. సమ్మాన్యుడు, సిరివెన్నెల నాన్నగారిపై సిరివెన్నెల గారి తమ్ముడు ప్రచురించిన పుస్తకం. దాని గురించి నేను ఇండియాలో ఉన్న రోజుల్లోనే విన్నాను, ఎప్పటి నుంచో చదవాలనుకుంటున్నాను. సిరివెన్నెల గతంలో అమెరికా వచ్చినప్పుడు సంతకం చేసి చాలా మందికి ఆ పుస్తకం ఇచ్చారు. అందుకే నేను అడగడం! ఆయన – “తప్పకుండా రండి! నేనూ వెంకట్ కి అదే చెబుదాం అనుకుంటున్నా!” అన్నారు! ఇంకేం దేవుడు వరమిచ్చాడు!

IMG_2865
సిరివెన్నెల దంపతులతో మేము!

భోజనం వేళ విజయ్ గారు నన్నూ, మౌళీని పిలిచి మరీ సిరివెన్నెల ఉన్న రౌండ్ టేబుల్ లో కూర్చోబెట్టారు. ఆనంద్ గారు, శాంతి గారు, కిరణ్ ప్రభ మొదలైన సిరివెన్నెల సన్నిహితులు ఉన్నారక్కడ. వారి మధ్య మేము కొంత మొహమాటంగానే కూర్చున్నాం. మాటల్లో సిరివెన్నెల నన్నూ మౌళీని చూపించి – “వీళ్ళు నా సైన్యం!” అన్నారు. నా పక్కన కూర్చున్నావిడ – “సైన్యం అంటున్నారాయన! మీరేం చేశారు? ఏమవుతారు ఆయనకి?” అని అడిగారు కూడా! నేను చిరునవ్వుతో ఏదో సమాధానం చెప్పాను కానీ, నిజానికి “సైన్యం” అన్నది సిరివెన్నెల మాకిచ్చిన బాధ్యత. ఆయన ఫిలాసఫీ అనే ఆయుధాన్ని వాడి బ్రతుకు యుద్ధంలో గెలుపొందే సైనికులం మేమందరం! అది ఆయన ఆకాంక్ష!

వెంకట్ గారింట్లో సిరివెన్నెలతో ఆత్మీయ సంభాషణ (జూన్ 25, ఆదివారం)

పక్కరోజు ఆదివారం, సిరివెన్నెల పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. సిరివెన్నెలే స్వయంగా రండని చెప్పినా, వెంకట్ గారు కలుద్దామని హామీ ఇచ్చినా నాకు ఈ మీట్ జరుగుతుందో లేదోనన్న చిన్న అనుమానం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత రోజు ఉదయమే సిరివెన్నెల ఇండియా ప్రయాణం. ఆ హడావిడి ఒకటీ, నిన్నా మొన్నా కార్యక్రమాల్లో అలిసిపోవడం ఒకటీ, వీటివల్ల సిరివెన్నెల నిజానికి ఎవరినీ కలవకుండా రెస్ట్ తీసుకుంటేనే మంచిది! కాబట్టి మీట్ కేన్సిల్ అవ్వొచ్చు, అయినా ఫర్వాలేదు అనుకుంటూ ఉన్నాను. ఇంతలోనే పదకొండు గంటల ప్రాంతంలో వెంకట్ గారు కాల్ చేశారు – “అన్నయ్య! ఇప్పుడే లేచారు. లేవగానే మీ గురించే అడిగారు. మీరో గంటలో వచ్చెయ్యండి!” అన్నారు. నేను ధన్యోస్మి అనుకుని, వేణూ, మౌళీలతో కలిసి హుటాహుటిన బయలుదేరాను. వెంకట్ కొండ గారి ఇంటి బ్యాక్ యార్డ్ లో చెట్టు కింద నీడలో సిరివెన్నెల గారు ఎవరితోనో మాటల్లో ఉన్నారు. పక్కన విజయ్ గారు అప్పటికే ఉన్నారు, చంద్ర గారు కొద్ది సేపట్లో వచ్చారు. సిరివెన్నెల గారిని రంగు చొక్కాలో చూడడం అరుదే! (ఆయనెప్పుడూ తెల్లటి బట్టలే వేసుకుంటారు). ఇంటిలో చుట్టాలందరూ కలిసి మాట్లాడుకున్నట్టే ఉంది వాతావరణం. దానికి తగినట్టే సిరివెన్నెల గారు మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా “టిఫిన్ తింటారా?” అని ఆప్యాయంగా పదే పదే అడిగారు.

చెట్టు కింద బుద్ధుడిలా ఆయన మాకు బోధ చేస్తూ ఉంటే మేము వింటూ ఉన్నాం. అది “బోధ” అని అనడాన్ని ఆయన ఒప్పుకోరు! “గొప్పవాళ్ళ ఆలోచనల్లో మన అంతరంగాన్ని కనుగొంటాం” అని ఒక కోట్ విన్నాను ఈ మధ్య. సిరివెన్నెల చెప్పేది అదే! మాతోనూ అన్నారు – “I am the echo of your silence” అని. ఆయన “శైశవేభ్యస్త విద్యానాం” అన్న రఘువంశంలోని కాళిదాసు శ్లోకం గురించి చాలా సేపు మాట్లాడారు. మనిషి ఎలా జీవించాలి అన్న విషయాన్ని భారత దేశం ఎంత గొప్పగా నేర్పించిందో వివరించారు. నిజానికి ఆ శ్లోకం మామూలుగా చూస్తే సాధారణమైనదే, కానీ దానికి సిరివెన్నెల చేసిన వ్యాఖ్యానం అత్యద్భుతం. “ప్రతీ దానికీ కూడా మనకి తెలిసేసిన జవాబులకి ప్రశ్నలు వేసుకుని అసలు ప్రశ్నలు వదిలేస్తున్నాం!” “మనకి భారతీయత మాటల నుంచి మౌనాన్ని నేర్పింది, అన్నీ పొందాక త్యజించడం నేర్పింది”, “ముని అంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకునేవాడు కాదు, తన గుండె చప్పుళ్ళను మౌనంగా వినేవాడు” వంటి వాక్యాలు నాకు గుర్తున్న కొన్ని జ్ఞానగుళికలు!

మాటల మధ్యలో నేను చేతిలో పట్టుకుని ఉన్న కాయితాలు చూసి – “ఏవిటివి? నాకేమైనా చూపించాలా?” అని అడిగారు. నేను ఈ మధ్య ఒక సరదా కథ రాసి కౌముదిలో ప్రచురించాను. ఒక సిరివెన్నెల అభిమాని అయిన అమ్మాయికీ, వేటూరి అభిమాని అయిన అబ్బాయికీ మధ్య జరిగే ప్రేమకథ, పేరు – “సుందరీ సీతారామ్”. ఆ కథ సిరివెన్నెల చూపించాలని ఉబలాటపడి ప్రింట్ తీసుకుని వెళ్ళాను. ఆయనకీ విషయం చెప్పి చూపిస్తే ఆయన తీసుకుని తరువాత చదువుతాను అన్నారు! ఈ “తర్వాత చదవడం” ఎప్పటికీ జరగదని నా భయం! సరే, అంతే ప్రాప్తం అనుకున్నాను. అయితే నేను తనని కథలో వేటూరితో పోల్చానని అనుకున్నారో ఏమో, “నాకూ వేటూరి గారికీ పోలిక లేదు. ఆ మాటకొస్తే నేను పాటల రాసే విధానం అందరి కన్నా భిన్నం. శ్రీశ్రీ గారు “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిదురపోకుమా” అని ప్రబోధించారు. నేను అలా చెప్పను – “ఎవరో ఒకరు, ఎపుడో అపుడు, నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు! మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి, వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది.” అన్నప్పుడు మీకు “అవును కదా!” అని ఒక ఆలోచన కలుగుతుంది. మీకు తెలిసినవే అయినా మీరు గ్రహించనవి మీలో ఆలోచన రేకెత్తించేలా చెప్పడం నా పద్ధతి” అన్నారు. ఈ మాటల గురించి తరువాత ఆలోచిస్తే సిరివెన్నెల పాటల పద్ధతి నాకు ఇంకొంచెం బాగా అర్థమైంది. పాటల్లో ఆయన వాడే భాషా, భావాలు సరళమే కానీ వాటి వెనుక సాలెగూడులా అల్లుకున్న అలోచనల లోతు అనంతం! అదే సిరివెన్నెల గొప్పతనం!

“అన్నయ్యా! ఎండలో కూర్చోకండి! లోపలికి రండి! ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు!” అని వెంకట్ గారి శ్రీమతి శాంతి గారు పదే పదే సిరివెన్నెలని పిలవడంతో మా మకాం బ్యాక్ యార్డ్ లోని చెట్టు నీడ నుంచి ఇంటి లోపలి హాలులోకి మారింది. వెళ్తున్నప్పుడు సిరివెన్నెల నాపైన చేయి వేసి – “నాన్నా ఫణీ! నీకేమైనా సందేహాలు ఉంటే అడుగు. శాండియాగో నుంచి అన్ని గంటలు నా గురించే డ్రైవ్ చేసుకుని వచ్చావు కదా!” అన్నారు. ఆ ఆప్యాయతకి ఏమనాలో తెలియలేదు. అప్పుడే మౌళీతో మాట్లాడుతూ మమ్మల్నందరినీ ఆయన్ని “గురువు గారూ” అని పిలవొద్దని ఆజ్ఞాపించారు! “నన్ను మావయ్య అని గానీ బాబయ్య అని గానీ పిలవండి, అవి రెండూ నాకు చాలా ఇష్టమైన పిలుపులు! “గురువు గారూ” అని పిలిచి నన్ను దూరం పెట్టకండి!” అన్నారు! కానీ గుండెల్లో ఎంతో గౌరవం పొందిన వ్యక్తిని ఒక్కసారిగా “మావయ్య” అని ఎలా పిలవడం? అప్పటికీ మొహమాటంగా ఒకసారెప్పుడో “మావయ్య” అని పిలిచాను కానీ “గురువు గారూ” అనడమే నాకు బావుంది నిజానికి!

ఇంట్లోకి వచ్చాక మౌళీ – “మీరు జరుతున్నది జనన్నాటకం పాటలో రాసిన ఒక లైన్ సరిగ్గా వినిపించట్లేదు. “నీ అడుగుల ఆకాశాన్నడుగు!” అన్నారా లేక “నీ అణువుల ఆకాశాన్నడుగు” అన్నారా?” అని అడిగాడు. “నీ అణువుల ఆకాశం, నీలోని అణువణువుల మధ్య ఉన్న శూన్యం. అక్కడ పంచభూతాలు అన్నిటినీ చెబుతూ ఆకాశం గురించి చెప్పాను. అణువులలోని శూన్యం ఉన్న పదార్థం (matter) కన్నా చాలా ఎక్కువని సైన్స్ కూడా చెబుతోందిగా! ” అన్నారు. మేమందరం ఏకగ్రీవంగా “అద్భుతం” అన్నాం.  అప్పుడు సిరివెన్నెల ఆ పాట గురించి అణువిస్ఫోటనం అంతటి శక్తివంతమైన ప్రసంగం చేశారు. పాటలోని లైన్లు మేము గుర్తుచేస్తూ ఉంటే దాదాపు మొత్తం పాటంతటినీ వివరించారు. దశావతారాలని మనిషికి ఎలా అన్వయించారో వివరించారు. ఈ పాటలో “కూర్మావతారం” వంటి అవతారాలలో కూర్మం ద్వారా ఓర్పునీ, విషం వచ్చినా కోరింది సాధించే నేర్పునీ తెలియజెప్పడం అందరికీ అర్థమవుతుంది. అయితే మత్స్యావతారంలో సత్యవ్రతుడి కథని మటుకు ఊరికే చెప్పినట్టు ఉంటుంది పాటలో. కానీ అక్కడా చాలా విషయం ఉందని నాకు తెలిసి అబ్బురమనిపించింది – “సత్యవ్రతుడు అంటే సత్యాన్ని శోధించే వాడు, అంటే మనిషి! నిరంతరం ప్రశ్నించే వాడు. ఈ అవతారంలో మనిషికి భగవంతుడు చెబుతున్నాడు. నీ జీవన వ్యవహారాన్ని అతలాకుతలం చేసుకుంటే, పర్పస్ పూర్తయ్యేలోపులోనే నీ ప్రయాణం ఆగిపోతుంది అని!” “శివమానస పూజ” వంటి రకరకాల అంశాలు స్పృశిస్తూ అద్భుతంగా సాగిన ఈ ప్రసంగాన్ని సిరివెన్నెల మాటల్లోనే వినాలి, చెప్పడానికి నా బోటి వాడికి మాటలు లేవు. ఆ వాగ్ధార ఎలాంటిదంటే మేమందరం మంత్రముగ్ధులై వింటూ ఉన్నాం, ఏ మాటా లేక. మధ్యలో అక్కడున్న ఒకాయన  – “ఇప్పుడు మీరు చెబుతున్న ఈ భగవద్గీతా అవీ విని ఎవరైనా పూర్తిగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళిపోయి రమణ మహర్షిలా అయిపోయారనుకోండి! అప్పుడు వాళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిడండ్రుల పరిస్థితి ఏమిటి?” అని అడిగారు. అప్పుడు సిరివెన్నెల ఏ మాత్రం తడుముకోకుండా – “ రమణ మహర్షి లాగ మనం అవ్వాలంటే కొన్ని వందల జన్మలు పడుతుంది! అయినా రమణ మహర్షి లాంటి వాడు మా వంశంలో పుట్టాడని ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు గొప్పగా చెప్పుకోవాలి కానీ, “అయ్యో! రమణ మహర్షి పుట్టాడేంటండీ మా ఇంట్లో!” అనీ వాపోతారేంటండీ మీరు?” అన్నారు మా నవ్వుల మధ్య. సిరివెన్నెల హాస్యచతురతా, సమయస్ఫూర్తీ కూడా గొప్పగా ఉంటాయి.

సిరివెన్నెల మాటలు వినాలనిపిస్తూనే ఉంటాయి కానీ వెళ్ళాలి, ఆయనకీ తెరిపి ఇవ్వాలి కదా! ఈలోపు వెంకట్ గారు కొన్ని “సమ్మాన్యుడు” పుస్తకాలు తీసిపెట్టారు మా కోసం. “సమ్మాన్యుడు” కాపీలు ఎక్కువ లేవు. 2014 లో సిరివెన్నెల సంతకం పెట్టిన పుస్తకాలు కొన్ని వెంకట్ గారి వద్ద ఉండడంతో అవి వెతికి మాకోసం బయటకు తీశారు. సిరివెన్నెల మాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా మా పేర్లను పుస్తకంపై రాసి పుస్తకాలను మాకిచ్చారు. ఆయన చేతులమీదగా ఈ పుస్తకం అందుకోవడం మహదానందం!

IMG_3072

చివర్లో వీడ్కోలు తీసుకునేటప్పుడు నేను వెంకట్ గారితో – “సిరివెన్నెల సచిన్ పరుగుల కన్నా ఎక్కువ పాటలు రాశారన్నారు కదా, అది సాధ్యమేనా?” అన్నాను. నా మాటలు విన్న సిరివెన్నెల – “అవును! అప్పట్లో నేను రోజుకి చాలా పాటలు రాసేవాడిని. ఇది కేవలం నేను చెప్పడం కాదు, ఆ ముప్ఫై వేల పాటలూ నా దగ్గర కాయితాలు ఉన్నాయి!” అన్నారు. “అద్భుతం! మరి వెలికితీసి అందరికీ అందిద్దాం అయితే” అని నేనంటే, “అవును! అదే ఆలోచన. సాయీ (సిరివెన్నెల గారి పెద్దబ్బాయి యోగి), వీళ్ళ డీటైల్స్ తీసుకో!” అని మరీ మరీ చెప్పారు. తరువాత మౌళీ తను పాటలు రాస్తానని చెబుతున్నప్పుడు, “నేనూ పాటలు రాస్తానండీ! మీ మీద ఒక పాట రాశాను అప్పట్లో, విజయ్ గారు మీకు చూపించారు, మీరు మెచ్చుకున్నారు!” అన్నాను. “ఆ, బాగా గుర్తుంది! అదే! ఫణీంద్ర పేరు ఎక్కడో విన్నాను అనుకుంటున్నాను, ఇప్పుడు గుర్తొచ్చావు!” అన్నారు. ఆయన గుర్తులో మన పేరు ఉండడం కన్నా ఆనందం ఏముంది?

00CE4F05-7345-4039-B3B0-24B96C022065
వెంకట్ కొండ గారింట్లో! (కుడి నుంచి – యోగి (సిరివెన్నెల గారబ్బాయి), వేణు, నేను, సిరివెన్నెల గారు, విజయ సారథి గారు, మౌళీ)

దేవుని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినట్టు, సిరివెన్నెల చుట్టూ మూడు రోజులు తిరిగి ఆయనతో ముచ్చటించగలగడం నా దృష్టిలో మహాపుణ్యమే! ఆయన పంచిన జ్ఞానమే ప్రసాదం. ఆయన పాటలూ, మాటలూ మనకి తరగని వరాలు!

సిరివెన్నెల సన్నిధిలో…!

సిరివెన్నెల పాటతో మనందరం!

సిరివెన్నెల అంతగా జనంలోకి చొచ్చుకుపోయిన సినిమా కవి మరొకరు కనిపించరు! పండిత పామరులని ఒకేలా అలరించడం సిరివెన్నెలకే సాధ్యపడింది. సాహిత్యం ఛాయలకే వెళ్ళని వాళ్ళనీ, సిరివెన్నెల పేరు తెలియని వాళ్ళనీ కూడా ఆయన పాట ఆకట్టుకుంది. ఆయన పాట ఎందరికో జీవితాన్ని నేర్పింది, కొందరికి జీవితమే అయ్యింది. సిరివెన్నెల పాటతో ప్రేమలో పడి, ఆయన పాటతో నవ్వుకుని, ఆయన పాట ద్వారా బాధపడి, ఆయన పాటతో బాధ దించుకుని, ఆయన పాటతో ప్రేరణ పొంది, జీవితాన్ని దిద్దుకుని, ఆయననే నమ్ముకుని బ్రతుకులోని నవరసాలనీ తెలుసుకున్నవారు ఎందరో! సిరివెన్నెల పాటల ప్రభావానికి నేను అబ్బురపడ్డ సందర్భాలు కొల్లలు ఉన్నాయి నా జీవితంలో. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వాటిల్లో కొన్ని పంచుకుంటున్నాను!

బోటనీ పాఠముంది!

ఊహ తెలిసినప్పటి నుంచీ నాకు సినిమా పాటలంటే చాలా ఇష్టం. సాహిత్యం అర్థం కాకపోయినా నచ్చిన పాటలని నోటికొచ్చినట్టు పాడుకునేవాడిని. అలాంటి నేను సాహిత్యం పూర్తిగా అర్థం కాకపోయినా సాహిత్యంలోని గమ్మత్తుని ఎంజాయ్ చేసిన మొదటి పాట “బోటనీ పాఠముంది” (అప్పటికి నా వయసు పన్నెండేళ్ళు ఉంటుందేమో). శివ సినిమా వచ్చిన కొన్నేళ్ళ వరకూ ఈ పాట మా ఫ్యామిలీ గేదరింగ్స్ లో తరచూ వినబడేది. మా తమ్ముడొకడు (బాబయ్య గారి అబ్బాయి) ఈ పాటని భలే ఎక్స్ప్రెషన్స్ తో పాడే వాడు. మామూలు మాటల్లానే ఉండే ఈ పాట మమ్మల్ని బాగా ఆకట్టుకునేది. అందరు పిల్లలం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అంత చిన్న వయసు పిల్లలు కూడా ఆస్వాదించేలా పాట రాయడం సిరివెన్నెల గొప్పతనం!

ఆదిభిక్షువు వాడినేది కోరేది?

మా అమ్మమ్మ గారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. మా ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను పిలిచి మరీ పాటలు పాడించుకునేది, ముఖ్యంగా భక్తి పాటలు. సిరివెన్నెల చిత్రంలో ఆది భిక్షువు” పాటని నా చేత చాలా సార్లు పాడించుకుని ఆ సాహిత్యానికి తెగ మురిసిపోయేది. నాకు మటుకు ఆ పాట పెద్ద అర్థమయ్యేది కాదు (అప్పటికి నేను ఇంటర్మీడియట్ కి వచ్చాను). మాటలు, భావం అర్థమవుతున్నా ఆ పాటలో అంత గొప్ప విషయం ఏముందో నాకు తెలిసేది కాదు. మా అమ్మమ్మ నాకు కొంత వివరించి – “నీకు అర్థమవుతుందిలే ఏదో రోజు” అనేది. తరువాత రెండేళ్ళకి అనుకుంటా నాకు ఆ సాహిత్యంలో గొప్పతనం అర్థమయ్యింది. సిరివెన్నెలకీ, మా అమ్మమ్మకీ ఓ దణ్ణం పెట్టుకున్నాను.

నిగ్గదీసి అడుగు!

ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఓ రోజు టీవీలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే ఆయనతో ఇంటర్యూ చూశాను. అదే ఆయన్ని మొదటి సారి చూడడం, పేరు వినడం. అప్పుడే నాకు “బోటనీ పాఠముంది” రాసింది ఆయననీ, సిరివెన్నెల పాటలన్నీ ఆయనే రాశారని తెలిసింది. దాంతో నేను ఆయనకి తక్షణం అభిమానిగా మారాను! తరువాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మొదటిసారి సిరివెన్నెలని చూడడం జరిగింది. ఓ బాలూ పాటల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించారు. సిరివెన్నెలని చూడడం మహగొప్పగా అనిపించింది. ఆయన మాటల్లోని ఫోర్స్ ని అప్పుడే తెలుసుకున్నాను. “నిగ్గదీసి అడుగు” పాట పాడుతూ “ఇది సమాజం నుంచి వేరుపడి, సమాజం కంటే ఉన్నతుణ్ణి అనుకున్న మనిషి సమాజానికి చేసే నీతిబోధ కాదు, సమాజంలోని భాగమైన మనిషి తనలోకి, తనలోని సమాజంలోకి తొంగి చూసుకోవడం” అని చెప్పడం నాకు బాగా గుర్తుంది. అలాంటి విప్లవ ప్రబోధాత్మక గీతాల్లో సమాజం, ఉద్ధరణ వంటి బాహ్య వస్తువులపై దృష్టి పెట్టక మనిషి, మనసు అంటూ అంతర్ముఖ విచారణ చెయ్యడం నన్ను అబ్బురపరిచింది!

నేను BTech ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా కాలేజీలోని కులవివక్షపై గొంతెత్తి యాజమాన్యంపై తిరుగుబాటు చేశారు. చాలా మంది విద్యార్థులు క్లాసులను బహిష్కరించి గేటు దగ్గర బైఠాయించారు. అక్కడున్న వారిని ఉత్తేజపరచడానికి ఎవరో పాట అందుకున్నారు – “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని” అంటూ! అందరూ గొంతు కలిపారు. మా కాలేజీలో యూనియన్లు లేవు, కమ్యూనిస్టులు లేరు. అప్పటికప్పుడు విద్యార్థులు మూకుమ్మడిగా స్పందించిన సందర్భంలో ఒకరి గుండెల్లోంచి పుట్టి అందరి గుండెలని తాకిన పాట అది! అందుకే సిరివెన్నెల “ప్రజాకవి”!

నీ నవ్వు చెప్పింది నాతో!

నేను విజయవాడ సిద్ధార్థ కాలేజీలో B.Tech చదువుతున్నప్పుడు కాలేజీ హాస్టల్ లో ఉండేవాణ్ణి. మా ECE బిల్డింగుకీ, హాస్టల్ కీ ఐదు నిమిషాలు నడక, అంతే. ఒక పాట పాడడం మొదలెడితే పూర్తయ్యేటప్పటికి హాస్టల్ లో ఉండేవాణ్ణి. ఓ రోజూ నేనూ ఓ మిత్రుడూ కలిసి నడుస్తున్నాం. నేను సాధారణంగా పక్కన ఎవరైనా ఉంటే పాడేవాడిని కాను, వాళ్ళని నా గానంతో కష్టపెట్టడం ఎందుకని! కానీ ఈ మిత్రుడు పాటలు ఇష్టపడతాడు, నా పాటలూ భరించాడు గతంలో. కనుక నేను అతనితో మాటలు పెట్టకుండా, నీ నవ్వు చెప్పింది నాతో” పాట పాడుకుంటూ పోయాను. హాస్టల్ కి చేరాక అతను నాతో – “చాలా బావుంది ఈ లిరిక్! కానీ మరీ అంత ఫీలై పాడాలా?” అని అడిగాడు! “ఈ పాట పాడుతుంటే ఆ సాహిత్యానికి ఫీల్ అవ్వకుండా ఉండడం కష్టం!” అన్నాను! అతను “అవును కదా!” అన్నట్టు తలూపాడు. మనిషిలోని మనసుని తట్టిలేపే పాట మరి! సిరివెన్నెల పాటలన్నీ అంతే!

నేలనడిగా పువ్వులనడిగా!

B.Tech చదివే రోజుల్లో మా క్లాసులో అమ్మాయిలందరూ ఓ వైపూ, అబ్బాయిలు మరో వైపు కూర్చునేవారు. ఓ రోజెందుకో నాకు అమ్మాయిలు కూర్చునే బెంచీపై ఓ రాత కనపడింది. చూస్తే – “ఇపుడే ఇటు వెళ్ళిందంటూ చిరుగాలి చెప్పింది, నిజమే ఇంకా గాలుల్లో చెలి పరిమళం ఉంది” అన్న వాక్యాలు ఎవరో రాశారు, క్లాసులో బోర్ కొట్టినప్పుడు అనుకుంటా. రాసిన వాళ్ళకి ఆ పాట రాసింది సిరివెన్నెల అని తెలిసుండకపోవచ్చు. తమకి నచ్చిన వాక్యాలు రాసుండొచ్చు. సిరివెన్నెల పాటలు అందరినీ ప్రేమలో పడేస్తాయనడానికి ఇదో ఉదాహరణ!

ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా!

మా బాబయ్య కూతురు ఒకమ్మాయి, అప్పుడు దానికి పదేళ్ళు ఉంటాయనుకుంటా. “వర్షం” సినిమా ట్రైలర్ వస్తోంది టీవీలో. “ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా…..అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా” అన్న సాహిత్యం. ఆ పాట అదే మొదటిసారి వినడం నేను. “ఎంత క్యూట్ గా రాశారో సిరివెన్నెల!” అని నేను మనసులో అనుకుంటూ ఉంటే, నాతో పాటూ ట్రైలర్ చూస్తున్న మా చెల్లెలు పైకి అన్న మాటలు – “అబ్బా! ఆశ దోశ అప్పడం. వాన నీతో ఉండిపోవాలనే!” దానికి సిరివెన్నెల చెప్పిన భావం అర్థమవుతుందని నేను అస్సలు ఊహించలేదు. దటీజ్ సిరివెన్నెల!

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని!

విజయవాడ సిద్ధార్థాలో ఒక స్నేహితుడు ఉండేవాడు. పల్లెటూరి నుండి వచ్చినవాడు. సినిమాలు బాగా చూసేవాడు. చూసి అందరికీ భలే వివరించేవాడు. ఈ కాలం భాషలో చెప్పాలంటే “mass audience”కి మంచి ప్రతినిధి. అప్పుడే “నువ్వు నాకు నచ్చావ్” సినిమా వచ్చింది. అందులో “ఒక్కసారి చెప్పలేవా” పాట గొప్పతనం గురించి “హాసం” పత్రికలో వ్యాసం చదివి “ఆహా అద్భుతం” అనుకున్నాను. కొన్ని రోజులు పోయాక అతనూ, నేను కూర్చుని మాట్లాడుకుంటుంటే ఈ సినిమా గురించి చర్చ వచ్చింది. అతను తన శైలిలో కథ చెప్తున్నాడు – “… ఇలా ఇద్దరూ ఇష్టపడినా పైకి చెప్పరు. వెంకటేష్ తొక్కలో లాజిక్కులతో మనని చావగొడుతూ ఉంటాడు. అప్పుడే ఒక పాట కూడా వస్తుంది. అందులోనూ మనవాడు తగ్గడు. నువ్వు చందమామ అనీ, పైన ఎక్కడో కూర్చున్నావు కాబట్టి నాకు అందవనీ, అయినా ఏదో చిన్నపిల్లలు చందమామని చూసి ముచ్చటపడినట్టు నీతో సరదాగా గడిపాననీ మహా లాజిక్ ఒకటి తీస్తాడు!….” అతను చెప్పుకుపోతున్నాడు. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఒక పాటలో విషయాన్ని సినిమా కథలో భాగంగా సాహిత్యంపై ఏ మాత్రం ఆసక్తి లేని నా మిత్రుడు చెప్పడం సిరివెన్నెల సినిమాలో ఎంత లీనమై పాటలు రాస్తారో, అవి ప్రేక్షకులని సినిమాతో ఎంతలా కనెక్ట్ చేస్తాయో చెప్పడానికి ఓ ఉదాహరణ.

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే!

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొక్క అనుభవం గురించి చెప్పి ముగిస్తాను. నేను విజయవాడలో B.Tech చదువుకునే రోజుల్లోనే ఆకాశవాణి వారు దీపావళి పండుగ సందర్భంగా, “వెండి వెలుగుల కవితావళి” అని ఒక కవితాగోష్టి పెట్టి ఎనిమిది మంది సినీ కవులను ఆహ్వానించారు. సిరివెన్నెల, జాలాది, భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, జొన్నవిత్తుల, సుద్దాల మొదలైన వారు ఉన్నారు. సిరివెన్నెల “ఏటికొక అమవాస దీపావళి, ఓటమెరుగని ఆశ దీపావళి” అంటూ దీపావళిపై రాసిన పాట పాడారు. కవిత గొప్పగా ఉన్నా, కొంచెం “ఆలోచనామృతం” కావడం వల్ల, జనాలు “సామాన్యులు” కావడం వల్ల తప్పదన్నట్ట్లు చప్పట్లు తప్ప అంత స్పందన లేదు. సిరివెన్నెల తరువాత మళ్ళీ వచ్చి ఒక పాట వినిపించారు. “అటు అమెరికా – ఇటు ఇండియా” అనే సినిమాకి ఈ పాట రాశానని చెప్తూ ఆయన ఆ పాట వినిపించారు – “నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే! ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే!!”. తేలికగా అందరికీ అర్థమయ్యి, గుండెల్ని సూటిగా తాకేలా ఉన్న ఆ పాట ఆయన పాడడం పూర్తవ్వగానే సభంతా కరతాళధ్వనులు. వేదికపై ఆసీనులైన మిగతా కవులు కూడా ఎంత కదిలిపోయారో!

సిరివెన్నెలని గొప్ప కవి అనో, మేధావి అనో, ఫిలాసఫర్ అనో, ఉత్తేజపరిచే ప్రసంగకుడనో మనం భావించొచ్చు. ఆయన ఇవన్నీ, ఇంకా ఎన్నో! కానీ వీటన్నిటికీ మించి ఆయన గొప్ప మనిషనీ, మనిషితనానికి ప్రతినిధనీ మనం గుర్తించాలి. నేను ఆయన పుట్టినరోజుకి మిత్రులతో కలిసినప్పుడు ఆయన మాతో అన్న ఓ మాట నా మనసులో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది – “నాలోని కవిని ఫిలాసఫర్, ఫిలాసఫర్ ని మనిషి డామినేట్ చేస్తారు!”. ఇదో గొప్ప మాట. కవి, ఫిలాసఫర్, మనిషి – ఈ ముగ్గురిలో అతి ముఖ్యమైన వాడు మనిషి. కవిని ఫిలాసఫర్, ఫిలాసఫర్ ని కవి డామినేట్ చెయ్యొచ్చు, కానీ లోపలి మనిషిని వీళ్ళు డామినేట్ చెయ్యకూడదు! కవిత్వం రాసేవాడు ఫిలాసఫీలను ఐడియాలజీలను చుట్టుకోవచ్చు, తప్పు లేదు. అయితే మనిషిని మరిచిపోతే, తానూ అందరిలా మనిషినన్న స్ప్రహ కోల్పోతే అది చాలా చేటు చేస్తుంది. దీనికి చరిత్ర లోని హింసా విధ్వంసాలే సాక్ష్యం. “చలించడం, కనులు చెమరించేటట్లు గుండె ద్రవించడం నిజమైన కవికి జీవలక్షణం!” అని వేటూరి ఆత్రేయ గురించి రాసిన మాటలు కవులనుకునే వాళ్ళు సర్వకాల సర్వావస్థల్లోనూ గుర్తుపెట్టుకోవాలి. సిరివెన్నెల పాటలన్నిటిలోనూ పరుచుకున్నది మనిషి గుండె సడులే. ఆ మనిషితనమే నన్ను సిరివెన్నెల వైపు ఆకర్షించింది, ఆ మనిషితనమే సిరివెన్నెలని అందరికీ దగ్గర చేసింది!

ఇంకా ఎన్నో గొప్ప పాటలు రాసి జనులను జాగృతి పరచాలని కోరుకుంటూ, గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు!

సిరివెన్నెల పాటతో మనందరం!

వేటూరికి సిరివెన్నెల అక్షరాభిషేకం!

సిరివెన్నెల రాసిన వ్యాసాలు చదివినవారికి ఆయన ఎంత బాగా విశ్లేషించి రాస్తారో తెలిసిన విషయమే. 2002 లో వేటూరి పుట్టినరోజు సందర్భంగా “హాసం” పత్రికలో ఆయన రాసిన వ్యాసం బహుశా వేటూరిపై వచ్చిన వ్యాసాల్లోకెల్లా గొప్పది. సిరివెన్నెలకి వేటూరిపై ఉన్న ఆదరాభిమానాలకి దర్పణం ఈ వ్యాసం. వేటూరికీ సిరివెన్నెల అంటే ఎంతో ఆప్యాయత ఉండేది. “సీతారామశాస్త్రి నా సోదరుడు, నాకు పెద్దబ్బాయిలాంటివాడు – చాలా గొప్ప జీనియస్ అతను, అతను వ్రాస్తున్న సాహిత్యం నాకు ఇష్టం” అని వేటూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఈ వ్యాసం చదవడం ఆ మహారచయితలిద్దరికీ వందనాలు అర్పించడమే. పీడీఫ్‌గా ఉన్న వ్యాసాన్ని (ఒరిజినల్ వ్యాసం ఇక్కడ), తెలుగులో టైపు చేసి అందించిన సూర్యప్రభ, చంద్రలేఖ గార్లకు కృతజ్ఞతలు!

వెండితెరని నల్లబల్లగా మార్చి తిరిగి తెలుగు ఓనమాలు దిద్దించిన వేటూరి

శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు గత మూడు దశాబ్దాలుగా తెలుగు చలన చిత్ర సీమలో గీత రచయితగా ఏం సాధించారు అన్న సమాచారాన్ని ఈ రోజు నేను పనిగట్టుకుని మళ్ళీ వివరించనక్కర్లేదు – జగమెరిగిన సత్యం గనుక.

veturi_sirivennela

ఆయన ‘చలన చిత్ర పద చరిత్ర’ గురించి ఇప్పటికే కొందరు ప్రామాణిక పరిశోధనా గ్రంధాలు రాసి పి.హెచ్.డి.లు పొందారు అని విన్నాను. వారిలో డా. జయంతి చక్రవర్తి గారు నాకు తెలుసు. ఇంకా ఎందరైనా, ఎన్నిసారులైనా, పునరుక్తిదోషం పట్టని పుస్తకాలెన్నయినా వేటూరి గారి గురించి రాయవచ్చు, రాయాలి కూడా. ఆయన గీతరచనా వ్యాసంగం గురించి సమగ్రంగా తెలుసుకోవటం, సినిమా పాట గురించి మాత్రమే గాక, తెలుగుభాష, వాజ్ఞ్మయం, సంస్కృతి, ఇత్యాది అత్యావశ్యక అంశాల గురించి అధ్యయనం చేసినట్టవుతుంది.

వేటూరి గారి బహుముఖ ప్రతిభను సాకల్యంగా సమీక్షించిన వారి హృదయం – నవరసాల్లోనూ మునిగి తేలి, ఎంత తుడుచుకుందామనుకున్నా ఆరని ‘అద్భుత రస’ స్పర్శతో చిరకాలం ‘స్నేహం’ చేస్తుంది.

ఈటీవిలో గత కొన్నాళ్ళుగా, ‘ఝుమ్మందినాదం’ అన్నపేరుతో ఆదివారాల్లో ప్రసారమౌతున్న కార్యక్రమాన్ని చూసేవారు వేటూరి గారి గురించి ఎంతో వింటున్నారు, చూస్తున్నారు, సంతోషిస్తున్నారు. అయితే, ఇంకా కొన్ని సూక్ష్మమైన ‘సంగతులు’ సశేషమై పోతున్నాయేమో అన్న ఆరాటంతో, నాకు అనిపించిన కొన్ని విశేషాల్ని మీతో పంచుకోవడానికి, వారి జన్మదిన శుభ సందర్భంగా దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ, వారికి నా శుభాకాంక్షలను, వినమ్ర ప్రణామాలను అర్పించుకుంటున్నాను.

తెలుగు సినిమా పాటని, ఆదినుంచీ ఇప్పటిదాకా ఒక్కసారి ‘విహంగ వీక్షణ’ చేస్తే, నేను దిగువ ప్రస్తావించనున్న మూడు ముఖ్యాంశాల ప్రత్యేకత ఏవిటో, ఎందుకో, సహృదయులు అర్థం చేసుకోగలరు.

వేటూరిగారిలోని భావ సంపద

మొదటిది-వేటూరిగారిలోని భావ సంపద గురించి. సినిమా పాటకి ఉన్న ఉండవలసిన పరిమితుల్ని దృష్టిలో పెట్టుకుంటే,దానికి సెలయేటి గలగలల ‘లలిత పద లాస్యం’ తప్ప, సాగర గీతానికి ఉండే లక్షణాలు ఉండవని, అలా ఉండక పోవడం సహజమేనని తెలుస్తుంది. జలధి పేరు చెవిని పడితే అనంతనీలిమ సౌందర్యం, చిందులాడే అలల ఆట, ముప్పుగా ముంచెత్తే ఉప్పెనల తాండవం, అంతుబట్టని లోతు, నీరు కూడా ఆర్పలేని నిప్పుని ఒడిలో దాచుకోగలగడం, పుడమిపైనున్న ప్రపంచానికి మూడింతల ప్రపంచాన్ని తనలో కలిగి ఉండడం, ఇలా ఎన్నో స్ఫురిస్తాయి.

తెలుగు సినిమా పాట-తనకి అంతవరకూ లేని ‘సముద్ర స్వభావాన్ని’ చూపడం మొదలు పెట్టింది వేటూరి గారి సిరా నింపుకున్నతర్వాతనే! స్వరాల సిరిమువ్వలతో గలగల పా(డే)రే లేత చరణాల గీతబాల, ‘గిరిబాల’ (పార్వతి)గా మారి, అర్థనారీశ్వర విలాసంగా, అటు ‘అరభటీ’ తాండవోద్ధతిని, ఇటు ‘కైశికీ’ ఖేలననీ ప్రదర్శించే స్థాయికి ఎదిగింది.

వేటూరి గారికి ముందున్న పెద్దలందరూ – ఎన్నోసార్లు, ఎన్నో సినిమా పాటల్లో భావగరిమనీ, కావ్య లక్షణాన్ని పొదిగి, సర్వాలంకార శోభితంగా, సలక్షణంగా, తీర్చిదిద్దిన సందర్భాలు లేక పోలేదు. నిజానికి ఈ వ్యాసంలో నేను వివరించ దలుచుకున్న వేటూరి వారి గీతాల సులక్షణాలన్నిటికీ స్ఫూర్తిదాయకమైన గీతాలు వారి ముందు తరం వారు ఎన్నో రచించారు. వారిని తన గురువులుగా, మార్గదర్శకులుగా వేటూరిగారే సంభావించారు.

కాకపోతే-‘సగటు సినిమా పాట’ తో పోలిస్తే, కావ్య స్థాయిలో మన్నించదగ్గ పాటల సంఖ్య స్వల్పమే గాక, అవి, అలా ఆ ప్రత్యేకతను సంతరించుకోవడానికి-ఆయా చిత్రాల్లోని కథ, సన్నివేశాలు, పాత్రల ఔచితి, వగైరా సహకరించడం కూడా కారణమని అర్థమవుతుంది.

ఇక్కడే వేటూరి గారి ‘ఉనికి’ తన విశిష్టతను వ్యక్తీకరిస్తుంది. తన పాటల ప్రయాణంలో మొదటి పదేళ్ళపాటూ ఆయన చేసిన ప్రయత్నాన్ని పనిగట్టుకుని పరిశీలించండి. యుగళగీతమైనా, భక్తిగీతమైనా, రక్తిగీతమైనా, విరక్తిగీతమైనా, ‘ఉత్తి’ గీతమైనా – పాట…అదే సినిమా పాట ఆయన కొనవేలు పట్టుకుని కొత్త మలుపుల్లోకి నడవడం మొదలెట్టింది. మొట్టమొదటసారిగా బాణీ కట్లుబాట్లని, ‘చిత్ర’ పరిధుల్ని దాటి, తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో ఒక ‘కావ్యఖండిక’ గా మనగలిగేలా పాటని నిలబెట్టి, ఎప్పటికీ వసివాడని దేవపారిజాతాల్లా, గీతాలు గుబాళించేటట్టు తన ‘భావ గంధాన్ని’ అద్ది, ఒక్కోపాట ఒక్కో ‘సంపూర్ణ కావ్యం’ లా తీర్చిదిద్దడానికి ఆయన చేసిన తపస్సు, నన్ను స్తంభీభూతుణ్ని చేసిన సందర్భాలెన్నో వివరించడానికి చోటు చాలదు. అది ఏ సినిమా, దాని ‘నిలకడ’ ఎంత క్షణికం, ఆ సినిమాకి గాని, ఆ సందర్భానికి గాని అంత అర్హత ఉందా అని కూడా పట్టించుకోకుండా, ఆయన చెక్కిన కావ్యశిల్పాలు ఎన్నో!! పేరుకూడా గుర్తులేనంతగా ఇట్టే వచ్చి అట్టే కొట్టుకుపోయిన ఎన్నో చిత్రాల్లో ఆయన చేసిన అద్భుతాల్ని ఆనవాలు పట్టాలంటే ఎంతో త్రవ్వకపు పని చేపట్టాల్సిందే. అలా ‘తెరమరుగున’ పడిన అనేక గీతాలను ‘కనిపెట్ట’ గలిగితే, తన పద పారిజాతాల సుమమాలతో వాగ్దేవి నలంకరించిన సుందర రామ్మూర్తి గారిలోని కవితా మూర్తిని దర్శించగలిగితే, సినిమాకి సంబంధించని మహాకవులు కూడా సినిమా పాట రాయడం తమ ప్రతిభకి గర్హించదగ్గ ‘స్వోన్మీలనం’ (Self expression) గా భావించి కుతూహలపడతారే గాని, గర్హించవలసిన, లొల్లాయి పదాల కాలక్షేపంగా భావించి వెనకడుగు వేయరని అనిపించక తప్పదు. జనాదరణ పొందిన చిత్రాల పుణ్యమా అని పదిమందికి తెలిసిన ఒకటి రెండు ఉదాహరణలు గమనించండి. ‘ఈ దుర్యోధన దుశ్సాసన దుర్వినీతలోకంలో’ (ప్రతిఘటన) అని ఉదధి కడుపులో రగిలే బాడబానలాన్ని సహస్రకీలలతో బహిర్గతం చేసినా, ‘భక్తకన్నప్ప’ లో ‘కిరాతార్జునీయం’ లోని ‘తలపైని గంగమ్మ తలపులోనికి ఒదిగె’ అని సార్ర్దమైన సదాశివుని తలపుని సూచించినా, ‘చినుకులన్నీ కలసి చిత్రకావేరి, చివరికా కావేరి కడలి దేవేరి’ (శుభసంకల్పం) అని కనురెప్పల చెలియల కట్టని దాటని కన్నీటి పొర వెనుకనున్న గుండెకడలి కల్లోలాన్ని చూపించినా, ‘ కైలాసాన కార్తీకాన హిమదీపం…’(సాగరసంగమం) అని ‘ప్రమిదే లేని ప్రమధాలోకమణి దీపాల’ కాంతిలో మనల్ని నడిపించినా… ఆయన అనేక గీతాల్లోని ఈ స్తవనీయమైన కావ్య ‘ధ్వని’, తెలుగు సినిమా పాట ఇట్టే తేలిపోయే ‘తేటగీతి’ మాత్రమే కాదు, ఇట్టే ఆడిపోయే ‘ఆటవెలది’ మాత్రమే కాదూ, ఆత్మని తట్టి లేపగల ‘గీతాచార్య పాంచజన్య శంఖారావం’ కూడా కాగలదని నిరూపించి ‘So Called’ కవుల చెవుల్లోని సీసాన్ని కరిగించిన సత్యాన్ని చాటి చెపుతుంది.

వేలకు వేలుగా ఉన్న ఆయన పాటల్లోని పొల్లుని మాత్రమే పోగు చేసుకునే ఓటి చేతుల పండితమ్మన్యులకీ, రత్నాకరుని (సముద్రుని) ఇంటి ముందున్న చెత్తకుండీలోని నత్తగుల్లల్ని లెక్కపెట్టి ఆయన సంపదని గణించ చూసుకునే ‘విమర్శక శిఖామణు’లకీ, నా మాటలు మరీ అతిశయోక్తులు అనిపించవచ్చు. ఆయన కాలకృత్యాల వేళ దంతధావనానంతరపు పుక్కిలింతలే గమనించి పక్కకి పారిపోయే వారు ఆ తర్వాత ఆయన తన మనోమందిరంలో ధ్యానముద్రలో జపించిన నమక చమకాల నాదం నుంచి ఆవాహన చేసి మనకందించిన రుద్రాభిషేక సంజనిత గీతామృత శీకరాలలో స్నానించలేరు. ‘పోయింది పొల్లు, ఉన్నది గట్టి’ అన్న మన కృషీవలుల (రైతుల) ఋషి వాక్తుల్యమైన సామెతను స్మరించుకునే ధీమంతులు వేటూరి గారి పాటల పూదోటలోని ప్రవేశార్హులు.

వేటూరి గారి భాషా పాటవం

రెండవది వేటూరి సుందరరామ్మూర్తి గారి భాషా పాటవం గురించి… ఆబాల గోపాలాన్ని అలరించే చిత్రకళాకేళిలో భాగమైన సినిమా పాటలో భాష అతి సరళంగా, జనబాహుళ్యం నిత్యం వినియోగించే వ్యావహారికంలా సులువుగా, తేలిగ్గా ఉండాలి అనే నిబంధన తప్పు అనలేం, అనకూడదు కూడా. కాని, వేటూరిగారు తెలిసి తెలిసి సినిమా నియమావళిని అతిక్రమించి, ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సాగర సంగమం’, ‘పార్వతీ పరమేశ్వరులు’ ఇంకా ఇలా ఎన్నో చిత్రాల్లో, అతి ప్రౌఢమైన భాషని వినియోగించడం ద్వారా తెలుగుభాషకి,సంస్కృతికి,ఎలాంటి మేలు జరిగిందో ఒకసారి ఆగి ఆలోచించాలి.

పాల పళ్ళు కూడా ఊడని పసిప్రాయంలోనే భారత భాగవతాలూ, భగవద్గీత, ప్రాచీన పద్యవాజ్ఞ్మయం, దాశరధీ శతకాది శతకాలూ, భర్తృహరి సుభాషితాలు, అమరకోశం, పెద్దబాలశిక్ష…. ఇంకా ఇలాంటి వన్నీ కంఠతా పట్టించిన మన తెలుగింటి విద్యాబోధన-తరాలు మారుతున్న కొద్దీ ఏ విధంగా ‘చిన్నబో’ తోందో గమనిస్తే, ఇంట్లో, వీధుల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇలా అన్ని చోట్లా మన పిల్లలకి ఎలాంటి మాటతీరు అలవడుతుందో అర్థం చేసుకో గలిగితే క్రమక్రమంగా ‘గ్రంధ పఠనం’, ‘అధ్యయనం’ , ‘వినడం’ లాంటి ‘కసరత్తు’ కరువై, దంతాలూ, జిహ్వా, సర్వతంత్రులూ, అన్నీ సత్తువుడిగి, దివ్యభాషాపీయూషాస్వాదనకి అనర్హమై, పలుకులు నత్తినత్తిగా, నంగినంగిగా తయారై, ఆంధ్రభాష ఎలాంటి దుర్దశకి లోనైందో గుర్తిస్తే, ఈనాటి అవకతవక శిక్షణ మనకి ఎంత ‘పెద్ద’ బాల ‘శిక్ష’ గా పరిణమించిందో అని బాధపడగలిగితే మనం ఏ సంపదని కోల్పోతున్నామో తెలుస్తుంది. పండితులు, పెద్దలు , భాషావేత్తలు, విజ్ఞులు, కవులూ ఈ పరిస్థితిని ఉపేక్షిస్తున్నారు.

మంచి ‘పలుకుబడిని’ కొందరికే పరిమితం చేయకుండా సమాజంలో అందరికీ పంచిపెట్ట గలిగిన, పంచి పెట్టవలసిన ‘వేదిక’ ఏదీ ఎక్కడా ‘మాటవరసకి’ కూడా లేక, తెలుగుభాష నిరుపేదగా మారి, నడి వీధుల్లో పడుతున్న సమయంలో, వేటూరి గారిలోని ‘వాచస్పతి’ మనకి సంస్కృతసత్సంగంతో పరిపుష్ఠమై, గాంభీర్యంలోనూ గహనత్వంలోనూ విస్తృతిలోనూ సౌందర్యంలోనూ మరే ఇతర భాషకి అందనంత ఎత్తులో ఊన్న ఆంధ్రభాషతో పునః పరిచయం కలిగించే ప్రయత్నం చేసారు. అది కూడా ప్రజాబాహుళ్యానికి చేరువగా ఉన్న వెండితెర వేదిక ద్వారా.

కావ్యభాష – సినిమాని చిన్నచూపు చూస్తూ తనని తనే ‘వెలి’ వేసుకున్న తరుణంలో వేటూరి గారి పుణ్యమా అని తెలుగుపాట ఉన్నత స్థాయిలో పలకడం నేర్చుకుంది. అంతకుమునుపు పౌరాణికాల్లోనూ, ఏవో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప తెలుగు సినిమా కవులు అందరికీ అందుబాటులో లేనంత జటిలమైన, సంస్కృత సమాస భరితమైన భాష జోలికి పోలేదు. ఆ కవులకి శక్తి, అర్హత, సామర్థ్యం లేక పోవడం వల్ల కాదు – సినిమా తెరని కృష్ణదేవరాయుల భువన విజయ మండపంగా మార్చే స్వేచ్ఛా, చొరవా తీసుకోక పోవడం వల్ల. అలాని అంతకుమునుపెప్పుడూ ఘనమైన భాషా పాటవాన్ని ప్రదర్శించిన పాటలు అస్సలు లేవని కాదు. కాని, వేటూరిగారు ఈ విషయంలో చాలా ముందుకి దూసుకువెళ్ళారు. అవకాశాన్ని అంది పుచ్చుకుని మరీ భాషని వినియోగించుకున్నారు.

‘గొప్ప భావాలను కూడా చిన్న మాటల్లో చెప్పగలగడం చాలా గొప్ప విషయం’ అన్న అభిప్రాయం తప్పని ఎవరూ అనరు. అది నిజంగా గొప్పే. కాని, ఆ అభిప్రాయం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఒక నిజాన్ని విస్మరిస్తోంది.

కేవలం నాదం ద్వారానే ప్రాణనాడుల్ని మీటగలిగే సత్తా ఉన్న ఆంధ్రవాణిలోని వేదతుల్యమైన నాదమహిమని అలక్ష్యం చేయడం ద్వారా మనం, ‘భాషకి అందని భావం లేదు’ అనే ఐశ్వర్యాన్ని వదులుకుని, ‘ఏ భాషకీ అందనిదే భావం’ అని అనుకోవలసిన దారిద్ర్యాన్ని వరిస్తున్నాం. ‘అందరికీ అర్థం కావడం’ అనే లక్ష్యం కోసం, సినిమా పాట రాన్రానూ ఓ అరవై డెబ్భె మాటలకి పరిమితమై పోతోంది.

‘అర్థం కావడం వేరు, అనుభూతికి అందడం వేరు’ అని తెలుసుకుంటే – ‘ఏవో కొన్ని మాటలతోనే నిత్యనైమిత్తిక వ్యవహారాలు నడిచి పోతున్నాయి కదా, ఇంకా అంత విశాలమైన భాషార్ణవం దేనికి? రండి, భాషా సాగరాన్ని ఎండగట్టి ఎడారి చేసేద్దాం’ అనుకునే విపరీత ధోరణి మానుకుంటే – మనకి అర్థం అయేలా మనకి అందుబాటులోకి వచ్చేలా విలువల శిఖరాల్ని తలవంచమనడం కన్నా – గొప్ప విషయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకి వశమయ్యేలా అభ్యాసం చేద్దాం. ఉన్నత విలువల శిఖరాలను అధిరోహించే బలాన్ని మన ‘చరణాల’ కు కలిగిద్దాం అనే దృక్పథాన్ని అలవాటు చేసుకుంటే ఒక్క సంస్కృతంలోనూ, సంస్కృత భరితమైన ఆంధ్రంలోనూ తప్ప ‘శివతాండవాన్ని’ ఇంకే భాషైనా మన ‘అనుభూతి’ కి అంది వచ్చేలా ఆవిష్కరించగలరా అని గర్వంగా ఆశ్చర్యపడగలిగితే వేటూరి సుందరరామ్మూర్తి గారు సినిమా పాటల్లో భాషా పాటవాన్ని చూపడం ద్వారా ఆంధ్రభాషకి చేసిన చిరస్మ్రణీయమైన సేవని మెచ్చగలుగుతాం. శంకరాభరణం, సప్తపది, సీతారామయ్య గారి మనవరాలు, భక్త కన్నప్ప, రాజేశ్వరీ కల్యాణం, సరిగమలు… ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన “పరిపూర్ణమైన తెలుగు”ను వినియోగిస్తూ, తెలుగు నుడికారాన్ని, ఆంధ్ర భాషా ప్రాశస్త్యాన్ని, తెలుగుజాతి వారసత్వాన్ని ప్రపంచంలో తెలెత్తుకు తిరగ్గల తెలుగు మాటలలోని ఠీవిని, రూపు కట్టిన సంక్లిష్ట భావాల్ని ఎన్నోసార్లు ఆవిష్కరించారు.

ఇది వివాదాస్పద అంశం. నాకు తెలుసు ఎందరితోనో విభేదించవలసి వస్తుందని! అయినా ఈ అంశాన్ని ఇంత విస్తృతంగా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అంటే – గ్రంధాలయాలకి, పండితులకి, ప్రత్యేకమైన ఆసక్తి గల వారికి, “మేం గొప్ప కవులం. సామాన్య ప్రజానీకం కన్నా ఉన్నతులం” అనుకుంటున్న కొందరికి మాత్రమే పరిమితమైపోతున్న భాషా వైభవాన్ని ప్రజలందరికీ సన్నిహితం చేసేందుకు వెండి తెరని నల్లబల్లగా మార్చి ఆరేళ్ళ ప్రాయం వారి నుంచి అరవై ఏళ్ళ పైబడిన వారి దాకా అందరికీ తిరిగి తెలుగు ఓనమాలు దిద్దించేందుకు కృషి చేసిన వేటూరి గారి ప్రయత్నానికి సహకరించకపోగా ఆ “గురువు”కే పాఠాలు నేర్పుతూ తపనిసరితనంలోకి నెట్టి ఆయన చేత గత్యంతరం లేని సాము గరిడీలు చేయించి శభాషంటూ చప్పట్లు కొడుతున్నాం.

మన ఈ ‘సరదా’ కేరింతల్ని కాసేపు కట్టిపెట్టి ఆయన ఏటికెదురీది, కావ్యభాషా ప్రయోగం చేసే సాహసాన్ని ప్రదర్శించి, తన పాటల ద్వారా అందించిన చక్కని చిక్కని మాటల మాధుర్యాన్ని అందుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం భాషా రసాస్వాదనలోని మాధుర్యాన్ని చవి చూడడంతో బాటు నన్నయ్య, తిక్కన, శ్రీనాధుడు, పెద్దన, పోతన, రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య వంటి ఎందరో శారదాంశా సంభూతులకు వారసులమని సగర్వంగా మనని మనం పరిచయం చేసుకోగలుగుతాం. శ్రీ వేటూరి గారు ముందు తరాలకి దారి చూపించేలా అందించిన ఈ కరదీపిక ఆరిపోక ముందే వర్తమాన చలనచిత్రసీమ లోని కవులు, ఆంధ్ర ప్రేక్షకులూ, ఈ “ముద్దుమాటల” మరుగున పడి నిద్దరోతున్న తమ “పెద్దరికాన్ని” మేలుకొలిపేందుకు వీలుగా “రుద్రవీణ నిర్ణిద్రగానమిది అవధరించరా! విని తరించరా!” అని ‘శంకరాభరణం’లో ఆలపించిన ఆయన శ్వాసకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.

వేటూరి గారి తుంటరితనం!

మూడవ అంశం… భావ ప్రకటన దృష్ట్యా, భాషా ప్రయోగం దృష్ట్యా ఆయన ఘనతకి గీటురాళ్ళుగా “నిలిచిన” పాటలు గాక, ఇంకా మిగిలిపోయిన “కీచురాళ్ళు”గా ఆయన విదిలించిన “చప్పుళ్ళ” గురించి- నాటుతనం, మోటుతనం, ఆకతాయితనం, తుంటరితనం మేళవించి, గులకరాళ్ళుగా ఆయన మన మీదకి విసిరిన పాటల్ని విమర్శిద్దాం. తప్పులేదు. కాని, అక్కడకూడా ఆయన చూపించిన అనన్య సామాన్యమైన చమత్కారాన్ని, చాతుర్యాన్ని చూసి, “ఔరా!” అనలేకపోతే మనకి “సరసం” తెలియనట్టే. ఆయనలోని ఈ విశిష్ట శైలి నభూతో నభవిష్యతి.

మామూలుగా, ఉత్తుత్తినే, సినిమా పాటల్ని “ఆరేసుకోబోయి పారేసుకోవచ్చు” అని భ్రమపడి, ఆయన్ని అనుకరించడానికి, అనుసరించడానికి ప్రయత్నిస్తున్న పిల్లకాకులకి, ఆయన “పదబంధవైచిత్రి” ఉండేలు దెబ్బలాంటిది. పైకి కొంటెతనంగా, కోణంగితనంగా కనిపించినా, ఆయన అలవోకగా వాడే మాటల అల్లికలోని లాఘవం పోల్చుకుంటే ఆ ఆంజనేయుడిముందు కుప్పిగెంతులు వేసే ప్రయత్నానికి పాల్పడరెవరూ.

చెప్పవలసినదంతా చెప్పేసాక, చెయ్యవలసినదంతా చేసేసాక, exaust అయిపోయిన తరుణంలో కూడా, ఇంకా ఆయన చెణుకులు, “జగడజగడజగడాలు” , “నాటుకొట్టుళ్ళు” “కాస్తందుకో ప్రేమ దరఖాస్తందుకో” (రెండు రెళ్ళు ఆరు) “హంస లేఖ పంపా నీకంది వుంటది, పూల బాణమేసా ఎద కంది వుంటది” (ముత్యమంత ముద్దు) ఇలా లెక్కకు మించి పలుకుబళ్ళు వింటుంటే, ఆఖరికి బూతులు కూడా “మాటకారితనం సుమా!” అని అనిపిస్తూ ఉంటే, చిరాకు పక్కనే చిరునవ్వు, కోపం పక్కనే “ఓరి వీడి అసాధ్యం గూలా” అనే అబ్బురబాటు కలుగుతుంటే….

“కాదనడానికి, కసురుకోవడానికి, తిట్టడానికి మనం ఏపాటివాళ్ళంలే! ఆయనగారిగ్గానీ కోపం వస్తే, ఓ గొ..ప్ప పాటని, రెక్కలున్న మేరుపర్వతంలా మన నెత్తిన పడేస్తాడు, అణిగి చావాలి. ఆయన మనని వెక్కిరించాడని, మనం కూడా ఆయన్ని వెక్కిరించాలంటే తాహతు ఉండద్దూ!” అని బెరుకు పుడుతుంది.

ఇది వేటూరి గారిలోని భీమబలం! ధీమా! పొగరు!

“మహానుభావా! మీతో మేం చాల్లేం గానీ, బళ్ళో మంచి పాఠాలు నేర్పి, వీధిలో ఇలా కబ్బాడీ ఆడించి పిడిగుద్దులు గుద్దుతుంటే, మీరు మమ్మల్ని రాముడు మంచిబాలుడిగా తీర్చి దిద్దుతున్నారో, మాకు రాలుగాయి రౌడీల్లా తయారయే తర్ఫీదిస్తున్నారో మీకే తెలియాలి” అంటూ-

ఆకాశాన్ని ఆక్రమించిన ఆయన భావనా పదానికి, భూగోళాన్ని ఆక్రమించిన ఆయన భాషా పదానికి భక్తితో అంజలి ఘటిస్తూ, ‘నా మూడో పదాన్ని నీ నెత్తిన పెడతా’ అంటున్న ఆయన తాండవ పదానికి భయంతో నమస్కరిస్తూ,

ముమ్మారు మొక్కుతూ…

– సిరివెన్నెల సీతారామ శాస్త్రి

(వేటూరి పోయినప్పుడు కన్నీళ్ళతో సిరివెన్నెల)

వేటూరికి సిరివెన్నెల అక్షరాభిషేకం!

ఒక ఉడతా – ఇద్దరు రాముళ్ళు!

veturi_sirivennela

తెలుగు సినీసాహితీ అయోధ్యానగరం ఇద్దరు రాముల పాటపాలనలో తియ్యగా విలసిల్లింది.

వేటూరి సుందర”రాముడు” – శైలి సుందరం, శబ్దం దివ్యం, భావం రమ్యం, కీర్తి అమరం!

సిరివెన్నెల సీతా”రాముడు” – నిఖార్సైన పాట, నియమాలున్న బాట, లలితపదాల పేట, మధురభావాల ఊట!

ఇద్దరూ సార్థకనామధేయులే. ఇద్దరూ మహాకవులే, మహానుభావులే. తమ పాటలతో నన్ను స్పందింపజేసిన ఈ ఇద్దరికీ “ఉడతా”భక్తితో వినమ్ర ప్రణామాలు!

(స్వరాభిషేకం చిత్రం ఆడియో రిలీజ్ అప్పటి అపురూపమైన చిత్రం)

ఒక ఉడతా – ఇద్దరు రాముళ్ళు!

వేటూరిని ఎలా స్మరించుకోవాలి? – సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సిరివెన్నెల వేటూరి పోయినప్పుడు రాసిన ఓ ప్రచురితం కాని వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు –

ఈనాడు మన తెలుగుసమాజంలో అనేకమంది పండితసమానులూ, మహామహులమనుకుంటున్న వారి దృష్టిలో “ఆఫ్ట్రాల్” అనిపించే సినీగేయ రచన ద్వారా శ్రీ వేటూరి వారు (ఆయన పేరు ముందు కీ.శే అని చేర్చడం నాకు ఇష్టం లేదు. ఆయన తన గీతాల ద్వారా శాశ్వతుడు) ఎంతో స్ఫూర్తి కలిగించారు…

నేనైనా, మరెవరైనా, ఎంత వారైనా సాహిత్యాన్ని “ఉద్దరించ”గలిగేంత అవతారపురుషులు ఎవరూ ఉండరు. కాలప్రవాహంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళుతుంటారు. అతి కొద్దిమంది మాత్రం శ్రీ వేటూరి గారిలా కాలాన్ని అధిగమించి శాశ్వత స్థానాన్ని శాసిస్తారు. ఆయన తర్వాత తరానికి చెందిన నాబోటి వాళ్ళు ఆయన సాధించిన ఆ ఘనతని ఆదర్శంగా, గమ్యంగా భావించి ఆ మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నించాలి…

…ఎవరెస్టు శిఖరం ఒక్కటే ఉంటుంది. మొదట ఎవరు అధిరోహించారు అన్నదే చరిత్ర. తరువాత మరికొందరు ఆ శిఖరాన్ని అధిరోహించడం అన్నది చరిత్ర కాదు. శ్రీ వేటూరి గారు తొలిసారి ఎవరెస్టుని అధిరోహించారు…

వ్యక్తుల పట్ల కన్నా వారు నెలకొల్పిన “విలువల” పట్ల దృష్టి మళ్ళించాలి. సాహిత్యం శాశ్వతం, సాహితీకారుడు కాదు. పాట శాశ్వతం, “పాటసారి” కాదు.

వేటూరిని ఎలా స్మరించుకోవాలి? – సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సిరివెన్నెలతో మరో సాయంత్రం

ఈ రోజు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా కొందరు మిత్రులతో పాటూ కలవడం జరిగింది. ఓ మూడు గంటలు ఆయన సమక్షంలో గడిపే భాగ్యం దక్కింది. గతంలో ఒకసారి ఆయన పుట్టినరోజుకే ఇలా మిత్రులతో కలిశాను. ఆ అనుభవాలని “సిరివెన్నెలతో ఓ సాయంత్రం” పేరున విపులంగా బ్లాగీకరించాను. ఇప్పుడు ఆ వ్యాసాలు చదివితే నేను మరిచిపోయినవి చాలా ఉన్నాయని తెలిసింది. సిరివెన్నెల గారితో సమయం గడిపితే మనలో నూతన ఉత్సాహం, ప్రేరణ కలుగుతాయ్. ఈ రోజు జరిగిన ముఖాముఖీలో నేను నేర్చుకున్న విషయాలు నాకు గుర్తున్నంతలో/అర్థమైనంతలో క్లుప్తంగా వివరిస్తాను. ఇది నాకోసం, అందరి కోసం కూడా!

 • పాటని సినిమా కోసం కాదు, నీకోసం రాసుకో. మనకోసం రాసుకున్నదే సినిమావాళ్ళకి నచ్చేలా ఒప్పించగలగడంలోనే కళా, కౌశలం దాగున్నాయి. ఒక రకమైన వస్తువుకే/అంశానికే పరిమితం కాకు. మనసుని స్పందింపజేసే అన్నిటిమీదా, జీవితంలోని ప్రతి అనుభవం మీదా రాస్తూ సాధన చేస్తూ ఉండు – అన్న నచకికి అభినందనపూర్వకంగా ఇచ్చిన సలహా.
 • పంచతంత్ర కథలూ, అరేబియన్ నైట్స్ వంటి కథల్లో చాలా జీవితం ఉంది –

  ఆలీబాబా కథలో నీతి ఏమిటంటే – నీకు కావలసిందేదో, ఎంతో తెలుసుకోమని. నలభై దొంగలూ సొమ్మైతే చాలా దోచారు కానీ వారి దృష్టిలో వాటి విలువ సున్నా. దొంగతనం వృత్తిగా చేస్తున్నారంతే. ఆలీబాబా అన్న అత్యాశకి పోయి మొత్తం సొమ్మంతా కావాలనుకుని, ఆ తొందరలో మంత్రం మరిచిపోయి దొంగల చేతిలో చచ్చాడు. చివరికి ఆలిబాబా దొంగలను గెలిచి తీసుకున్న సొమ్మెంత? రెండు జేబుల సరిపడా. బతకడానికి ఎంత సొమ్ము కావాలో అతనికి తెలుసు.

  అల్లాదీన్ కథలో, అల్లాదీన్ అద్భుతదీపాన్ని రెండు సార్లే వాడాడు. రాకుమారిని దక్కించుకోడం కోసం ఒకసారీ, రక్షించుకోడం కోసం ఇంకోసారి. అంతే కానీ నా పనులన్నీ నువ్వే చెయ్యి, నా తిండి నువ్వే తిను, నాకు ఇవితే, అవితే అనలేదు. నీ శక్తికి మించిన దానికి సాయం కావాలి కానీ, జీవించడానికి ఎందుకు?

 • dichotomy(ద్వంద్వత) లేకుండా జీవించాలి. జనం, సమాజం మిమ్మల్ని ఎలా ఉండాలనుకుంటోందో అలా ఉంటున్నవాళ్ళే ఎక్కువ. మీకేం కావాలో మీరు తెలుసుకోండి, మీలా మీరు ఉండండి.
 • ప్రతి వ్యక్తి గొప్పతనం వెనకా ఒక వ్యవస్థ ఉంది. గాంధీ, థెరీసా గొప్పవాళ్ళే, కానీ వాళ్ళ గొప్పతనానికి దోహదం చేసిన పరిస్థితులనూ, సమాజాన్ని మర్చిపోరాదు. అందుకే సిరివెన్నెల కూడా ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. జగమంత కుటుంబం అంటే ఇదే. ఈ ప్రపంచం అంతా నేనే, నేనే ప్రపంచం అనుకుని చూడండి – మీలో గొప్పతనం బయటకి వస్తుంది.
 • మీరు నాకు ఫేన్స్‌గా ఉండకండి, ఆ మాటకొస్తే ఎవరికీ ఫేన్స్ కావొద్దు. మీరే ఒక హీరో అవ్వండి.
 • Anything that becomes organized loses its power. జిడ్డు కృష్ణమూర్తి అందుకే తన ఆధ్యాత్మిక హోదానీ, మఠ సారధ్యాన్ని త్యజించాడు. నిరంతరం తర్కిస్తూ, నిరంతరం నేర్చుకుంటూ ఉండండి. ఒక ఆలోచనా ధోరణికో, ఒక సంస్థకో బద్ధులు కాకండి.

ఈ meeting లో మరికొన్ని విషయాలు –

 • గురువుగారు ఎంతో గౌరవించే “సత్యారావు మాస్టారు” గారు మాతో ఉండడమే ఈ పుట్టినరోజు విశిష్టత అని మాతో చెప్పారు. ఒక శిలని, గుళ్ళో శిల్పంగా మలిచిన ఘనత మాస్టారికే దక్కుతుందన్నారు. “జగమంత కుటుంబం నాది” పాటకి సజీవ ఉదాహరణ మాస్టారన్నారు. మాస్టారు మాట్లాడుతూ – “అంతా సిరివెన్నెలే చేసినది. నేనందించింది కొద్ది తోడ్పాటు మాత్రమే. సాధారణంగా గెలుపు తనవల్లేననీ, పరాజయం అందరివల్లా అనీ జనం భావిస్తారు. సిరివెన్నెల మాత్రం తన గెలుపు అందరి వల్లా అని చెప్పడం ఆయన సంస్కారం” అన్నారు.
 • గురువుగారు సినిమా రంగంలోకి వచ్చి పాతికేళ్ళు పూర్తైన సందర్భంగా మాస్టారు ఒక 4 రోజుల కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. 3 రోజులు విశాఖలో – సిరివెన్నెల అమ్మపైన, స్నేహం పైన, యువత పైనా, సమాజం పైన ఇలా వివిధ అంశాలపై రాసిన పాటలు గానం చేస్తారు. 1 రోజు హైదరాబాద్ లో సిరివెన్నెల తను పనిచేసిన దర్శకులు, సంగీత దర్శకులూ, హీరోల గురించి అనుభవాలను వివరిస్తారు.
 • మమ్మల్ని మాస్టారికి పరిచయం చేస్తూ – “వీరంతా చక్కని కుర్రాళ్ళు. యూత్ అంటే ఈ ఒక్క సినీ పరిశ్రమకే సదాభిప్రాయం లేదు. వాళ్ళు తాగుబోతులనీ, తిరుగుబోతులనీ, ఎందుకూ పనికిరారన్నట్టే చూపిస్తారు. వీళ్ళందరిలో ఏ ఒక్క అవలక్షణం లేదు. వీరే నాకు దక్కిన నిజమైన అవార్డులు. అంతే కానీ ఆ అవార్డు చెక్కముక్కలు కాదు” అన్నారు. గురూజీకి మాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడానికి అయినా నాలో కొన్ని మార్చుకోవాలన్న సంకల్పం కలిగింది.
 • గురువుగారు ఈ మధ్యే రాసిన పాటలోని ఓ రెండు వాక్యాలు ఆయనే హాస్యనటులు బ్రహ్మానందం గారితో ఫోన్‌లో మాట్లడుతున్నప్పుడు చెప్పడం జరిగింది –

               మన భాష మనసుకు తెలుసా

               మదిఘోష మనిషికి తెలుసా!

 • రామ జోగయ్య శాస్త్రి గారు వారి ఇద్దరి అబ్బాయిలతో వచ్చారు. వారి రెండవ అబ్బాయిని (పదేళ్ళు ఉంటాయేమో) సిరివెన్నెల మాకు పరిచయం చేస్తూ – “వీడు child prodigy. ఎలాంటి సన్నివేశం అయినా చెప్పండి, వెంటనే ట్యూన్ చెప్పేస్తాడు. హార్మోనియం పెట్టె ముందేసుకుని, ట్యూన్లు ఇవ్వడం అంటే అదో గొప్ప ఘనకార్యం అన్నట్టు ఫోజులు కొట్టే మ్యూజిక్ డైరెక్టర్లకి వీడిని చూసి బుద్ధి రావాలి.” అన్నారు. తర్వాత ఈ child prodigy తన ప్రతిభని మా ముందు ప్రదర్శించి అబ్బురపరిచాడు. గురువుగారు ఇచ్చిన ఒక అసాధారణ సన్నివేశానికి, గురువుగారు చెప్పడం పూర్తిచెయ్యగానే ఆశువుగా “తననా”లతో ట్యూన్ కట్టాడు. మేము గురువుగారి రూం నుండి బయటకి వచ్చాక RJS గారు ఈ అబ్బాయికి ప్రేమగా నుదుటిపై ముద్దుపెట్టడం చూసి ముచ్చటేసింది.

తెలియడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. గురువుగారి వాక్కులో శక్తి ఉంది. తెలిసిన విషయాలనే, ఆయన ద్వారా విన్న విషయాలనే అయినా మళ్ళీ ఒకసారి వింటే కొత్త ఉత్సాహం కలుగుతుంది. తీర్థం ప్రాప్తమయ్యింది, ప్రస్థానం మొదలుపెట్టాలి.

సిరివెన్నెలతో మరో సాయంత్రం

సినిమా పాటలు – సాహిత్యం

వెంకట్ గారనే ఒకాయన “సిరివెన్నెల భావలహరి”  (http://www.sirivennela-bhavalahari.org/) అనే అద్భుతమైన సైట్ ని నిర్వహిస్తున్నారు. సిరివెన్నెల సంపూర్ణ సాహిత్యాన్ని అందించాలనే సంకల్పంతో సాగుతున్న ఈ సైట్ లో contribute చేసే అవకాశం నాకూ కలిగితే కొన్ని పాటలు type చేస్తున్నాను. ఈ మధ్య ఈ సైట్ కి ఉన్న google group లో సినిమా పాటల్లో సాహిత్యం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అక్కడ నేను వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను –

 literary standard అంటే ఏమిటి అని అడిగారు. నాకూ ఇలాటి సాహితీ విషయాల గురించి పెద్ద పరిజ్ఞానం లేకున్నా, కొన్ని సినిమా పాటలు రాసిన అనుభవంతో సినిమా పాటల గురించీ, సాహిత్యం గురించి నా అభిప్రాయం చెబుతున్నాను.

మా అబ్బాయి ఇక లేడు

మా అబ్బాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు

 పై రెండు వాక్యాల్లో విషయం ఒకటే. కాని రెండో వాక్యంలో ఏదో తెలియని ఆర్ద్రత, అనుభూతి మనని స్పందింపజేస్తుంది. దీనినే నేను literary standard అన్నాను. దీనిని బట్టి కొన్ని విషయాలు గ్రహించొచ్చు –

1. కవిత్వానికైనా ఆ మాటకొస్తే ఏ సాహితీ ప్రక్రియకైనా పరమావధి పాఠకుల స్పందన. అంటే నిజానికి గొప్ప కవిత్వం అంటూ ఏమీ ఉండదు – నేను అది చదివి గొప్పగా స్పందించేదాకా. అది నాకు అందకపోతే నాకు అది గొప్పది కాదు. ఇంకొకరికి కావొచ్చు. అయితే చాలా మందికి నచ్చినది బాగుందంటాం, నచ్చనిది బాగోలేదంటాం. ఇలా కొంత objectivity ని కల్పించే ప్రయత్నం చేస్తాం కానీ నిజానికి objective rating అంటూ ఏదీ ఉండదు.

2. ఈ ప్రాసలూ, అలంకారాలూ, శబ్ద సౌందర్యాలు ఇలా ఎన్నో మనం నిర్వచించుకున్నాం మన సౌకర్యం కోసం. అంటే ఏవి వాడితే స్పందన కలుగుతోంది పాఠకుడిలో అన్న దాన్ని బట్టి ఇవన్నీ వచ్చాయ్. ఇవన్నీ tools మాత్రమే, creation కాదు. గొప్ప కవులు ఇది గ్రహిస్తారు, result అయిన స్పందనని ఇవి వాడి సిద్ధించుకుంటారు . కానీ ఎంతో మంది ఇది గ్రహించక ప్రాసలూ, అలంకారాలే కవిత్వం అనుకుని efforts లోనే ఉండిపోతారు.

3. అందుకునే “ఎవరు గొప్ప కవి” లాంటి వాదనలు అర్థం లేనివి. అలాగే “ఇలాగ రాస్తేనే గొప్ప”, “ఇలాగైతే కాదు” లాంటి rules కూడా అర్థం లేనివి. కవిత్వం అన్నది open ended task. ఏం రాశాం అన్నదాని కంటే ఎంత స్పందన కలిగించాం అన్నది ముఖ్యం. కొందరు ఇది అర్థం చేసుకోలేరు కవిత్వం అంటే information అనుకుంటారు. అలాగని పూర్తిగా irrelevant గా రాయమని కాదు. “భం భం భోలే” పాటలో information పరంగా చూస్తే కాశీ గురించి పెద్ద ఏమీ లేకపోవచ్చు. కానీ ఆ స్పందన, కలిగే భక్తి భావం చూడండి – కాశీని చూసినట్టే ఉంటుంది.

4. ఇప్పుడు సినిమా పాటని తీసుకుందాం, పాట అంటే – సాహిత్యం + సంగీతం + గానం. ఇవన్ని ఒకదానికి ఒకటి తోడై స్పందనని పెంచాలి. దీనికి దృశ్యాన్ని (visualization) కూడా కలపండి – ఎంత శక్తివంతమైన స్పందనని సినిమా పాట కలిగించగలదో తెలుస్తుంది. అందుకే సినిమాని “దృశ్య కావ్యం” అన్నది. అయితే చిక్కల్లా సినిమా పాట ఎప్పుడూ స్పందనని కలిగించడానికే ఉద్దేశించినది కాదు. ఊరికే filler గా ఉండే ఉతుత్తి గీతాలు, ఉందాలి కాబట్టి పెట్టే formula గీతాలు ఈ కోవలోకి వస్తాయ్. ఇక్కడ కూడా మన కవులు గొప్ప పాటలు రాశారు, అయితే అన్ని సార్లూ సినిమా పరిమితుల దృష్ట్యా ఇది వీలు పడదు. ఇలాటి పాటలనే నేను literary songs కాదు అన్నది. పరమ నాటు పాట కూడా ఎవరో ఒకరికి ఏదో మూడ్ లో నచ్చొచ్చు. మరి ఇది స్పందన కాదా అని అడగొచ్చు. స్పందన అంటే హితం కలిగించే రసానుభూతి అనుకుంటే “సాహిత్యమే” స్పందింపజేయగలదు.

5. సినిమా పాట స్పందనకి సంగీతం చాలా సార్లు దోహద పడుతుంది. కొన్ని సార్లు చేటు చేస్తుంది. అందుకే సాహిత్యం బాగున్నా అంత గొప్పగా అనిపించని పాటలు, సాహిత్యం మాములుగానే ఉన్నా గొప్ప సంగీతం వల్ల గొప్పగా అనిపించే పాటలు చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడ మన analysis కోసం సంగీతం బాగుంది, సాహిత్యం బాగులేదు అనుకుంటాం కానీ నిజానికి కేవలం ఒక దానినే ఆస్వాదిస్తూ రెండో దానిని విస్మరించడం practical గా అంత సాధ్యం కాదు. అందుకే సినిమా పాట పాడుతూనే వినాలి అంటాను నేను. సిరివెన్నెల గారు కూడా అందుకే ఎప్పుడూ పాడే వినిపిస్తారు. అయితే సిరివెన్నెల గారే సంగీతం తీసేసి సాహిత్యం చదవగలగాలి అని కూడా అన్నారు. ఇదీ ఉంటే చాలా మంచిదే అయితే సినిమా పాటకి ఇది ప్రాథమిక లక్షణం కాదని నా అభిప్రాయం!

సినిమా పాటలు – సాహిత్యం

సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 3

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిసిన అనుభవాలను వివరిస్తూ సాగుతున్న series లో ఇది ఆఖరి భాగం. ఇందులో గురువు గారు స్పృశించి వదిలేసిన కొన్ని అంశాలని క్లుప్తంగా వివరిస్తున్నాను.

సమాజ సేవ గురించి
మేము మొదటిసారి సిరివెన్నెలని కలిసినప్పుడు మా ముందు ఒక social service group ఆయన్ని కలిసింది. వాళ్ళ గురించి ఆయన ఆలోచిస్తూ మాతో ఇలా అన్నారు –

ఈనాటి యువతని చూస్తే ఎంత అయోమయంలో ఉన్నారో అనిపిస్తుంది. వీళ్ళ పేరు Adam అయ్యినట్టూ, ఇప్పటి దాకా అసలు సమాజ సేవ ఎవరికీ పట్టనట్టూ, వీళ్ళే మొదలుపెట్టినట్టూ మాట్లాడారు. established organizations లో ఒక అనామక సంఘ సేవకుడిగా పనిచెయ్యొచ్చు గా? లేదు. “నాకంటూ ఒక organization ఉండాలి. దాని ద్వారా చేసిన సేవే సంతృప్తినిస్తుంది.” అని నువ్వు అనుకుంటే ఈ సేవ అన్నది నీకోసం అన్నమాట, సమాజం కోసం కాదు!

సినిమా పాటలు ఎలా రాయాలి?

మా బృందంలో కొందరు ఔత్సాహిక సినీ గీత రచయితలు ఉన్నారు. వాళ్ళ కోసం సిరివెన్నెల గారు కొన్ని అమూల్యమైన సలహాలు ఇచ్చారు –

ముందు మీ గురించి మీకు తెలియాలి. పాటలు రాయగలిగే passion ఉందా, సినిమా పరిశ్రమలో ఉండే ఒడిదుడుకులని తట్టుకునే సామర్ధ్యం ఉందా, ఇలాటివి. తర్వాత మీ motivation గురించి మీకు clarity ఉండాలి. మీరు lyricist ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? పేరు కోసమా, డబ్బు కోసమా, సంతృప్తి కోసమా, ప్రజల కోసమా? ఇందులో ఏదో మీరు తెలుసుకోవాలి. సగం దూరం వెళ్ళాక వెనక్కి రావడం అంత సులభం కాదు”.

గురువుగారు చెప్పిన ఈ wisdom ఔత్సాహిక సినీ గేయ రచయితలకే కాక, job change అవ్వాలనుకుంటున్న వారికి, జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా చాలా అవసరం.

“మన భావాలని tune లో పలికించడం ఎలా? మీరు ఇది చాలా బాగా చేస్తారే. కొన్ని మెళకువలు నాకూ చెప్పరూ?” అని తెలిసీ తెలియని జ్ఞానంతో నేను అడిగిన ప్రశ్నని తీసి పారెయ్యకుండా –

“మెళకువలు ఏమీ లేవు! మెలకువగా ఉండడమే మెళకువ!”

అన్న సిరివెన్నెలకి మనసులోనే నమస్కరించుకున్నాను.

దీనికి కొంత ప్రతిభ అవసరమే. అయితే సాధన చాలా అవసరం. నేను అనుకున్న భావం tune లో పలికించుకునే దాకా నేను ఎంత కష్టపడతానో మీకు తెలియదు. ఒక పాట పల్లవికి 150 versions రాశాను రాత్రంతా కూర్చుని

అని ఆయన చెబితే బాగా రాయడానికి tricks and shortcuts లేవని మనకి తెలుస్తుంది. “బాగా రాయడం ఎలాగండీ?” అని ఒక రచయితని ఎవరో అడిగితే “రాయాలి” అని ఆయన చెప్పిన సమాధానం గుర్తుకు వస్తుంది.

సినిమా కవికీ స్వతంత్రుడు కాదు. తనకి నచ్చినట్టు రాసుకుంటే సరిపోదు. మరి ఎలా రాయాలి అన్న దాని గురించి చెబుతూ ఇలా అన్నారు –

ముందు పాట మీకోసం మీరు రాసుకోవాలి. స్పందంచగలగాలి. మీలో సమస్త మానవాళి దాగుంది కాబట్టి ఈ స్పందనలో universality అదే వస్తుంది. రాసే దానిని దర్శకుడికి నచ్చేటట్టు మలచగలగాలి.

యువతకి ఇచ్చే సందేశం

గురువుగారు చాలా విషయాల గురించి మాట్లాడారు. ఆఖరిగా ఆయన చెప్పాలనుకుంటున్నది ఏమిటో ఆయనే ఇలా చెప్పారు –

ప్రశ్నించుకోండి, మనిషిగా బ్రతకడం ఎలా అని? నిరంతరం ప్రశ్నించుకోండి. మనిషిగా బ్రతకట్లేదని సిగ్గుపడండి. ఆ guilty feeling తో మీరు ఇక్కడి నుంచీ వెళ్ళండి. మిమ్మల్ని మీరే విమర్శించుకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు సాగండి. నేను అదే చేస్తాను. నన్ను నేను తిట్టుకున్నట్టుగా ఎవ్వరూ నన్ను తిట్టలేరు, అలాగే నన్ను నేను మెచ్చుకున్నట్టుగా ఎవ్వరూ మెచ్చుకోనూలేరు !

ఆయన చెప్పిన మాటలు ఎదలో, మదిలో సొదచేస్తూ ఉండగా ఇక వెళ్ళడానికి ఉపక్రమించాం అందరం. కొందరు ఆయన autograph తీసుకున్నారు. నాకు అనిపించింది – ఆయన సంతకాన్ని ఇప్పుడు పుస్తకం మీద కాదు, మన మనసుపై తీసుకోవాలి అని! ఆయన మాటల్ని విని బాగుందని వదిలెయ్యకుండా మన నరనరాల్లో ఎక్కించుకోవాలని. అప్పుడే ఆయన ఆనందించేది. అప్పుడే ఆయన సగర్వంగా వీళ్ళు నా శిష్యులు, నా సైన్యం అనగలిగేది.

ఆ రాత్రి ఇంటికి వెళుతూ ఉండగా, ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయ్ –

మీరు నా సైన్యం అనుకుంటున్నాను నేను. మీలో సత్తా ఉంది, చాలా సాధించగలరు, పూనుకుంటే. మీ లోపాలని అధిగమించండి. ఒక కుంటివాడూ, ఒక గుడ్డివాడూ తన సైన్యమైతే ఏ సేనాధిపతి గర్వించగలడు?

మీరు సిరివెన్నెలని గర్వించేలా చెయ్యగలరా?

సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 3

సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 2

సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిని కలిసిన నా అనుభవాన్ని వివరిస్తూ సాగుతున్న వ్యాస పరంపరలో ఇది రెండవది. మొదటిది ఇక్కడ ఉంది: సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 1

మొదటి భాగానికి తమ సలహాలూ, ప్రశంసలూ అందించిన అందరికీ thanks. బిజీగా ఉండడం వల్ల ఈ రెండవ భాగం రాయడంలో జాప్యం జరిగింది. విషయపరంగా చూస్తే ఈ భాగంలో Core of Sirivennela’s teaching ఉంది. కాబట్టి ఇది ముఖ్యమైన భాగం. part-3 లో చిన్న చిన్న ఇతర విషయాలు గురించి రాసి ఈ శీర్షిక ముగిస్తాను.

నీ నా నవ్వుల రంగొకటే
జీవితం గురించీ, మనిషితనం గురించీ మాట్లాడ్డం శాస్త్రిగారికి చాలా ఇష్టమైన విషయం –

నువ్వు అంటే నువ్వు కట్టుకున్న టై, బట్టా కాదు. ప్రాణం ఉన్నంత వరకే నీ పేరు పెట్టి పిలుస్తారు. పోయాక body ని “it” అని refer చేస్తారు. అంటే ఆ “it” కంటే వేరైన నువ్వు అని ఏదో ఉండాలి కదా?

అంటూ కంటికి కనిపించే భిన్నత్వం నుంచి, మనసుకే అందే ఏకత్వాన్ని దర్శింపజేస్తారు. మనుషులంతా ఒకటే అని చెబుతూ –

మనమంతా ధాన్యపు పోగులోని ధాన్యపు గింజలం. ఒక గింజ పైన ఉంటుంది ఇంకోటి కింద ఉంటుంది. ఆకారాల్లో తేడాలు ఉంటాయ్. కాని లక్షణం ఒకటే. position and expression లో తేడా ఉన్నా nature ఒకటే.

ఇదంతా చిన్నప్పటి నుండీ చదవుకున్న “మనుషులంతా ఒకటే” భావమే కదా అని మనం అలవాటులోకి, అలసత్వంలోకి జారుకోడానికి ముందే ఈ సత్యంలోని దాగున్న బాధ్యతని గుర్తు చేస్తారు –

ఇటుక పటిష్టంగా ఉంటేనే గోడ బాగుంటుంది. ఇటుక బయటకి వచ్చేసి, గోడ కేసి చూసి, ఇదేమిటి గోడ ఇంత బలహీనంగా, అస్తవ్యస్తంగా ఉందీ అని అడిగితే ఉన్న గోడ కూడా కూలుతుంది. మీలోనే సమస్త ప్రపంచం దాగుంది. ముందు మీరు మారితే ప్రపంచం మారుతున్నట్టే. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా? తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా? అంటే ఇదే.

ఈ నిశిత సూర్య కిరణాలు నా మనసుని తాకుతూ ఉంటే ఒక ఉదయం స్ఫురించింది – “అరే! జిడ్డు క్రిష్ణమూర్తి (ఓ ప్రముఖ తత్త్వవేత్త) చెప్పిన You are the world సారం కూడా ఇదే కదా! సిరివెన్నెల గానీ ఆయన పుస్తకాలు చదివారా?” నా ప్రశ్నకి సమాధానం ఆయన మాటల్లోనే తర్వాత దొరికింది –

ప్రపంచంలో ఏ philosophy పుస్తకమైనా చదవండి. నేను చెప్పిన విషయాలే ఉంటాయ్. అది నా గొప్పతనం కాదు. సార్వజనీనమైన మనిషితనానికి నిదర్శనం అది

సరే! మనమంతా మనుషులం. మనమంతా ఒకటే. మనిషిగా మనకి ఉండాల్సినది ఏమిటి? “ప్రేమ” అంటారు గురువుగారు –

ప్రేమకి ఉన్న శక్తి ఇంక దేనికీ లేదు. ప్రేమతో ఎవరినైనా జయించొచ్చు. గుండెల నిండా ప్రేమ నింపుకోండి. రోజూ ఎదురయ్యే మనుషులందరినీ ప్రేమగా పలకరించండి. ప్రేమతో వ్యవహరించండి. మీ కారుని ఒక బైక్ వాడు రాసుకునిపోతే కోపంతో ఎగిరి వాడి మీద పడడం దేనికి? కారుకి damage ఎలాగా అయ్యింది. శాంతంగా ఉంటే ఒక అనవసర గొడవని అరికట్టచ్చు కదా!.

బాగా చెప్పారు. అంటే దీని అర్థం అన్యాయం జరిగినా ప్రేమతో క్షమించెయ్యాలనా? ఇలాటి అపార్థాలకి తావు ఇవ్వకుండా గురువు గారే ఇలా చెప్పారు –

నేను బస్సులో ఉంటే ఏ అమ్మాయినీ ఎవ్వడూ ఏడిపించలేడు. ముందు నన్ను పడగొట్టమంటాను. అందరిలోనూ నిద్రాణమైన మనిషితనం ఉంటుంది. కాని భయం ఆపుతుంది. ఒక్కడు ముందుకు వచ్చి ఎదిరిస్తే మొత్తం బస్సులోని వారంతా వాడికి మద్దతుగా కలిసి రావడం మనం చూస్తాం. ధైర్యంగా ఉండండి. అసలు మనం దేనికి భయపడాలి? చావు కంటే ఎక్కువ భయపెట్టేది ఏమైనా ఉందా? ఆ చావు నిర్ణయించేది భగవంతుడు. దానికి తిరుగు లేదు, ఎవరూ ఆపనూ లేరు. ఎవడైనా నన్ను చంపాడూ అంటే వాడు తలారి మాత్రమే, నిర్దేశించేది భగవంతుడు.

ఈ మాటల్లో సత్యం ఎంతుందో ఆలోచిస్తే తెలుస్తుంది. చాలా మంది “ఉపేక్ష”ని “క్షమ”గా భ్రమపడుతుంటారు. మన భయం వల్లో, నిర్లక్ష్యం వల్లో వచ్చిన ఉపేక్షని, ప్రేమగా భావించుకుని, “ఆ వాడి ఖర్మకి వాడే పోతాడు” లే అని మనం చెయ్యగలిగీ ఏమీ చెయ్యకుండా ఆత్మవంచన చేసుకుంటాం. తెలుగు మహా భారతంలో ఉద్యోగ పర్వంలో శ్రీ కృష్ణుడు ధ్రుతరాష్ట్రునికి చెప్పే “సారపు ధర్మమున్ విమల సత్యము” అన్న పద్యంలోని సారాంశం ఇదే –


సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే
పారము పొందలేక చెడబారినదైన అవస్థ, దక్షులె
వ్వారలుపేక్ష సేతురది వారల చేటగుగాని ధర్మని
స్థారకమయ్యు సత్యశుభదాయకమయ్యును, దైవముండెడెన్.

సమాజంలో అధర్మం-అసత్యాలచేత, ధర్మము-సత్యం దారుణంగా చెరచబడుతున్నా, దానిని నిరోధించేశక్తి వుండీ ఉపేక్షించినవారికి తమ ఉపేక్షే చేటుగా పరిణమిస్తుంది

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా

సమాధానాలు కావాలంటే ముందు ప్రశ్నించడం నేర్చుకోవాలి అంటారు సిరివెన్నెల –

యువతలో seriousness పెరగాలి. ప్రశ్నించడం నేర్చుకోవాలి. నిజాయితీగా ఉంటున్నానా? నేను మనిషిగా బ్రతుకుతున్నానా? అని ప్రశ్నించుకోండి. అలా చేస్తే మీకు మీరే సత్యాలని తెలుసుకుంటారు. ఆ సత్యం అనాదిగా అందరూ చెబుతున్నదే అవుతుంది. మీలోని అనంతమైన శక్తిని వ్యర్థ ఆలొచనలతో వృథా పరచకండి. శుభకామనలు చేయండి.

ఈ analysis అన్నది కూడా subjective గా చెయ్యడం ఎంతో అవసరం అంటారు –

సమస్య ఏమిటి అని మీరు దాని నుంచి దూరంగా జరిగి analyze చెయ్యడం కాదు. అసలు ఈ సమస్య కి నేను ఎంత వరకూ కారణం? నాలో నేను ఏమి మార్చుకుంటే ఈ సమస్యకి నా వంతు పరిష్కారం ఇస్తాను? ఇలా ప్రశ్నించుకోవాలి.

ఆలోచిస్తే Objective analysis & subjective analysis రెండూ అవసరమే అనిపిస్తుంది. అయితే objective analysis లో కేవలం ఎనాలసిస్ లోనే ఉండిపోతూ inaction లోకి జారిపోయే ప్రమాదం ఉంది. ఒబామా అమెరికాని ఎలా నడిపించాలి దగ్గరనుండీ ఆవకాయ్-బిర్యానీ సినిమా దాకా మనకి అన్నిటిపైనా అభిప్రాయాలు ఉంటాయ్. మొన్నొక మిత్రుడు – “మన దేశం ఇంకొక 80 ఏళ్ళు అయినా infrastructure పరంగా develop అవుతుంది అని నేను అనుకోను. రాజకీయ నాయకులు వెనకేసుకోడానికి చూస్తున్నారు గాని, వెనకబాటుదనాన్ని పారద్రోలాలని చూడట్లేదు” అంటూ సుధీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. నేను అంతా విని అన్నాను – “బాగా analyze చేశావ్. నిజమే, మనకి సమర్థ రాజకీయ నాయకత్వం లేదు. సమస్యలు చాలా ఉన్నాయ్. అయితే మనం ఏమి చెయ్యగలం అని ప్రశ్న కూడా వేసుకోవాలి. మన ఓటు హక్కుని మనం సక్రమంగా వాడుతున్నామా? మనం అవినీతి లేకుండా ఉంటున్నామా? … ఇలా subjective analysis గురించి నేను మాట్లాడేసరికి నా మిత్రుడు ఇక మాట్లాడలేదు!!.

subjective analysis మనని action oriented గా చేస్తుంది. సిరివెన్నెల స్పష్టంగా చెప్పారు –

ఊరికే ఆలోచన కాదు. practical గా ఏమైనా చెయ్యాలి. అదే నేను మీనుంచి కోరుకునేది.

ఈ విషయాన్ని ఆయన అంత నొక్కి వక్కాణించకపోయినా, సుస్పష్టంగా చెప్పారు. సిరివెన్నెల శిష్యులు అనిపించుకోవాలి అనుకునే వారంతా ఇది గుర్తు పెట్టుకుని action oriented గా మారడం కొంతైనా అవసరం. మేనేజ్మెంట్ గురు Peter Drucker కూడా ఈ విషయమే చెప్తారు –

After gaining new knowledge, ask 2 questions –
1. What will I do different with this knowledge?
2. What will I stop doing?

బతుకులో అడుగడుగూ ఒక భేతాళ ప్రశ్ననీ, సమాధానం చెప్తే కానీ ముందుకు సాగలేమంటారు సిరివెన్నెల –

జీవితం అంటే సాఫీగా సాగిపోయే ప్రయాణం కాదు. ఒడిదుడుకులుంటాయ్. solve చేసుకుంటూ ముందుకి సాగడమే. మనకి అల్లాదీన్ అద్భుత దీపం ఏమీ అవసరం లేదు. మీరు అల్లాదీన్ కథ విని ఉంటే ఆ కథలో అల్లాదీన్ రెండు సార్లే జీనీని పిలిచాడు. అదీ సహాయం అవసరమై. అంతే కానీ నా బదులు నువ్వు నిద్రపో, నాకు ఆకలి వేస్తే నువ్వు భోంచెయ్ అనలేదు

ఆయన ఈ మాటల నుంచి 2 inferences చెయ్యొచ్చు –

 1. జీవితంలో problems ఉండకపోవడం default condition అనుకుంటాం మనం. ఇలా అనుకోవడం వల్లే సమస్యలని కష్టాలు గానో, unfortunate things గానో చూస్తాం. అదే problems ని జీవితంలో భాగంగా, default condition గా భావించి చూడండి. అప్పుడు సమస్యలు ఏవో పెద్ద అడ్డంకులుగా అనిపించవ్. చాలా positive attitude వస్తుంది.
 2. సమాధానం చాలా సార్లు మనకి తెలుసు. కాని ఆ సమాధానం అంటే మనకి భయమో, నిర్లక్ష్యమో, బద్ధకమో ఇలా ఏదో feeling/resistance ఉంటుంది. ఆ feeling ని దాటుకుని మనం వెళ్ళలేకపోతాం. కనీసం ఆ feeling ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా ఎటో పరుగులు తీస్తూ ఉంటాం. కొత్త సమాధానల కోసం వెదుకులాటలో మనకి తెలిసిన సమాధానంతో జరగాల్సిన కార్యసాధన మరుగునపడిపోతుంది. అంటే మన mind execution కంటే collection of information మాత్రమే చెయ్యడానికే ఇష్టపడుతుంది . దీనిని “information trap” అనవచ్చు. దీనిని దాటుకుని వెళ్ళడం చాలా ముఖ్యమని సిరివెన్నెల సందేశం.

ఈ information trap కి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పి ఈ part-2 ముగిస్తాను. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన joke ఇది:

A devil and a friend of his were walking down the street, when they saw ahead of them a man stoop down and pick up something from the ground, look at it, and put it away in his pocket.
The friend said to the devil, “What did that man pick up?”
“He picked up a piece of Truth,” said the devil.
“That is a very bad business for you, then,” said his friend.
“Oh, not at all,” the devil replied, “I am going to let him organize it.

ఇలా కథలో వ్యక్తిలా truth కనుగొన్నప్పటికీ, దానిని execute చెయ్యకుండా organization అనే information trap లో పడిపోవడం మీ స్వానుభవం లో కనీసం ఒకసారైనా చూసుంటారు. కాదంటారా?

(To be continued in part 3)

సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 2

సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 1

అసలు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎవరు? గొప్ప కవి అనో గొప్ప తత్త్వవేత్త అనో అంటాం మనం. కాదంటారు ఆయన!

“నాలోని కవిని ఫిలాసఫర్, ఫిలాసఫర్ని మనిషి డామినేట్ చేస్తాడు”

అనే ఈ మహా మనిషిని Orkut Sirivennela Community సభ్యులతో రెండు సార్లు కలిసిన అనుభూతిని మీతో పంచుకోవాలని ఈ వ్యాసం రాస్తున్నాను. రాయాల్సింది చాలా ఎక్కువ ఉండడంతో 2-3 భాగాలుగా పోస్ట్ చేస్తాను. ఈ రాయడంలో నా స్పందన తెలపాలన్న తాపత్రయం ఉన్నా, ఆయన చెప్పిన గొప్ప మాటల్ని అందరికీ తెలియజెప్పాలన్న తపనే ఎక్కువ ఉంది. ఈ వ్యాసంలో ఆయన అన్నట్టుగా రాసిన మాటలు, ఆయన అన్నవి నాకు గుర్తున్నంతలో/అర్థమైనంతలో రాసినవని గ్రహించాలి.

అయిన వాడే అందరికీ!
సిరివెన్నెల గారిని మొదటిసారి కలిసిన ఐదు నిమిషాలలోనే – “ఈయన the great writer సిరివెన్నెల” అన్న consciousness పోయి, నా బాబయ్యతోనో మావయ్యతోనో మాట్లాడుతున్న feeling కలిగింది. సామాన్యుడిలా మనకు అందుతున్నట్టు అనిపిస్తూనే తన అసాధారణమైన మేధస్సుతో అందనట్టూ అనిపించడం – ఆయన పాట ద్వారా చెప్పాలంటే, “అయిన వాడే అందరికీ, అయినా అందడు ఎవ్వరికీ!” – సిరివెన్నెలలో చూస్తాం. మనని స్పందింపజేసే రెండో విషయం – ఆయన passion. ఆయనలోని నిజాయితీ, భావప్రకటనలో ఆవేశం,  వాగ్ధాటి, హాస్యచతురత మనని సమ్మోహితుల్ని చేస్తూనే ఉత్తేజితుల్ని కూడా చేస్తాయి. ఆయనతో మాట్లాడితే చాలు ఎవరికైనా కొత్త energy రావడం ఖాయం! మనలోని నైరాశ్యం, సందేహం మటు మాయం! ఆయన మాట కన్నా ఆయన మాట వెనుక ఉన్న ఈ శక్తి ఏదో మనని ఎక్కువ స్పందింపజేస్తుంది. ఆలోచనా పరిధి దాటి అనుభూతిలోకి మనం జారుతున్న వేళ,

“అర్థం చేసుకోవడం వేరు. అనుభూతి చెందడం వేరు”

అన్న ఆయన మాటల వెనుక అర్థం కొంత మనకి అనుభవమవుతుంది.

Echo of silence
చెప్పాల్సిన విషయం ఎంత క్లిష్టమైనదైనా చాలా తేలికగా అనిపించేటట్టు నాటకీయతా, హాస్యచతురతా, స్పష్టతా జోడించి చెప్పి, మన మనసులని సూటిగా తాకెట్టు చెయ్యగలగడం, సిరివెన్నెల ప్రత్యేకత. కొరుకుడు పడని కొబ్బరికాయని పీచు తీసి, కాయ కొట్టి, నీళ్ళు తీసి, గ్లాసులో పోసి, మనకి తాగించడం తద్వారా “తలస్నానం” చేయించడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. మూడు గంటలు నేల మీద కూర్చుని వింటున్న నాకు కాళ్ళు నొప్పెట్టడం తెలియలేదంటే అది ఆయన ప్రేమగా పూసిన పలుకుల వెన్న పూతల చలువే! philosophy ఏ కాదు, philosophy చెప్పేవాడు కూడా చాలా boring గా ఉంటాడు అన్న అభిప్రాయం తప్పని ఈ తత్త్వుని చూస్తే తెలుస్తుంది. philosophy అంటే అదేదో కొరుకుడు పడని, పనికి రాని పైత్యం కాదని వివరిస్తారాయన –

“philosophy అంటే అదేదో పెద్ద విషయం కాదు. తత్త్వం అంటే nature. ప్రతి వస్తువుకీ తనదైన సహజ ప్రవృత్తి ఉంటుంది. ఈ white paper తీసుకోండి, దీనికి కొన్ని physical and chemical properties ఉన్నాయ్. అవి అర్థం చేసుకోడం తత్త్వం. అలాగే మన జీవితంలోని నవ్వునీ, బాధని, ఆశనీ, కోరికనీ అర్థం చేసుకోవడం philosophy”.

ఓహో! అనుకుని, ఆయన చెప్తున్న philosophy ని తెలుసుకోడానికి మనం సిద్ధపడేలోపే,

“మీకు తెలియంది అంటూ ఏమైనా ఉంటే అది నేను మీకు చెప్పినా తెలియదు!”

అంటూ మనకి ఒక ముడి వేస్తారు. ఆ ముడి విప్పుకునేలోపే,

“నేను చెప్పేవి అన్నీ మీకు తెలిసినవే. మీకు తట్టనివి చెప్తానేమో గాని తెలియనివి చెప్పలేను”

అని ఇంకో ముడి వేస్తారు. ఈ గజిబిజిలో మనముండగా ఒక చిరునవ్వు నవ్వి ఆయనే ఆ ముడులు విప్పుతారు –

“ఆకాశం నీలంగా ఉందనే మనకి తెలుసు. ఎందుకంటే అదే చూశాం కనుక. ఎవడో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చి, అక్కణ్ణుంచి ఆకాశాన్ని చూసి, కిందకి దిగాక ఆకాశం నల్లగా ఉంది జనులారా అన్నాడనుకోంది. అప్పటికీ మనం అతనిని నమ్మగలం గాని నిజం తెలుసుకోలేం. ఎందుకంటే మనకి తెలియంది ఎవరూ తెలపలేరు కనుక”.

హమ్మయ్యా! కొంత అర్థమవుతున్నట్టు ఉంది అని మనం అనుకుంటూ ఉంటే ఆయన ఇందాక చెప్పినదే మళ్ళీ చెప్తారు –

“కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది మీకు తెల్సినట్టు అనిపిస్తోంది అంటే మీకది already తెలుసు కనుకే కదా”.

అంతే! ఏదో సాక్షాత్కారం కలిగినట్టు మనకో కొత్త సత్యం బోధపడుతుంది. లెర్నింగ్ అంటే ఇదేనేమో. సిరివెన్నెల తన భావధారని కొనసాగిస్తూ –

“I am just the echo of your silence. నేనొక post master ని మాత్రమే. సందేశాన్ని చేరవేస్తున్నాను. చదువుకోగలిగేది, చదువుకోవలసింది మీరే”

అంటారు. నాకు స్వామీ వివేకానందుని మాటలు గుర్తొచ్చాయి –

“You can only water the plant. You can’t make it grow. The plant grows by itself. It is foolishness to think that you are growing the plant. Be glad that you had the opportunity to serve the plant in its growth”.

ఈ మాటల అక్షర రూపం సిరివెన్నెలలో దర్శించుకోవడం నేను పొందిన గొప్ప అనుభూతులలో ఒకటి.

అలతి అలతి పదాలతో, సరళ వివరణలతో ఆయన చెబుతున్న వాటి వెనుక ఎంతో ఆనల్పమైన, నిగూఢమైన భావాలూ, గొప్ప విషయాలూ ఉన్నాయని గ్రహించడం కష్టం కాదు. ఈ మాట ఆయనే చెబుతూ –

“సెలయేరు గల గల మంటూ రొద చేస్తూ, కొండకోనల నుంచీ దూకుతూ కవ్విస్తూ ఉంటుంది. తీరా దిగితే కాలి మడమ కూడా తడవదు. సముద్రం గంభీరంగా ఏమీ తెలియనట్టు ఉంటుంది. మరి దిగిచూస్తే?”.

అంతటి సముద్రాన్ని మథించి, సెలయేరుగా చేసి, అందులో పాటల పడవలేసి మనకోసం పంపుతున్న మహానుభావుడా సిరివెన్నెల?

(To be continued in Part 2)

సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 1