నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే!

అది 2000వ సంవత్సరం అనుకుంటా. నేను విజయవాడలో engineering చదువుకునే రోజులు. ఆకాశవాణి వారు దీపావళి పండుగ సందర్భంగా, “వెండి వెలుగుల కవితావళి” అని ఒక కవితాగోష్టి పెట్టి ఎనిమిది మంది సినీ కవులను ఆహ్వానించారు. అంటే అష్ట కవులు అన్న మాట. వచ్చిన వారిలో వయసు పరంగా “జాలాది”, పేరు పరంగా “సిరివెన్నెల” పెద్దవారు. భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, జొన్నవిత్తుల, సుద్దాల మొదలైన వారు ఉన్నారు. సిరివెన్నెల గారిని ప్రత్యక్షంగా చూడ్డం అదే మొదటి సారి. ఆయనే మొదలుపెట్టారు – “ఏటికొక అమవాస దీపావళి, ఓటమెరుగని ఆశ దీపావళి” అంటూ. కవిత గొప్పగా ఉన్నా, కొంచెం “ఆలోచనామృతం” కావడం వల్ల, జనాలు “సామాన్యులు” కావడం వల్ల తప్పదన్నట్ట్లు చప్పట్లు తప్ప అంత స్పందన లేదు. తర్వాత మిగతా కవులు తమ కవితలు వినిపించారు. అందరిలో ఎక్కువగా జనాలని ఆకట్టుకున్నది “సుద్దాల అశోక్ తేజ” అని చెప్పొచ్చు. అందుకు “నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేనవేల దండనాలమ్మా” అని సులువుగా అర్థమయ్యే జానపదాలు పాడడం ఒక కారణం అయితే, మధురమైన కంఠంతో పాడగలగడం మరో కారణం.

ఇదేమిటి “సిరివెన్నెల” మసకబారుతోందా అని నా లాంటి వాళ్ళు అనుకుంటూ ఉండగా, సిరివెన్నెల మళ్ళీ వచ్చి ఒక పాట వినిపించారు. “అటు అమెరికా – ఇటు ఇండియా” అనే సినిమాకి ఈ పాట రాశానని చెప్తూ ఆయన ఆ పాట వినిపించారు. తేలికగా అందరికీ అర్థమయ్యి, గుండెల్ని సూటిగా తాకేలా ఉన్న ఆ పాట ఆయన పాడడం పూర్తవ్వగానే సభంతా కరతాళధ్వనులు. వేదికపై ఆసీనులైన మిగతా కవులు కూడా ఎంత కదిలిపోయారో! ఇలా సిరివెన్నెల తన స్థాయిని, ఆధిపత్యాన్ని చాటుకోవడం నాలాటి అభిమానులకి ఆనందం కలిగించింది!

అప్పుడు ఆయన పాడిన పాటే – “నువ్వెవరైనా నేనెవరైనా” అన్నది. ఆయన పాడినప్పుడే నేను పాటని రాసుకుని ఉండాల్సిందేమో అన్ని ఎన్ని సార్లు అనుకున్నానో. తర్వాత ఆ పాట కోసం ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను. ఆ సినిమా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడమూ జరిగిపోయింది. కానీ ఈ పాట నాకు వినబడలేదు. తర్వాత ఈ పాట కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. manasirivennela.com site లో ఒక video లో ఈ పాట కొంత సిరివెన్నెల పాడతారు గానీ, ఆ site లో ఈ పాట పూర్తిగా ఉన్నట్టు లేదు.

ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఈ పాటని కొన్నాళ్ళ క్రితం Orkut మిత్రుడు “చైతన్య” నా కోసం వెతికి మరీ సాహిత్యం అందించాడు. అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ పాటని ఇక్కడ అందిస్తున్నాను. ఈ పాట Youtube లో లభ్యం అవుతోంది.

 

Pallavi:

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే

అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే
మనసు తడిస్తే నీ నా చెంపలు
నిమిరే వెచ్చని కన్నీరొకటే

Charanam 1:

ఏ దేశం వారికి ఐనా ఇల ఒకటే గగనం ఒకటే
ఏ భాషను పలికిస్తున్నా గొంతులు స్వరతంత్రులు ఒకటే

ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే
ఆకారం వేరే అయినా
ఆధారం బ్రతుకొకటే

నిన్నూ నన్నూ కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే
ఎన్నో రంగుల తెల్లకిరణమై వెలుగుతున్న జీవితమొకటే

Charanam 2:

ఏ రూపం చూపెడుతున్నా ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా పిల్లనగ్రోవికి గాలొకటే

నీ నాట్యం పేరేదైనా పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువ్వున్నా ప్రాణాలకి విలువొకటే

నీకూ నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే
నువ్వూ నేనూ  వారూ
వీరూ అంతా కలిసి మనమొకటే

పాటలో అంశం ఏకత్వం. మన చుట్టూ జనజీవితంలో మనమూ ఒక భాగమే అనీ, అందరి నవ్వులూ, నొప్పులూ ఒకటే అనీ చెప్పడం. తద్వారా “నిన్ను నన్నూ కలిపి మనము” అనే భావం పెంపొందించడం ఈ పాట లక్ష్యం. అందుకు సిరివెన్నెల ఎన్నుకున్న సరళమైన ఉపమానాలు అందరికీ అందేలా ఉండి, ఈ పాట అర్థమయ్యేలా చేసి, పాట లక్ష్యాన్ని నెరవేర్చేందుకు దోహదపడ్డాయి.

“ఏ దేశం వారికి ఐనా ఇల ఒకటే గగనం ఒకటే” అన్న వాక్యం చూస్తే “పడమటి సంధ్యారాగం” సినిమాలోని “ఈ తూరుపు ఆ పశ్చిమం” అన్న వేటూరి గీతంలోని ” ఏ దేశమైనా ఆకాశమొకటే, ఏ జంటకైనా అనురాగమొకటే” అన్న lines గుర్తొస్తాయ్. మహా కవులు ఒకేలా ఆలోచించడం ఆశ్చర్యం ఏమీ కాదు కదా!

ఎన్నో రంగుల తెల్ల కిరణం పేరుతో సిరివెన్నెల ఒక కథ రాశారు 1980 లో. ఆ కథ – ఇక్కడ. ఈ కథ చదివితే “ఎన్నో రంగుల తెల్ల కిరణం” అంటే ఏమిటో బాగా అర్థమౌతుంది. ఆనందం, ఆరాటం, కష్టం ఇలా ఎన్నో రంగుల్లో ఉన్న జీవితాన్ని ఆ రంగుల్లో కాకుండా, కొంచెం దూరంగా జరిగి అన్నీ కలిసిన తెల్ల రంగుని పరిపూర్ణంగా చూడగలిగితే అప్పుడు జీవితం ఎంత గొప్పదో తెలుస్తుంది. అప్పుడు బాధ కూడా గొప్ప experience లా అనిపిస్తుంది.

ఈ మధ్య వివేకానందుని Practical Vedanta చదివా. అందులో ఆయన అంటాడు –

“వేదాంతం అంతే ఏదో అర్థం కాని సిద్ధాంతమో, నైరాశ్యం నిండిన భావనో కాదు. వేదాంతం అంటే నువ్వే భగవంతుడివని గుర్తించడం (అద్వైత వేదాంతం). నువ్వు భగవంతుడిని చేరుకోడానికో, సాక్షత్కరించుకోడానికో ఎక్కడో వెతకనక్కర లేదు. నీలోనే ఉన్నాడు పరమాత్మ. నువ్వు కప్పుకున్న తెరలు తొలగిస్తే కనబడతాడు. అప్పుడు నువ్వు నీలో, అందరిలో, చుట్టుపక్కల అణువణువులో దైవాన్ని చూడగలుగుతావు. చుట్టూ ప్రకృతితో ఏకత్వాన్ని పొందగలుగుతావ్. వేదాంతమంటే ఈ ఏకత్వాన్ని తెలుసుకోవడమే”

నాకు చప్పున సిరివెన్నెల రాసిన పై పాట గుర్తొచ్చింది. ఎంతో క్లిష్టమైన తాత్త్వికతని, ఇట్టే అర్థమయ్యేటట్టు చెప్పిన సిరివెన్నెల ప్రతిభ ఎంత గొప్పది! వివేకానందుడు ఈ పాట వింటే ఎంత ఆనందించేవాడో! భారతీయ తాత్త్వికతని గడప గడపకీ చేర్చే ప్రయత్నం చెయ్యాలన్న ఆయన కలని నెరవేర్చే ఓ ముద్దు బిడ్డ ఆయనకి సిరివెన్నెలలో కనిపించి మురిపిస్తాడు….

అవును…సిరివెన్నెల కవి మాత్రమే కాదు, తాత్త్వికుడూ, దార్శనికుడూ, అంతకు మించి మానవతావాది!

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే!