నేను రాసిన అతి క్లిష్టమైన పాట! (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

(“శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా” పాట రాయడంలో తాను పడ్డ కష్టం గురించి సిరివెన్నెల స్వయంగా రాసిన ఈ వ్యాసం ఆయన స్వదస్తూరిలో పాత manasirivennela.com వెబ్సైటులో ఉండేది. ఒక కళాకారుడికి కళపట్ల ఎంత నిబద్ధత ఉండాలి, గొప్ప కళాసృష్టికి ఎంత తాపత్రయ పడాలి అన్నది తెలియాలంటే ఈ వ్యాసం తప్పక చదవాలి. వ్యాసం చదివాక సిరివెన్నెలకి మనసులో ఓ నమస్కారం పెట్టకుండా ఉండలేం. ఈ అపురూపమైన వ్యాసాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశ్యంతో ఉడతాభక్తిగా టైపు చేసి అందిస్తున్నాను.)

కష్టమైన పాట – క్లిష్టమైన పాట

 

“మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట ఏది?” అని అడుగుతుంటారు చాలామంది. ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేను నేను. రాసిన ప్రతి పాటా పదిమంది మెప్పు పొందాలని ఆశించడం తప్పుకాదు కానీ అలా జరగడం సాధ్యం కాదు. రాసేటప్పుడు, ఈ పాట తప్పకుండా హిట్ అవుతుంది కాబట్టి గొప్పగా రాయాలి, ఈ పాట పురిట్లోనే సంధికొట్టి చస్తుంది కనుక దీనికి పెద్దగా శ్రమపడక్కర లేకుండా ఏదో గీకి పారెయ్యాలి అని ఎవరూ అనుకోరు. ఆ  పాట వీధినపడ్డ తర్వాత తెలుస్తుంది దాని బతుకేవిటో! కవి రాతతో పాటూ పాటకి దాని సొంత తలరాత కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళింతర్వాత పాట “హిట్”, “ఫట్” అవడాన్ని బట్టి దాని మీద ఇష్టం ఏర్పరుచుకోవడం జరగదు. ఇష్టపడకుండా ఎలా రాయడం?

కానీ ఇప్పటికీ ఎక్కువమంది నన్ను “సిరివెన్నెల” పాటల్లోనే గుర్తించడానికి ఇష్టపడతారు. “అంత గొప్ప పాటలు మళ్ళీ మీరు రాయలేరు!” అని అన్నవాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మాత్రం నేను “హర్ట్” అవుతాను. ఎందుకంటే సిరివెన్నెల పాటలంత ప్రజాదరణ మిగతా పాటలకి రాలేదేమో గానీ సిట్యుయేషన్ దృష్ట్యా, అంతకన్నా గొప్పపాటలు చాలానే రాశాను.

“మీరు రాసిన పాటల్లో మీకు ఎదురైన అత్యంత క్లిష్టమైన పాట ఒకటి చెప్పండి!” అని అడిగితే, అది కూడా నా పాలిటి చిక్కుప్రశ్న. ఎందుకంటే క్లిష్టమైన పాట వేరు, కష్టమైన పాట వేరు. తగినంత సమయం దొరక్క, అక్కడ ఆ పాట ఎందుకుండాలో, దాంట్లో చెప్పాల్సినంత గొప్ప సంగతేవిటో తెలీక, తేలక చాలా పాటలు చాలా కష్టపడి రాయాల్సి వచ్చింది. సాధారణంగా ఈ “డ్యూయెట్లు” అనబడే “గాలిపాటలు” రాసేటప్పుడు ఈ కష్టం వస్తుంది. నా దృష్టిలో ఈ పాటలు క్లిష్టమైనవి కావు. చెప్పాల్సిన విషయం చాలా గొప్పదీ, విస్తృతమైనదీ, లోతైనదీ అయినప్పుడు, దాన్ని ఒక పల్లవీ, రెండు చరణాల్లో ఇమిడ్చి, వీలయినంత సరళంగా చెప్పవలసి వచ్చినపుడు అదే నిజమైన క్లిష్టత. అయితే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురయితే ఏ కవీ కష్టంగా భావించడు, ఇష్టపడతాడు.

ఈ దృష్టితో చూస్తే మాత్రం, నాకు సంబంధించి నేను “స్వర్ణకమలం” సినిమాలో రాసిన పాటలు చాల క్లిష్టమైనవి. కనుక చాలా ఇష్టమైనవి. అందులో “శివపూజకు చివురించిన” పాట గురించి చెబుతాను. కవిగా తన సత్తా చూపించాలి అని అనుకునే ఎవరికైనా, సరైన ఛాలెంజ్ ఎదురైతే ఎంతో ఆనందం కలుగుతుంది. తన సర్వశక్తుల్నీ ధారపోసే అవకాశం దొరికిన సంతోషం అది. అసలు “స్వర్ణకమలం” సినిమా కథలోనే గొప్పతనం ఉంది. ఆ సినిమా కథకి పాటలు రాయడం అనేక విధాల కత్తిమీద సాములాంటిది.

మూడు ఛాలెంజ్‌లు!

 

మొట్టమొదటి ఛాలెంజ్ ఏవిటంటే

సినిమాపాట అనేది సినిమా చూసే ప్రేక్షకులకోసం అన్నది సినిమా కవి సర్వవేళ సర్వావస్థల్లోనూ గుర్తుపెట్టుకునే ఉండాలి. తన వ్యక్తిగతమైన ప్రతిభని చాటించుకోడానికీ, మహామహా విద్వాంసుల బుర్రలకు పనిపెట్టేందుకూ సినిమా పాట వాడరాదు. ఒక ఉదాహరణ చెబుతాను.

సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ పొందిన టి.ఎస్.ఇలియట్ రాసిన “వేస్ట్‌లాండ్” అన్న సుధీర్ఘమైన కవిత ఉంది. అది ఎంతటి పాషాణపాకంలో ఉంటుందంటే కొమ్ములు తిరిగిన ఉద్దండపిండాల్లాంటి పాండితీప్రకాండులెందరికో ఇప్పటికీ పూర్తిగా కొరుకుడుపడలేదు. ఇప్పుడు, ఎవరైనా టి.ఎస్.ఇలియట్ జీవిత కథని కమర్షియల్‌గా తీస్తున్నారనుకోండి! “వేస్ట్‌లాండ్” కావ్యం అంతా కూడా ఒక పాటలో చెప్పాలనుకోండి. చెప్పగలిగి తీరాలి చచ్చినట్టు. ఎందరెందరికో పూర్తిగా అర్థంకాని దాన్ని ముందు తను సంపూర్ణంగా అర్థం చేసుకోవలసి రావడం ఒక ఎత్తు. దాన్ని సినిమా పాటగా రాయవలసి రావడం ఒక ఎత్తు. ఎందుకంటే “వేస్ట్‌లాండ్” లో తన సొంత తెలివి చొప్పించకూడదు. అందులో ఉన్న ఏ అంశాన్ని తప్పించకూడదు. ప్లస్ అదంతా కూడా సినిమా ప్రేక్షకులకి అందుబాటులో ఉండేలా చెప్పాలి.

ఉదాహరణ కోసం పైసంగతి చెప్పాను కానీ, ఎక్కడో నూటికీ కోటికీ ఒక అరుదైన సందర్భంలో తప్ప, సినిమాకవికి అలాంటి, అంతటి ఘోరపరీక్ష ఎదురవదు. సాధారణంగా మనం నిత్యం తీసే సినిమాల్లోనూ చూసే సినిమాల్లోనూ ఉండే పాటలు, సంగీతబద్ధంగా ఉండే మామూలు మాటలే తప్ప, గొప్ప కవిత్వాలు కాదు. కానక్కర్లేదు కూడా. కాకూడదు కూడా. పార్కులో గెంతులేస్తూ, డ్యూయట్ పాడుకునే హీరో హీరోయిన్లు కవులు కాదు. కనుక వాళ్ళ నోటంట కవిత్వం రాకూడదు.

అయితే ఎప్పుడో అరుదుగా ఎదురయ్యే అసాధారణ స్థితి లాంటిది “స్వర్ణకమలం” కథ. అలాంటి అసాధారణమైన అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. విశ్వనాథ్‌గారికి నాపట్ల ఉన్న ఆదరణ.

జనబాహుళ్యానికి అందుబాటులో ఉండాలి అన్న మొట్టమొదటి నియమానికి “స్వర్ణకమలం” కథలోనే ఇబ్బంది ఉంది. ఆ కథే అసాధారణం. మామూలుగా సినిమా స్టొరీలు, మన జీవితంలోని మెటీరియస్టిక్ అంశాలకి సంబంధించినవే అయి ఉంటాయి తప్ప, తీవ్రమైన భావనా ప్రపంచానికి సంబంధించినవి అయి ఉండవు. కానీ “స్వర్ణకమలం” కథలో కేంద్రబిందువు ఏవిటి?

ప్రతి ఒక్కరూ ఏదో ఒక “పని” చేస్తుంటారు. ఏదో ఒక “పని” చెయ్యకుండా బ్రతుకు గడవదు గనక. అయితే, తాము చేసే పనిని మనసా వాచా కర్మణా ప్రేమించే వాళ్ళు ఎంతమంది? “బ్రతుకు గడవదు గనుక” అనే తప్పనిసరితనంతో కొందరు, ఆ పనివల్ల తన ఆదర్శం కోసం కొందరు, ఆ పనివల్ల తాను నలుగుర్లో చాలా గొప్పవాడనిపించుకోవాలనే పట్టుదలతో కొందరు. ఇలా అనేక రకాలుగా చేస్తారు. రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. కాకపోతే ఆ పని, దాని ఫలితమూ ఇతరులతో సంబంధించిందే తప్ప, తనకీ ఆ పనికీ ఉన్న ప్రత్యేక అనుబంధం కాదు.

ఇలాటి ఒక సూక్ష్మాతిసూక్ష్మమైన భావనా ప్రపంచానికి సంబంధించిన కథ అది. ఒక యోగసాధన, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం లాటి అంశాలు మన నిత్యజీవితంలో రొటీన్‌గా ఎదురయ్యే అంశాలు కాదు కదా? ప్రేమ, ఆకలి, ఆదర్శం, కులం, మతం, సెంటిమెంట్సు ఇత్యాది జనులందరికీ కామన్‌గా ఉండే విషయాలకన్నా వేరుగా ఉంటుంది. మరి అటువంటి కథకి పాటలు రాసేటప్పుడు మొదటి కండిషన్‌ని పూర్తిగా ఫాలో అవడం సాధ్యమా?

అయితే ఉపనిషత్తుల్లాగా, శాస్త్రచర్చలాగా చెప్పడం కుదరదు కదా? ఎంచుకునే భాషలో గానీ, భావంలో గానీ, మరీ నేలవిడిచి చుక్కల్లో తిరిగితే, ఆ పాట వినడానికి, చూడ్డానికి భూలోకవాసులు పరలోకాలకి పోలేరు కదా!

రెండో క్లిష్టత ఉంది.

స్వర్ణకమలంలో మూడు పాటలు ఒకే విషయం చెప్పాలి. “ఆకాశంలో ఆశల హరివిల్లు” అనే పాట, మీనాక్షి (భానుప్రియ) కారెక్టర్‌ని చెబుతోంది. జీవితం పట్ల తనకి ఉన్న ఆశలేవిటి, అవగాహనలేవిటి అన్నది. ఏదో పుట్టుకతో తనకి డాన్స్ చెయ్యడం అబ్బింది. కానీ డాన్స్ చెయ్యడం పట్ల ఆసక్తి గానీ, అభిమానం గానీ లేదు. ఓ పక్కనుంచి తండ్రి (పోరు). మరో పక్కనుంచి చంద్రం (వెంకటేష్) వేధించుకు తినేస్తుంటాడు. “నువ్వు మహా డాన్సర్‌వి సుమా! దీన్ని ప్రాణంగా భావించాలి” అంటూ. తనకు ఒద్దు మొర్రో అన్నా వినడు.

రెండో పాట “ఘల్లు ఘల్లు..”. ఈ పాటలో కూడా మళ్ళీ మీనాక్షి పాత్ర లక్షణం చెప్పాలి. మొదటి పాటకి, రెండో పాటకి ఆమె పాత్ర స్వభావం మారిపోదు కదా? అంటే, మొదటి పాటలో చెప్పిందే మళ్ళీ చెప్పాలి.

తర్వాత “శివపూజకి…”. ఇది మళ్ళీ చంద్రానికీ, మీనాక్షికీ మధ్య వాళ్ళవాళ్ళ జీవన దృక్పథాల్ని చెప్పుకుంటూ సంఘర్షించే పాట. రెండో డ్యూయెట్‌కీ దీనికీ మధ్య వీసవెత్తుకూడా భేదం లేదు. అంటే “ఘల్లు ఘల్లు..” లో వాళ్ళిద్దరి మధ్యా ఆర్గ్యుమెంట్ ఏం జరిగిందో మళ్ళీ దానినే మూడో పాటగా చెప్పాలి.

మూడో క్లిష్టత…

నేను సినిమా కవిని. ఏ పాత్ర పాట పాడాలో ఆ పాత్ర సంస్కారాన్ని, భాషని పలికించాలి గాని నా వ్యక్తిగత భావనల్ని కాదు. అంటే మీనాక్షి పాత్రకి రాసేటప్పుడు నేను మీనాక్షినే అయిపోవాలి.

సీతారామశాస్త్రిగా, నాకు చంద్రం ఆలోచనే రైటు, మీనాక్షి ఒట్టి మూర్ఖురాలు అనిపించవచ్చు, అనిపించాలి! అదే కథ ఉద్దేశం. కనకే మీనాక్షి మారుతుంది. సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడూ చంద్రం పక్షం వహిస్తాడు.

కానీ మీనాక్షి తనలో మార్పు వచ్చేవరకూ తనూ తన పక్షమే వహిస్తుంది గాని చంద్రం పక్షం వహించదు కదా. “అమ్మాయ్, నీ ఆలోచన తప్పు సుమా” అని చంద్రం అంటే, “అవునండీ రైటే!” అని ఒప్పుకోదు గదా! అతను ఒకటంటే, తను పది అంటూ, తనే రైటని వాదిస్తుంది. ఆ వాదనలో లొసుగు ఉంటే తనకే తెలుస్తుంది కదా! అంటే ఆ అమ్మాయి తను తప్పుచేస్తున్నానని అనుకోవడం లేదు గనక, తనే ఒప్పు అనుకుంటుంది గనుక, చంద్రం ఏ “లా” పాయిట్ తీసినా, వాటికి ధీటుగా తనూ అంతకన్నా బలంగా సమాధానం చెపుతుంది. ఇదీ నిజమైన క్లిష్టత అంటే!

చంద్రం పల్లవి

 

శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా?
నటనాంజలితో బ్రతుకును తరించనీవా?

అని చంద్రం పాడాల్సిన పల్లవి రాసాను. రాయగానే నాకు అనిపించింది చాలా అద్భుతంగా వచ్చిందని, డైరెక్టరు గారు (శ్రీ కె.విశ్వనాథ్ గారు) మెచ్చుకుంటారని. అనుకున్నట్టే ఆయన చాలా సంతోషించారు. అసలు చిక్కు అంతా అప్పుడు ప్రారంభం అయింది. చంద్రం పల్లవికి దీటైన పల్లవి మీనాక్షి అనాలి. సహజంగానే నాకు (వ్యక్తిగతంగా) చంద్రం పాత్రపట్ల మొగ్గు ఉంటుంది కనక అతని ఆరోపణ చాలా పవర్ఫుల్‌గా చెప్పాను. పైగా ఒక కవితాపరమైన శిల్పవైచిత్రి చూపించాను.

“చివురించిన మువ్వ” అన్నాను. మువ్వ అంటే పువ్వు కాదు కదా! మరి మువ్వని పువ్వు అని సమర్థించడం ఎలా అంటే అడుగడుగునా మువ్వకి సర్వలక్షణాల్లోనూ పువ్వుతో సారూప్యం కనిపిస్తుంది. పువ్వు చిగురిస్తుంది – ఒక లతకి, ఒక కొమ్మకి. మరి మువ్వ మృదువైన, అందమైన (మంజుల) పాదాలు అనే లతకి (మంజరి) చిగురించిన పువ్వు. పువ్వుకి పరిమళం ఉంటుంది. మరి మువ్వకి జతిస్వరములు. అయితే ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని రెండు వస్తువుల్ని అంత బలవంతంగా, విచిత్రంగా ఎందుకు పోల్చాలి? ఎందుకూ అంటే నాదమూర్తి, నటరాజు అయిన పరమేశ్వరుడి పాదపూజకి మామూలు పూలు కాకుండా, నాట్యానికి సంబంధించిన పూలు అయితే ధర్మంగా ఉంటుంది. కనుక “శివపూజకి చివురించిన సిరిసిరి మువ్వా”. అదే విధంగా వాసన, జతిస్వరాలు ఒకటి కాదు. కనుకనే యతిరాజు అని వాడడం జరిగింది. యతిరాజు అంటే సన్యాసులకి రాజు అని. సర్వసంగ పరిత్యాగి అయిన యోగి, సుగంధ ద్రవ్యాల్ని, సువాసనల్ని స్వీకరిస్తాడా? కానీ శివుడే ఒక విచిత్రమైన యోగి. ఇద్దరు భార్యలున్న సన్యాసి. అర్ధనారీశ్వరుడైన విరాగి. అతడు సంసారి కనుక పరిమళాలు కావాలి. సన్యాసి కనుక పరిమళాలు కూడదు. ఈ రెండూ కలిసొచ్చి “యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా”!

మీనాక్షి పల్లవి

 

ఇక ఆ క్షణం నుంచీ పదిహేను రోజులపాటు నేను పొందిన అలజడీ, అశాంతీ అంతా ఇంతా కాదు. అయితే ఆ ఛాలెంజ్‌ని ఎదుర్కోవడంలో ఇష్టం ఉంది. ఒక పాట రాయడానికి పదిహేను రోజులు టైమిచ్చే విశ్వనాథ్‌గారి వంటి దర్శకులుండటం, అటువంటి వారి వద్ద పనిచేసే అదృష్టం పట్టడం ఎంత గొప్ప!

ఈ పదిహేను రోజులూ నేను మీనాక్షిని అయిపోయాను. చంద్రం ఆరోపణకి దీటైన సమాధానం ఇవ్వడం ఒక సమస్య. కానీ ఆ పల్లవిలో ఉన్న కవిత్వపు లోతుముందు ఈమె పల్లవి వెలవెలపోకూడదు. కానీ మీనాక్షి పాత్ర కవిత్వం పలకదు కదా. ఎలా? చంద్రం భావుకుడు, కళాకారుడు. కనుక అతడు శివుడు, మువ్వ, పువ్వు లాంటి కావ్య వస్తువుల్ని, అలంకారాల్ని స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు. నేను కవిని గనక సులువుగా రాసేసాను.

కళలూ, ఆత్మానందం, పరమార్థం లాంటి విచిత్రపదాలతో భావనాలోకంలో పరిగెత్తడం కన్నా, ఓ హోటల్లో వెయిట్రెస్‌గా నౌఖరీ చెయ్యడం చాలా ఘనమైన సంగతి అని భావించే మీనాక్షి కవిత్వం చెప్పొచ్చా? చెప్పకుండా పేలవంగా పొడిపొడి మాటలు చెబితే రెండు పల్లవులకీ “బ్యాలెన్స్” ఉంటుందా? అంటే నేను మీనాక్షి పల్లవి రాస్తూ నాతో నేనే యుద్ధం చేయాలి. నా సర్వశక్తుల్నీ, ఆలోచనా తీవ్రతని వినియోగించి తిరుగులేని విధంగా ఆరోపణ చేసి, దాంట్లో లోతైన కవిత్వాన్ని పొదిగిన నన్నే నేనోడించాలి. ప్రత్యారోపణని కూడా మళ్ళీ చంద్రం నోరెత్తకుండా చేసేలా చెయ్యాలి. పొరబాటున కూడా కవిత్వపరిభాషని వాడకూడదు!

రాత్రీ లేదు, పగలూ లేదు. తిండీ లేదు, నిద్రా లేదు. మొదటి పల్లవి రాయడం ఒక తప్పు, దాన్ని అత్యుత్సాహంగా డైరెక్టరుగారికి చూపించేసి “సెభాష్” అనిపించేసుకోవడం రెండో తప్పు. నా మెడకి నేనే ఉరి తగిలించుకున్నానే అని చింత మొదలైంది.

మొత్తానికి, సరస్వతీదేవి కరుణ, శివుడి చల్లని దీవెన, నేను నిత్యం ఆరాధించే శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహం వల్ల, దాదాపు పదిహేను రోజుల తర్వాత ఒక రాత్రి పన్నెండూ ఒంటిగంట మధ్య పిచ్చిపట్టినట్టు వడపళని రోడ్లంట తిరుగుతూ జుట్టు పీక్కుంటూంటే, నాకు కావాల్సిన అన్ని లక్షణాలూ ఉన్న పల్లవి దొరికింది –

పరుగాపక పయనించవె తలపుల నావా!
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
నడిసంద్రపు తాళానికి నర్తిస్తావా?
మదికోరిన మధుసీమలు జయించుకోవా?

ఈ పల్లవిలో మూడో లైను కవిత్వపు ఘాటు వేస్తోందని, ఫైనల్ వెర్షన్‌లో మార్చాను. చంద్రం మాటకి సరైన జవాబు ఎలా చెప్పిందో నేను వివరించక్కర్లేదు. మంజుల, మంజరి లాంటి కావ్యభాష లేదు గనక. అది మీనాక్షి మాటల్లోనే ఉంది గనుక.

అయితే, చంద్రం పల్లవిలో ఉన్న కవితాలక్షణాన్ని కూడా ఎదుర్కోడానికి ఇక్కడ చిన్న మేజిక్ చేసాను. అతనిలా, శివుడూ, పదమంజరి, జతిస్వరాల పరిమళాలు లాంటి అభౌతికమైన విషయాలు కాకుండా, సముద్రం మీద నడుస్తున్న ఒక నావలాంటి భౌతికమైన అంశాన్ని ఆమె వాదానికి ఆలంబనగా తీసుకున్నాను. నట్టనడి సముద్రం మధ్య, కెరటాలు తాళం కొడుతున్నాయి కదా అని, ఒయ్యారంగా ఊగుతూ అక్కడే నిలబడదు ఓడ. తెడ్లో, ఇంజనో ప్రయోగించి, ఆ అలల ఊపుకి ఎదురీదుతుంది.

చరణాల్లో కూడా ఇదే బ్యాలెన్స్ చూపించాను. అతను మొత్తం అంతా కావ్య పరిభాష వాడుతూ, ఆమెను ఉదయంలా ప్రకాశించమంటాడు. ఆమె తన నిత్యజీవితంలో చూసే ఒక భౌతికమైన విషయాన్ని ఆలంబనగా తీసుకుని అతని వాదాన్ని తిప్పికొట్టడమే గాక, ఉదయప్రకాశంలో మేలుకోవడం కన్నా, నడిరాత్రి వెన్నెల్లో సోలిపోవడం మేలని చెబుతుంది.

నేను కత్తిమీద సాముగా భావించింది ఎక్కడంటే ఆమె ఆర్గ్యుమెంట్ విన్నవాళ్ళెవ్వరైనా అందులో లొసుగుందని అనుకోకూడదు. ఆమె ఆర్గ్యుమెంట్‌కి వెంటనే కన్విన్స్ అయిపోవాలి. ఆమె దృష్టితో చూస్తూ అంగీకరించడం కాదు. మన దృష్టిలోంచి చూసినా కూడా “అవును కదా!” అనిపించాలి.

“ఘల్లు ఘల్లు” పాటలో కూడా ఇదే సర్కస్ ఫీట్ చేసాను, గమనించండి –

నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే
విరుచుకు పడు సురగంగకు విలువేముంది?

అని అతను అన్నప్పుడు, “అవును కదా” అనుకుంటాం.

“అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరివనముల పరిమళముల విలువేముంది?”

అని ఆమె అంటే, “అవును కదా!” అనుకోమా?

– సిరివెన్నెల సీతారామశాస్త్రి

ఈ పాటను యూట్యూబులో ఇక్కడ వినొచ్చు –

 

నేను రాసిన అతి క్లిష్టమైన పాట! (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

6 thoughts on “నేను రాసిన అతి క్లిష్టమైన పాట! (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

 1. Nikesh Kumar Dasagrandhi says:

  మనసు పెట్టి చదివితే కళ్ళు చమర్చడం ఖాయం..సర్ మీకు మీరే సాటి

  Like

 2. Mi laanti vallu Telugu Industry lo Puttadam Mi duradrustam Ma adrustam. Duradrustam ani yenduku annanu ante Meeru, mi standard totally different. Meeru yekkuvaga famous kaleka poyaru Telugu industry lo Paatalu Rayadam valla. Meeru Books rasthe inka baguntundi Sir. adi kooda thelugu lo. Mi paatalu vinte Telugu inka Brathike Undi anipisthuntundi

  Like

 3. కష్టం సర్ మీలా భావుకంగా… ఆలోచించడం.. మీనాక్షి చంద్రం సంగతేమిటో లే కాని నాకు మాత్రం అవునా అనిపిస్తుంది. నవ్వించి మనసుకు మనిషికి ఆహ్లాదాన్ని ఇచేవాళ్ళు కొంచం మంది.. .. చిన్న చిన్న పాటలలో / కవిత్వం లో మాంచి మాటలు చెప్పి ఆనందాన్ని ఇచ్చేవాళ్ళు ఇంకొంచం మంది అందరు మహానుభావులే అందరకి వందనములే..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s