ఎన్నో త్యాగాల దాస్యమా

చిత్రం: శివ 2006
రచన: సిరివెన్నెల
సంగీతం: ఇళయరాజా
గానం: ఇళయరాజా, బృందం

ఇటీవల వచ్చిన “శివ 2006” (Hindi) సినిమాలో పోలిసు శిక్షణ తర్వాత చేసే శపథం నేపథ్యంగా, వాళ్ళ వృత్తి లోని సవాళ్ళనూ, పరిస్థితులనూ ప్రస్తావిస్తూ ఒక పాట వినిపిస్తుంది. ఈ పాటకి సిరివెన్నెల తెలుగు వెర్షన్ రాశారు.

చాల మంది గీతరచయితల్లాగ, సిరివెన్నెల పాటలని తెలుగులోకి అనువదించరు. lip-sync మొదలైన విషయాలు పట్టించుకోకుండా తనదైన స్వతంత్ర భావాన్ని పలికిస్తారు. ఈ పాటలో కూడా అది కనిపిస్తుంది. అసలు పోలిసుల సమస్యల గురించి కాకుండా, పోలిసులంటే దేశ శాంతిభద్రతల పరిరక్షకులు కాబట్టి, వాళ్ళు దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నట్టుగా సిరివెన్నెల పాటని రాశారు. కాబట్టి ఈ పాటలో వినిపించేది ఆయన సొంత గొంతు.

గాయం సినిమాలో రాసిన “సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని” లాంటి పాటే ఇది కూడా. ఆ పాట లాగే ఈ పాటకీ వివరణలూ ఏమీ అక్కరలేదు. పాట తనకు తానే అర్థాన్ని పలికించుకుని, స్పందనని కలిగించడం సిరివెన్నెల పాటల లక్షణం!

ఎన్నో త్యాగాల దాస్యమా
ఏం సాధించింది నీ శ్రమ?
ఈ నిజం కోసమా, కలగన్నావు నా దేశమా?
రాలిన పూవుల సాక్షిగా, పాపమే పాలించె స్వేచ్చగా

1. ఎన్నాళ్ళైనా చలనం లేని రాతి రథం పై ప్రయాణమా?
కావాలన్నా కాంతే రాని కారడవే నీకు గమ్యమా?
అర్థరాత్రి వేళలో అలికిడే స్వతంత్రమా?
నిద్రచెడిన కళ్ళలో ఎర్రదనమే ఉదయమా?

2. కాసే కంచే మేస్తూ ఉంటే చేనుకు ఏదింక రక్షణ?
వేకువతోనే చీకటి పడితే పయనం అడుగైన సాగునా?
బానిసత్వ భావన మనసులోనె మిగిలిన
శాంతి జాడ దొరుకునా ఎంత సేపు వెతికినా

మొదటి చరణంలో మన దేశ ప్రగతి ఇంకా జరగాల్సినంతగా, జరగాల్సిన విషయాల్లో, జరగలేదని కవి సూచన. ముఖ్యంగా 3,4 lines అద్భుతం అని నా భావన.

రెండో చరణంలో ప్రగతికి అవరోధాలు కొన్ని ప్రస్తావించడం జరిగింది.

పాట ఆసాంతం పరికిస్తే మన దేశం కనిపిస్తుంది. దానితో పాటూ సిరివెన్నెలా కనిపిస్తారు! అప్రయత్నంగా నా మనసు ఈ మహాకవికీ, దార్శనికుడికీ, తాత్త్వికుడికీ  సాష్టాంగ ప్రణామం చేస్తుంది.

ఎన్నో త్యాగాల దాస్యమా