ఎవ్వరినెప్పుడు తన వలలో (full version)

చిత్రం: మనసంతా నువ్వే
రచన: సిరివెన్నెల
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
గానం: కె.కె

“మనసంతా నువ్వే” సినిమాలోని ఈ సుప్రసిద్ధ రచన ఎన్ని యువ-హృదయాలని కదిపిందో లెక్కలేదు. ప్రేమ గురించి చాలా గొప్ప భాష్యం చెబుతూనే అది అందరికీ ఇట్టే అర్థమయ్యేటట్టు చెప్పడం సిరివెన్నెల మహత్యం.

సిరివెన్నెల సుదీర్ఘ రచనని, సినిమాలో కొంత వరకే వాడుకున్నారు.

సినిమాలో వినిపించే పాట ఇది:

ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే అయినా గానీ ఈ ప్రేమ
జీవిత పరమార్ధం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ

కోరస్:ప్రేమా ప్రేమా ఇంతేగా ప్రేమా

1. ఇంతక ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనిపిస్తుంది ఈ ప్రేమ
కలసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ

సిరివెన్నెల రాసిన మొత్తం పాట ఇది: (courtesy:manasirivennela.com)
ఎవ్వరినెప్పుడు తనవలలో బంధిస్తుందో ఈ ప్రేమ
ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే ఐనా గానీ ఈ ప్రేమ,
జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ

ఎన్నెన్నెన్నో రంగులతో కనిపిస్తుంది ఈ ప్రేమ
రంగుల కలలే కాంతి అని నమ్మిస్తుంది ఈ ప్రేమ
వర్ణాలన్నీ కలిసుండే రవికిరణం కాదీ ప్రేమ
తెల్లని సత్యం కల్ల అని ప్రకటిస్తుంది ఈ ప్రేమ

లైలా మజ్నూ గాధలనే చదివిస్తుంది ఈ ప్రేమ
తాజ్ మహల్ తన కోట అని అనిపిస్తుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో కనిపిస్తుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ

అమృత కలశం తానంటూ ఊరిస్తుంది ఈ ప్రేమ
జరిగే మథనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమ
ఔనంటూ కాదంటూనే మదిని మథించే ఈ ప్రేమ
హాలాహలమే గెలవండి చూద్దామంటుందీ ప్రేమ

ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఒక జంటతొ మీ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
సీతారాములనేమార్చే మాయలేడి కథ ఈ ప్రేమ
ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమ

ఈ full version చూస్తే ప్రేమ గురించి హెచ్చరికగా రాసిన వాక్యాలని సినిమాలో తీసుకోలేదని తెలుస్తుంది. అయినా మన దర్శకనిర్మాతలకి ప్రేమా, ప్రేమా అంటూ యువతని మత్తులోకి దించే వాక్యాలు కావాలి గానీ, జాగ్రత్తలూ అవీ చెప్పి మేల్కొల్పే పాటలు కావు కదా!

సీతారాములనేమార్చే మాయలేడి కథ ఈ ప్రేమ
ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమ

అంటూ రామాయణం, భారతాలని స్పర్శిస్తూ ప్రేమకి నవీన భాష్యం చెప్పడంలోనే సిరివెన్నెల ప్రతిభ తెలుస్తోంది.

ఈ పాటలో ప్రేమకి సంబంధించిన pit-falls గురించి శాస్త్రి గారు చేసిన హెచ్చరికలు ప్రేమలో పడుతున్నాం, పడ్డాం, పడదాం అనుకుంటున్న కుర్రకారు జాగ్రత్తగా గమనించి పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడు ప్రేమ కథా, ముగింపూ కూడా సినిమాల్లో చూపించినంత అందంగా ఉంటుంది!!
 

ఎవ్వరినెప్పుడు తన వలలో (full version)