సిరివెన్నెల రాసిన అఘమర్షణమైన శివదర్పణ గీతం!

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు గొప్ప గీతరచయితలే కాక గొప్ప శివభక్తులు కూడా. తమ గురువు గారైన సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతో శివునిపై వేయి గీతాలు రాయాలని సంకల్పించారు. ఈ గీతాలలో కొన్ని “శివదర్పణం” అనే పుస్తకంగా వచ్చాయి. ఈ పుస్తకంలోని పాటలు కొన్ని  రెండు ఆడియో క్యాసెట్లుగానూ వచ్చాయి. ఈ గీతరచనా సంకల్పం గురించి “శివదర్పణం”లో సిరివెన్నెల ఇలా చెప్పారు –

“అడగకుండానే, శ్రమించి సాధించకుండానే, మాటల్ని పాటల పేటలుగా కూర్చే చిన్ని విద్దెను పుట్టుకతోనే ఇచ్చిన పరాత్పరుడి కరుణాకటాక్ష వరానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బతుకుని అర్థవంతం చేసుకుని తరించే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అనిపించడమే శ్రీకారంగా, ఈ గీతాయజ్ఞం 1990లో ప్రారంభించాను. వెయ్యి పాటల్నీ వెయ్యి యజ్ఞాలుగా చేసి, సహస్రమఖ పూర్తి సిద్ధి పొంది, తద్వారా లభించే దేవేంద్రత్వాన్ని, దేవదేవుని సేవేంద్రత్వంగా మలచుకోవచ్చని అత్యాశ కలిగింది!”

ఆయన అత్యాశ మన పాలిటి వరమై, అద్భుత సాహితీ యజ్ఞమై నిలిచింది! ఈ పుస్తకంలో ఉన్న ప్రతిపాటా ఆణిముత్యం. భక్తిగా సిరివెన్నెల తనని తాను శివునికి అర్పించుకున్న విధానం మనసుని స్పందింపజేస్తుంది. ఈ పాటల్లో ఆయన వాడిన భాషని చూస్తే సిరివెన్నెల ఎంత పదసంపద కలవారో తెలుస్తుంది. సినిమా పాటల కోసం తనని తాను భోళాశంకరునిగా మలచుకున్నారే తప్ప ఆయనో మహోన్నత కైలాస శిఖరమని అర్థమవుతుంది!

“శివదర్పణం” అంటే శివుణ్ణి చూపించే అద్దం. అయితే సిరివెన్నెలకి శివుడంటే క్యాలెండర్ లో కనిపించే దేవుడు కాదు. శివుడంటే మనం, శివుడంటే సమస్తం! ఆయన మాటల్లోనే చెప్పాలంటే –

“జగత్తు మొత్తాన్నీ త్రికాలసమేతంగా సాకల్యంగా సజీవంగా సంక్షిప్తంగా ప్రతిబింబించే అద్దం మనం! అలాగే మనకీ ప్రపంచం అద్దమవుతుంది. అయితే మనలా సూక్షంగా లేదే? మన భౌతిక తత్త్వాన్ని సరిగ్గా మన పరిమాణంలోనే ప్రతిబింబించేలా ప్రపంచాన్ని కుదించగలమా? అలా కుదిస్తే ఆ అద్దం శివుడు అవుతుంది. శివుడంటే ప్రపంచమే! శివుడంటే మనమే! శివుణ్ణి సరిగ్గా చూడగలిగితే మనని మనం సరిగ్గా, సజీవంగా, సంపూర్ణంగా, చూడగలం. అలాంటి శివదర్పణాన్ని చూపించడమే నా ఉద్దేశ్యం!”

ఆయనిలా చక్కగా చూపించినా, అర్థమయ్యేలా వివరించినా, శివతత్త్వాన్ని గ్రహించడానికి చాలా సంస్కారం, జ్ఞానం ఉండాలి అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సిరివెన్నెల గీతధారలో తడిసే ఆనందం దక్కాలంటే మాత్రం హృదయం ఉంటే చాలు. అందుకే ఈ పుస్తకంలోని ఒక పాటని పరికించి పులకిద్దాం!

“తొలిజోత” అనే పేరుతో రాసిన ఈ గీతం పుస్తకంలో మొదటిది. శివదర్పణ యజ్ఞాన్ని మొదలుపెడుతూ వినాయకునికి ప్రార్థనగా రాసిన గీతం.

పల్లవి:

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత
ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత
నా తలపోత! కైతల సేత!

చరణం 1:

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత
ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!
అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత
అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట
ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

చరణం 2:

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత
స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత
అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత
శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా
తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

చరణం 3:

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత
కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత
శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత
సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత
అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

అగజాసూనుడు అందునట అఖిలజగమ్ముల తొలిజోత
ఆ గజాననుని ఆదిపూజగొను అయ్యకు అంకిత మౌగాత
నా తలపోత! కైతల సేత!

విఘ్నేశ్వర స్తుతిలోనూ తెలివిగా శివుణ్ణి ప్రస్తుతించారిక్కడ సిరివెన్నెల! “అగజాసూనుడు” అంటే పార్వతీ (అగజా) తనయుడైన (సూనుడు) వినాయకుడు! అఖిల జగాలూ ఏ పని చేసినా ముందుగా దణ్ణం పెట్టుకునేది వినాయకునికి! మరి ఆ వినాయకుడు భక్తిగా తొలిపూజ చేసేది ఎవరికి అంటే శివుడికి! ఆ శివుడికి సిరివెన్నెల తన గీతాలను అంకితం ఇస్తున్నారు. ఈ శివదర్పణ కృతి సిరివెన్నెల మేధలోంచి జాలువారిన  కవితామృతధార! ఆ తలపోత, కైతలసేత పొందే ధన్యత మనది!

హేరంబుని కాద్యభివందనమిడి ఆరంభించుట చేత ప్రతిచేత
ఆ లంబోదరు ఆలంబనతో అవిలంబితమౌనంట!
అందుచేత నేనందజేతునా చంద్రజేత చేత శతవందనముల చేత
అవిఘ్నమ్ముగా చేర్చునంట గణపతి తన అంజలి వెంట
ఈ నా తరగని యద చింత, నా ఈశుని పదముల చెంత!

వినాయకుడికి (హేరంబుడు) తొలి వందనాలు చేసి మొదలుపెట్టిన ఏ పనైనా ఆయన ప్రాపు (ఆలంబన) వల్ల విఘ్నాలు లేకుండా వేగంగా (అవిలంబితము) సాగుతుంది. ఇక్కడ సిరివెన్నెలకి అవ్వాల్సిన పని వేయి గీతాలు పూర్తిచెయ్యడం కాదు. ఆ గీతాల ద్వారా తాను చేసిన శత వందనాల చేష్టని (శత వందనముల చేత) ఆ శివుని చెంతన చేర్చడం!  ఇది తన వల్ల అయ్యేది కాదు కనుక చంద్రజేత అయిన వినాయకుని శరణుకోరుతున్నాను అంటున్నారు! ఆ వినాయకుడు శివుడికి రోజూ అర్పించే వందనాల (అంజలి) వెంట సిరివెన్నెల యొక్క  హృదయభారాన్నీ తీసుకెళ్ళి ఆ పరమేశ్వరుని పాదాల చెంత అర్పించాలట! ఎంత చక్కని భావం!  చేత/జేత వంటి పదాలతో శబ్దాలంకారాలు చేస్తూనే గొప్ప అర్థాన్నీ సాధించారిక్కడ సిరివెన్నెల!

శంభుని సన్నుతి సంకల్పించితి గణుతించిక స్వీయార్హత ఒక రవ్వంత
స్కందపూర్వజుని శరణు వేడితిని అందించడ దయచేత చేయూత
అజాతుడు అచింత్యుడు అనంతుడు అమేయుడౌ పరమాత్ముని ప్రభుత ప్రకటించే నా అల్పజ్ఞత
శర్వసర్వమంగళాశంసనకు అర్హమయే ఆశంతా
తీర్చును ఆ గణనేత తన అపారమౌ కృపచేత

అల్పత్వ భావన లేనిదే భక్తి లేదు. ఆ భగవంతుని ముందు నేనెంత, ఆయన్ని స్తుతించడానికి నా అర్హతెంత అనుకున్నప్పుడే  ఆయన కటాక్షం వలన గొప్ప కృతులు పుడతాయి! ఇదే ఇక్కడ సిరివెన్నెలలో కనిపిస్తోంది.  “నా అర్హత ఏమిటో కొంచెం కూడా తెలుసుకోకుండానే (గణుతించక) ఆ శివుణ్ణి స్తుతించాలనుకున్నాను! అందుకే స్కందపూర్వజుడైన ఆ వినాయకుడిని శరణు వేడుకుంటున్నాను! ఆయనే దయతో నాకు చేయూత నివ్వాలి! పుట్టుకలేనివాడూ (అజాతుడు), ఆలోచనకి అందనివాడూ (అచింత్యుడు), అంతము లేనివాడూ (అనంతుడు), పరిమితులు లేనివాడూ (అమేయుడు) అయిన ఆ పరమేశ్వరుడి గొప్పతనాన్ని ఈ శివకీర్తనల ద్వారా ప్రకటించడానికి ప్రయత్నిస్తోంది నా అల్పత్వం. ఈ అల్పత్వం శర్వుడైన ఆ శివుణ్ణి సర్వమంగళంగా ప్రస్తుతించే అర్హతగా మారాలి అన్నది నా ఆశ.  ఈ నా ఆశని ఆ వినాయకుడే తన అపారమైన దయతో  తీర్చాలి!” అని వేడుకుంటున్నారు సిరివెన్నెల! ఇంత భక్తితో వేడుకుంటే వినాయకుడు తీర్చకుండా ఉంటాడా?

సంచిత సుకృత సంభూతమ్మౌ సుసంకల్ప సంకలిత శివకవిత
కవింకవీనామను గణననుగల సిద్ధి వినాయకు చేత పరిపూత
శివాజ్ఞ ఎరుగని నా అవజ్ఞ ఆ విద్యాదినాధునిచేత అవనతమొందును గాత
సింధురాస్యునికి స్వాధీనమ్మై సిద్ధి సాధకమ్మవుగాత
అఘమర్షణమై అలరారుత ఈ శివకీర్తనముల సంహిత!

శివకవిత రాయాలంటే భక్తీ ప్రతిభతో పాటూ సుకృతమూ ఉండాలి! పరమాత్ముని కీర్తనం పుణ్యులకే సాధ్యపడుతుంది. అందుకే సిరివెన్నెల – “మంచి సంకల్పాలతో కూర్చబడిన (సంకలిత) ఈ శివకవిత, కూడబెట్టబడిన (సంచిత) నా సుకృతాల వలనే పుట్టింది (సంభూతము)” అంటున్నారు. పుణ్యాత్ములకే గొప్ప సంకల్పాలు కలుగుతాయి మరి!

ఈ సంకలనం “కవులలో కవి” అని ప్రస్తుతించబడిన సిద్ధివినాయకుని స్తోత్రం (గణన) వలన పవిత్రతను పొందింది (పరిపూత). అంటే తన గీతాలలో గొప్పతనమేదైనా ఉంటే అది కేవలం తన సుకృతం వల్ల, వినాయకుని దయ వల్ల, శివుని విభూతి వల్ల సాధ్యపడిందే తప్ప నాదంటూ ఘనత ఏమీ లేదని వినమ్రంగా సిరివెన్నెల చెప్పుకుంటున్నారు! “కవిం కవీనాం” అన్న వినాయక స్తుతిలో కవి అంటే కవిత్వం రాసేవాడు అని కాక జ్ఞాని, మేధావి అన్న అర్థం చెప్తారు. గొప్ప కవిత్వాన్ని కలిగిన ఈ శివదర్పణ సంకలనపు తొలిగీతంలో  “కవులలో కవి” అంటూ వినాయకుణ్ణి స్తుతించడం ఎంతైనా సముచితం!

ఆ శివుని ఆజ్ఞని ఎరుగని తన తిరస్కార (అవజ్ఞ) ధోరణిని ఆ విద్యాదినాధుడైన వినాయకుడే వంచుతాడు అంటున్నారు!  అంత భక్తితో, వినమ్రతతో ఉన్న సిరివెన్నెలకి తిరస్కారం ఎక్కడ నుంచి వచ్చింది? శివుని గురించి ఏమీ తెలియని అజ్ఞానం నాదని ముందు చరణంలో చెప్పుకున్నారు కదా, అలాంటి అల్పత్వం ఉన్నా లెక్కపెట్టక శివుణ్ణి స్తుతించే సాహసం చెయ్యడమే ఈ తిరస్కార ధోరణి! ఇలాంటి తిరస్కారం చూస్తే శివుడు కోప్పడడు సరికదా, కరిగిపోతాడు!

ఇలా ఆ వినాయకుని అండ వలన సింధురాస్యుడైన ఆ శివునికి అర్పితమైన ఈ శివకీర్తనలు పావనమై సిద్ధిని సాధిస్తాయి! “సర్వపాపాలూ నశింపజేసే మంత్ర” (అఘమర్షణము) సంహితలై అలరారుతాయి!

భక్తితో సిరివెన్నెల అర్పించిన పుష్పాలీ గీతాలు. పూజ ఆయనది, పుణ్యం మనందరిదీ! భక్తి ఆయనది, ఆ భక్తికి పులకించే హృదయం మనది. ఇన్ని గొప్ప గీతాలు రాసిన సిరివెన్నెలా ధన్యులే, ఈ గీతాలను విని ఆనందించే భాగ్యం కలిగినందుకు మనమూ ధన్యులమే! సిరివెన్నెల గారికి సహస్ర వందనాలు.

శశిప్రీతం సంగీతంలో బాలు ఆర్తిగా ఆలపించిన ఈ గీతాన్ని ఇక్కడ వినొచ్చు! 

 

సిరివెన్నెల రాసిన అఘమర్షణమైన శివదర్పణ గీతం!

నేను రాసిన అతి క్లిష్టమైన పాట! (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

(“శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా” పాట రాయడంలో తాను పడ్డ కష్టం గురించి సిరివెన్నెల స్వయంగా రాసిన ఈ వ్యాసం ఆయన స్వదస్తూరిలో పాత manasirivennela.com వెబ్సైటులో ఉండేది. ఒక కళాకారుడికి కళపట్ల ఎంత నిబద్ధత ఉండాలి, గొప్ప కళాసృష్టికి ఎంత తాపత్రయ పడాలి అన్నది తెలియాలంటే ఈ వ్యాసం తప్పక చదవాలి. వ్యాసం చదివాక సిరివెన్నెలకి మనసులో ఓ నమస్కారం పెట్టకుండా ఉండలేం. ఈ అపురూపమైన వ్యాసాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో ఉడతాభక్తిగా టైపు చేసి అందిస్తున్నాను.)

కష్టమైన పాట – క్లిష్టమైన పాట

 

“మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది?” అని అడుగుతుంటారు చాలామంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేను నేను. రాసిన ప్రతి పాటా పదిమంది మెప్పు పొందాలని ఆశించడం తప్పుకాదు కానీ అలా జరగడం సాధ్యం కాదు. రాసేటప్పుడు, ఈ పాట తప్పకుండా హిట్ అవుతుంది కాబట్టి గొప్పగా రాయాలి, ఈ పాట పురిట్లోనే సంధికొట్టి చస్తుంది కనుక దీనికి పెద్దగా శ్రమపడక్కర లేకుండా ఏదో గీకి పారెయ్యాలి అని ఎవరూ అనుకోరు. ఆ  పాట వీధినపడ్డ తర్వాత తెలుస్తుంది దాని బతుకేవిటో! కవి రాతతో పాటూ పాటకి దాని సొంత తలరాత కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళింతర్వాత పాట “హిట్”, “ఫట్” అవడాన్ని బట్టి దాని మీద ఇష్టం ఏర్పరుచుకోవడం జరగదు. ఇష్టపడకుండా ఎలా రాయడం?

కానీ ఇప్పటికీ ఎక్కువమంది నన్ను “సిరివెన్నెల” పాటల్లోనే గుర్తించడానికి ఇష్టపడతారు. “అంత గొప్ప పాటలు మళ్ళీ మీరు రాయలేరు!” అని అన్నవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మాత్రం నేను “హర్ట్” అవుతాను. ఎందుకంటే సిరివెన్నెల పాటలంత ప్రజాదరణ మిగతా పాటలకి రాలేదేమో గానీ సిట్యుయేషన్ దృష్ట్యా, అంతకన్నా గొప్పపాటలు చాలానే రాశాను.

“మీరు రాసిన పాటల్లో మీకు ఎదురైన అత్యంత క్లిష్టమైన పాట ఒకటి చెప్పండి!” అని అడిగితే, అది కూడా నా పాలిటి చిక్కుప్రశ్న. ఎందుకంటే క్లిష్టమైన పాట వేరు, కష్టమైన పాట వేరు. తగినంత సమయం దొరక్క, అక్కడ ఆ పాట ఎందుకుండాలో, దాంట్లో చెప్పాల్సినంత గొప్ప సంగతేవిటో తెలీక, తేలక చాలా పాటలు చాలా కష్టపడి రాయాల్సి వచ్చింది. సాధారణంగా ఈ “డ్యూయెట్లు” అనబడే “గాలిపాటలు” రాసేటప్పుడు ఈ కష్టం వస్తుంది. నా దృష్టిలో ఈ పాటలు క్లిష్టమైనవి కావు. చెప్పాల్సిన విషయం చాలా గొప్పదీ, విస్తృతమైనదీ, లోతైనదీ అయినప్పుడు, దాన్ని ఒక పల్లవీ, రెండు చరణాల్లో ఇమిడ్చి, వీలయినంత సరళంగా చెప్పవలసి వచ్చినపుడు అదే నిజమైన క్లిష్టత. అయితే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురయితే ఏ కవీ కష్టంగా భావించడు, ఇష్టపడతాడు.

ఈ దృష్టితో చూస్తే మాత్రం, నాకు సంబంధించి నేను “స్వర్ణకమలం” సినిమాలో రాసిన పాటలు చాల క్లిష్టమైనవి. కనుక చాలా ఇష్టమైనవి. అందులో “శివపూజకు చివురించిన” పాట గురించి చెబుతాను. కవిగా తన సత్తా చూపించాలి అని అనుకునే ఎవరికైనా, సరైన ఛాలెంజ్ ఎదురైతే ఎంతో ఆనందం కలుగుతుంది. తన సర్వశక్తుల్నీ ధారపోసే అవకాశం దొరికిన సంతోషం అది. అసలు “స్వర్ణకమలం” సినిమా కథలోనే గొప్పతనం ఉంది. ఆ సినిమా కథకి పాటలు రాయడం అనేక విధాల కత్తిమీద సాములాంటిది.

మూడు ఛాలెంజ్‌లు!

 

మొట్టమొదటి ఛాలెంజ్ ఏవిటంటే

సినిమాపాట అనేది సినిమా చూసే ప్రేక్షకులకోసం అన్నది సినిమా కవి సర్వవేళ సర్వావస్థల్లోనూ గుర్తుపెట్టుకునే ఉండాలి. తన వ్యక్తిగతమైన ప్రతిభని చాటించుకోడానికీ, మహామహా విద్వాంసుల బుర్రలకు పనిపెట్టేందుకూ సినిమా పాట వాడరాదు. ఒక ఉదాహరణ చెబుతాను.

సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ పొందిన టి.ఎస్.ఇలియట్ రాసిన “వేస్ట్‌లాండ్” అన్న సుధీర్ఘమైన కవిత ఉంది. అది ఎంతటి పాషాణపాకంలో ఉంటుందంటే కొమ్ములు తిరిగిన ఉద్దండపిండాల్లాంటి పాండితీప్రకాండులెందరికో ఇప్పటికీ పూర్తిగా కొరుకుడుపడలేదు. ఇప్పుడు, ఎవరైనా టి.ఎస్.ఇలియట్ జీవిత కథని కమర్షియల్‌గా తీస్తున్నారనుకోండి! “వేస్ట్‌లాండ్” కావ్యం అంతా కూడా ఒక పాటలో చెప్పాలనుకోండి. చెప్పగలిగి తీరాలి చచ్చినట్టు. ఎందరెందరికో పూర్తిగా అర్థంకాని దాన్ని ముందు తను సంపూర్ణంగా అర్థం చేసుకోవలసి రావడం ఒక ఎత్తు. దాన్ని సినిమా పాటగా రాయవలసి రావడం ఒక ఎత్తు. ఎందుకంటే “వేస్ట్‌లాండ్” లో తన సొంత తెలివి చొప్పించకూడదు. అందులో ఉన్న ఏ అంశాన్ని తప్పించకూడదు. ప్లస్ అదంతా కూడా సినిమా ప్రేక్షకులకి అందుబాటులో ఉండేలా చెప్పాలి.

ఉదాహరణ కోసం పైసంగతి చెప్పాను కానీ, ఎక్కడో నూటికీ కోటికీ ఒక అరుదైన సందర్భంలో తప్ప, సినిమాకవికి అలాంటి, అంతటి ఘోరపరీక్ష ఎదురవదు. సాధారణంగా మనం నిత్యం తీసే సినిమాల్లోనూ చూసే సినిమాల్లోనూ ఉండే పాటలు, సంగీతబద్ధంగా ఉండే మామూలు మాటలే తప్ప, గొప్ప కవిత్వాలు కాదు. కానక్కర్లేదు కూడా. కాకూడదు కూడా. పార్కులో గెంతులేస్తూ, డ్యూయట్ పాడుకునే హీరో హీరోయిన్లు కవులు కాదు. కనుక వాళ్ళ నోటంట కవిత్వం రాకూడదు.

అయితే ఎప్పుడో అరుదుగా ఎదురయ్యే అసాధారణ స్థితి లాంటిది “స్వర్ణకమలం” కథ. అలాంటి అసాధారణమైన అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. విశ్వనాథ్‌గారికి నాపట్ల ఉన్న ఆదరణ.

జనబాహుళ్యానికి అందుబాటులో ఉండాలి అన్న మొట్టమొదటి నియమానికి “స్వర్ణకమలం” కథలోనే ఇబ్బంది ఉంది. ఆ కథే అసాధారణం. మామూలుగా సినిమా స్టొరీలు, మన జీవితంలోని మెటీరియస్టిక్ అంశాలకి సంబంధించినవే అయి ఉంటాయి తప్ప, తీవ్రమైన భావనా ప్రపంచానికి సంబంధించినవి అయి ఉండవు. కానీ “స్వర్ణకమలం” కథలో కేంద్రబిందువు ఏవిటి?

ప్రతి ఒక్కరూ ఏదో ఒక “పని” చేస్తుంటారు. ఏదో ఒక “పని” చెయ్యకుండా బ్రతుకు గడవదు గనక. అయితే, తాము చేసే పనిని మనసా వాచా కర్మణా ప్రేమించే వాళ్ళు ఎంతమంది? “బ్రతుకు గడవదు గనుక” అనే తప్పనిసరితనంతో కొందరు, ఆ పనివల్ల తన ఆదర్శం కోసం కొందరు, ఆ పనివల్ల తాను నలుగుర్లో చాలా గొప్పవాడనిపించుకోవాలనే పట్టుదలతో కొందరు. ఇలా అనేక రకాలుగా చేస్తారు. రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. కాకపోతే ఆ పని, దాని ఫలితమూ ఇతరులతో సంబంధించిందే తప్ప, తనకీ ఆ పనికీ ఉన్న ప్రత్యేక అనుబంధం కాదు.

ఇలాటి ఒక సూక్ష్మాతిసూక్ష్మమైన భావనా ప్రపంచానికి సంబంధించిన కథ అది. ఒక యోగసాధన, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం లాటి అంశాలు మన నిత్యజీవితంలో రొటీన్‌గా ఎదురయ్యే అంశాలు కాదు కదా? ప్రేమ, ఆకలి, ఆదర్శం, కులం, మతం, సెంటిమెంట్సు ఇత్యాది జనులందరికీ కామన్‌గా ఉండే విషయాలకన్నా వేరుగా ఉంటుంది. మరి అటువంటి కథకి పాటలు రాసేటప్పుడు మొదటి కండిషన్‌ని పూర్తిగా ఫాలో అవడం సాధ్యమా?

అయితే ఉపనిషత్తుల్లాగా, శాస్త్రచర్చలాగా చెప్పడం కుదరదు కదా? ఎంచుకునే భాషలో గానీ, భావంలో గానీ, మరీ నేలవిడిచి చుక్కల్లో తిరిగితే, ఆ పాట వినడానికి, చూడ్డానికి భూలోకవాసులు పరలోకాలకి పోలేరు కదా!

రెండో క్లిష్టత ఉంది.

స్వర్ణకమలంలో మూడు పాటలు ఒకే విషయం చెప్పాలి. “ఆకాశంలో ఆశల హరివిల్లు” అనే పాట, మీనాక్షి (భానుప్రియ) కారెక్టర్‌ని చెబుతోంది. జీవితం పట్ల తనకి ఉన్న ఆశలేవిటి, అవగాహనలేవిటి అన్నది. ఏదో పుట్టుకతో తనకి డాన్స్ చెయ్యడం అబ్బింది. కానీ డాన్స్ చెయ్యడం పట్ల ఆసక్తి గానీ, అభిమానం గానీ లేదు. ఓ పక్కనుంచి తండ్రి (పోరు). మరో పక్కనుంచి చంద్రం (వెంకటేష్) వేధించుకు తినేస్తుంటాడు. “నువ్వు మహా డాన్సర్‌వి సుమా! దీన్ని ప్రాణంగా భావించాలి” అంటూ. తనకు ఒద్దు మొర్రో అన్నా వినడు.

రెండో పాట “ఘల్లు ఘల్లు..”. ఈ పాటలో కూడా మళ్ళీ మీనాక్షి పాత్ర లక్షణం చెప్పాలి. మొదటి పాటకి, రెండో పాటకి ఆమె పాత్ర స్వభావం మారిపోదు కదా? అంటే, మొదటి పాటలో చెప్పిందే మళ్ళీ చెప్పాలి.

తర్వాత “శివపూజకి…”. ఇది మళ్ళీ చంద్రానికీ, మీనాక్షికీ మధ్య వాళ్ళవాళ్ళ జీవన దృక్పథాల్ని చెప్పుకుంటూ సంఘర్షించే పాట. రెండో డ్యూయెట్‌కీ దీనికీ మధ్య వీసవెత్తుకూడా భేదం లేదు. అంటే “ఘల్లు ఘల్లు..” లో వాళ్ళిద్దరి మధ్యా ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందో మళ్ళీ దానినే మూడో పాటగా చెప్పాలి.

మూడో క్లిష్టత…

నేను సినిమా కవిని. ఏ పాత్ర పాట పాడాలో ఆ పాత్ర సంస్కారాన్ని, భాషని పలికించాలి గాని నా వ్యక్తిగత భావనల్ని కాదు. అంటే మీనాక్షి పాత్రకి రాసేటప్పుడు నేను మీనాక్షినే అయిపోవాలి.

సీతారామశాస్త్రిగా, నాకు చంద్రం ఆలోచనే రైటు, మీనాక్షి ఒట్టి మూర్ఖురాలు అనిపించవచ్చు, అనిపించాలి! అదే కథ ఉద్దేశం. కనకే మీనాక్షి మారుతుంది. సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడూ చంద్రం పక్షం వహిస్తాడు.

కానీ మీనాక్షి తనలో మార్పు వచ్చేవరకూ తనూ తన పక్షమే వహిస్తుంది గాని చంద్రం పక్షం వహించదు కదా. “అమ్మాయ్, నీ ఆలోచన తప్పు సుమా” అని చంద్రం అంటే, “అవునండీ రైటే!” అని ఒప్పుకోదు గదా! అతను ఒకటంటే, తను పది అంటూ, తనే రైటని వాదిస్తుంది. ఆ వాదనలో లొసుగు ఉంటే తనకే తెలుస్తుంది కదా! అంటే ఆ అమ్మాయి తను తప్పుచేస్తున్నానని అనుకోవడం లేదు గనక, తనే ఒప్పు అనుకుంటుంది గనుక, చంద్రం ఏ “లా” పాయిట్ తీసినా, వాటికి ధీటుగా తనూ అంతకన్నా బలంగా సమాధానం చెపుతుంది. ఇదీ నిజమైన క్లిష్టత అంటే!

చంద్రం పల్లవి

 

శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా?
నటనాంజలితో బ్రతుకును తరించనీవా?

అని చంద్రం పాడాల్సిన పల్లవి రాసాను. రాయగానే నాకు అనిపించింది చాలా అద్భుతంగా వచ్చిందని, డైరెక్టరు గారు (శ్రీ కె.విశ్వనాథ్ గారు) మెచ్చుకుంటారని. అనుకున్నట్టే ఆయన చాలా సంతోషించారు. అసలు చిక్కు అంతా అప్పుడు ప్రారంభం అయింది. చంద్రం పల్లవికి దీటైన పల్లవి మీనాక్షి అనాలి. సహజంగానే నాకు (వ్యక్తిగతంగా) చంద్రం పాత్రపట్ల మొగ్గు ఉంటుంది కనక అతని ఆరోపణ చాలా పవర్ఫుల్‌గా చెప్పాను. పైగా ఒక కవితాపరమైన శిల్పవైచిత్రి చూపించాను.

“చివురించిన మువ్వ” అన్నాను. మువ్వ అంటే పువ్వు కాదు కదా! మరి మువ్వని పువ్వు అని సమర్థించడం ఎలా అంటే అడుగడుగునా మువ్వకి సర్వలక్షణాల్లోనూ పువ్వుతో సారూప్యం కనిపిస్తుంది. పువ్వు చిగురిస్తుంది – ఒక లతకి, ఒక కొమ్మకి. మరి మువ్వ మృదువైన, అందమైన (మంజుల) పాదాలు అనే లతకి (మంజరి) చిగురించిన పువ్వు. పువ్వుకి పరిమళం ఉంటుంది. మరి మువ్వకి జతిస్వరములు. అయితే ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని రెండు వస్తువుల్ని అంత బలవంతంగా, విచిత్రంగా ఎందుకు పోల్చాలి? ఎందుకూ అంటే నాదమూర్తి, నటరాజు అయిన పరమేశ్వరుడి పాదపూజకి మామూలు పూలు కాకుండా, నాట్యానికి సంబంధించిన పూలు అయితే ధర్మంగా ఉంటుంది. కనుక “శివపూజకి చివురించిన సిరిసిరి మువ్వా”. అదే విధంగా వాసన, జతిస్వరాలు ఒకటి కాదు. కనుకనే యతిరాజు అని వాడడం జరిగింది. యతిరాజు అంటే సన్యాసులకి రాజు అని. సర్వసంగ పరిత్యాగి అయిన యోగి, సుగంధ ద్రవ్యాల్ని, సువాసనల్ని స్వీకరిస్తాడా? కానీ శివుడే ఒక విచిత్రమైన యోగి. ఇద్దరు భార్యలున్న సన్యాసి. అర్ధనారీశ్వరుడైన విరాగి. అతడు సంసారి కనుక పరిమళాలు కావాలి. సన్యాసి కనుక పరిమళాలు కూడదు. ఈ రెండూ కలిసొచ్చి “యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా”!

మీనాక్షి పల్లవి

 

ఇక ఆ క్షణం నుంచీ పదిహేను రోజులపాటు నేను పొందిన అలజడీ, అశాంతీ అంతా ఇంతా కాదు. అయితే ఆ ఛాలెంజ్‌ని ఎదుర్కోవడంలో ఇష్టం ఉంది. ఒక పాట రాయడానికి పదిహేను రోజులు టైమిచ్చే విశ్వనాథ్‌గారి వంటి దర్శకులుండటం, అటువంటి వారి వద్ద పనిచేసే అదృష్టం పట్టడం ఎంత గొప్ప!

ఈ పదిహేను రోజులూ నేను మీనాక్షిని అయిపోయాను. చంద్రం ఆరోపణకి దీటైన సమాధానం ఇవ్వడం ఒక సమస్య. కానీ ఆ పల్లవిలో ఉన్న కవిత్వపు లోతుముందు ఈమె పల్లవి వెలవెలపోకూడదు. కానీ మీనాక్షి పాత్ర కవిత్వం పలకదు కదా. ఎలా? చంద్రం భావుకుడు, కళాకారుడు. కనుక అతడు శివుడు, మువ్వ, పువ్వు లాంటి కావ్య వస్తువుల్ని, అలంకారాల్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. నేను కవిని గనక సులువుగా రాసేసాను.

కళలూ, ఆత్మానందం, పరమార్థం లాంటి విచిత్రపదాలతో భావనాలోకంలో పరిగెత్తడం కన్నా, ఓ హోటల్లో వెయిట్రెస్‌గా నౌఖరీ చెయ్యడం చాలా ఘనమైన సంగతి అని భావించే మీనాక్షి కవిత్వం చెప్పొచ్చా? చెప్పకుండా పేలవంగా పొడిపొడి మాటలు చెబితే రెండు పల్లవులకీ “బ్యాలెన్స్” ఉంటుందా? అంటే నేను మీనాక్షి పల్లవి రాస్తూ నాతో నేనే యుద్ధం చేయాలి. నా సర్వశక్తుల్నీ, ఆలోచనా తీవ్రతని వినియోగించి తిరుగులేని విధంగా ఆరోపణ చేసి, దాంట్లో లోతైన కవిత్వాన్ని పొదిగిన నన్నే నేనోడించాలి. ప్రత్యారోపణని కూడా మళ్ళీ చంద్రం నోరెత్తకుండా చేసేలా చెయ్యాలి. పొరబాటున కూడా కవిత్వపరిభాషని వాడకూడదు!

రాత్రీ లేదు, పగలూ లేదు. తిండీ లేదు, నిద్రా లేదు. మొదటి పల్లవి రాయడం ఒక తప్పు, దాన్ని అత్యుత్సాహంగా డైరెక్టరుగారికి చూపించేసి “సెభాష్” అనిపించేసుకోవడం రెండో తప్పు. నా మెడకి నేనే ఉరి తగిలించుకున్నానే అని చింత మొదలైంది.

మొత్తానికి, సరస్వతీదేవి కరుణ, శివుడి చల్లని దీవెన, నేను నిత్యం ఆరాధించే శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహం వల్ల, దాదాపు పదిహేను రోజుల తర్వాత ఒక రాత్రి పన్నెండూ ఒంటిగంట మధ్య పిచ్చిపట్టినట్టు వడపళని రోడ్లంట తిరుగుతూ జుట్టు పీక్కుంటూంటే, నాకు కావాల్సిన అన్ని లక్షణాలూ ఉన్న పల్లవి దొరికింది –

పరుగాపక పయనించవె తలపుల నావా!
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
నడిసంద్రపు తాళానికి నర్తిస్తావా?
మదికోరిన మధుసీమలు జయించుకోవా?

ఈ పల్లవిలో మూడో లైను కవిత్వపు ఘాటు వేస్తోందని, ఫైనల్ వెర్షన్‌లో మార్చాను. చంద్రం మాటకి సరైన జవాబు ఎలా చెప్పిందో నేను వివరించక్కర్లేదు. మంజుల, మంజరి లాంటి కావ్యభాష లేదు గనక. అది మీనాక్షి మాటల్లోనే ఉంది గనుక.

అయితే, చంద్రం పల్లవిలో ఉన్న కవితాలక్షణాన్ని కూడా ఎదుర్కోడానికి ఇక్కడ చిన్న మేజిక్ చేసాను. అతనిలా, శివుడూ, పదమంజరి, జతిస్వరాల పరిమళాలు లాంటి అభౌతికమైన విషయాలు కాకుండా, సముద్రం మీద నడుస్తున్న ఒక నావలాంటి భౌతికమైన అంశాన్ని ఆమె వాదానికి ఆలంబనగా తీసుకున్నాను. నట్టనడి సముద్రం మధ్య, కెరటాలు తాళం కొడుతున్నాయి కదా అని, ఒయ్యారంగా ఊగుతూ అక్కడే నిలబడదు ఓడ. తెడ్లో, ఇంజనో ప్రయోగించి, ఆ అలల ఊపుకి ఎదురీదుతుంది.

చరణాల్లో కూడా ఇదే బ్యాలెన్స్ చూపించాను. అతను మొత్తం అంతా కావ్య పరిభాష వాడుతూ, ఆమెను ఉదయంలా ప్రకాశించమంటాడు. ఆమె తన నిత్యజీవితంలో చూసే ఒక భౌతికమైన విషయాన్ని ఆలంబనగా తీసుకుని అతని వాదాన్ని తిప్పికొట్టడమే గాక, ఉదయప్రకాశంలో మేలుకోవడం కన్నా, నడిరాత్రి వెన్నెల్లో సోలిపోవడం మేలని చెబుతుంది.

నేను కత్తిమీద సాముగా భావించింది ఎక్కడంటే ఆమె ఆర్గ్యుమెంట్ విన్నవాళ్ళెవ్వరైనా అందులో లొసుగుందని అనుకోకూడదు. ఆమె ఆర్గ్యుమెంట్‌కి వెంటనే కన్విన్స్ అయిపోవాలి. ఆమె దృష్టితో చూస్తూ అంగీకరించడం కాదు. మన దృష్టిలోంచి చూసినా కూడా “అవును కదా!” అనిపించాలి.

“ఘల్లు ఘల్లు” పాటలో కూడా ఇదే సర్కస్ ఫీట్ చేసాను, గమనించండి –

నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకు పడు సురగంగకు విలువేముంది?

అని అతను అన్నప్పుడు, “అవును కదా” అనుకుంటాం.

“అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది?”

అని ఆమె అంటే, “అవును కదా!” అనుకోమా?

– సిరివెన్నెల సీతారామశాస్త్రి

ఈ పాటను యూట్యూబులో ఇక్కడ వినొచ్చు –

 

నేను రాసిన అతి క్లిష్టమైన పాట! (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

కంచెలు తుంచే మనిషితనం!

సిరివెన్నెల “కంచె” చిత్రానికి రాసిన రెండు అద్భుతమైన పాటలు పైకి యుద్ధోన్మాదాన్ని ప్రశ్నిస్తున్నట్టు కనిపించినా నిజానికవి నానాటికీ మనందరిలో కనుమరుగౌతున్న మనిషితనాన్ని తట్టిలేపడానికి పూరించిన చైతన్యశంఖాలు. ఇక్కడ “మనిషితనం” అంటే ఏమిటి అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఓషో చెప్పిన ఓ కథ మనిషితనాన్ని చక్కగా విశదీకరిస్తుంది. ఓ ఇద్దరు వ్యక్తులు నది ఒడ్డున ఉన్నారు. ఇంతలో ఎవరో నదిలో మునిగిపోతూ – “రక్షించండి, రక్షించండి” అని అరిచారు. ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి తలెత్తి చూశాడు. అతని విశ్వాసం ప్రకారం ప్రతి మనిషీ తన కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. పక్కవాడి కర్మలో మనం తలదూర్చడం కన్నా అవివేకం మరోటి లేదు. అంతా భగవదేచ్చ!  కాబట్టి ఇక్కడో మనిషి మునిగిపోతున్నాడంటే అదతని కర్మఫలమే! ఇందులో చెయ్యగలిగినది ఏమీ లేదు. ఇలా ఆలోచించి అతను ఏమీ పట్టనట్టు ఉండిపోతాడు. రెండో మనిషీ ఈ అరుపులు వింటాడు. ఇతని నమ్మకం ప్రకారం మనిషి పోయాక స్వర్గ-నరకాలు అంటూ ఉంటాయి. పుణ్యకర్మలు చెయ్యడం వలన దేవుని కృపకి పాత్రులమవుతాం, స్వర్గం సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడీ మునిగిపోతున్న మనిషిని రక్షించడమంటే స్వర్గప్రవేశాన్ని ఖాయం చేసుకోవడమే! ఇలా ఆలోచించి అతను వెంటనే నదిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షిస్తాడు. కథలో నీతి ఏమిటంటే, మనం మనుషుల్లా స్పందించడం మరిచిపోయాం. ఏవో ఆలోచనలూ, సిద్ధాంతాలు, భావజాలాలూ తలలో నింపుకుని వాటి వలన మనుషులను రక్షించగలం, చంపగలం కూడా! ఇలా కాక మనిషిలా కరిగి, గుండెతో స్పందించే గుణం మనిషితనం అవుతుంది.

ఒక ఊరిలో రెండు వర్గాలు కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేక ఇంకేదో కారణం చేతనో విద్వేషంతో రగిలి తలలు తెగనరుక్కునే దాకా వస్తే, అది చూసిన మన స్పందన ఏమిటి?  ఇద్దరిలో ఎవరిది ఎక్కువ తప్పుందీ, గతంలో ఎవరు ఎక్కువ దారుణాలు చేశారు, ఏ శక్తులు ఎవరికి సహాయపడుతున్నాయి, అవి మంచివా చెడ్డవా – ఇవన్నీ బేరీజు వేసుకుని అప్పుడు గానీ స్పందించలేకపోతే మనలో మనిషితనం చచ్చిపోయినట్టే లెక్క! ఒక మనిషిలా కనుక స్పందిస్తే, మన గుండె ద్రవించాలి, మనసు తల్లడిల్లిపోవాలి.యుద్ధం పేరుతో ఓ మనిషి ఇంకో మనిషిని ఎందుకు చంపుకుంటున్నాడు? ఏమి సాధించడానికి? మృదువైన కోరికలూ, తీయని కలలలో తేలే మన హృదయ పావురాన్ని ఏ చీకటి బోయవాడు పాపపు బాణం వేసి నేలకూల్చాడు? హృదయాన్ని మరిచి, తెలివి మీరి, పగలతో సెగలతో రాక్షసులుగా మారిన మన మానవజాతిని చూసి పుడమి తల్లి గుండె తీవ్రమైన వేదనతో తల్లడిల్లిందే! ఆ తల్లి చేష్టలుడిగి నిస్సహయురాలై నిట్టూర్చిందే! ఆ తల్లి గుండెఘోషని చూస్తున్నామా, చూస్తే ఏమైనా చేస్తున్నామా? ఇంతటి మహా విషాద వృక్షాన్ని పెంచిన విషబీజాలేమిటి? పూలతోటల బదులు ముళ్ళచెట్లని పూయిస్తున్న ఆ ఆలోచనలేమిటి –

నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం

మృదు లాలస స్వప్నాలస హృత్ కపోత పాతం

పృథు వ్యథార్త పృథ్విమాత నిర్ఘోషిత చేతం

నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం

ఏ విష బీజోద్భూతం ఈ విషాద భూజం?

ఈ మనసూ, హృదయస్పందనా, మనిషితనం లాంటివి వినడానికి బానే ఉంటాయి కానీ ప్రాక్టికల్‌గా చూస్తే ఒక మంచిని సాధించడానికి కొన్నిసార్లు దారుణాలు జరగక తప్పవని కొందరి భావన. ఉదాత్తమైన గమ్యం కోసం వక్రమార్గం పట్టినా ఫర్వాలేదు (The end justifies the means) అనే ఈ ఆలోచన చేసిన వినాశనానికి చరిత్రే సాక్ష్యం. తాను దుర్మార్గుణ్ణని విర్రవీగి విధ్వంసం సృష్టించిన వాడి కంటే, తానెంతో మంచివాణ్ణనీ, మహోన్నత ఆశయసాధనకే ప్రయత్నిస్తున్నాననీ నమ్మినవాడి వలన జరిగిన మారణహోమాలే ఎక్కువ! మనని మనం తగలబెట్టుకుంటే ఏ వెలుగూ రాదనీ, కత్తుల రెక్కలతో శాంతికపోతం ఎగరదనీ, నెత్తుటిజల్లులు ఏ పచ్చని బ్రతుకులూ పెంచవనీ ఇప్పటికైనా మనం నేర్వకపోతే మన భవిత అంధకారమే –

భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో?

ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో?

ఏ పంటల రక్షణకీ కంచెల ముళ్ళు?

ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు?

ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు

ఏ దాహం తీర్చవు ఈ కార్చిచ్చులు

ప్రాణమే పణమై ఆడుతున్న జూదం

ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు

చావులో విజయం వెతుకు ఈ వినోదం

పొందదే ఎపుడూ మేలుకొలుపు మేలుకొలుపు!

ఒకప్పుడు ఎంత స్నేహం, సౌభ్రాతృత్వం వర్ధిల్లినా మనసులో మొలకెత్తే ఒక విషబీజం చాలు ఆ చెలిమిని అంతా మరిచిపోవడానికి. ప్రచండ సూర్యుణ్ణి సైతం మబ్బు కప్పేసినట్టు, ద్వేషం, పగా దట్టంగా అలముకున్నప్పుడు ఏ వెలుగురేఖలూ పొడచూపవు. అపార్థాల వలన చెదిరిన అనుబంధాలకీ, స్వార్థం వలన సమసిన స్నేహాలకీ, ద్వేషం వలన దగ్ధమైన పూదోటలకీ లెక్క లేదు. ఈ పగలసెగల వలన ఏర్పడిన ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలాల్సిందేనా –

అంతరాలు అంతమై అంతా ఆనందమై

కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా

చెలిమి చినుకు కరువై, పగల సెగలు నెలవై

ఎల్లలతో పుడమి ఒళ్ళు నిలువెల్లా చీలిందా!

ఇలా గుండె రగిలిన వేదనలోంచి ఓ వెలుగురేఖ ఉద్భవించి మనలోకి మనం తరచి చూడగలిగితే ఓ సత్యం బోధపడుతుంది. నేనూ, నా వాళ్ళు అని స్వార్థంతో గిరిగీసుకుని, నా వాళ్ళు కానివాళ్ళందరూ పరాయివాళ్ళనే అహంకారపు భావనే అన్ని సమస్యలకీ మూలకారణం అని. పక్కవాడు కూడా నాలాగే మనిషే, వాడికీ నాలాగే కన్నీళ్ళూ, కోపాలూ, ద్వేషాలూ, ప్రేమలూ ఉంటాయని గ్రహించగలిగినప్పుడు మాత్రమే ఈ స్వీయవినాశనానికి దారితీసే వైపరీత్యం నుంచి మనం బైటపడే వెసలుబాటు ఉంటుంది –

నీకు తెలియనిదా నేస్తమా?

చెంత చేరననే పంతమా?

నువ్వు నేననీ విడిగా లేమనీ

ఈ నా శ్వాసని నిన్ను నమ్మించనీ

మన హృదయస్పందనని పట్టుకుని, మనలోని మనిషితనాన్ని మేల్కొలిపి, నేనొక్కణ్ణీ వేరుకాదు మనమంతా ఒకటే అనే భావనని మొలకెత్తించగలిగినప్పుడు మనం యుద్ధం అనే సమస్యకి సామరస్యమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని దర్శించగలుగుతాం. మనమంతా మనుషులం, ఈ భూగోళం మనది! విద్వేషంతో పాలించే దేశాలూ, విధ్వంసంతో నిర్మించే స్వర్గాలు ఉండవు, ఉంటే అవి మనుషులవి కాబోవు అని నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. యుద్ధం అంటే శత్రువుని సంహరించడం కాదు, మనలోని కర్కశత్వాన్ని అంతమొందించడం అని అర్థమైనప్పుడు మన ప్రతి అడుగూ ఒక మేలుకొలుపు అవుతుంది. సరిహద్దుల్ని చెరిపే సంకల్పం సిద్ధిస్తుంది –

విద్వేషం పాలించే దేశం ఉంటుందా?

విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా?

ఉండుంటే అది మనిషిది అయ్యుంటుందా?

అడిగావా భూగోళమా! నువ్వు చూశావా ఓ కాలమా?

రా ముందడుగేద్దాం.. యుద్ధం అంటే అర్థం ఇది కాదంటూ

సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం!

ప్రేమ గురించి గొప్పగొప్ప కల్పనలు చెయ్యొచ్చు, ప్రేమే జీవితమనీ, ప్రేమే సమస్తమనీ ఆకాశానికెత్తెయ్యొచ్చు. ఇలా ఆలోచనల్లో భూమండలం మొత్తాన్ని ప్రేమించడం చాలా ఈజీ, కానీ మనకి నచ్చని మనిషి ఎదురుగా ఉంటే ప్రేమించడం చాలా కష్టం. యుద్ధంలో ఉండీ, చేతిలో ఆయుధం ఉండీ, ఎదురుగా ఉన్న శత్రువుని సంహరించగలిగే సామర్థ్యం ఉండీ, ఆ శత్రువూ సాటి మనిషే అని జాలి కలిగితే అప్పుడు మనం నిలువెత్తు ప్రేమకి నిదర్శనం అవుతాం. అలాంటి ప్రేమ బ్రహ్మాస్త్రం సైతం తాకలేని మనలోని అరిషడ్వర్గాలను నాశనం చెయ్యగలుగుతుంది. రాబందలు రెక్కల సడుల మధ్య సాగే మరుభూముల సేద్యం నుంచి మనని మరల్చి జీవనవేదాన్ని అందిస్తుంది.”రేపు” అనే పసిబిడ్డని గుండెకి పొదువుకుని తీపి కలలను పాలుగా పట్టే అమ్మతనానికి మనమంతా ప్రతినిధులమనీ, మనని మనమే నాశనం చేసుకునే ఈ ఉన్మాదం వలన భవితంతా ఆ పాలుదొరకని పసిబిడ్డడి ఏడ్పుల పాలౌతుందనీ గుర్తుచేస్తుంది –
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?

ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా?

రాకాసుల మూకల్లే మార్చదా పిడివాదం!

రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?

సాధించేదేముంది ఈ వ్యర్థ వినోదం?

ఏ సస్యం పండించదు మరుభూముల సేద్యం!

రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం

ఈ పూటే ఇంకదు అందాం, నేటి దైన్యానికి ధైర్యం ఇద్దాం!
ఇదంతా పాసిఫిజమనీ, ఐడియలిజమనీ, దుర్మార్గం ఎప్పుడూ ఉంటుందనీ, యుద్ధం తప్పదనీ కొందరు వాదించొచ్చు. కావొచ్చు. అయితే ఈ అందమైన భూలోకం మనదనీ, మనందరం దానికి వారసులమనీ, ఒకరు ఎక్కువనే ఆధిపత్యం చెల్లదనీ మనమంతా నమ్మినప్పుడు, అరిష్టాలపై అంతా కలిసికట్టుగా చేసే యుద్దం యొక్క లక్షణం వేరేగా ఉంటుంది. అప్పుడది పంటకి పట్టిన చీడని నిర్మూలించే ఔషదం అవుతుంది, పచ్చదనాన్ని పెకిలించే ఉన్మాదం అవ్వదు. అప్పుడు లోకకళ్యాణాల పేరుతో కల్లోలాలు జరగవు, మానవ సంక్షేమం కోసం మారణహోమాలు జరగవు. అప్పుడు మనం భౌగోళికంగా ఖండాలుగా, దేశదేశాలుగా విడిపోయినా మానసికంగా అఖండమైన మానవత్వానికి ప్రతినిధులమవుతాం. మన చొక్కాపై ఏ జెండాని తగిలించుకున్నా మన గుండెల్లో ప్రేమజెండానే ఎగరేస్తూ ఉంటాం. ఈ సదాశయమే నిజమైన గెలుపు, లోకానికి అసలైన వెలుగు –

అందరికీ సొంతం అందాల లోకం

కొందరికే ఉందా పొందే అధికారం?

మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం

గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం!

ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం

ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం

ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే అవుదాం

ఆ తలపే మన గెలుపని అందాం

“సిరివెన్నెల ఎంత అద్భుతంగా చెప్పారండీ! ఏం కవిత్వమండీ! నిజమే సుమండీ, లోకంలో హింసా ద్వేషం పెరిగిపోతున్నాయి! దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు!” అంటూ మనని మనమే మంచివాళ్ళ జాబితాలో వేసేసుకోకుండా, ఈ పాటని అద్దంగా వాడుకుని మనలోని లోపాలను మనం చూసుకోగలగాలి. ఎందుకంటే యుద్ధమంటే ఇరు దేశాల మధ్యో, ఇరు వర్గాల మధ్యో జరిగే మహాసంగ్రామమే కానక్కరలేదు. మన దైనందిన జీవితంలో, మన సంబంధ బాంధవ్యాలలో జరిగే సంఘర్షణలనీ యుద్ధాలే. అరిషడ్వర్గాల సైన్యంతో చీకటి మనపై దాడి చేసే యుద్ధంలో, మన తెలివితో మనిషితనాన్ని వెలిగించుకోవాలి, ప్రేమని గెలిపించుకోవాలి. ఆ యుద్ధంలో ఈ పాటని రథంగా, సిరివెన్నెలని రథసారధిగా వినియోగిస్తే జయం మనదే!
అనుబంధం:

  1. కంచె చిత్రంలోని ఈ రెండు పాటలనీ యూట్యూబ్‌లో ఇక్కడ వినొచ్చు – భగభగమని & నీకు తెలియనిదా
  2. ఈ పాటల గురించి సిరివెన్నెలే స్వయంగా వివరించిన వీడియో – సిరివెన్నెల వివరణ

(తొలి ప్రచురణ సారంగ పత్రికలో)

కంచెలు తుంచే మనిషితనం!

“బంగారు” సిరివెన్నెల!

కొన్ని పాటలు ఒకసారి విని, పెద్ద విషయం లేదని వదిలేశాక, ఎవరో ఒకరు మాటల్లో “అబ్బా! ఆ పాట ఎంత బావుంటుందో కదా!” అంటే “అవునా, మళ్ళీ ఒకసారి విని చూద్దాం” అని తిరిగి వినడం జరిగింది. అలా తిరిగి విన్న పాటలు కొన్ని ఎంతో బావున్నాయనిపించాయి కూడా – సంగీతమో, సాహిత్యమో, గానమో దేనివల్లైనా కానీ. అలా ఈ మధ్య మంచి కవయిత్రి, మధుమనస్వి అయిన ఒక స్నేహితురాలు “మహాత్మ” చిత్రంలోని “ఏం జరుగుతోంది” అన్న పాటని ప్రస్తావిస్తూ “సిరివెన్నెల ఎంత బాగా రాశారో కదూ?” అంటూ పొంగిపోయింది. నేను, “అవును, చాలా మంచి పాట!” అని అన్నాను కానీ నాకు నిజానికి ఆ పాట సాహిత్యం గుర్తు లేదు అసలు. “మహాత్మ” చిత్రం అంటే సిరివెన్నెల రాసిన “ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ” పాటో, “తలయెత్తి జీవించి తమ్ముడా” అనే పాటో గుర్తొస్తాయి నాకు. ఇవి నిస్సందేహంగా గొప్ప పాటలే, సిరివెన్నెలకి వన్నె తెచ్చేవే. అయితే ఈ మధ్యే సిరివెన్నెల ఓ సభలో చెప్పినట్టు, కొన్ని సినిమాలకి ఆయన రాసిన చాలా అందమైన “మామూలు పాటలు”, ఆ సినిమాలోని గొప్ప పాటల వల్ల మరుగున పడిపోయాయి. ఈ పాట అలాంటిదే మరి!

మామూలు పాటలు అనడంలో నా ఉద్దేశ్యం గొప్ప సందేశమో, గొప్ప కథావస్తువో లేని పాటలు అని. ఇలాంటి మాములు పాటలకి కూడా అసాధారణమైన సాహిత్యం అందించడంలోనే సిరివెన్నెల గొప్పదనం దాగుంది. గొప్ప సన్నివేశాలకి గొప్పగా ఎవరైనా రాస్తారు, మామూలు సన్నివేశాలకి కూడా గొప్పగా రాయడంలోనే అసలైన గొప్పదనం దాగుంది. ఈ పాట అలాంటి గొప్ప “మాములు పాట”! ప్రేమలో పడ్డ ఇద్దరి మనస్థితిని ఎంతో అందంగా చెప్పిన పాట. సినిమా కథ ప్రకారంగా హీరో ఒక రౌడీ అన్న విషయాన్ని సిరివెన్నెల పట్టించుకోలేదు (పాట చివరలో వచ్చే “మొదటి స్నేహమా” అన్న ప్రయోగంలో ఓ చిన్న సూచన చేశారు, కానీ అది మొదటి సారి ప్రేమలో పడ్డ ఎవరికైనా వర్తిస్తుంది). అతనిలోని మగవాడినీ, ప్రేమికుడినీ, మనిషినీ బైటకి తీసి, ఒక అమ్మాయికీ అతనకీ మధ్య నడిచిన మనసు కథని అద్భుతంగా ఆవిష్కరించారు. సాధారణంగా ఇలాంటి పాటల్లో ప్రేమో, శృంగారమో, అనురాగమో, చిలిపిదనమో ఏదో ఒక అంశం ప్రముఖంగా ఉంటుంది. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ సమపాళ్ళలో రంగరించి గోముగా, మార్దవంగా, లాలనగా అందించారు సిరివెన్నెల. అదే ఈ పాటకి అందం, ప్రాణం!

పల్లవి:

ఆమె: ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ!
అతను: ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసీవేళ!

ఆమె: నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు
ఏం పనట తమతో తనకు తెలుసా

అతను: నీ వెనక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేశావసలు సొగసా

||ఏం జరుగుతోంది ||

సంగీత పరంగా, సాహిత్య పరంగా కూడా ఈ పాటకి పల్లవి కొంత “వీక్” అనే చెప్పాలి చరణాలతో పోలిస్తే. ఆ మాటకొస్తే చాలా పాటల్లో సిరివెన్నెల పల్లవి కంటే చరణాల్లోనే విజృంభించి రాస్తారు. అలా అని ఈ పల్లవిని తీసి పారెయ్యలేం. ఇది అందమైన పల్లవే! మొదటి రెండు లైన్లని, తరువాత లైన్లతో లింక్ చెయ్యడం ఇక్కడ సిరివెన్నెల ప్రత్యేకత. వేరే రచయితలు ఎవరూ అలా రాయరు. అమ్మాయి, “నా మనసుకి ఏమౌతోంది?” అంది కాబట్టి తనతో “ఎందుకీ మనసు కుదురుగా నిలవకుండా నీ వెంటే పరుగులు పెడుతోంది?” అనిపిస్తారు తరువాతి లైనులో. అబ్బాయి, “నా వయసు ఏం వెతుకుతోంది?” అన్నాడు కనుక, “నీ వెంటే నా కలలన్నీ తిరుగుతున్నాయి, ఏం మాయ చేశావు సోయగమా?” అని వయసు పరంగా అంటాడు మళ్ళీ.

చరణం 1:

ఆమె: పరాకులో పడిపోతుంటే కన్నె వయసు కంగారు
అరె అరె అంటూ వచ్చి తోడు నిలబడు
అతను: పొత్తిళ్లల్లో పసి పాపల్లే పాతికేళ్ల మగ ఈడు
ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ

ఆమె: ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీ కోసమే దూకుతోంది చిలిపి లాహిరి
అతను: ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి
నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి
||ఏం జరుగుతోంది||

ఈ పాట చరణాలు ఎంత బావుంటాయో! ట్యూన్ కూడా చాలా లలితంగా “ఫీల్” పెంపొందించేలా ఉంటుంది చరణాల్లో. ఈ కన్నె పిల్ల వయసు పరాకులోనూ ఉంది, కంగారుగానూ ఉంది! తొలి ప్రేమలో ఉండే మైమరపునీ, అలజడిని ఎంత ముచ్చటగా చెప్పారు! “నేనిలా గుబులుగా ఉంటే అలా చూస్తావేం! వచ్చి సాయం చెయ్యొచ్చు కదా!” అని అంత మురిపెంగా ఓ అమ్మాయి అడిగితే పడిపోని అబ్బాయి లేడు లోకంలో! సిరివెన్నెల స్త్రీ అవతారం ఎత్తి రాసిన ఇలాటి పాటల్లో ఉండే అందమే ఇది! ఇక్కడ అబ్బాయి గడుసుతనం చూడండి, “సరే, అలాగే. వస్తాను సాయంగా. కానీ పాతికేళ్ళ ఈ మగవాడు పసివాడిగా మారి వెక్కివెక్కి ఏమి వెతుకుతున్నాడో కూడా కనుక్కో మరి” అంటున్నాడు. ఇందులో లలితమైన శృంగారం ఉంది, ఆమె చెంత పసివాడుగా మారే అమాయకత్వం ఉంది, ఆమెకి ప్రేమగా దాసోహం అవ్వడం ఉంది. ఇలాంటి మగవాడిని ఏ స్త్రీ గుండెలకి పొదువుకోకుండా ఉంటుంది?

ఆమె అనురాగమై అతనిపై చినుకులా వర్షిస్తే, చిలిపితనం చిగురు తొడగదూ? అతనిలోని వేడి ఊపిరి కూడా ఆమె సావాసాన్నే కోరుతోంది మరి! “ఆదుకో మరి” అన్న ఎక్స్ప్రెషన్‌తో ఆ లైనుకి ఎంతో అందాన్ని చేకూర్చారు సిరివెన్నెల.

చరణం 2:
ఆమె: ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు
అతను: మధురమైన కబురందిందే కలత పడకు బంగారు
పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు

ఆమె:గంగ లాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అతను: అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా

||ఏం జరుగుతోంది||

కన్నీరు కమ్మగా ఉంటుందా అంటే ఉంటుంది. అది తియ్యని ప్రేమ గుబులు వల్ల వచ్చినదైతే. మనసు ప్రేమధారల్లో తడిసినపుడు ఆ నీరు కొంత పైకి ఉబికి వచ్చి మనలోని మనిషితనాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మనసు కరిగే వాళ్ళు కదా ధన్యులు, కఠినహృదయ ఘనులెందుకు? ఆమె కంటి చెమ్మ చెప్పే మధురమైన ప్రేమ కబురు ఆ అబ్బాయికి అందింది. ఆ ప్రేమకి అతని మనసూ ఉప్పొంగింది. అలా ఉప్పొంగిన ప్రేమని వ్యక్తపరచడానికి చెక్కిళ్ళపై పెట్టే నునులేత ముద్దు కంటే గొప్ప సాధనం ఉందా! ఇంతటి ప్రేమ మూర్తులు ఒకరి కౌగిలిలో ఒకరు కరిగి ఉండడం ఎంత అందమైన దృశ్యం! మనసుని రంజింపజేశారు సిరివెన్నెల! సాహిత్యం అంటే అదే కదా!

పాట ముగింపును సముద్రం-నది మధ్య అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, పాట వినే శ్రోతల్లోని అనురాగాన్ని పెంపొందిస్తూ చేశారు సిరివెన్నెల. ఆమె ఉప్పొంగిన గంగైతే అతను ప్రేమ సంద్రం. ఆ కలయిక ప్రాణ బంధం కాక మరేమిటి? సముద్రంలో కలిసిన నదికి ఇక ఉనికి లేదు. అతని ప్రేమలో పడి మునకలేశాక ఇక ఆమెంటూ లేదు. ఈ ప్రియప్రవాహాన్ని కలుసుకుని అసంపూర్తిగా ఉన్న సముద్రం కూడా సంపూర్ణత్వాన్ని, సార్థకతనీ పొందింది. ఇక్కడ సిరివెన్నెల చమత్కారం గమనించండి – నది సముద్రంలో కలిసి అంతమైంది, సముద్రం నది కలవడం వల్ల పూర్తైంది. అర్థభాగం సంపూర్ణమవ్వడం, ఆ సంపూర్ణత్వంలో నువ్వూ-నేను అన్న భావం తొలగి ఏకత్వం సిద్ధించడం, ఇదే ప్రేమకి ఉన్న అసలైన లక్షణం.

ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది. వింటూ వింటూ నాకు నేనే అబ్బాయినై, అమ్మాయినై, ఇద్దరినీ నేనై ఆస్వాదించాను. ఆనందించాను. ఈ పాటని ప్రస్తావించి నాకీ మేలు చేసిన ఆ స్నేహితురాలికి నా కృతజ్ఞతలు. పాట రాసిన సిరివెన్నెలకి వేన వేల వందనాలు!

“బంగారు” సిరివెన్నెల!

పూల ఘుమఘుమ!

సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఉన్న ఒక క్రెడిట్ ఏమిటంటే ఏ ఇబ్బందీ లేకుండా అందరి ముందూ పాడగలిగే ఎన్నో శృంగారగీతాలు రాసి ఉండడం. మిగతా గీతరచయితలు లలితమైన శృంగారగీతాలు రాయలేదని కాదు కానీ, సిరివెన్నెల ఈ విషయంలో ఎక్కువ మార్కులు సంపాయిస్తాడు. కొన్ని పాటలకి సాహిత్యం చాలా మర్యాదగానే ఉన్నా, చిత్రీకరణ నాటుగా ఉండడం వల్ల అవి చెత్తపాటలుగా ముద్రపడిపోతాయి. “శ్రీ ఆంజనేయం” సినిమాలోని “పూల ఘుమఘుమ” అనే పాట ఇలాంటిదే. గొప్ప భావుకతతో రాసిన ఈ పాటని ఫక్తు మసాలా పాటలా చిత్రీకరించి దర్శకుడు కృష్ణవంశీ తీరని అన్యాయం చేశాడు! సంగీతపరంగా అతి చక్కని మెలొడీ ఇచ్చిన మణిశర్మకి చిత్రీకరణకి తగ్గట్టు ఇంటర్లూడ్లలో రసభంగం కలిగించే సంగీత విన్యాసాలు చేయాల్సి వచ్చింది ! ఫలితంగా “ఛార్మి” కంటే ఎంతో చార్మింగ్‌గా ఉన్న సాహిత్యానికి తగినంత పేరు రాలేదు! ఈ పాట గురించి కొన్ని ముచ్చట్లు.

పాట ఆడియో లింకు: పూల ఘుమఘుమ (raaga.com)

పాట సాహిత్యం:

పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా?
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా?
ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగరా మగరాయడా!
భామంటే చూడని వ్రతమేలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడా!
మారనే మారవా మారమే మానవా
మౌనివా మానువా తేల్చుకో మానవా

|| పూల ఘుమఘుమ ||

చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమయ్యే అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలుజడ చుట్టుకొని మొగలిరేకా నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో

|| పూల ఘుమఘుమ ||

ప్రతి ముద్దుతో ఉదయించనీ కొత్తపున్నాగనై
జతలీలలో అలసి మత్తెక్కిపోనీ నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండననీ పొగడపూదండనై
నీ కంటి కోనేట కొలువుండిపోనీ చెలిమిచెంగల్వనై
మోజులే జాజులై పూయనీ హాయిని
తాపమే తుమ్మెదై తీయనీ తేనెని

|| పూల ఘుమఘుమ ||

ఓ ముద్దుగుమ్మ తనకు నచ్చిన అబ్బాయిని ఎంత అందంగా కవ్విస్తోంది అన్నది ఈ పాటలో విషయం. ప్రేమలో శృంగారాన్ని కలిపి, ఆ శృంగారభావాన్ని ఎంత అందంగా, మృదువుగా వ్యక్తపరుస్తోందో ఈ పాటలోని లలన! మనసులోని మాటని ఇంత రమణీయంగా వ్యక్తీకరించడం కేవలం అమ్మాయిల విషయంలోనే సాధ్యం. ఒక అబ్బాయి ఎంత భావుకతతో పాడినా ఇంత సొగసుని సాధించలేడు!

పల్లవి మొదలుపెట్టడమే ఎంతో గడుసుగా మొదలుపెట్టారు సిరివెన్నెల – పూల ఘుమఘుమనీ, తేనెమధురిమనీ కాదని ప్రవరాఖ్యుడిలా వెళ్ళిపోకు అని. చరణాల్లో పువ్వుల ప్రస్తావన ఉంది కాబట్టి “పూల ఘుమఘుమ” అంటూ మొదలుపెట్టడం చక్కగా ఉంది. “మారనే మారవా” అంటూ సాగే అనుపల్లవిలో శబ్దార్థ విన్యాసాలు ముద్దొచ్చేలా ఉంటాయి. అమ్మాయి ఇంత అందంగా పల్లవి పాడితే వలలో పడని అబ్బాయి ఉంటాడా అసలు?

అరవిందము (తామర/కమలము)
మల్లెపువ్వు
మొగలిపువ్వు

చరణాల్లో ప్రతి భావాన్నీ ఒక పువ్వుగా పరిమళింపజేశారు. “అరవిందము” అంటే కమలం/తామర, ఉదయం వికసించేది. “బంధమై అల్లుకో” అంటే ప్రేమబంధమే! “అరవిచ్చి అరవిందమయ్యే అందం” అనడం ఎంతో బాగుంది. అరవిచ్చడం (అంటే సగమే విచ్చడం) సంకోచాన్ని, సిగ్గుని సూచిస్తోందనుకుంటే, కమలంలా నిండుగా వికసించడానికి “నీ ప్రేమ అనే నమ్మకాన్ని” ఇవ్వు అనడం. “అరవిచ్చి” అన్నది అబ్బాయి పరంగా కూడా వాడి ఉండవచ్చు – “మాస్టారూ, కొంచెం మొహమాటం తగ్గించుకుని, నా దగ్గరగా రండి” అన్న అర్థంలో. “పెదాలపై ముద్దుపెట్టుకుని తీపిని తోడుకో” అనడానికి “మల్లెలే తుంచుకో” అనడం ఎంత భావుకత! ఇంత నాజుగ్గా అందంగా వాడిన మాటలే ముద్దుకంటే తియ్యగా ఉంటే ఇక వేరే ముద్దులెందుకని? వాలుజడ-మొగిలిరేకులు అన్నది ఒక అందమైన తెలుగింటి కాంబినేషన్. మొగలిపువ్వు పైన బిరుసుగా ఉన్నా, లోపలి రేకులు చాలా మృదువుగా పరిమళభరితంగా ఉంటాయి. “అబ్బాయి గారూ, మీలోని బెరుకుని పక్కనపెట్టి మనసులోపలి దాగిన మృదువైన ప్రేమని బైటపెట్టండి” అన్న సూచన. అందంగా నాతో కలిసి రా, సరదాగా ప్రేమకథ నడిపించుకో అన్న భావం.

మొదటి చరణం అంతా ఒక ఎత్తైతే, చివరి లైన్లు మాత్రం మరో ఎత్తు. ఒక కవ్వింత, ఒక ప్రణయభావం లేకపోతే పడుచుదనపు ఉత్సాహానికి అర్థం ఏమిటని? “వయసులో పరవశం” అంటే ఇదే. ఎంత మొహం తిప్పేసుకున్నా, అబ్బాయి వయసులో ఉన్న వాడే కదా! నన్ను మామూలుగా కాదు, వయసులోని పరవశం నిండిన కళ్ళతో చూడు. అప్పుడు నా అందం నీలో కలవరం కలిగించకపోతే అడుగు! ఒక్కసారి నా సొగసులో చిక్కుకున్నావా ఇక జీవితమంతా పరిమళభరితం – ప్రేమ పరిమళం, సొగసు పరిమళం, బ్రతుకు పరిమళం, అంత పరిమళమే! ఎంత అద్భుతంగా చెప్పాడండీ సిరివెన్నెల ఈ భావాన్ని!

పున్నాగ
నిద్రగన్నేరు

రెండో చరణం మొదటిలైన్లలో ఓ చమత్కారం చేశారు సిరివెన్నెల. “నీ ప్రతి ముద్దుతో నన్ను పున్నాగ పువ్వులా ఉదయించనీ” అంటూ ప్రారంభించి, “మత్తెక్కి అలసి నిద్రగన్నేరులా నీ కౌగిలిలో నిద్రించనీ” అంటూ ముగిస్తాడు. అంటే మెలకువ/మగత, పగలూ/రాత్రీ అనే పరస్పర వ్యతిరేకభావాలు రెండింటినీ శృంగారపరంగా పక్కపక్కనే చెప్పడం. విడమరిచి చెప్పకుండా ఊహకి వదిలేయడమే శృంగారరచనకి వన్నెతెస్తుంది. ఈ కిటుకు తెలిసిన ఘటికుడు సిరివెన్నెల! ఈ లక్షణాన్ని కూడా మొదటి రెండులైన్లలో చూడొచ్చు. తర్వాత లైన్లలో అనురాగాన్నీ, ప్రేమనీ పలికిస్తాడు. “నీ గుండెపై పొగడపూడండలా ఒదిగుండనీ” అనడం ఎంత లలితమైన వ్యక్తీకరణ! ఇక్కడ నన్ను గుండెల్లో పెట్టి చూసుకో అన్న ధ్వని కూడా ఉంది. నీ కంటికోనేట చెంగల్వనై నిలిచిపోనీ అంటుంది అమ్మాయి వెంటనే. ఊహించుకుంటే ఎంతో అందంగా ఉంది ఇది. “నీ కళ్ళలో నేనే కొలువుండాలి, ఇంకే అమ్మాయి వంకా నువ్వు కన్నెత్తి చూడకూడదు” అన్న హెచ్చరిక కూడా మరి ఉండే ఉండొచ్చు ఇలా అనడంలో! ఆఖరి లైన్లలో మళ్ళీ శృంగారం! మోజులన్నీ జాజులై హాయిని పూయాలట. వినడానికి ఎంత హాయిగా ఉందో! “తాపమే తుమ్మెద కాగా తేనెని ఆస్వాదిద్దాం” అంటూ ముగుస్తుందీ పాట. సాధారణంగా శృంగార గీతాల్లో పురుషుడిని తుమ్మెదతో, స్త్రీని పువ్వుతో పోల్చడం చూస్తూ ఉంటాం. ఇక్కడ సిరివెన్నెల మాత్రం జంట తుమ్మెదలమై ప్రణయ మకరందాన్ని తాగి పరవశిద్దాం అన్న అర్థాన్ని పలికించారు. దటీజ్ సిరివెన్నెల! రొటీన్ కి భిన్నంగా రాయడానికి ఎంతో తపిస్తారు.

పొగడ పువ్వు
చెంగల్వ

 

జాజి

 

స్పీడుకి మనం దాసోహమైపోయిన తరువాత, జీవితంలో లేతభావాలకి చోటు లేకుండా పోయింది. కవిత్వాన్ని అర్థం చేసుకునే తీరికా, ఓపికా ఎవరికీ లేకపోవడంతో సినిమా పాటలనుంచి కవిత్వం మరుగైపోయింది. స్వచ్చమైన శృంగారం సిగ్గుపడి మాయమైపోయింది. పువ్వులూ, పరిమళాలూ, తెలుగుదనాలు మన జీవితాల్లోంచి, తెలుగు సినిమా పాటల్లోంచి సవినయంగా సెలవు తీసుకున్నాయి. ఎడారిలో ఒయాసిస్సులా ఎప్పుడో ఇలాటి పాటలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రసాదంలా కళ్ళకద్దుకుని పుచ్చుకోవడం, పాట వెనుక ఉన్న వ్యక్తులని స్మరించుకోవడమే మనం చెయ్యగలిగేది! ఈ పాట వరకూ హీరో సిరివెన్నెల. పూలఘుమఘుమల తేనెబాలునికీ, పసిడివెన్నెలల నిండు చంద్రునికీ ప్రణామాలు! జన్మదిన శుభాకాంక్షలు!

(మే 20, సిరివెన్నెల పుట్టినరోజు)

పూల ఘుమఘుమ!

నీ ప్రశ్నలు నీవే!

ఉత్తమ సాహిత్యం ఎప్పుడూ పాఠకుడికి సూటిగా వెళ్తుంది, ఎవరి వ్యాఖ్యానం అవసరం లేకుండా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సినీ గీతాలు ఈ కోవకే చెందుతాయి. అందుకే ఈ బ్లాగులో ఆయన పాటలపై వివరణలు తక్కువ కనిపిస్తాయ్. అయినా ఒక్కో సారి సిరివెన్నెల పాటలకీ వ్యాఖ్యానం అవసరం అవుతుంది. ఈ మధ్య కాలంలో నాకు ఇలా అనిపించిన పాట “నీ ప్రశ్నలు నీవే” (కొత్త బంగారు లోకం సినిమా). నిజానికి ఈ పాటలో అంత క్లిష్టత లేదు. చాలా వరకూ అర్థమైపోతూనే ఉంటుంది. అయినా కొంత వివరణ ఇద్దామని ఈ వ్యాసం.

ఈ పాట గురించి Orkut Sirivennela కూటమిలో లో మంచి చర్చ జరిగింది – Orkut – నీ ప్రశ్నలు నీవే . అందులో చాలా మంచి విశ్లేషణలు చేసి, ఈ పోస్ట్ రాయడానికి ప్రేరణ ఇచ్చిన వీరికి ముందుగా నా ధన్యవాదాలు: అన్న నచకి (పాట picturization గురించి అద్భుతమైన వివరణ ఇచ్చారు. అది పై లింకులో మీరు చదవొచ్చు), వెంకట్ గారు (కొన్ని విషయాలు సిరివెన్నెల గారినే అడిగి clarify చేశారు), శైలజ గారు (కొన్ని చక్కటి వివరణలు).

ప్రేమలో పడిన పడుచు జంట ఇంట్లో నుంచీ పారిపోదామని నిర్ణయించుకున్న సందర్భంలో వచ్చే background song  ఇది. దీనికి మాములుగా సాహిత్యం రాయడం కష్టం కాదు. అయితే decision making గురించీ, maturity గురించీ, జీవిత సత్యాల గురించీ చెప్పే పాటగా మలచాలంటే ఒక సిరివెన్నెల కావాలి. పాటల్లో పాఠాలు నేర్పే మేస్టారూ, మెగా స్టారూ ఆయనే కదా మరి.

failure

ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం రాయడానికి సరిపోయే విషయాలున్న ఈ పాటలోని పాఠాలని ఒక సారి పరికిద్దాం:
Take Responsibility
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా
ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా
చాలా సమస్యల్లో క్లిష్టత నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుంది. ఊరికే వదిలిస్తే సమస్యలు వాటంతట అవే తీరి పోతే బాగుండేది. కానీ చాలా సమస్యలు ఇలా దారికి రావు. కాబట్టి మనకున్న భయాలని, ఆందోళనలని పక్కన పెట్టి సమస్యని ఎదురుకోక తప్పదు. పక్కవాళ్ళ సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు కానీ మనకేం కావాలో మనకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే “తప్పించుకు పారిపోకు, ఆగిపోకు, నీ సమస్యని నువ్వే సాధించాలి” అని కర్తవ్య గీతను మరో శ్రీ కృస్ణుడై బోధిస్తున్నారు సిరివెన్నెల.
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా
అపుడో ఇపుడో కననే కనను అంటుందా
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా
గుడికో జడకో సాగనంపక ఉంటుందా
అమ్మైనా సరే సాధారణంగా తొమ్మిది నెలలు మోస్తుంది, మహా అయితే పది నెలలు. అంతే. తర్వాత నువ్వు అమ్మ నుండి విడిపడాల్సిందే. నీకు నువ్వుగా ఎదగాల్సిందే. అలాగే పూలకొమ్మ పూలని తనతోనే ఉంచుకోదు. గుడికో, జడకో పంపించి నీ పరిమళాన్ని నువ్వే పంచుకో, నీ పరమార్థాన్ని నువ్వే చేరుకో అని చెప్తుంది. సినిమా పరంగా చెప్పాలంటే యువ జంటకి – “మీరు చిన్న పిల్లలు కారు..ఎదిగిన వాళ్ళూ, తెలిసిన వాళ్ళు. మీరే తేల్చుకోండి”  అని హితబోధ చేస్తున్నరు సిరివెన్నెల.

ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం రాయడానికి సరిపోయే విషయాలున్న ఈ పాటలోని పాఠాలని ఒక సారి పరికిద్దాం:

Take Responsibility

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా

నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా

ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

చాలా సమస్యల్లో క్లిష్టత నిర్ణయం తీసుకోవడంలోనే ఉంటుంది. ఊరికే వదిలిస్తే సమస్యలు వాటంతట అవే తీరి పోతే బాగుండేది. కానీ చాలా సమస్యలు ఇలా దారికి రావు. కాబట్టి మనకున్న భయాలని, ఆందోళనలని పక్కన పెట్టి సమస్యని ఎదురుకోక తప్పదు. పక్కవాళ్ళ సలహాలూ సూచనలూ తీసుకోవచ్చు కానీ మనకేం కావాలో మనకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే “తప్పించుకు పారిపోకు, ఆగిపోకు, నీ సమస్యని నువ్వే సాధించాలి” అని కర్తవ్య గీతను మరో శ్రీ కృస్ణుడై బోధిస్తున్నారు సిరివెన్నెల.

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా

అపుడో ఇపుడో కననే కనను అంటుందా

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా

గుడికో జడకో సాగనంపక ఉంటుందా

అమ్మైనా సరే సాధారణంగా తొమ్మిది నెలలు మోస్తుంది, మహా అయితే పది నెలలు. అంతే. తర్వాత నువ్వు అమ్మ నుండి విడిపడాల్సిందే. నీకు నువ్వుగా ఎదగాల్సిందే. అలాగే పూలకొమ్మ పూలని తనతోనే ఉంచుకోదు. గుడికో, జడకో పంపించి నీ పరిమళాన్ని నువ్వే పంచుకో, నీ పరమార్థాన్ని నువ్వే చేరుకో అని చెప్తుంది. సినిమా పరంగా చెప్పాలంటే యువ జంటకి – “మీరు చిన్న పిల్లలు కారు..ఎదిగిన వాళ్ళూ, తెలిసిన వాళ్ళు. మీరే తేల్చుకోండి”  అని హితబోధ చేస్తున్నరు సిరివెన్నెల.

Life is difficult

బతుకుంటే బడి చదువా అనుకుంటే అతి సులువా

పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా

ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా

జీవితం పూల బాట కాదు. ఇది తెలిసిందే అయినా, ప్రేమ మత్తులో పడిన పడుచు జంటకి గుర్తు చెయ్యాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మత్తులో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వాళ్ళ ముందు జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆచితూచి అడుగు వెయ్యమని బోధన.

Real intelligence is knowing how to use intelligence

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?

కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?

గతముందని గమనించని నడిరేయికి రేపుందా?

గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా..?

తెలివీ, తర్కం మనిషికున్న గొప్ప వరాలు. ఇవి Tools లాటివి. వాడాల్సిన చోట, వాడాల్సిన పద్ధతిలో వాడితే ప్రయోజనం పొందుతాం.  “తర్కం అన్నది అన్ని వైపులా పదునున్న కత్తి. మనం ఎందుకు వాడుతున్నాం అనే ప్రశ్న మీద తర్కం యొక్క లక్ష్యం చేధించబడుతుంది” అని చెబుతూ సిరివెన్నెల తన ఒక పాత కవితలో ఇలా రాశారు –

తర్కం ఒక ఆట

ఒక కెలిడియోస్కోప్

మేధోమథనమే దాని లక్ష్యమైతే

తర్కం ఒక బాట

ఒక దూరదర్శిని

సత్యాన్వేషణే దాని లక్ష్యమైతే

తర్కాన్ని ఆటగా వాడడం అంటే మనకి నచ్చిన దానికి సమర్థనగా లాజిక్కులు తియ్యడం – “అలలు లేని కడలి లేదు, అలాగే అలజడి లేని మనసు లేదు. కలలు లేని కనులు లేవు.” అంటూ intermediate చదివే కురాడు తన ప్రేమని సమర్థించుకోవడం ఈ కోవకే చెందుతుంది. అందుకే వెలుగుని చూపే, గమ్యన్ని చేర్చే బాటగా  తర్కాన్ని వాడాలి అని సుతిమెత్తగా సూచిస్తున్నారు.

Define your success

వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది.

గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??

సుడిలో పడు ప్రతి నావ… చెబుతున్నది వినలేవా..?

Clarity అన్నది జీవితంలో చాలా ముఖ్యం. మనం ఏమి సాధించాలో తెలియకపోతే ప్రతి అల్పమైనదీ గెలుపులాగే అనిపిస్తుంది. వయసులో ఉన్న యువ జంటకి ప్రేమే గొప్ప గెలుపు అనిపిస్తుంది అది సుడిలో పడదోసే నావ అయినా సరే. అందుకే ఇక్కడ సిరివెన్నెల – “తెలివిని వాడండి. మీ జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టండి. తెలిసీ తప్పటడుగులు వెయ్యకండి” అని చెప్తున్నారు.

Lost moment is lost forever

పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా?

ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా?

మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..

కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??


కాలం మనపై ప్రేమ కురిపిస్తూ, రోజూ గోరు ముద్దలుగా ఒకొక్క జీవిత సత్యాన్నీ తినిపిస్తూ కూర్చోదు. మనకే ఆ జాగ్రత్తా, స్పృహా, తెలివీ ఉండాలి. సినిమాలో హీరో తన తండ్రిని కోల్పోతాడు. కొంత పశ్చాత్తాపం కలుగుతుంది. సూర్యుడు ఉన్నప్పుడు అతని విలువని గ్రహించక రాత్రి అయ్యి చీకటి పడ్డాక తెలుసుకుంటే పెద్ద ప్రయోజనం లేదు. అయితే మళ్ళీ వెలుగు వస్తుంది కాబట్టి ఈ సారైనా తెలివి తెచ్చుకుని మసలడం చెయ్యాలి.

Learn from history

కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!

అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు.

తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు???

ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత…!!

గత చరిత్రనీ, మన అనుభవాలని ఒక సారి తరచి చూసుకోవడం అవసరం. ఎందుకంటే అవి మనం చేసిన తప్పుల్ని, మన అసమర్థతల్ని, మన సత్తాలనీ చూపెడతాయి కనుక. మనం ముందు వెయ్యబోయే అడుగులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొంత వివరిస్తాయి కనుక. మనం చరిత్రని తిరగ రాయాలనుకున్నా కూడా ఇప్పటికే రాసి ఉన్న చరిత్రని చదవడం అవసరం! ఇది విస్మరించి ప్రపంచంలో మాదే ప్రత్యేకమైన ప్రేమ జంటా, మాది అమర ప్రేమ, లేక అద్భుత ప్రేమ అనే బ్రాంతిలో మునుగుతూ ఉంటే చివరికి మునకే మిగులుతుంది. ఒక్క సారి ప్రేమ పేరుతో పడదోసిన పాత కథలనీ, ప్రేమ వల్ల రగిలిన చితులని స్మరించుకుంటే ఇలా ముందు వెనకలు చూడకుండా ఉరికే వలపు పరుగులు కుదుట పడతాయ్. అప్పుడు  ప్రేమికుల జీవితాలూ, తల్లిదండ్రుల హృదయాలూ కూడా నవ్వుకుంటాయ్. కన్ను కొట్టే జాబిల్లీ, వెన్నెల రగిల్చే విరహాలూ, దోబూచులాడే చుక్కలూ…వీటిని అన్నింటినీ కూడా అప్పుడు దర్జాగా అనుభూతి చెందొచ్చు!!

నీ ప్రశ్నలు నీవే!

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే!

అది 2000వ సంవత్సరం అనుకుంటా. నేను విజయవాడలో engineering చదువుకునే రోజులు. ఆకాశవాణి వారు దీపావళి పండుగ సందర్భంగా, “వెండి వెలుగుల కవితావళి” అని ఒక కవితాగోష్టి పెట్టి ఎనిమిది మంది సినీ కవులను ఆహ్వానించారు. అంటే అష్ట కవులు అన్న మాట. వచ్చిన వారిలో వయసు పరంగా “జాలాది”, పేరు పరంగా “సిరివెన్నెల” పెద్దవారు. భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, జొన్నవిత్తుల, సుద్దాల మొదలైన వారు ఉన్నారు. సిరివెన్నెల గారిని ప్రత్యక్షంగా చూడ్డం అదే మొదటి సారి. ఆయనే మొదలుపెట్టారు – “ఏటికొక అమవాస దీపావళి, ఓటమెరుగని ఆశ దీపావళి” అంటూ. కవిత గొప్పగా ఉన్నా, కొంచెం “ఆలోచనామృతం” కావడం వల్ల, జనాలు “సామాన్యులు” కావడం వల్ల తప్పదన్నట్ట్లు చప్పట్లు తప్ప అంత స్పందన లేదు. తర్వాత మిగతా కవులు తమ కవితలు వినిపించారు. అందరిలో ఎక్కువగా జనాలని ఆకట్టుకున్నది “సుద్దాల అశోక్ తేజ” అని చెప్పొచ్చు. అందుకు “నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేనవేల దండనాలమ్మా” అని సులువుగా అర్థమయ్యే జానపదాలు పాడడం ఒక కారణం అయితే, మధురమైన కంఠంతో పాడగలగడం మరో కారణం.

ఇదేమిటి “సిరివెన్నెల” మసకబారుతోందా అని నా లాంటి వాళ్ళు అనుకుంటూ ఉండగా, సిరివెన్నెల మళ్ళీ వచ్చి ఒక పాట వినిపించారు. “అటు అమెరికా – ఇటు ఇండియా” అనే సినిమాకి ఈ పాట రాశానని చెప్తూ ఆయన ఆ పాట వినిపించారు. తేలికగా అందరికీ అర్థమయ్యి, గుండెల్ని సూటిగా తాకేలా ఉన్న ఆ పాట ఆయన పాడడం పూర్తవ్వగానే సభంతా కరతాళధ్వనులు. వేదికపై ఆసీనులైన మిగతా కవులు కూడా ఎంత కదిలిపోయారో! ఇలా సిరివెన్నెల తన స్థాయిని, ఆధిపత్యాన్ని చాటుకోవడం నాలాటి అభిమానులకి ఆనందం కలిగించింది!

అప్పుడు ఆయన పాడిన పాటే – “నువ్వెవరైనా నేనెవరైనా” అన్నది. ఆయన పాడినప్పుడే నేను పాటని రాసుకుని ఉండాల్సిందేమో అన్ని ఎన్ని సార్లు అనుకున్నానో. తర్వాత ఆ పాట కోసం ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను. ఆ సినిమా వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడమూ జరిగిపోయింది. కానీ ఈ పాట నాకు వినబడలేదు. తర్వాత ఈ పాట కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. manasirivennela.com site లో ఒక video లో ఈ పాట కొంత సిరివెన్నెల పాడతారు గానీ, ఆ site లో ఈ పాట పూర్తిగా ఉన్నట్టు లేదు.

ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఈ పాటని కొన్నాళ్ళ క్రితం Orkut మిత్రుడు “చైతన్య” నా కోసం వెతికి మరీ సాహిత్యం అందించాడు. అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ పాటని ఇక్కడ అందిస్తున్నాను. ఈ పాట Youtube లో లభ్యం అవుతోంది.

 

Pallavi:

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే
ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే

అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే
మనసు తడిస్తే నీ నా చెంపలు
నిమిరే వెచ్చని కన్నీరొకటే

Charanam 1:

ఏ దేశం వారికి ఐనా ఇల ఒకటే గగనం ఒకటే
ఏ భాషను పలికిస్తున్నా గొంతులు స్వరతంత్రులు ఒకటే

ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే
ఆకారం వేరే అయినా
ఆధారం బ్రతుకొకటే

నిన్నూ నన్నూ కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే
ఎన్నో రంగుల తెల్లకిరణమై వెలుగుతున్న జీవితమొకటే

Charanam 2:

ఏ రూపం చూపెడుతున్నా ఉలి కదలికలకు శిల ఒకటే
ఏ రాగం వినిపిస్తున్నా పిల్లనగ్రోవికి గాలొకటే

నీ నాట్యం పేరేదైనా పాదాలకు కదలిక ఒకటే
ఏ ప్రాంతంలో నువ్వున్నా ప్రాణాలకి విలువొకటే

నీకూ నాకూ అందరికీ పుట్టుకతో చుట్టరికం ఒకటే
నువ్వూ నేనూ  వారూ
వీరూ అంతా కలిసి మనమొకటే

పాటలో అంశం ఏకత్వం. మన చుట్టూ జనజీవితంలో మనమూ ఒక భాగమే అనీ, అందరి నవ్వులూ, నొప్పులూ ఒకటే అనీ చెప్పడం. తద్వారా “నిన్ను నన్నూ కలిపి మనము” అనే భావం పెంపొందించడం ఈ పాట లక్ష్యం. అందుకు సిరివెన్నెల ఎన్నుకున్న సరళమైన ఉపమానాలు అందరికీ అందేలా ఉండి, ఈ పాట అర్థమయ్యేలా చేసి, పాట లక్ష్యాన్ని నెరవేర్చేందుకు దోహదపడ్డాయి.

“ఏ దేశం వారికి ఐనా ఇల ఒకటే గగనం ఒకటే” అన్న వాక్యం చూస్తే “పడమటి సంధ్యారాగం” సినిమాలోని “ఈ తూరుపు ఆ పశ్చిమం” అన్న వేటూరి గీతంలోని ” ఏ దేశమైనా ఆకాశమొకటే, ఏ జంటకైనా అనురాగమొకటే” అన్న lines గుర్తొస్తాయ్. మహా కవులు ఒకేలా ఆలోచించడం ఆశ్చర్యం ఏమీ కాదు కదా!

ఎన్నో రంగుల తెల్ల కిరణం పేరుతో సిరివెన్నెల ఒక కథ రాశారు 1980 లో. ఆ కథ – ఇక్కడ. ఈ కథ చదివితే “ఎన్నో రంగుల తెల్ల కిరణం” అంటే ఏమిటో బాగా అర్థమౌతుంది. ఆనందం, ఆరాటం, కష్టం ఇలా ఎన్నో రంగుల్లో ఉన్న జీవితాన్ని ఆ రంగుల్లో కాకుండా, కొంచెం దూరంగా జరిగి అన్నీ కలిసిన తెల్ల రంగుని పరిపూర్ణంగా చూడగలిగితే అప్పుడు జీవితం ఎంత గొప్పదో తెలుస్తుంది. అప్పుడు బాధ కూడా గొప్ప experience లా అనిపిస్తుంది.

ఈ మధ్య వివేకానందుని Practical Vedanta చదివా. అందులో ఆయన అంటాడు –

“వేదాంతం అంతే ఏదో అర్థం కాని సిద్ధాంతమో, నైరాశ్యం నిండిన భావనో కాదు. వేదాంతం అంటే నువ్వే భగవంతుడివని గుర్తించడం (అద్వైత వేదాంతం). నువ్వు భగవంతుడిని చేరుకోడానికో, సాక్షత్కరించుకోడానికో ఎక్కడో వెతకనక్కర లేదు. నీలోనే ఉన్నాడు పరమాత్మ. నువ్వు కప్పుకున్న తెరలు తొలగిస్తే కనబడతాడు. అప్పుడు నువ్వు నీలో, అందరిలో, చుట్టుపక్కల అణువణువులో దైవాన్ని చూడగలుగుతావు. చుట్టూ ప్రకృతితో ఏకత్వాన్ని పొందగలుగుతావ్. వేదాంతమంటే ఈ ఏకత్వాన్ని తెలుసుకోవడమే”

నాకు చప్పున సిరివెన్నెల రాసిన పై పాట గుర్తొచ్చింది. ఎంతో క్లిష్టమైన తాత్త్వికతని, ఇట్టే అర్థమయ్యేటట్టు చెప్పిన సిరివెన్నెల ప్రతిభ ఎంత గొప్పది! వివేకానందుడు ఈ పాట వింటే ఎంత ఆనందించేవాడో! భారతీయ తాత్త్వికతని గడప గడపకీ చేర్చే ప్రయత్నం చెయ్యాలన్న ఆయన కలని నెరవేర్చే ఓ ముద్దు బిడ్డ ఆయనకి సిరివెన్నెలలో కనిపించి మురిపిస్తాడు….

అవును…సిరివెన్నెల కవి మాత్రమే కాదు, తాత్త్వికుడూ, దార్శనికుడూ, అంతకు మించి మానవతావాది!

నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే!

అమృతం టైటిల్ సాంగ్

ఎప్పుడూ సినిమా పాటల గురించి రాసే నేను ఇప్పుడు అమృతం టైటిల్ సాంగ్ గురించి రాయడానికో కారణం ఉంది – ఇది రాసినది సినీ గీత రచయిత సిరివెన్నెల కాబట్టి. పైగా ఎంతో పాపులర్ అయ్యి, చక్కటి మెసేజ్ కలిగిన ఈ పాటని మళ్ళీ ఒక సారి గుర్తుచేసుకోవడం మంచిదే కదా!

ముందుగా పాట సాహిత్యం:

అయ్యోలూ అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో హో హో
ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హా హా హా
మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు?
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు!
వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు?
అయడిన్ తో అయిపోయే గాయాలే మనకు గండాలు

ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు
“హలో హౌ డుయూ డూ” అని అంటోంది అంతే మీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు?

ఒరేయ్ ఆంజినేలూ! తెగ ఆయస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో  కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
భారీగా  ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!

ఇప్పుడు కొంత విశ్లేషణ:

సృష్టిలో objective అంటూ ఏదీ నిజానికి ఉండదు. పూలు అందంగా ఉన్నాయన్నది కరెక్ట్ కాదు. పూలు నీకు అందంగా అనిపించాయ్. ఇది కష్టం అన్నది కరెక్ట్ కాదు. నువ్వు దానికి కష్టం అని పేరు పెట్టుకున్నావ్ కాబట్టి, అదేదో పెద్ద ఇబ్బందైన విషయం అని అనుకున్నావ్ కాబట్టి అది నీకు కష్టం. ఇలా మన mind ఏది చూపిస్తే అది చూస్తాం మనం. అది చూపించిన జగాన్నే జగం అనుకుంటున్నం మనం. అందుకే “జగమే మాయ” అన్నది. ఈ mind ఒక cricket commentator లా ప్రతి దానికి ఏదో commentary చెబుతూ ఉంటుంది. మనం దానీ ద్వారా అన్నీ తెలుసుకుంటున్నాం. అసలు ఈ commentary ఏమీ లేకుండా cricket match ని (అంటే హర్షా భోగ్లే commentary లేకుండా, “ద్రావిడ్ జిడ్డు గాడు! ధోని కి బలం తప్ప స్టైల్ లేదు! లాటి మన మనసు చెప్పే commentary ఏది లేకుండా) చూడగలమా అన్నది philosophical ప్రశ్న.

ఈ మనసు మాయని deal చెయ్యడానికి రకరకాల techniques ఉన్నాయ్. ఏమౌతుందో ఏంటో అని ఫలితం గురించి అతిగా తాపత్రయ పడే mind ని పక్కకి నెట్టి పని చేసుకుంటూ పోతే అది “కర్మ యోగం”. భక్తి భావంలో లీనమై ఆ భక్తి లో ఈ mind ని కరిగించేస్తే అది “భక్తి యోగం”. mind ని observe చేస్తూ, present moment లోనే ఉంటూ, ఈ mind వలలో పడకుండా ఉంటే అది “రాజ యోగం” (meditation). ఇవన్నీ కాకుండా, “ముల్లుని ముల్లుతోనే తియ్యాలి” అన్న నానుడి ప్రకారం, “ఓ మైండూ! నువ్వు కష్టం అన్న దాన్ని నీ చేతే ఇష్టం అనిపిస్తా. ఇప్పుడు బాధపడాలి అని నువ్వు అన్నప్పుడు, ఓసింతేగా ఏముంది అంతగా బాధ పడేందుకు అని అనిపిస్తా” అని mind ని mind తోనే ఢీకొడితే అది “జ్ఞాన యోగం”

(Of course, ఇవన్నీ కొంత simplified definitions. మీలో యోగా experts ఎవరన్నా ఉంటే “నువ్వు చెప్పినదంతా తప్పుల తడక” అంటూ నా మీదకి యుద్ధానికి రాకండి. ఈ అజ్ఞానిని క్షమించేసి మీ ఔదార్యం చాటుకోండి 🙂 )

సిరివెన్నెల చాలా పాటల్లో ఈ “జ్ఞాన యోగం” అప్రోచ్ పాటిస్తారు. imagination అంటూ మనుషులమైన మనకి ఏడ్చింది కాబట్టి దానిని వాడి లేనిపోని ఊహల్నీ, భయాలని, బాధలని కల్పించుకుని మరీ ఏడవడం ఎందుకు? ఆ imagination తో మంచిని, శ్రేయస్సుని, positiveness ని, పురోగతినీ ఊహించుకోవచ్చు కదా?  అన్న తత్త్వం సిరివెన్నెల గారిది –

అయ్యోలూ అమ్మోలూ ఇంతేనా బ్రతుకు హో హో హో
ఆహాలూ ఓహోలూ ఉంటాయి వెతుకు హా హా హా

“వెతికితే” తెలుస్తుంది అంటున్నారు. ఎక్కడ వెతకాలి? మన సంతోషాలని బయట ప్రపంచంలో వెతుక్కోడం ఒకటి. మనలో మనం వెతుక్కోడం ఇంకోటి. ఈ రెండోది బయట ప్రపంచంతో నిమ్మిత్తం లేకుండా, అన్ని కాలాల్లోనూ మనల్ని ఆనందంలో ఉంచగలుగుతుంది.

మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు?
ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు!

చాలా మంది అసలు బాధ రాకుడదు అనుకుంటారు. అప్పుడే ఆనందంగా ఉండగలం అనుకుంటారు. ఒకవేళ వచ్చిందంటే కొన్ని గంటలో, రోజులో, నెలలో బాధ పడాల్సిందే అని మనకి లెక్కలు ఉంటాయ్ –

e.g ఓ అసమర్థుని జీవ యాత్ర
బాధ – బాధపడే కాలం
ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే – ఒక గంట
పక్క వాడు బాగుపడిపోతుంటే – ఒక రోజు
ఆఫీసులో హైకు రాకపోతే – ఒక వారం
ప్రేమ విఫలమైతే – ఒక జీవితం

Note: ఒకే బాధకి బాధపడే కాలం మనిషిని బట్టి మారును

maths లో వీక్ అయిన వాళ్ళు కూడా ఈ లెక్కలు తప్పకుండా, తెలియకుండానే కట్టి ఖచ్చితంగా బాధపడిపోతూ ఉంటారు. కొంచెం upset అయ్యి మూడ్ బాలేకపోతే sad face పెట్టాలి కాబోలు అనుకుని మరీ పెడుతుంటారు. డబ్బులు కట్టి చూస్తున్న సినిమానే బాగులేకపోతే బయటకి వచ్చేస్తాం, కానీ మనకి తెలియకుండానే మనలో ఎన్నో కలతల సినిమాలని entertain చేస్తున్నాం. ఎన్నో చానెల్సు ఉన్నా, రిమోట్ ఉన్నా, పాత “దూరదర్శన్” రోజుల్లో లాగ “చిత్రలహరి” చూస్తూ బ్రతుకుని చిత్రంగా గడిపెయ్యడం ఏమిటి?

వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు?
అయడిన్ తో అయిపోయే గాయాలే మనకు గండాలు

మనకి ఇంకో జబ్బు ఉంది – చిన్న విషయాలని పెద్దవి చేసుకోవడం. ఇప్పుడు పెద్దైపోయాం, చిన్ననాటి బంగారు బాల్యం తిరిగి రాదేమి అని డైలాగులు కొడతాం గానీ, ఇలా తిరిగి రాని వాటిగురించి కాకుండా తరచి చూస్తే తరిగి పోయే కల్పిత కష్టాల గురించి అసలు ఆలోచించం.

ఎటో వెళ్ళిపోతూ నిను చూసింది అనుకోవొయ్ ట్రబులు
“హలో హౌ డుయూ డూ” అని అంటోంది అంతే మీ లెవెలు
ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా
గాలైనా రాదయ్యా నీదసలే ఇరుకు అద్దిల్లు
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు?

అసలు కష్టానికి చాలా మంది fans ఉన్నారు. పాపం అందరినీ  అంతో ఇంతో పలకరిస్తూ పోతూ ఉంటుంది. అంతే గానీ ఉండమన్నా నీతోనే ఉండిపోదు. అయినా కష్టాన్ని “వలచి మరీ వగచేను” అని అనుకుంటే నీ ఇష్టం! కాబట్టి విశాల హృదయులమై వచ్చిన ప్రతి కష్టాన్ని శరణార్థిగా భావించి ఆశ్రయమివ్వకుండా, కఠినంగా వ్యవహరించడం అవసరమని సిరివెన్నెల ఎంతో తమాషాగా సూచించారు ఇక్కడ.

ఒరేయ్ ఆంజనేయ్లూ! తెగ ఆయస పడిపోకు చాలు
మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు
కరెంటూ రెంటూ ఎట్సెట్రా మన కష్టాలు
కర్రీలో  కారం ఎక్కువ ఐతే కన్నీళ్ళు
నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
భారీగా  ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీ మార్!

ఇప్పటి వరకు చెప్తున్న భావాలనే మళ్ళీ ఇంకో సారి ఇంకోలా చెప్తున్నారు ఇక్కడ. “చెంచాడు భవసాగరాలు” అన్న ప్రయోగం అద్భుతం. కష్టంలో మునిగి ఉన్నంత కాలం అదో సాగరం అనిపిస్తుంది. బయటకి ఈది వచ్చి చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. ఈ అనిపించడం జరగాలంటే ముందు మనం “అనుకోవడం” చెయ్యాలి. ఇదంత సులభం కాదు. సాధన చెయ్యాలి. ఎంత చేసిన కొన్ని సార్లు demotivate అవ్వడం సహజం. అప్పుడు ఇలాటి ఓ సిరివెన్నెల పాట వింటే సరి.

People often say that motivation doesn’t last. Well, neither does bathing. That’s why we recommend it daily.” — Zig Ziglar

వ్యాసం ముగించే ముందు చిన్న వివరణ. ప్రతి విషయాన్ని “లైట్ తీసుకో” అనే చెప్పడమే కదా ఇది అని కొందరు ఈ సందేశాన్ని అపార్థం చేసుకుని ఏమీ చెయ్యకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇది లైట్ తీసుకోవడమే, కానీ సీరియస్ గా లైట్ తీసుకోడం!!

అమృతం టైటిల్ సాంగ్

రామ నవమి – సిరివెన్నెల

ఈ రోజు శ్రీ రామ నవమి. నాకు రాముణ్ణి తలచుకుంటే చప్పున సిరివెన్నెల రామ తత్త్వం గురించి, రాముని విశిష్టత గురించి రాసిన పాటలు గుర్తొస్తాయ్. “మా” TV లో ఆయన ఈ రోజు కనిపించి ఈ విషయాలు విశదీకరించారుట కూడాను!

రామాయణం గురించి గొప్ప తాత్త్విక విశ్లేషణ సిరివెన్నెల రాసిన “తికమక మకతిక” పాట (శ్రీ ఆంజనేయం సినిమాలోది). ఆ పాట గురించి నేను ఇది వరకే ఒక వ్యాసం రాసి ఉన్నాను- http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=40166&page=1

శాస్త్రి గారు కొన్ని పాటలకి చాలా versions రాస్తారన్నది తెలిసిన విషయమే. కొన్ని సార్లు ఇలా 50 versions దాకా రాసిన సందర్భాలు ఉన్నాయిట! ఇలా రాసిన వాటిల్లో దర్శక నిర్మాతలు తమకు నచ్చినది తీసుకుంటారు. అలాగే ఈ “తికమక మకతిక” పాటకి కూడ ఇంకో version ఉంది. దీని గురించి మిత్రుడు నచకి Orkut sirivennela comm లో చాలా కాలం క్రితం ఇచ్చిన వివరాలు, అతని మాటల్లోనే:

At first, guruji was in USA when Krishna Vamsi told the situation for the song. He gave one version based on the track provided by Mani Sarma. And, then, KV changed the situation again twice! appuDu inka ikkaDa unDi vraayaTam kudaradu ani India ki veLLipOyi vraasina version “tikamaka makatika…” ani (movie lO unna version).

The previous version, sung by Anjaneya addressing the God (instead of the man, as in the movie finally) is given here, thanks to my friend Vamsee:
కపికులం కపికులం మనుషుల రూపంలో
కలకలం కలకలం మనసుల మౌనంలో
కపికులం కపికులం నరుల సమూహంలో
కలకలం కలకలం భక్తి ప్రవాహంలో

సుడిగాలిలాగ రెచ్చి, గుడిలోకి తరలివచ్చి
మదిలోని బురద తెచ్చి ముదిరేటి భక్తి పిచ్చి
అది నీ పాదాలపై వదిలిందిరా దేవా…

మనిషిలో మనిషిని చూసావా దేవా?
మనసులో మురికిని భక్తని అనుకోవా?
భేరీలు పగలగొట్టి, బూరాలు ఎక్కుపెట్టి
పిలిచింది శక్తి కొద్దీ, బీభత్సమైన భక్తి
ఈ కేకల ధాటికి వైకుంఠమే దిగవా!

భజనలే చేయరా చిడతలు చేపట్టి
పూజలే జరపరా పూనకమే పుట్టి!
గుడిలోన అడుగుపెట్టి, కోరికల కూతపెట్టి
వెను తరుముంటె భక్తి గుండెల్లొ గుబులు పుట్టి
భగవంతుడే గడగడా వణకాలిరా నరుడా!

ఈ సాహిత్యం చదివితే భక్తి పేరుతో జరిగే నానా సంగతుల్ని ఒక పక్క వ్యంగ్యంగా విమర్శిస్తూనే, ఇంకో పక్క నిజమైన భక్తి గురించి చెప్పకనే చెప్పారు. మన మనసుల్లో నిండిన కపిత్వాన్నీ, మురికినీ చూపెడుతూ, అసలు మనుషుల్లో నిజమైన మనిషిని చూశావా అని దేవుణ్ణి ప్రశ్నించడం చతురంగానూ ఉంది, ఆలోచింపజేసేది గానూ ఉంది.
“రాయినై ఉన్నాను ఈనాటికి, రామ పాదము రాక ఏనాటికి?” (వేటూరి) అనడంలో రాముడు వచ్చి కాపాడాలి అనే భావం కన్నా, “నాలో మార్పు ఎప్పుడు వచ్చి రాయి రాగాలు పలుకుతుంది?” అని తనకు తాను ప్రశ్నించుకోవడమే ఎక్కువ కనిపిస్తుంది. శ్రీ రామ నవమి పర్వ దినాన ఈ ప్రశ్న మన అందరమూ వేసుకుని, కొన్ని క్షణాలైనా మనని మనం ఆలోచనల అద్దంలో చూసుకుంటే రాముడు తప్పక ఆనందపడతాడు!

రామ నవమి – సిరివెన్నెల

దేవతలా నిను చూస్తున్నా & ఎందుకు ఎందుకు ఎందుకు

“నేను” అనే ఒక సినిమా కథ విభిన్నమైనది. బాల్యం లోని దుర్భర సంఘటనలకి చితికిపోయిన ఒక బాలుడు, పెరిగి యువకుడైనా గతస్మృతులనే నిత్యం తలచుకుంటూ సంఘంలో ఇమడలేకపోతాడు. ఒంటరిగా, మౌనంగా, తనదైన లోకంలోనే జీవిస్తూ ఉంటాడు.

ఇటువంటి అబ్బాయికి పరిచయం అయ్యింది college లో ఒక అమ్మాయి. మరిచిపోయిన మమకారాలనీ, చిన్ననాటి అనుబంధాలనీ ఆమెలో చూసుకుంటాడు ఇతను. తనని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి మాత్రం స్నేహభావం తోనే ఉంటుంది. తను వేరే అబ్బాయి ప్రేమలో పడుతుంది కూడా. ఇవన్నీ మౌనంగా చూస్తూ, తనలో చెలరేగే భావాలని ఆ అమ్మాయికి చెప్పలేక తనలోనే దాచుకుని నలిగిపోతూ ఆ అబ్బాయి పడే సంఘర్షణకి అక్షర రూపం ఇవ్వాలి.

సినిమాలో అతను తనలోని ఈ సంఘర్షణనని రెండు పాటల ద్వారా చెప్పుకుంటాడు –
1. దేవతలా నిను చూస్తున్నా – ఇది అతనిలోని సంఘర్షణ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటి పాట. ఈ స్థితిలో అతనిలో బాధ ఉన్నా, ఆలోచన, ఆశ ఇంకా చచ్చిపోలేదు.
2. ఎందుకు ఎందుకు ఎందుకు – ఇది సినిమా చివర్లో వచ్చే పాట. అతనిలో తారాస్థాయి సంగర్షణకి అక్షర రూపం. ఇక్కడ బాధ కాదు, పూర్తి శోకం కనిపిస్తుంది. ఆశా, ఆలోచన పూర్తిగా చచ్చిపోయి అనుభూతుల సంద్రంలో కొట్టుకుపోతున్నప్పటి పాట.

పై వాటిలో మొదటి పాట వేటూరి రాశారు, రెండోది సిరివెన్నెల. ఇద్దరూ రాసిన పాటల్ని గమనిస్తే సందర్భానికి తగినట్టుగా ఎంత గొప్పగా రాశారో తెలుస్తుంది. వాళ్ళ శైలి కూడా కొంచెం గమనించొచ్చు. వేటూరి పాట “ఆలోచనామృతం” అయితే, సిరివెన్నెల పాట ఆలోచన అవసరం లేని ఇట్టే అర్థమయ్యే అమృతం!

ఈ వ్యాసంలో వేటూరి పాట గురించి నా అభిప్రాయం రాస్తాను. వచ్చే వ్యాసంలో సిరివెన్నెల పాట గురించి.

వేటూరి రాసిన గుండెల్ని పిండేసే పాట ఇది:

దేవతలా నిను చూస్తున్నా
దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువు తీస్తున్నా
నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా?
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా?
ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

1. సుడిగాలికి చిరిగినా ఆకు అణగదు
చెలిచూపుకు నలిగినా మనసు మరవదు
నీ ఒడిలో చేరలేని నా ఆశలూ
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలూ
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు
అందీ అందనిదానా, అందమైనా దానా
అంకితం నీకే అన్నా, నను కాదన్నా

2. నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు
నీ వెన్నెల నీడలైన నా ఊహలూ
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులూ
ఈ సమాధిపై పూసే సన్నజాజులు
నిదర రాని నిట్టూర్పుల జోలపాటలు
చక్కనైన చినదానా దక్కనిదానా
రెక్కలు కట్టుకు రానా, తెగిపోతున్నా

మామూలుగా చదివితే ఈ పాటలో గుండెలని పిండేసే తత్త్వం అంత కనబడదు. ఇందాక చెప్పుకున్నట్టు ఇది “ఆలోచనామృతం” కాబట్టి కొంచెం ఆలోచించి అర్థం చేసుకుంటేనే పాట భావాన్ని “అనుభూతి” చెందగలం. నాకు తోచిన భాష్యం కొంత చెబుతాను –

దేవతలా నిను చూస్తున్నా
దీపంలా జీవిస్తున్నా
నా ప్రాణం నువు తీస్తున్నా
నీ ధ్యానం నే చేస్తున్నా
ఎవరమ్మా నువ్వెవరమ్మా?
ఇంతకీ నాకు నువ్వెవరమ్మా?

ఆ అమ్మాయి దేవత. ఆ అబ్బాయి దృష్టిలో ఎడారిలో స్నేహపు పన్నీటి జల్లులు కురిపించిన దేవత ఆమె. ఈ అబ్బాయి దీపం. దీపం లాగే ధ్యానిస్తూ, అదే సమయంలో మరిగిపోతూ, కరిగిపోతూ ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి తనకి ఎవరు? నిన్నటి దాకా ఎవరో తెలియని, పరిచయమే లేని అమ్మాయే ఇప్పుడు జీవితం అయిపోయిందా?

ఎగిరి ఎగిరిపోయింది సీతాకోక చిలక
మిగిలిందీ వేళ్ళపై అది వాలిన మరక

అయినా ఆ అమ్మాయి తనది కాదు. ఇంకెవరినో ప్రేమిస్తోంది. తను అందక ఎగిరిపోయినా తన జ్ఞాపకాలు మాత్రం ఇంకా ఉన్నాయి. ఈ రెండు లైన్లూ అద్భుతం! ఎంత గొప్ప ఉపమానం ఎంచుకున్నాడు వేటూరి! “పల్లవికి వేటూరి” అని ఊరికే అన్నారా?

సుడిగాలికి చిరిగినా ఆకు అణగదు
చెలిచూపుకు నలిగినా మనసు మరవదు

అతని మనసు ఆ అమ్మాయిని ఇంకా మరవలేదు. ఎంత పిచ్చిదీ మనసు? దక్కదని తెలిసీ చందమామ కోసం చేయి చాచుతుంది. “సుడిగాలికి చిరిగిన ఆకు” అన్న చక్కటి ఉపమానం ద్వారా వేటూరి అతని చితికిన మనసుని మనకి చూపిస్తాడు.

నీ ఒడిలో చేరలేని నా ఆశలు
ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలు
ఎండమావిలో సాగే పూల పడవలు
గుండె దాచుకోలేని తీపి గొడవలు

తను కోరుకున్నది దక్కనప్పుడు మనసులో ఒక నిరాశ, ఒక నిట్టూర్పు. “ఎండమావిలో పూల పడవలు” అనడం ఎంత గొప్ప ఉపమానం! అతను గుండెల్లోని అగ్ని గుండాలని చల్లార్చుకోడానికి, మనసు విప్పి మాట్లాడుకోడానికి ఆ అమ్మాయిని కోర్కున్నాడు. ఇప్పుడు తను దక్కట్లేదు. ఇంక ఎవరికి చెప్పుకోవాలి?

అందీ అందనిదానా, అందమైనా దానా
అంకితం నీకే అన్నా, నను కాదన్నా

తను అందదు. అయినా మనసూ, జీవితం అంతా తన చుట్టూనే తిరుగుతాయ్! తను కాదన్నా మనసు వద్దనుకోదు.

నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు
నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు

ఆ అమ్మాయిని పువ్వు అనుకుని ఇష్టపడితే ఇప్పుడు నిప్పై దహిస్తోంది ఏమిటి? తప్పు తనదేనా? “నెమలి కన్ను” అందంగా కనిపిస్తుంది, కానీ చూడలేదు. మనసుకి నెమలి కళ్ళు! అందుకే అది నిజాలని చూడలేదు. ప్రేమలోనో, వ్యామోహంలోనో గుడ్డిగా పడిపోతుంది. అయినా ఇప్పుడు ఇదంతా అనుకుని ఏం లాభం? బుద్ధిని మనసు ఎప్పుడో ఆక్రమించేసుకుంది.

నీ వెన్నెల నీడలైన నా ఊహలు
నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు
ఈ సమాధిపై పూసే సన్నజాజులు
నిదర రాని నిట్టూర్పుల జోలపాటలు

ఆ అమ్మాయి ఊహలే అతనికి వెన్నెల. ఆ అమ్మాయి కనులు తనతో మూగ సంభాషణ చేస్తున్నాయ్ అనుకోవడమే అతనికి ఆనందం. ఇవే సమాధి లాంటి అతని జీవితంపై పూసే సన్నజాజులు, నిదురపోని నిట్టుర్పుల మనసుకి జోలపాటలు. అతని దయనీయమైన మానసిక స్థితిని ఆవిష్కరించే ఈ వాక్యాలు మన గుండెల్ని బరువెక్కిస్తాయ్.

చక్కనైన చినదానా దక్కనిదానా
రెక్కలు కట్టుకు రానా, తెగిపోతున్నా

ఆ అబ్బాయి ఆ అమ్మాయిని మరవలేడు. తన ప్రాణమే ఆ అమ్మాయి. అలిసిపోతున్నా, ప్రాణమే పోతున్నా పరుగు తప్పదు! అవును రెక్కలు తెగిపోతున్నా ఎగరక తప్పదు.

మొత్తం పాటలో వేటూరి వాడిన ఉపమానాలు గమనించండి. ఎంత గొప్పగా ఉన్నాయో. చదివిన ప్రతి సారీ కొత్త అర్థాలు స్ఫురిస్తూనే ఉంటాయి. “సాహో వేటూరి” అనుకోకుండా ఉండలేం. ఈ పాటలో ప్రతీ పదాన్ని గమనిస్తూ, భావాన్ని అనుభూతి చెందుతూ ఒక సారి చదవండి. మనసు చెమర్చకపోతే చూడండి.

ఇప్పుడు సిరివెన్నెల రాసిన పాట చూద్దాం:

ఎందుకు ఎందుకు ఎందుకు
నను పరిగెత్తిస్తావెందుకు?
ఆకలి తీర్చని విందుకు
నన్నాకర్షిస్తావెందుకు?
దరికి రానీక నింగి శశిరేఖా
పొదువుకోనీక ఒదులుకోనీక
ఇంతగా చితిమంటగా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాలా, సౌందర్య జ్వాలా!

1. పాల నవ్వుల రూపమా
తను తాళనివ్వని తాపమా
దారి చూపని దీపమా
జత చేరనీయని శాపమా
తళ తళ తళ తళ కత్తుల మెరుపై కళ్ళని పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అలిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంట కాని జంటగా నా వెంట నడవాలా?

2. నీవు నింపిన ఊపిరే
నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే
నరనరాన్ని కోస్తుంటే ఇలా
సల సల మరిగే నిప్పుల మడుగై నెత్తురి ఉడికేలా
నిలువున నీలో కరగని కోరిక విలవిలలాడేలా
ఒక్క పుట్టుకలోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గర ఉన్నా దక్కదే వరమాలా
నన్నిలా ఉరితాడుతో ఉయ్యాలలూపాలా?

ఇందాకటి పాటతో పోలిస్తే ఈ పాటలో అతని పరిస్థితి మరింత దయనీయంగా మారింది. శోకం అతనిని కమ్మిన ఆక్రోశంలో పుట్టిన పాట ఇది. సిరివెన్నెల తనదైన శైలిలో రాశారు – చక్కటి తేలిక పదాలూ, ఇట్టే అర్థమయ్యే గుణం, లోతైన భావం అన్నీ ఈ పాటలో చూడొచ్చు. “సౌందర్య జ్వాల”, “జంట కాని జంటగా నడవడం”, “ఒక్క పుట్టుకలో ఎన్నో మరణాలు”, “ఉరితాడుతో ఉయ్యాలలూపడం” కొన్ని గమనించదగిన ప్రయోగాలు. వాక్యాలు చదివితే అర్థమైపోతాయ్ కాబట్టి ఈ పాటకి పెద్ద వ్యాఖ్యానం కూడా అక్కర లేదు వేటూరి పాటలా.

ఈ పాటనీ, వేటూరి రాసిన “దేవతలా” పాటని పక్క పక్కన పెట్టుకుని వినడం ఒక చక్కని అనుభూతి. ఒకేలాటి సందర్భానికి ఇద్దరు కవులు, భిన్నమైన శైలిలో, భిన్నమైన ఉపమానాలతో రాయడం మనం చూడొచ్చు. “బాగా” ఎలా రాయలో కొంత నేర్చుకోవచ్చు కూడా.

ఈ రెండు పాటలకీ తగిన tune ఇచ్చిన సంగీత దర్శకుడు “విద్యాసాగర్” కూడా అభినందనీయుడే!

దేవతలా నిను చూస్తున్నా & ఎందుకు ఎందుకు ఎందుకు