“బంగారు” సిరివెన్నెల!

కొన్ని పాటలు ఒకసారి విని, పెద్ద విషయం లేదని వదిలేశాక, ఎవరో ఒకరు మాటల్లో “అబ్బా! ఆ పాట ఎంత బావుంటుందో కదా!” అంటే “అవునా, మళ్ళీ ఒకసారి విని చూద్దాం” అని తిరిగి వినడం జరిగింది. అలా తిరిగి విన్న పాటలు కొన్ని ఎంతో బావున్నాయనిపించాయి కూడా – సంగీతమో, సాహిత్యమో, గానమో దేనివల్లైనా కానీ. అలా ఈ మధ్య మంచి కవయిత్రి, మధుమనస్వి అయిన ఒక స్నేహితురాలు “మహాత్మ” చిత్రంలోని “ఏం జరుగుతోంది” అన్న పాటని ప్రస్తావిస్తూ “సిరివెన్నెల ఎంత బాగా రాశారో కదూ?” అంటూ పొంగిపోయింది. నేను, “అవును, చాలా మంచి పాట!” అని అన్నాను కానీ నాకు నిజానికి ఆ పాట సాహిత్యం గుర్తు లేదు అసలు. “మహాత్మ” చిత్రం అంటే సిరివెన్నెల రాసిన “ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ” పాటో, “తలయెత్తి జీవించి తమ్ముడా” అనే పాటో గుర్తొస్తాయి నాకు. ఇవి నిస్సందేహంగా గొప్ప పాటలే, సిరివెన్నెలకి వన్నె తెచ్చేవే. అయితే ఈ మధ్యే సిరివెన్నెల ఓ సభలో చెప్పినట్టు, కొన్ని సినిమాలకి ఆయన రాసిన చాలా అందమైన “మామూలు పాటలు”, ఆ సినిమాలోని గొప్ప పాటల వల్ల మరుగున పడిపోయాయి. ఈ పాట అలాంటిదే మరి!

మామూలు పాటలు అనడంలో నా ఉద్దేశ్యం గొప్ప సందేశమో, గొప్ప కథావస్తువో లేని పాటలు అని. ఇలాంటి మాములు పాటలకి కూడా అసాధారణమైన సాహిత్యం అందించడంలోనే సిరివెన్నెల గొప్పదనం దాగుంది. గొప్ప సన్నివేశాలకి గొప్పగా ఎవరైనా రాస్తారు, మామూలు సన్నివేశాలకి కూడా గొప్పగా రాయడంలోనే అసలైన గొప్పదనం దాగుంది. ఈ పాట అలాంటి గొప్ప “మాములు పాట”! ప్రేమలో పడ్డ ఇద్దరి మనస్థితిని ఎంతో అందంగా చెప్పిన పాట. సినిమా కథ ప్రకారంగా హీరో ఒక రౌడీ అన్న విషయాన్ని సిరివెన్నెల పట్టించుకోలేదు (పాట చివరలో వచ్చే “మొదటి స్నేహమా” అన్న ప్రయోగంలో ఓ చిన్న సూచన చేశారు, కానీ అది మొదటి సారి ప్రేమలో పడ్డ ఎవరికైనా వర్తిస్తుంది). అతనిలోని మగవాడినీ, ప్రేమికుడినీ, మనిషినీ బైటకి తీసి, ఒక అమ్మాయికీ అతనకీ మధ్య నడిచిన మనసు కథని అద్భుతంగా ఆవిష్కరించారు. సాధారణంగా ఇలాంటి పాటల్లో ప్రేమో, శృంగారమో, అనురాగమో, చిలిపిదనమో ఏదో ఒక అంశం ప్రముఖంగా ఉంటుంది. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ సమపాళ్ళలో రంగరించి గోముగా, మార్దవంగా, లాలనగా అందించారు సిరివెన్నెల. అదే ఈ పాటకి అందం, ప్రాణం!

పల్లవి:

ఆమె: ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ!
అతను: ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసీవేళ!

ఆమె: నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఏం పనట తమతో తనకు తెలుసా

అతను: నీ వెనక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేశావసలు సొగసా

||ఏం జరుగుతోంది ||

సంగీత పరంగా, సాహిత్య పరంగా కూడా ఈ పాటకి పల్లవి కొంత “వీక్” అనే చెప్పాలి చరణాలతో పోలిస్తే. ఆ మాటకొస్తే చాలా పాటల్లో సిరివెన్నెల పల్లవి కంటే చరణాల్లోనే విజృంభించి రాస్తారు. అలా అని ఈ పల్లవిని తీసి పారెయ్యలేం. ఇది అందమైన పల్లవే! మొదటి రెండు లైన్లని, తరువాత లైన్లతో లింక్ చెయ్యడం ఇక్కడ సిరివెన్నెల ప్రత్యేకత. వేరే రచయితలు ఎవరూ అలా రాయరు. అమ్మాయి, “నా మనసుకి ఏమౌతోంది?” అంది కాబట్టి తనతో “ఎందుకీ మనసు కుదురుగా నిలవకుండా నీ వెంటే పరుగులు పెడుతోంది?” అనిపిస్తారు తరువాతి లైనులో. అబ్బాయి, “నా వయసు ఏం వెతుకుతోంది?” అన్నాడు కనుక, “నీ వెంటే నా కలలన్నీ తిరుగుతున్నాయి, ఏం మాయ చేశావు సోయగమా?” అని వయసు పరంగా అంటాడు మళ్ళీ.

చరణం 1:

ఆమె: పరాకులో పడిపోతుంటే కన్నె వయసు కంగారు
అరె అరె అంటూ వచ్చి తోడు నిలబడు
అతను: పొత్తిళ్లల్లో పసి పాపల్లే పాతికేళ్ల మగ ఈడు
ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ

ఆమె: ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీ కోసమే దూకుతోంది చిలిపి లాహిరి
అతను: ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి
నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి
||ఏం జరుగుతోంది||

ఈ పాట చరణాలు ఎంత బావుంటాయో! ట్యూన్ కూడా చాలా లలితంగా “ఫీల్” పెంపొందించేలా ఉంటుంది చరణాల్లో. ఈ కన్నె పిల్ల వయసు పరాకులోనూ ఉంది, కంగారుగానూ ఉంది! తొలి ప్రేమలో ఉండే మైమరపునీ, అలజడిని ఎంత ముచ్చటగా చెప్పారు! “నేనిలా గుబులుగా ఉంటే అలా చూస్తావేం! వచ్చి సాయం చెయ్యొచ్చు కదా!” అని అంత మురిపెంగా ఓ అమ్మాయి అడిగితే పడిపోని అబ్బాయి లేడు లోకంలో! సిరివెన్నెల స్త్రీ అవతారం ఎత్తి రాసిన ఇలాటి పాటల్లో ఉండే అందమే ఇది! ఇక్కడ అబ్బాయి గడుసుతనం చూడండి, “సరే, అలాగే. వస్తాను సాయంగా. కానీ పాతికేళ్ళ ఈ మగవాడు పసివాడిగా మారి వెక్కివెక్కి ఏమి వెతుకుతున్నాడో కూడా కనుక్కో మరి” అంటున్నాడు. ఇందులో లలితమైన శృంగారం ఉంది, ఆమె చెంత పసివాడుగా మారే అమాయకత్వం ఉంది, ఆమెకి ప్రేమగా దాసోహం అవ్వడం ఉంది. ఇలాంటి మగవాడిని ఏ స్త్రీ గుండెలకి పొదువుకోకుండా ఉంటుంది?

ఆమె అనురాగమై అతనిపై చినుకులా వర్షిస్తే, చిలిపితనం చిగురు తొడగదూ? అతనిలోని వేడి ఊపిరి కూడా ఆమె సావాసాన్నే కోరుతోంది మరి! “ఆదుకో మరి” అన్న ఎక్స్ప్రెషన్‌తో ఆ లైనుకి ఎంతో అందాన్ని చేకూర్చారు సిరివెన్నెల.

చరణం 2:
ఆమె: ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు
అతను: మధురమైన కబురందిందే కలత పడకు బంగారు
పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు

ఆమె:గంగ లాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అతను: అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా

||ఏం జరుగుతోంది||

కన్నీరు కమ్మగా ఉంటుందా అంటే ఉంటుంది. అది తియ్యని ప్రేమ గుబులు వల్ల వచ్చినదైతే. మనసు ప్రేమధారల్లో తడిసినపుడు ఆ నీరు కొంత పైకి ఉబికి వచ్చి మనలోని మనిషితనాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మనసు కరిగే వాళ్ళు కదా ధన్యులు, కఠినహృదయ ఘనులెందుకు? ఆమె కంటి చెమ్మ చెప్పే మధురమైన ప్రేమ కబురు ఆ అబ్బాయికి అందింది. ఆ ప్రేమకి అతని మనసూ ఉప్పొంగింది. అలా ఉప్పొంగిన ప్రేమని వ్యక్తపరచడానికి చెక్కిళ్ళపై పెట్టే నునులేత ముద్దు కంటే గొప్ప సాధనం ఉందా! ఇంతటి ప్రేమ మూర్తులు ఒకరి కౌగిలిలో ఒకరు కరిగి ఉండడం ఎంత అందమైన దృశ్యం! మనసుని రంజింపజేశారు సిరివెన్నెల! సాహిత్యం అంటే అదే కదా!

పాట ముగింపును సముద్రం-నది మధ్య అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, పాట వినే శ్రోతల్లోని అనురాగాన్ని పెంపొందిస్తూ చేశారు సిరివెన్నెల. ఆమె ఉప్పొంగిన గంగైతే అతను ప్రేమ సంద్రం. ఆ కలయిక ప్రాణ బంధం కాక మరేమిటి? సముద్రంలో కలిసిన నదికి ఇక ఉనికి లేదు. అతని ప్రేమలో పడి మునకలేశాక ఇక ఆమెంటూ లేదు. ఈ ప్రియప్రవాహాన్ని కలుసుకుని అసంపూర్తిగా ఉన్న సముద్రం కూడా సంపూర్ణత్వాన్ని, సార్థకతనీ పొందింది. ఇక్కడ సిరివెన్నెల చమత్కారం గమనించండి – నది సముద్రంలో కలిసి అంతమైంది, సముద్రం నది కలవడం వల్ల పూర్తైంది. అర్థభాగం సంపూర్ణమవ్వడం, ఆ సంపూర్ణత్వంలో నువ్వూ-నేను అన్న భావం తొలగి ఏకత్వం సిద్ధించడం, ఇదే ప్రేమకి ఉన్న అసలైన లక్షణం.

ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది. వింటూ వింటూ నాకు నేనే అబ్బాయినై, అమ్మాయినై, ఇద్దరినీ నేనై ఆస్వాదించాను. ఆనందించాను. ఈ పాటని ప్రస్తావించి నాకీ మేలు చేసిన ఆ స్నేహితురాలికి నా కృతజ్ఞతలు. పాట రాసిన సిరివెన్నెలకి వేన వేల వందనాలు!

“బంగారు” సిరివెన్నెల!